Friday, October 29, 2010

డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్

సొగసు సౌకర్యం కుర్తా

అందంగా కనబడే సౌకర్యవంతమైన డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్ ఉందంటారు డిజైనర్లు. అలాంటి దుస్తుల్లో కుర్తా ఒకటి. ఎన్ని రకాల ఫ్యాషన్లు మార్కెట్లోకి వచ్చినా- కుర్తాకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గటం లేదు.

ఏ సందర్భంలో వేసుకున్నా అందంగా కనిపించటం కుర్తాలకున్న ప్రత్యేకత. కాటన్, లినెన్, రెయన్ బ్లెండ్స్ ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో కుర్తాలను కుట్టించుకోవచ్చు. 

                                                                             
ఎవరికి ఎలాంటి కుర్తాలు నప్పుతాయో  చూద్దాం..

ఎలాంటి ఫిట్?
'కుర్తా' అంటే వదులుగా ఉండేదని అర్థం. సాధారణంగా కుర్తాలు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా నప్పుతాయి. శరీరాకృతికి తగినట్లుగా కుర్తాను కుట్టించుకోవటం వల్ల అందం రెట్టింపు అవుతుంది. సన్నని నడుము ఉన్నవాళ్లు కుర్తా నడుము భాగం వద్ద బిగుతుగా ఉండేలా కుట్టించుకోవాలి.

నడుము దగ్గర లావుగా, పిరుదులు పెద్దవిగా ఉన్నవారు- పై నుంచి కిందకి ఒకే విధంగా ఉండేలా కుట్టించుకోవాలి. లావుగా, పొట్టిగా ఉండేవాళ్లు- మందంగా ఉన్న గుడ్డతో కుర్తాను కుట్టించుకోవాలి. సన్నగా ఉన్నవారు మీడియం రకం గుడ్డతో కుట్టించుకోవాలి.

ఎంత పొడవు?
పొట్టిగా ఉండేవాళ్లు- మోకాళ్ల వరకూ కుర్తా ఉండేలా కుట్టించుకోవాలి. నిలువు గీతలున్న కుర్తాలు ధరించటం వల్ల పొడవుగా కనిపిస్తారనేది మీకు తెలిసే ఉంటుంది.

పొడవుగా ఉన్నవాళ్లు- నడుము కిందదాకా ఉన్న కుర్తీలను ఉపయోగిస్తే అందంగా ఉంటుంది. బాగా పొడవు ఉన్నవారు అడ్డగీతలు ఉన్న కుర్తాలను వేసుకోవాలి. ముదురు రంగు కుర్తాలను వేసుకున్నప్పుడు..బాటమ్ లేత రంగులో ఉండేలా చూసుకోవాలి.

ఎలాంటి స్లీవ్స్?
కుర్తాల స్లీవ్స్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం 1960,70ల నాటి రెట్రో ఫ్యాషన్ నడుస్తోంది. లావుగా ఉన్నవారు స్లీవ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోచేతి వరకు లేదా 3/4 లెంగ్త్ లేదా ఫుల్ సీవ్స్ కుర్తాలను కూడా వేసుకోవచ్చు. కాని అవి బిగుతుగా ఉండాలి.

అప్పుడు సన్నగా కనిపిస్తారు. సన్నగా ఉండే అమ్మాయిలు బెల్, బట్టర్‌ఫ్లై, కప్స్, పఫ్స్ వంటి స్టయిల్ స్లీవ్స్‌ను ధరించవచ్చు. పొట్టిగా ఉన్నవారు 3/4 స్లీవ్స్‌ని వేసుకోవటం వల్ల కొంత డిఫరెంట్‌గా కనిపించవచ్చు. కుర్తా చేతులకు ఇటీవల కాలంలో వర్క్ చేయిస్తున్నారు. ఇవి పార్టీ వేర్‌గా బావుంటాయి.

ఎవరికి ఏలాంటి నెక్‌లైన్?
నెక్‌లైన్‌ను- మెడ, భుజాలు, ఛాతి, ముఖంల ఆధారంగా నెక్‌లైన్‌ను ఎంచుకోవాలి. డీప్ నెక్‌లైన్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. భుజాలు చిన్నగా (నారో షోల్డర్స్) ఉన్నవారు సాధారణ నెక్‌లైన్స్‌కు భిన్నంగా ఉన్నవి వేసుకుంటే బావుంటుంది.

పొడవు మెడ, కోల మొహం ఉన్నవారు క్రూ నెక్‌లైన్‌ని ఎంచుకోవటం వల్ల శరీరాకృతిని బ్యాలెన్స్ చేయవచ్చు. ముఖం గుండ్రంగా ఉన్నవారికి క్రూ నెక్ బావుండదు. భుజాలు చిన్నగా ఉన్నవారు వెడల్పు వీ నెక్, భుజాలు పెద్దగా ఉండేవారు డీప్ వీ నెక్ కుర్తాలను ధరించొచ్చు.

వర్క్
ఎంబ్రాయిడరీ, జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్, పల్లు, నిట్టెడ్, నక్షి ఇలా ఎన్నో వర్క్ చేసిన కుర్తాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సంప్రదాయంగా కనిపించాలంటే జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్ వర్క్స్ ఉన్న కుర్తాలను ధరించొచ్చు. కాస్త స్టయిల్ లుక్ రావాలంటే జర్దోసీ, పల్లు, నిట్టెడ్, నక్షి వర్క్ కుర్తాలను వేసుకోవాలి.

మంచి శరీరాకృతి ఉన్నవాళ్లు హెవీ, లైట్ ఎలాంటి వర్క్ ఉన్న కుర్తాలనయినా ధరించొచ్చు. పొడవుగా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద ప్రింట్లు, ఓవరాల్ ప్రింటెడ్ వర్క్ ఉన్న వాటిని కూడా ధరించొచ్చు. లావుగా ఉన్న వారికి సింపుల్ వర్క్ ఉన్న కుర్తాలే బావుంటాయి.

కలర్స్
ప్రస్తుతం- ఆరెంజ్, డీప్ పర్పుల్, మెరూన్, గోల్డ్, తెలుపు, గులాబి, ఎరుపు, పసుపు రంగులను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. లావుగా ఉన్నవారు సింగిల్‌కలర్ టోన్ ఉన్న కుర్తాలను వేసుకుంటే సన్నంగా కనిపిస్తారు.
అర్పిత, ఫ్యాషన్ డిజైనర్

Monday, October 25, 2010

తళుకుల తారల చేతిలో కత్తెర్లు ........

వీళ్ల 'కటింగ్'లకు ఖరీదెక్కువ!

దసరా, దీపావళి వచ్చిందంటే చాలు. వాళ్ల కత్తెర్లకు చేతినిండా పని. కత్తెర్లకు పనంటే ఏ హెయిర్‌సెలూన్‌లోనో బిజీ అయిపోయారని కాదండోయ్. ఈ తళుకుల తారల చేతిలో కత్తెర్లు కొత్తరకం హెయిర్‌స్టయిల్స్ కట్ చేసి ఏ యాభయ్యో వందో తీసుకోవు. అలా వయ్యారంగా వచ్చి ఒక చేత్తో 'కటింగ్' ఇచ్చి.. మరో చేత్తో లక్షలు సంపాదించి పెడుతున్నాయి వీళ్ల కత్తెర్లు

అలాగని అన్ని కత్తెర్లకూ ఒకే రేటు కాదు. ఎంత పదునుకు అంత రేటన్నమాట. పదునంటే గ్లామర్. గ్లామర్ అంటే స్టార్‌డమ్. టాలీవుడ్ భామలంతా పండుగలొస్తే కత్తెర్లకు పనిజెప్పే ట్రెండు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఏటా దసరా, దీపావళి పండుగలకు హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో షాపింగ్‌మాల్స్ బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీపడుతుంటాయి.

ఈ రోజుల్లో చడీచప్పుడు లేకుండా ఊరికినే ఆకట్టుకోవాలంటే కుదిరేపని కాదు. అందుకే షాపింగ్ యజమానులు గ్లామర్ తారల చేత్తో ఖరీదైన కటింగ్స్ ఇస్తుంటారు. అప్పుడు బోలెడు డిస్కౌంట్లు, బంపర్ బహుమతులు, ప్రారంభోత్సవాలతో అందర్నీ ఆకర్షిస్తారు.

ప్రకటన ఉత్తినే చేస్తే ఎవ్వరి చూపూ షాపింగ్‌ల వైపు పడదని.. ఏ అనుష్కాతోనో, ఇలియానాతోనో సందడి చేయిస్తుంటారు. కస్టమర్లకు పండుగ ఆఫర్లు ఎంత సంతృప్తినిస్తున్నాయో కానీ, కటింగ్‌లు ఇచ్చే తారలకు మాత్రం నిజంగా పండగే పండగ. తెలుగు సినీ పరిశ్రమలో మంచి బూమ్‌లో ఉన్న అనుష్క ఒక కార్యక్రమ ప్రారంభోత్సవానికి గంటకు 20 లక్షలు తీసుకుంటుందట.

'మగధీర'తో అందరినీ ఆకర్షించిన కాజల్ 5 నుంచి 8 లక్షలు తీసుకుంటుందట. ఈ మధ్యనే 'బృందావనం' సూపర్‌హిట్ కొట్టడంతో ప్రారంభోత్సవాల రేటును 10 లక్షలకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియమణి, నికిషాపటేల్ 4 లక్షలు, సమంతా, తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, మమతా మోహన్‌దాస్‌లు ఒక్కో ప్రైవేటు కార్యక్రమానికి రెండు నుంచి మూడు లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

" దుకాణాలకు తారలను ఆహ్వానించడం కొంత ఖర్చుతో కూడుకున్న పనే అయినా, తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రచారం వస్తుంది...'' అంటున్నారు యజమానులు.

ఎవరి కత్తెరకు ఎంత పదును..?
అనుష్క, ఇలియానా, జెనీలియా : రూ.15 నుంచి 20 లక్షలు
కాజల్ : రూ.5 నుంచి 8 లక్షలు
ప్రియమణి, నికిషా పటేల్ : రూ. 4 లక్షలు
సమంతా, తాప్సీ, రిచా, మమతా మోహన్‌దాస్ : రూ.2 నుంచి 3 లక్షలు
ప్రియా ఆనంద్ : రూ.2 లక్షలు
మధురిమ, బిందుమాధవి, పద్మప్రియ : రూ.50 వేల నుంచి లక్ష

Thursday, October 21, 2010

జీనాలజీ

నడుము
నడుము, పిరుదులు, తొడలు- ఈ మూడింటి ఆకృతిని బట్టి జీన్‌ను ఎంచుకోవాలి. జీన్ వేసుకున్నప్పుడు- ఈ మూడు భాగాల్లోను ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కచ్చితంగా అతికినట్లు ఉంటేనే అందంగా కనిపిస్తుంది. కొందరికి నడుము దగ్గర ఎక్కువ కొవ్వు ఉంటుంది. పొట్ట కూడా ఉంటుంది. ఇలాంటి వారు నడుము భాగం ఎక్కువ కనిపించకుండా ఉండే- హై రెయిజ్, మిడ్ రెయిజ్ జీన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. కాళ్లు సన్నగా ఉండి.. నడుము దగ్గర ఎక్కువ కొవ్వు లేనివారు లో రెయిజ్ జీన్స్‌ను ఎంచుకోవాలి.

పిరుదులు
జీన్స్‌ని ఎంచుకునేటప్పుడు వాటి వెనక జేబులు ఎక్కడ ఉన్నాయో చూడాలి. జీన్ వేసుకున్నప్పుడు వెనక జేబులు- మరీ పక్కకు రాకూడదు. పిరుదు మధ్యకు రావాలి. దీనితో పాటుగా ముందు జేబులలో చేతులు పెట్టి ఒక సారి చూసుకోవాలి. వాటిలో పర్సు లేదా సెల్‌ఫోన్ పెట్టుకోవటానికి వీలు ఉండాలి. కొందరికి పిరుదులు పెద్దవిగా ఉంటాయి. అలాంటి వారు వెనక భాగంలో మరీ ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేసిన జీన్స్‌ను ఎంపిక చేసుకోకపోవటం మంచిది. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కాని జేబులకు కవర్లు ఉన్న జీన్స్ కాని ఎంచుకుంటే మంచిది.

ముందు భాగం
జిప్ ఉండే భాగం ఆధారంగా కూడా జీన్స్ షేప్ మారిపోతూ ఉంటుంది. ఈ భాగంలో బాగా బిగుతుగా ఉన్న జీన్స్‌ను ఎంచుకోకూడదు. అక్కడ మాత్రం శరీరాకృతికి కచ్చితంగా పట్టినట్లు కాకుండా- ఒకటి ఒకటిన్నర అంగుళాలు వదులుగా ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే కూర్చునే సమయంలో ముందు భాగంలో ముడతలు పడిపోతుంది.

తొడలు
జీన్స్ తొడ దగ్గర భాగం కొద్దిగా వదులుగా ఉండాలి. అప్పుడే నడవటానికి సౌకర్యంగా ఉంటుంది. కొందరికి తొడలు వెడల్పుగా ఉంటాయి. అలాంటి వారు తొడల వద్ద టైట్‌గా పట్టేసే జీన్స్‌ను ఎంచుకోకూడదు.

పిక్కలు
పిక్కల దగ్గర జీన్స్ బిగుతుగా ఉండాలనుకుంటే జెగ్గింగ్స్‌ను ఎంచుకోవాలి (జీన్స్‌లా ఉండే లెగ్గింగ్స్‌ను జెగ్గింగ్స్ అంటారు). మంచి శరీరాకృతి ఉన్నవారి కోసం మార్కెట్లోకి బూట్‌కట్ ఫిట్, ఫ్లేర్డ్ ఫిట్‌లు వచ్చాయి. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు.

హెమ్
జీన్స్ కింది భాగాన్ని హెమ్ అంటారు. శరీరాకృతిని బట్టి ఇది ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. పొట్టిగా ఉండే అమ్మాయిలు- పిక్కల దాకా ఉండే జీన్స్‌ను(3/4 జీన్స్) వేసుకోకూడదు. హై హీల్స్ వేసుకొని పాదం కింది దాకా ఉండే జీన్స్‌ను వేసుకోవాలి. కొందరు ఫ్లాట్ జీన్స్‌ను ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి వారు చెప్పులు లేదా బూట్లు దాకా ఉండే జీన్స్‌ను వేసుకుంటే బావుంటుంది.

చెక్‌లిస్ట్
మరీ వదులుగా లేదా మరీ టైట్‌గా ఉన్న జీన్స్‌ను ఎప్పుడూ కొనొద్దు. మరీ టైట్ జీన్స్‌ను కొంటే తొడల వద్ద ముడతలు పడిపోతాయి. మరీ లూజ్‌గా ఉన్న జీన్స్‌ను కొంటే బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా సౌకర్యంగా ఉండదు.

మార్కెట్లో ఉన్న ట్రెండ్‌ను ఫాలో కావాలి. సన్నగా ఉన్నవారికి స్కిన్నీ జీన్స్ బాగుంటాయి. తొడల దగ్గర కొద్దిగా లావుగా ఉన్నవారు కూడా స్కిన్నీ జీన్స్‌ను వేసుకోవచ్చు కాని దానిపై పొడవైన టాప్‌ను లేదా కుర్తీని వేసుకోవాలి.

మార్కెట్‌లోకి అనేక రకాల జీన్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఒకే రకం జీన్‌ను పదే పదే కొనటం అనవసరం. వేర్వేరు రకాలు కొనుగోలు చేస్తే బావుంటుంది.

ట్రెండీగా ఉండే జీన్స్‌నైనా సరే ఒకటి రెండుకు మించి కొనొద్దు. ఎంబ్రాయిడరీ, యాసిడ్ వాష్ రకాలు ఏడెనిమిది సంవత్సరాలుగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. అలాంటి వాటికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వాటిని ఎంచుకుంటే మంచిది.

జీన్స్ కొనేందుకు వెళ్లినప్పుడు స్కర్ట్ వేసుకొని వెళ్లటం ఉత్తమం. దీని వల్ల జీన్‌ను వేసి చూసుకోవటం సులభమవుతుంది.

షాపులో జీన్స్ ట్రయల్ వేసినప్పుడు నడవటంతో పాటుగా వంగి పైకి లేచి చూసుకోవాలి. అప్పుడు జీన్ కచ్చితంగా ఫిట్ అయిందో లేదో తెలుస్తుంది.