
సంవత్సరం కిందట...ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఓ అపార్ట్మెంట్.... ఇంట్లో మరిచిపోయిన ఆఫీస్ కాగితాలను తీసుకెళ్లడానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ఫ్లాట్‌కు వచ్చింది కనూప్రియా సింగ్. ఫైల్ తీసుకుని తాళం వేస్తూ హడావుడిగా లిఫ్ట్ వైపు పరిగెడుతుంటే...ఎదురు ఫ్లాట్‌లో నుంచి పదహారేళ్ల అబ్బాయి అరుపులు వినిపించాయి గట్టి గట్టిగా...ఓ నలుగురు మనుషులు ఆ పిల్లాడిని పట్టుకుని బలవంతంగా ఈడ్చుకొస్తున్నారు బయటకు.
'భయ్యా....ఆహిస్తా...( అన్నా...మెల్లగా...) అంటున్నాడు గాభరాగా ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి ఆ నలుగురితో. బహుశా ఆ అబ్బాయి తండ్రేమో. తల్లి అనుకుంటా....నోట్లో పమిట చెంగు అదిమి పెట్టుకుని తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గుమ్మం దగ్గర కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్లంతా పోగై ఆవిడను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయసాగారు. తండ్రేమో ఆ పిల్లాడితో కలిసి లిఫ్ట్‌లో కిందకి వెళ్లిపోయాడు. మౌనంగా వాళ్లనే అనుసరించింది కనూప్రియా సింగ్. కింద అంబులెన్స్‌లోకి ఎక్కించారు ఆ పిల్లాడిని బలవంతంగా. ఇంకా అరుస్తూ గింజుకుంటూనే ఉన్నాడు ఆ పిల్లాడు. కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. తండ్రీ అంబులెన్స్ ఎక్కగానే అక్కడ్నుంచి కదిలింది అది.
'క్యా హువా భయ్యా...' పక్కనే ఉన్న వాచ్‌మన్‌ను అడిగింది కనూప్రియ.
'క్యాబోలూ మేడం...అంటూ చెప్పసాగాడు...' 304 వాళ్ల అబ్బాయండి....టెన్త్ చదువుతున్నాడు. ఎప్పుడు అలవాటైందో తెలియదు కాని డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. ఆరునెలల నుంచైతే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇంట్లో డబ్బులు పోతుంటే....ఎందుకో అనుమానం వచ్చి వాళ్ల నాన్న ఆరా తీస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. స్కూల్‌కని ఇంట్లోంచి వెళ్తున్నాడు కాని అటెండెన్స్ లేదట.
సెకండ్ టర్మ్ ఫీజు కట్టమని డబ్బులిచ్చి పంపితే...ఆ డబ్బుతో డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసింది. కానీ అప్పటికే శృతిమించిపోయింది. ఇప్పుడు డీ ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు మేడం...చాకులాగా ఉండేటోడు పిల్లోడు... ఎట్ల అయిపోయిండు. ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. చాంపియన్ అయితడని కలలు కన్నడు వాళ్ల నాన్న...ప్చ్,...పిల్లల్ని కంటం కాని వాళ్ల తలరాతలను కంటమా..?' అంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు వాచ్‌మన్.

అంతా విన్న కనూప్రియాసింగ్ దిగాలు పడింది. ఆఫీస్‌కు వెళ్లిందే కాని మనసు మనసులో లేదు. డ్రగ్స్ దుష్ప్రభావాలను, వాటి బారిన పడుతున్న యువతకు సంబంధించిన సమాచారాన్ని చూసింది నెట్లో. ఇంకా దిగ్భ్రమ చెందింది తెలిసిన వివరాలను చూసి. లాభం లేదు...జాతి భవిష్యత్తు ఇలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకున్న కనూప్రియాసింగ్ ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఉన్న స్నేహితులందరికీ ఫోన్ చేసి అంతకుముందు రోజు తమ అపార్ట్మెంట్లో జరిగిన విషయాన్నంతా చెప్పింది పూసగుచ్చినట్టు.
తర్వాత తనకు వచ్చిన ఆలోచనలూ పంచుకుంది. 'నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని...ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పనులు. మనకెక్కడ వీలవుతుంది' ఒక స్నేహితుడి కామెంట్. 'బాగా చెప్పావు. స్వంత పనులకే టైమ్ దొరక్క ఛస్తుంటే...ఇంకా ఈ సమాజసేవను ఎక్కడ నెత్తినెట్టుకునేది?' ఇంకో స్నేహితురాలి విరుపు. దాదాపు అందరూ కుదరదనే తేల్చారు.
'ఒక్కసారి ఆలోచించండి...రేప్పొద్దున ఈ జాబితాలో మన పిల్లలూ ఉండొచ్చు' హెచ్చరించింది కనూప్రియ.
'మన పిల్లలా..?' ఉలిక్కిపడ్డారు అంతా.
'అవును. మనమేమీ ఈ సమాజానికి దూరంగా తీసుకెళ్లి వాళ్లను పెంచలేం కదా. పరిస్థితుల నుంచి పారిపోయే కంటే. నెమ్మదిగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్..మనకు సెలవు దొరికిన సమయాల్లో స్కూళ్లకు వెళదాం. డ్రగ్స్, వాటి దుష్ప్రభావాలు గురించి పిల్లలకు అవగాహన కల్పిద్దాం ' అని ఒప్పించే ప్రయత్నం చేసింది.
అందరూ ఆలోచించి కనూప్రియాసింగ్ ప్రతిపాదనకు ఓటేశారు. అట్లా రూపుదిద్దుకుంది డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పనిచేసే 'హ్యాపీలైఫ్ వెల్ఫేర్ సొసైటీ' అనే సంస్థ.
వెబ్సైట్లో
ముందుగా పాఠశాల యాజమాన్యాల అనుమతి తీసుకుంటూ...వారాంతపు సెలవుల్లో హైస్కూలు పిల్లలకు డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రారంభించారు ఈ స్నేహితుల బృందం. ఆ బృందంలో ఒకరైన ఎల్లిగారం నాగరాజు హైదరాబాదులో ప్రాపర్టీమేనేజ్‌మెంట్ కన్సల్టన్సీని స్థాపించి ఓ వైపు వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు హ్యాపీలైఫ్ వెల్ఫేర్ పనులనూ కొనసాగిస్తున్నారు. బోయిన్‌పల్లిలో నివాసముంటున్న నాగరాజు ఆ దగ్గర్లోని స్కూళ్లకు వెళ్లి డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంస్థ తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాల వివరాలతో 'హ్యాపీలైఫ్‌వెల్‌ఫేర్. ఒఆర్జి (జ్చిఞఞడజూజీజ్ఛఠ్ఛీజూజ్చట్ఛ.ౌటజ) అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది.
విశేష స్పందన
తమ వెబ్‌సైట్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్తూ ఇ. నాగరాజు 'మా ఈ కృషిని కేవలం స్కూలు యాజమాన్యాలే కాదు...తల్లిదండ్రులూ గుర్తించడం మొదలుపెట్టారు. ఎంతోమంది పేరెంట్స్ మా సంస్థలో సభ్యులమవుతామని ముందుకు వస్తున్నారు. చాలామంది సభ్యులయ్యారు కూడా. మా సేవలు ముంబై, బెంగుళూరు వంటి అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాయి. ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం.
హైదరాబాదులో రోజూ పేపర్లలో వస్తున్న డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే...మా కార్యక్రమాలను ఇక్కడ ఇంకా విస్తృతం చేయాలని నిర్ణయించాం. జనవరిలో మా ఢిల్లీ బృందం కూడా ఇక్కడికి రానుంది. ఇక్కడ తల్లితండ్రులకూ అవగాహనా క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ మాది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చేరొచ్చు. ఒక్క స్కూలు పిల్లలకే కాదు కాలేజీ విద్యార్థులకూ అవగాహనా కార్యక్రమాలున్నాయి.
డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులను కాపాడేందుకు కౌన్సిలింగ్, డీ ఎడిక్షన్ లాంటి సేవలనూ అందిస్తున్నాం. జంటనగరాల తల్లితండ్రులను మేము కోరేది ఒక్కటే...మా సేవలను తీసుకోవడమే కాక మా సంస్థలో చేరి మీరూ మీకు తెలిసిన వాళ్లను చైతన్యపర్చండి. జాతి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి' అని విన్నవించారు.
సరస్వతి రమ
ఫోటోలు: రాజ్‌కుమార్
ఫోటోలు: రాజ్‌కుమార్