Thursday, September 23, 2010

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదు , శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తాం .... * టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌

ఉద్యమాలను నియంత్రిస్తా !
Kcr-miceడిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తామని హెచ్చరించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హటాత్తుగా మడమ తిప్పారు. ముందు చెప్పినట్లు.. డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదని, శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తామని తెలంగాణేతర పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. తెలంగాణేతర, ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణ వచ్చిన తర్వాత తరిమివేస్తామన్న తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో.. ఉద్యమకారులను తాము నియంత్రిస్తామని, ఆ విషయంలో తన మాటకు తిరుగులేదని అభయహస్తం ఇచ్చారు. బుధవారం హోటల్‌ తాజ్‌ కృష్ణాలో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ అసెస్‌మెంట్‌ నిర్వహించిన సీఈఓల ఫోరమ్‌ సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి, పారిశ్రామికవేత్తల వ్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఈ భేటీకి మీడియాను దూరంగా ఉంచడం చర్చనీయాంశమయింది. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేక ప్రశ్నలు వస్తే, అవి మీడియాలో వచ్చిన తర్వాత అసలు సమావేశ లక్ష్యమే దెబ్బతింటుందని భావించి మీడియాను దూరంగా ఉంచారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులను మాత్రం ఆహ్వానించారు. ఇదంతా ఐఎంఏ ఆహ్వానం మేరకు జరుగుతు న్నందున, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ నేతల సూచనల మేరకే ఈ సమావేశం జరిగిందని, అందుకే మీడియాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న నాస్కామ్‌, ఫిక్కీ, సిఐఐ సభ్యులను మాత్రం ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది.

తెలంగాణ ఉద్యమం వల్ల వ్యాపారం దెబ్బతిందని ఇటీవల ఫిక్కీ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసినందుకే ఆ సభ్యులను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఇలాంటి పారిశ్రామికవేత్తల సమావేశాల్లో కీలకపాత్ర పోషించే శక్తిసాగర్‌ సీఈఓ దూరంగా ఉండటం ప్రస్తావనార్హం. సీఈఓల భేటీకి హాజరయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ భేటీని తాము అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమ సంస్థలు ముందస్తుగా హెచ్చరించడంతో చాలామంది సీఈఓలు సమావేశానికి వెళ్లలేదు. ఫలితంగా సమావేశం కొందరికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఈ సమావేశానికి వెళితే లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మా తెలంగాణ అధ్యక్షుడు వీరారెడ్డి, తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా జయలక్ష్మి హోటల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం తాజ్‌ కృష్ణాలో జరిగిన సమావేశ వివరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, తనతో కేంద్ర ప్రముఖులు రోజూ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణేతర- సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టుకునేది లేదన్నారు. అంతా కలసి తెలంగాణ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడదామన్నారు. ఈ విషయంలో తాము ఇప్పటిమాదిరిగా ప్రాంతాలపై వివక్ష చూపబోమని, తమకు అభివృద్ధే ప్రధానమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం, రాయితీల వంటి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసులో ఉన్న అపోహలను తొలగించుకుని, పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా.. కేసీఆర్‌ ప్రసంగం తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొనే పరిస్థితులు, తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు తమకు వ్యతిరేకంగా ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వాటికి సమాధానాలిచ్చిన కేసీఆర్‌.. తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు ఎవరి వల్ల ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సంస్థలు, నాయకులు, విద్యార్థి సంఘాల గురించి మీరేం భయపడనవసరం లేదు. వారిని నియంత్రించే బాధ్యత మాది. వారికి నచ్చచెబుతాం. పరిస్థితి అంతా సద్దుమణిగేలా చేస్తాం. ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ వద్దనరు. ఈ విషయంలో నా మాటకు తిరుగు ఉండదు. విద్యార్థులకు ఆవేశం సహజం. ముందు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అంతా సద్దుకుపోతుందని భరోసా ఇచ్చారు.  

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తానని గతంలో తాను చేసిన హెచ్చరికను ఓ పారిశ్రామికవేత్త ప్రస్తావించగా.. అలాంటివేమీ ఉండవని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటి పరిస్థితిని బట్టి ఒక్కోసారి భావోద్వేగంగా మాట్లాడవలసి ఉంటుంది. భాషను కాకుండా భావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలను తాను నియంత్రిస్తానని, ఆ విషయంలో ఎవరూ అనుమానించవలసిన పనిలేదన్నారు. జేఏసీలు, విద్యార్థి సంఘాలను తాను నియంత్రిస్తానని, వారి వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళన ఉండనందున, తాను వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చి మీకు నష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

No comments: