Thursday, September 23, 2010

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదు , శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తాం .... * టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌

ఉద్యమాలను నియంత్రిస్తా !
Kcr-miceడిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తామని హెచ్చరించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హటాత్తుగా మడమ తిప్పారు. ముందు చెప్పినట్లు.. డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదని, శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తామని తెలంగాణేతర పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. తెలంగాణేతర, ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణ వచ్చిన తర్వాత తరిమివేస్తామన్న తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో.. ఉద్యమకారులను తాము నియంత్రిస్తామని, ఆ విషయంలో తన మాటకు తిరుగులేదని అభయహస్తం ఇచ్చారు. బుధవారం హోటల్‌ తాజ్‌ కృష్ణాలో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ అసెస్‌మెంట్‌ నిర్వహించిన సీఈఓల ఫోరమ్‌ సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి, పారిశ్రామికవేత్తల వ్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఈ భేటీకి మీడియాను దూరంగా ఉంచడం చర్చనీయాంశమయింది. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేక ప్రశ్నలు వస్తే, అవి మీడియాలో వచ్చిన తర్వాత అసలు సమావేశ లక్ష్యమే దెబ్బతింటుందని భావించి మీడియాను దూరంగా ఉంచారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులను మాత్రం ఆహ్వానించారు. ఇదంతా ఐఎంఏ ఆహ్వానం మేరకు జరుగుతు న్నందున, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ నేతల సూచనల మేరకే ఈ సమావేశం జరిగిందని, అందుకే మీడియాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న నాస్కామ్‌, ఫిక్కీ, సిఐఐ సభ్యులను మాత్రం ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది.

తెలంగాణ ఉద్యమం వల్ల వ్యాపారం దెబ్బతిందని ఇటీవల ఫిక్కీ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసినందుకే ఆ సభ్యులను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఇలాంటి పారిశ్రామికవేత్తల సమావేశాల్లో కీలకపాత్ర పోషించే శక్తిసాగర్‌ సీఈఓ దూరంగా ఉండటం ప్రస్తావనార్హం. సీఈఓల భేటీకి హాజరయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ భేటీని తాము అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమ సంస్థలు ముందస్తుగా హెచ్చరించడంతో చాలామంది సీఈఓలు సమావేశానికి వెళ్లలేదు. ఫలితంగా సమావేశం కొందరికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఈ సమావేశానికి వెళితే లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మా తెలంగాణ అధ్యక్షుడు వీరారెడ్డి, తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా జయలక్ష్మి హోటల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం తాజ్‌ కృష్ణాలో జరిగిన సమావేశ వివరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, తనతో కేంద్ర ప్రముఖులు రోజూ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణేతర- సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టుకునేది లేదన్నారు. అంతా కలసి తెలంగాణ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడదామన్నారు. ఈ విషయంలో తాము ఇప్పటిమాదిరిగా ప్రాంతాలపై వివక్ష చూపబోమని, తమకు అభివృద్ధే ప్రధానమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం, రాయితీల వంటి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసులో ఉన్న అపోహలను తొలగించుకుని, పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా.. కేసీఆర్‌ ప్రసంగం తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొనే పరిస్థితులు, తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు తమకు వ్యతిరేకంగా ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వాటికి సమాధానాలిచ్చిన కేసీఆర్‌.. తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు ఎవరి వల్ల ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సంస్థలు, నాయకులు, విద్యార్థి సంఘాల గురించి మీరేం భయపడనవసరం లేదు. వారిని నియంత్రించే బాధ్యత మాది. వారికి నచ్చచెబుతాం. పరిస్థితి అంతా సద్దుమణిగేలా చేస్తాం. ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ వద్దనరు. ఈ విషయంలో నా మాటకు తిరుగు ఉండదు. విద్యార్థులకు ఆవేశం సహజం. ముందు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అంతా సద్దుకుపోతుందని భరోసా ఇచ్చారు.  

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తానని గతంలో తాను చేసిన హెచ్చరికను ఓ పారిశ్రామికవేత్త ప్రస్తావించగా.. అలాంటివేమీ ఉండవని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటి పరిస్థితిని బట్టి ఒక్కోసారి భావోద్వేగంగా మాట్లాడవలసి ఉంటుంది. భాషను కాకుండా భావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలను తాను నియంత్రిస్తానని, ఆ విషయంలో ఎవరూ అనుమానించవలసిన పనిలేదన్నారు. జేఏసీలు, విద్యార్థి సంఘాలను తాను నియంత్రిస్తానని, వారి వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళన ఉండనందున, తాను వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చి మీకు నష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

Saturday, September 18, 2010

ఈ గడ్డ మీద పుడితే తెలంగాణ బిడ్డే * పొట్టకూటికోసం వచ్చిన వారిపై ద్వేషం లేదు * మా పొట్ట కొట్టడానికి వచ్చిన వారిపైనే ఉద్యమం * టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - ఈ దొరయేందిరో !

"ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే'' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు, ఎమ్మెల్యే పదవులు సహా అన్నింటికీ అర్హులేనని తేల్చి చెప్పారు. హక్కులేదన్నవాడు సన్నాసి.. దద్దమ్మ అని అన్నారు. ఒకవేళ వారికి అన్యాయం జరిగితే.. చేపట్టే ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

ఎవరి వాటా ఎంత?  అనే అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా నిర్వహించిన 'గ్రేట్ డిబేట్'లో కేసీఆర్ ఫోన్ ద్వారా పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... "సమైక్యవాదం నిజమే అయితే.. ఆంధ్రాలోని న్యాయాధికారుల్లో తెలంగాణ బిడ్డ ఒక్కరున్నారా? తెలంగాణలో గుంటూరు పల్లెలు ఉన్నాయి. కాని, సీమాంధ్రలో ఎక్కడైనా ఒక్క తెలంగాణ పల్లె ఉందా? 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కరీంనగర్‌లో ఏంచెప్పారు.

ప్రధాని తన తొలి ప్రెస్‌మీట్‌లో ఏంచెప్పారు? సోనియానాకు ఫోన్ చేసి.. డిన్నర్‌కు ఇంటికొచ్చి ఏం చెప్పారు? డిసెంబర్ 9న ప్రధాని తెలంగాణ ఏర్పాటు ప్రకటనచేయించారు. దాని అమలు దశలో పడ్డ బ్రేకులు బద్దలు కొట్టాల్సి ఉంది. ఒకసారి ప్రకటన చేశాక.. వేలాడితే.. పాకులాడితే.. కేసీఆర్‌ను తిడితే తెలంగాణ ఆగుతుందా? పోరాడాలని అడ్వకేట్లకుఎవరు చెప్పారు? రేపు పోలీసులూ ఇలా చేస్తారని అంటున్నారు.తెలంగాణకొచ్చిన సీమాంధ్రులు ఇక్కడి సంస్కృతిలో కలిసిపోలేదు.

'మీ బొంద మీకేం తెలుసు. తెలివి ఉందా ?' అని ప్రతి రోజు ఆంధ్రా వారు ఇక్కడి వారిని తక్కువ చేసి మాట్లాడుతారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా డిసెంబర్ 9న తెలంగాణ వచ్చేది కదా? అప్పుడు సహృద్భావ వాతావరణాన్ని నాశనం చేసింది ఎవరు? రెండు రాష్ట్రాలుగా సహృద్భావ వాతావరణంలో విడిపోవాలన్నదే నా భావన.

తెలంగాణ ఏర్పడ్డాక సీమాంధ్రులు ఇక్కడ అద్భుతంగా ఉండవచ్చు. వారికి రేపు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం. తెలంగాణ వచ్చాక ఇక్కడి సినిమా పరిశ్రమను ఏ సన్నాసి వెధవ అయినా వదులుకుంటాడా? విభజన ఇప్పటికే జరిగిపోయింది.. చంద్రబాబుపై నెపం పెట్టటం కాదు. సమైక్యంగా ఉండటంపై రాద్ధాంతం వల్ల నష్టపోతున్నది ప్రజలు.

లగడపాటీ.. ఐ లవ్ యూ సో మచ్ : కేసీఆర్ : తెలంగాణ డైనమేట్ కేసీఆర్.. సమైక్యాంధ్ర సీమటపాకాయ లగడపాటి రాజ్‌గోపాల్. ఒకరంటే మరొకరికి పడదనే ప్రచారం. రాష్ట్ర విభజన ఉద్యమం నేపథ్యంలో వారి మధ్య 'దూరం' పెరిగిందన్నది వాస్తవం. అయితే వారిద్దరినీ తొలిసారిగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫోన్ ద్వారా కలిపింది. ఇద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు.

ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని చెప్పుకున్నారు. కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి.. "లగడపాటీ..ఐ లవ్ యూ సో మచ్' అని అంటే.."కేసీఆర్ గారు.. ఈ రాత్రే మీ ఇంటికొస్తా'' అని లగడపాటి అన్నారు. ఇరువురు కూడా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. లగడపాటిపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

తెలంగాణ జనాభా 34 శాతం కాగా, సీమాంధ్ర వారు కలవటం వల్ల తెలంగాణ జనాభా 40.5 శాతం అయ్యిందని, పదవుల్లోనూ సీమాంధ్రులకు తెలంగాణ ఆమేరకు వాటా దక్కాలని లగడపాటి అంటున్నట్లు రాధాకృష్ణ చెబితే.. లగడపాటి చెప్పేది వంద శాతం కరెక్ట్ అని కేసీఆర్ అన్నారు.

ప్రధాని మన్మోహన్ తెలంగాణపై మాట్లాడిన ఆదివారం లగడపాటి ఇంటికి పంపిస్తానని కేసీఆర్ అంటే.. ఈ రాత్రే (శనివారం) మీ ఇంటికొస్తానని లగడపాటి బదులిచ్చారు. దీనికి కేసీఆర్.. "మోస్ట్ వెల్‌కమ్.. మీ ఇల్లు మా ఇల్లు వేరు కాదు'' అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉందామని లగడపాటి ప్రతిపాదిస్తే మాత్రం.. కేసీఆర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తలాతోకలేని నివేదిక ఇస్తే ఎందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించారు.

సన్నాసి కమిటీ కావచ్చు... దరఖాస్తు అడిగారు కాబట్టి ఇచ్చాం. కమిటీ నివేదిక ఎలా నివేదిక ఇచ్చినా అంగీకరిస్తే.. డిసెంబర్ 9న కేంద్రం బుద్ధి లేకుండా ప్రకటన చేసిందనుకోవాలా? అని ప్రశ్నించారు. ఓ సమయంలో లగడపాటిని 'యూ ఆర్ ఏ హీరో' అని కొనియాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుంచే విరమించుకుంటానని చెప్పి.. అదే విధానానికి కట్టుబడి ఉన్న మగబిడ్డ అని ప్రస్తుతించారు.

పొట్టకూటికోసం వచ్చిన వారిపై ద్వేషం లేదు
మా పొట్ట కొట్టడానికి వచ్చిన వారిపైనే ఉద్యమం : కేసీఆర్

  "ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే'' అన్న వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమర్ధించుకుంటూ, ఆ వ్యాఖ్యల వెనుక విశాల దృక్పథం ఉందని తెలిపారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిపై తమకెలాంటి ద్వేషం లేదని, మా పొట్ట కొట్టడానికి వచ్చినవారిపైనే మా ఉద్యమం అని పేర్కొన్నారు.

తెలంగాణలో పుట్టిన వాళ్ళంతా ఇక్కడివాళ్లేనని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు 42 శాతం ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసిన నేపథ్యంలో పై విధంగా సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ వివరణపై స్పందించిన తెలంగాణ న్యాయవాదుల సంఘం కార్యదర్శి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఒకసారి క్షమాపణ చెబితే సరిపోతుందని అన్నారు. లేని పక్షంలో సోమవారం న్యాయవాదుల సంఘం జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ దొరయేందిరో !
main-cartoతుది దశకు చేరుకున్న తెలంగాణ ఉద్యమాన్ని కులాల వారీగా చీల్చి తన అగ్రకుల దురహంకార మాయోపాయాన్ని తమపై ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుల రాజకీయంపై తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. కేసీఆర్‌ తెచ్చే వెలమ-రెడ్ల తెలంగాణ తమకు అవసరం లేదని, అగ్రవర్ణాలు లేని.. బడుగు బలహీన వర్గాలతో కూడిన సామాజిక తెలంగాణ మాత్రమే కావాలంటూ పిడిి లి బిగించనున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని టీఆస్‌ఎస్‌కు తాకట్టు పెట్టి, వారికి తొత్తులుగా మార్చుకునే కేసీఆర్‌ కుల రాజకీయాన్ని తిప్పికొట్టి, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తామే ముందుండి తెలంగాణ సాధించుకోవాలని బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

మరోవైపు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ సిద్ధమయింది.అగ్రకులాల రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడంతో పాటు, కేసీఆర్‌ పడగ నీడ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో ఇకపై అడుగులు వేయాలని నిర్ణయించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ సభలో దళిత నేత విశారదన్‌ ప్రసంగాన్ని అక్కడే ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి సూచనలతో అడ్డుకున్న వైనం బడుగు వర్గాల విద్యార్థి లోకంలో ఆగ్రహానికి దారితీసింది. ఈ పరిణామం.. కేసీఆర్‌ చేతిలో ఓయూ విద్యార్థి సంఘాలు చిక్కుకున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బడుగు వర్గాలు, తమ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు రంగంలోకి దిగాయి.

ఆత్మగౌరవ సభలో తమకు జరిగిన అన్యాయానికి కేసీఆరే కారణమంటూ శనివారం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నేతలు ఉస్మానియాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్థం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఓయూలోని బడుగు వర్గాలకు విద్యార్థుల్లో కేసీఆర్‌ చేస్తున్న కుల రాజకీయాలపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు వారు శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

బడుగు బలహీన వర్గాల ఆత్మత్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిందని, అయితే కేసీఆర్‌ దానిని వెలమ-రెడ్లకు అంకితం చేసేందుకు ఉద్యమంలో పాల్గొంటున్న తమ మధ్య చీలికలు తెచ్చి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ఎత్తుగడను తిప్పికొట్టి కేసీఆర్‌ నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బడుగు బలహీన వర్గాల విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు.కేసీఆర్‌ తన తొత్తులను తమలో చొప్పించి ఉద్యమాన్ని కులాల వారీగాచీలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అన్ని విధాలుగా ప్రలోభపరుచుకుని, తమ ఉద్యమాన్ని చివరకు టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టే దిశగా తీసుకువెళుతున్నందున, ఇకపై తాము కేసీఆర్‌ ఉచ్చులో చిక్కకూడదని బడుగు జేఏసీ నేతలు తీర్మానించు కున్నారు. తమ వర్గాలకే చెందిన కొందరు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ ప్రలోభాలకు చిక్కినందున, అగ్రవర్ణాలతో పాటు వారిని కూడా దూరం పెట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.

తమ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో తుది దశకు చేరిన ఉద్యమం ఫలించాలంటే తమకు అన్ని రాజకీయ పార్టీల అండ కావాలని, అందుకోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు.టీఆర్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలు మిగిలిన రాజకీయ పార్టీలను అడ్డుకుని, మొత్తం విద్యార్థులను కేసీఆ ర్‌ మద్దతుదారులుగా మార్చే ప్రయత్నా లను తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నా రు. బడుగు బలహీన వర్గాల ద్వారా ప్రారంభమయిన ఉద్యమాన్ని హైజాక్‌ చేసి, దానిని ఒక్క శాతం కూడా లేని వెలమదొరలకు అంకితం చేసేందుకు కేసీఆర్‌ చేస్తున్న రాజకీయ కుట్రను సమర్థవంతంగా, సమిష్ఠిగా తిప్పికొడతా మని ఓయూ బీసి జేఏసీ కన్వీనర్‌ వి. రామారావు గౌడ్‌ స్పష్టం చేశారు.

విద్యార్థి ఉద్యమంలో చొరబడ్డ టీఆర్‌ఎస్‌ను దూరం చేయకపోతే మిగిలిన పార్టీలు దరికి చేరవని గుర్తించిన బడుగు వర్గాల విద్యార్థి సంఘాలు, మిగిలిన పార్టీల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నాయి.నాయకులను అడ్డకుంటున్నది ఒక్క టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే సంఘాలే తప్ప, విద్యార్థులంతా కాదని వారికి స్పష్టం చేయనున్నారు. కేసీఆర్‌ అగ్రకుల రాజకీయం, మీడియా వల్ల పెద్ద నేతలుగా ఎదిగిన తమ వర్గ నేతలు కొందరు కేసీఆర్‌ను తాము విమర్శిస్తుంటే అడ్డుకుంటూ, దొరలకు ఊడిగం చేస్తున్నందున.. అలాంటి వారిని ఇకపై నాయకులుగా గుర్తించ వద్దని పిలుపునిచ్చేందుకు తీర్మానించారు. ‘దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన మైక్రోఫైనాన్స్‌ కేసులో పెద్ద లీడరుగా చెలామణి అవుతున్న ఓ నేత 3 లక్షలు తీసుకున్నాడు. కేసీఆర్‌కు భజన చేయడం, ఆయన నుంచి లబ్థి పొందడమే వారి రోజు వారీ కార్యక్రమం. ఇది ఓయూలో అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వాళ్లు చేసే ఉద్యమాలకు విశ్వసనీయత ఉంటుందా’ అని ఓ బీసీ విద్యార్థి సంఘ నేత ప్రశ్నించారు.

కొందరు నాయకుల తీరు, వ్యవహారశైలి వల్ల మొత్తం ఓయూ విద్యార్థులను దోషులుగా చూస్తున్నారని, అన్నింటికన్నా ప్రధానంగా విద్యార్థులందరినీ టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా చూపించేందుకు కేసీఆర్‌, ఆయనకు తందానా పలుకుతున్న నేతల ప్రయత్నాలను అడ్డుకోవడం చారిత్రక అవసరంగా గుర్తిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు ఆత్మగౌరవం అనేది లేకుండా పోతుందని భావిస్తున్నారు.విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారితో ఆరున్నర లక్షల సభ్యత్వాలు కేసీఆర్‌ చేయిస్తే, దానికి కారణమయిన విద్యార్థి నేతలు మాత్రం ఇంకా ఆయన చుట్టూ తిరుగుతున్న విషాద పరిస్థితిని తోటి విద్యార్థులకు వివరించేందుకు త్వరలో ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కేసీఆర్‌ను దూరం పెట్టాలి
ramaraoతనకు తొత్తులుగా మారని విద్యార్థి సంఘాల నేతలపై కేసీఆర్‌ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్‌ రామారావు ఆరోపించారు. కొన్ని విద్యార్థి సంఘాలు కేసీఆర్‌ ప్రలోభానికి లోనయ్యాయని, వారిని విద్యార్థులే దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దళితుడికి సీఎం, మైనారిటీకి డిప్యూటీ సీఎం ఇస్తానన్న కేసీఆర్‌కు తెలంగాణ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు ఆ పదవులకు అర్హులుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణ-దొరల తెలంగా ణకు వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ ఉద్యమంలో తామూ భాగస్వాము లవుతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో మొదలయిన విద్యార్థి ఉద్యమాన్ని కేసీఆర్‌ చీల్చి, వారి మధ్య శత్రుత్వాన్ని రగిలించారని ఆరోపించారు. ఆరోపించారు.

కేసీఆర్‌ అగ్రకుల దురంహంకారి
Arvind-Kumar-Goudకేసీఆర్‌ అగ్రకుల దురహంకారి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవిందకుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. దళితుడితో చెప్పులు తొడిగించుకున్న కేసీఆర్‌ రేపు తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవాన్ని ఇంకెంత దెబ్బతీస్తారో గమనించాలని పిలుపునిచ్చారు. దళిత విద్యార్థి విశారదన్‌ను అవమానించిన టీఆర్‌ఎస్‌ అగ్రకుల వైఖరిని దళితులు, బీసీలు ఇప్పటికయినా గ్రహించాలని కోరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు మాత్రమే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చారన్న వాస్తవాన్ని విస్మరిం చకూడదన్నారు. చంద్రబాబునాయుడు దళితులకు లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌, బీసీలకు అసెంబ్లీ స్పీకర్‌, హోం, రెవిన్యూ, ఆర్ధికమంత్రి వంటి శక్తివంతమైన పదవులు ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం దళితులతో చెప్పులు తొడిగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. నిజంగా దళితుడికి ఆ పదవి ఇస్తే అప్పుడు ఇంకెంత దారుణంగా అవమానిస్తారో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని గౌడ్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతాం
visharadhan‘ఇప్పటికే ఓయూలో కొన్ని విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారాయన్న అభిప్రాయం, అప్రతిష్ఠ జనంలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల మిగిలిన పార్టీలు మాకు కంటితుడుపు మద్దతు తప్ప, మనస్ఫూర్తిగా మద్దతునిచ్చేందుకు ముందుకురావడం లేదని గ్రహించాం. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు తీసుకువస్తాం. విద్యార్థుల ఆత్మగౌరవంతో నడిపే ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు అవసరం. ఆత్మగౌరవమంటే శక్తి. ఆ శక్తిని నిర్వీర్యం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. మా ఉద్యమంలో చీలికలు తెచ్చిన కేసీఆర్‌ను మేం కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం. అంటే మేమే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారతాం. అప్పుడే తెలంగాణ సిద్ధిస్తుంద’ని ఓయూకు చెందిన దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్‌ విశారదన్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్‌ బీసీల వ్యతిరేకి : జయప్రసాద్‌
కేసీఆర్‌ పచ్చి బీసీ వ్యతిరేకి అని, ఆయన ఉద్యమాన్ని నడిపించినంత కాలం తెలంగాణ రావడం అసాధ్యమని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కె.జయప్రసాద్‌ స్పష్టం చేశారు. ఓయూలో దళిత విద్యార్థి నేత విశారదన్‌ను ప్రసంగం మధ్యలోనే అడ్డుకోవడం, దానిని కోదండరామిరెడ్డి దగ్గరుండి మరీ ప్రోత్సహించడం బట్టి.. దొరల తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎంత నీచానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోందన్నారు. ఓయూ విద్యార్థులంతా తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటున్నందున.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కేసీఆర్‌ వలలో చిక్కుకోవద్దన్నారు. కేసీఆర్‌ కేవలం వెలమ-రెడ్ల కోసమే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు.

Friday, September 10, 2010

అందరి ఆనందం..ఈద్

రమజాన్ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్నిసృష్టిస్తుంది.
"ఈద్''అనేది ఒక అరబీ పదబంధం. ఒక మహనీయుని, లేక మహా సంఘటనను స్మరించుకుంటూ, ఏటా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రతి శుభ సందర్భాన్ని 'ఈద్'అంటారు. దీన్నే మనం తెలుగు భాషలో 'పండగ' అంటున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్(సం)మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్దెనిమిది మాసాల తరువాత, అంటే రమజాన్ మాసం మరి రెండు రోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రి శకం రెండవ సంవత్సరంలో సదఖా, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.

"ఎవరైతే పరిశుద్ధతను పొంది, అల్లాహ్(దైవ)నామాన్ని స్మరిస్తూ(ఈద్)నమాజ్ ఆచరించారో వారు సాఫల్యం పొందారు''(పవిత్ర ఖురాన్ 18-14). ఈ వాక్యానికి సంబంధించిన ఒక వ్యాఖ్యానంలో 'ఎవరైతే జకాత్, ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందారు'అని ఉంది. ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా, అబూఖుల్‌దాతో, 'రేపు మీరు ప్రార్థన కోసం ఈద్‌గాహ్‌కు వెళ్ళే ముందు ఒకసారి నా వద్దకు వచ్చి వెళ్ళండి' అన్నారు.

మరునాడు అబూఖుల్‌దా ఆయన వద్దకు వెళ్ళినపుడు 'ఏమైనా భుజించారా?'అని ప్రశ్నించారు. సమాధానంగా అబూఖుల్‌దా 'ఆ.. భుజించాను'అన్నారు. 'గుస్ల్(స్నానం)చేశారా?'అని మళ్ళీ ప్రశ్నించారు. 'ఆ.. చేశాను'అన్నారాయన సమాధానంగా. 'మరి జకాత్, ఫిత్రాలు చెల్లించారా?' 'ఆ.. చెల్లించాను'అని చెప్పాడరు అబూఖుల్‌దా. 'ఇక చాలు ఈ విషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఈ దైవ వాక్యం అర్థం కూడా ఇదే.'అన్నారాయన. హజ్రత్ ఉమర్‌బిన్ అబ్దుల్ అజీజ్ కూడా ప్రజలను ఫిత్రా చెల్లించమని ఆదేశించి, ఈ వాక్యాన్నే చదివి వినిపించేవారు.

ఉత్సాహవేళ...
పవిత్ర ఖురాన్‌లో 'ఈద్'అనే పదం ఓ ప్రత్యేక అర్థంలో మనకు కనిపిస్తుంది. మాయిదా సూరాలో దేవుని ప్రవక్త హజ్రత్ ఈసా అలై హిస్సలాం(క్రీస్తు మహనీయులు)ఆకాశం నుంచి 'మాయిదా'ను(ఆహార పదార్థాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపచేయమని దైవాన్ని వేడుకుంటారు. "మా ప్రభువా!! మా ముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుంచి అవతరింపచేయి.

అది మాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ పండగ(ఈద్) ఈ రోజు అవుతుంది.''(పవిత్ర ఖురాన్ 5-114) అల్లమా ఇచ్నెకసీర్, హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్(రజి) మహనీయుల్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు.

హ!! ఈసా అలై హిస్సాలాం, ఇజ్రాయేలీయులతో, 'మీరు 30రోజుల వరకు ఉపవాసవ్రతం పాటించి, ఆకాశం నుంచి మాయిదాను వర్షింపచేయమని అల్లాహ్‌ను ప్రార్థిస్తే ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికేదాని ప్రతిఫలం దొరుకుతుంది''అన్నారు. అప్పుడు క్రీస్తు మహనీయుల వారి వాక్కు ప్రకారం ఇజ్రేయెలీయులు 30రోజులు ఉపవాసాలు పాటించారు. దీంతో ఆకాశం నుంచి 'మాయిదా' అవతరించింది.

హ.. అమ్మార్ బిన్ యాసిర్(రజి) కథనం ప్రకారం, 'ఈ మాయిదాను ప్రజలు ఎంత తిన్నా తరిగేది కాదు'అందుకే మాయిదా అవతరణను క్రీస్తు మహనీయులు పండగ(ఈద్)తో పోల్చారు. అంటే, దేవుని అనుగ్రహాలను పొంది మనం సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్రఖురాన్‌లో కూడా ఇలా ఉంది. 'ప్రవక్తా! వారికిలా చెప్పండి. ఈ మహా భాగ్యాన్ని దైవం మీ కోసం పంపాడంటే, అది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి'(పవిత్ర ఖురాన్ 10-58).

దైవ కృప అపారం
మరో చోట.. 'మీ ప్రభువు అనుగ్రహాలను గురించి బాగా చర్చించండి, వాటిని దాటుతూ ఉండండి'అని ఉంది(పవిత్ర ఖురాన్ 93-11). నిజానికి రమజాన్ ఉపవాసాలు దైవం మానవులపై కురిపించిన అపార దయానుగ్రహాలు. పండగ ఆ అనుగ్రహాలను స్మరించుకుంటూ దైవానికి కృతాజ్ఞతాంజలులు సమర్పించుకొనే ఓ చక్కని సందర్భం.

అంతేకాకుండా ఈ పవిత్ర రమజాన్‌లోనే దైవం మానవాళికి మరో మహత్తర కానుక కూడా బహుకరించాడు. అదే పవిత్ర ఖురాన్ అవతరణ. ఇది సమస్త మానవాళికి సన్మార్గ ప్రదాయిని. మానవ కల్యాణం కోసం ఇంతటి మహత్తర, మహిమాన్విత గ్రంథ రాజాన్ని అవతరిపంచేసినందుకు, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకొని, ఆయన ఘనతను, కొనియాడండి.

ఆయనకు కృతజ్ఞతలు తెలపండి'(పవిత్ర ఖురాన్ 2-185) ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారం, హద్దుల్ని అతిక్రమించకుండా, దుబారాలకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు తావీయకుండా దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండగ.

ప్రవక్త ఏం చేసేవారు?
పండగ సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త(స)వారి ఆచరణ ఇలా ఉండేది. ఆయన పండగ నమాజును ఈద్‌గాహ్‌లో చేసేవారు. అందుకే ప్రవక్త సంప్రదాయన్ననుసరించి ఈద్ నమాజును ఊరి బయట బహిరంగ ప్రదేశంలో (ఈద్‌గాహ్‌లో)నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచ దేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం.

అయితే అనివార్య పరిస్థితుల్లో మాత్రం ఈద్ నమాజ్‌ను మసీదులోనే చేసుకోవచ్చు. ప్రవక్త వారు కూడా ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్‌గాహ్‌లో పండగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ప్రవక్త మహనీయులు ఉన్నంతలోనే కొత్త వస్త్రాలు ధరించేవారు.

శుక్రవారం నమాజుకు, పండగ నమాజులకు ధరించేందుకు ఆయనకు ప్రత్యేకంగా ఒక జత దుస్తులు ఉండేవి. పండగపూట మంచి బట్టలు ధరించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు వాడడం కూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్‌గాహ్‌కు వెళ్లే ముందు కొద్దిగా అల్పాహారం (అంటే ఆ రోజుల్లో ఖర్జూరాలు) తీసుకొనే వారు.

బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్‌గాహ్‌కు వెళ్లేవారు. రమజాన్ నమాజును కాస్త ఆలస్యంగా బక్రీద్ నమాజును కాస్త తొందరగా చేసేవారు. ఈదుల్ ఫిత్ర్‌లో సదఖ, ఫిత్రా, ఈదుల్ అజహాలో ఖుర్బానీ ముఖ్య విధులు. యావత్ ప్రపంచంలో ఈ పండగను అత్యంత భక్తి ప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

పేదసాదలను ఆదుకోవాలి
కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండగ రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ధనవంతులు జకాత్, ఫిత్రాల రూపంలో తమను ఆదుకుంటారని వారు ఆశిస్తారు. కాబట్టి ధనవంతులు నిరుపేదల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా, అభాగ్యులకు సాయం చేసి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రయత్నించాలి. ఇస్లామియా ధర్మశాస్త్రం డబ్బు దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా చేసేవారు సైతాన్ సోదరులని చెప్పింది.

అవసరార్థులకు, పేదసాదలకు ధనసాయం చేసేందుకు ఖర్చు చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది.

సేమియా, షీర్‌ఖుర్మాల తీపితో పాటు కులమతాలకు అతీతంగా అందరి మధ్య ఆత్మీయతలు, అనుబంధాలను ప్రోది చేస్తుంది. ఎలాంటి అసమానత, అణచివేత, దోపిడీ, పీడన, దారిద్య్రం లేని ఓ సుందర సమాజ నిర్మాణానికి పండగలు దోహదం చేయాలని, రమజాన్ స్ఫూర్తి అందరి గుండెల్లో నిండుగా వెలగాలని కోరుకుందాం. 
* యం.డి. ఉస్మాన్ ఖాన్