Monday, April 18, 2011

చారిత్రాత్మక సంపాదకు చెర

శతృదుర్భేధ్యం గోల్కొండ కోట


కుతుబ్‌షాహిలు శతృదుర్భేధ్యంగా నిర్మించిన కోట లోని పలు నిర్మాణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా దక్కన్ సంస్కృతీ - సంప్రదాయాలు, రాజులు, రాణులు, వారి జీవన శైలి నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ముఖ్యంగా యుద్ధ తంత్ర కళా నైపుణ్యానికి గోల్కొండ కోట సాక్షీభూతంగా నిలిచింది. సుమారు 500 ఎకరాలకు పైగా విస్తరించిన గోల్కొండ కుతుబ్‌షాహిల కాలంలో వజ్ర-వైఢూర్యాలు, మంచి ముత్యాలకు అరుదైన వర్తక వాణిజ్యంకు కేంద్రం.

సుమారు నాలుగు వందల అడుగుల ఎత్తైన పర్వతంపై కోటగోడలురాతితో నిర్మించారు. కోటలోపల మందుగుండు సామగ్రి నిల్వ చేసే మందిరాలు, సైనిక స్థావరాలు, మంత్రుల కార్యాలయాలు, రాణిమహల్‌లు, ఉద్యానవనాలున్నాయి. అంతే కాకుండా ఫతే దర్వాజా- మూసా బురుజులకు మధ్య వాయవ్యదిశలో దివాన్ మహల్ ఉంది. అప్పట్లో దీన్ని తానీషా కొలువులో పని చేసిన అక్కన్న- మాదన్నలు కార్యాలయంగా వినియోగించారు. అలాగే బాలాహిస్సార్ దర్వాజాకు ఎదురుగా రెండు కమాన్‌లు హబ్సికమాన్‌లున్నాయి. రాజభవనాలకు కిందిభాగంలో జీలుఖానా ఇలీ మైదానం వుంది. దీనికి సమీపంలోనే శిధిలమైన మసీదు ఉండేది. సైనిక వందనం కోసం ఈ మైదానాన్ని వినియోగించేవారు. అలాగే కోట పై భాగంలో కొండపై కన్పించే సుందర నిర్మాణం బాలాహిస్సార్. కుతుబ్‌షాహి మందిరాలు, విధాన సభ హాల్, మూడు అంతస్థులో బరాదరినిర్మాణం ఉంది.

దీని పై అంతస్థులో రాతి సింహాసనం ఉండేది. బాలాహిస్సార్ మొదటిగేట్ నుంచి బరాదరి వరకు సుమారు 360 మెట్లున్నాయి. బరాదరిలో మొదటిది దర్బార్-ఎ- ఆమ్ (ఇక్కడికి సామాన్య ప్రజలను అనుమతించేవారు) రెండోది దర్బార్-ఎ-ఖాస్ ( ఇక్కడ మంత్రి వర్గ సమావేశాలు నిర్వహఙంచేవారు), మూడో అంతస్థులో కుతుబ్‌షా ఏకాంత మందిరం. ఇక క్రింది వైపు రామదాసు బందిఖానా, అక్కన్న మాదన్నలు నిర్మించిన జగదాంబ మందిరం, మసీదులున్నాయి. గోల్కొండకు సుమారు అయిదు కిమీ దూరంలోని దుర్గం చెరువు నుంచి కోటపైభాగానికి నీటిని పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఆ కాలంలో ఉండేవట. అంతే కాకుండా గోల్కొండ నుంచి చార్మినార్ వరకు రహస్య సొరంగమార్గం ఉండేదని ప్రచారం.
 
 
కుతుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌధలకు 'యునెస్కో' గుర్తింపు దక్కేనా..?

గోల్కొండ కోటకు వా యువ్య దిశలో వంద ఎకరాల తోట ఇ బ్రహీంబాగ్‌లో వెలిసిన ఏడుగురు కు తుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌధల ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తింపు పొందాల్సి ఉంది. కానీ చుట్టూ వెలిసిన అక్రమ నిర్మాణాలతో అస్తవ్యస్థంగా మారడంతో యునెస్కో గుర్తింపునకు నోచుకోలేదు.కుతుబ్‌షాహి నిర్మాణాల పేరి ట గుర్తించేందుకు అనువుగా అక్రమణలు తొలగించి పర్యాటకులను ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్ది ప్రతిపాదనలు పంపితే గుర్తింపు దక్కే అవకాశం ఉం టుందని ప్రతినిధులు సూచించారు.ఈ మేరకు రాష్ట్ర పురాతత్త్వ శాఖ అధికారులు రెండో సారి గోల్కొండ టూంబ్స్ పై సమగ్ర సమాచారాన్ని సేకరించి యునెస్కోకు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా 525 ఏళ్ల క్రితం నాటి కుతుబ్‌షా సమాధుల నిర్మాణాలు ప్రపంచవారసత్వ సంపదజాబితాలో చేరేఅవకాశం ఉంటుంది.

కుతుబ్‌షాహి వంశంలో తొలి రాజు సుల్తాన్ కులీ కుతుబ్‌షా (1543) నుంచి ఆ వంశంలో ఏడో రాజు అబ్దుల్లా ఖుతుబ్‌షా (1614-1672) వరకు సమాధులు ఈప్రాంతంలోనే ఉన్నా యి.చివరి రాజు సుల్తాన్ అబ్దుల్ హసన్ తానీషా (1672-1687) అధికారంలో ఉండ గా ఔరంగజేబు దండయాత్రతో బందీ గా మారి ఔరంగాబాద్‌లో 12 ఏళ్లు కారాగారవాసం చేసి మరణించాడు.దీంతో ఆయన సమాధి గోల్కొండలో నిర్మించలేదు. తోట ఉత్తర దిశలో మొ దటి సుల్తాన్ కులీ కుతుబ్‌షా సమాధి ఉంది. దానికి సమీపంలోనే ముగ్గురు పాదుషాలు జంషీద్ కుతుబ్‌షా (1543-1550), సుబాన్‌కులీ కుతుబ్‌షా (1550-1551), ఇబ్రహీం కులీ కుతుబ్‌షా (1550-1580) సమాధులున్నాయి. వీటికి దక్షిణ భాగంలో హైదరాబాద్ నగర వ్యవస్థాపకులు మ హ్మద్‌కులీ కుతుబ్‌షా (1580- 1612) సమాధి ఉంది. విశిష్ట వాస్తు నిర్మాణం. దీనికి సమీపంలోనే ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా మసీదు ఉంటుంది.

ఆగ్నేయ భాగంలో ఆరవ సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612-1626) సమాధి, ఏడో రాజు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా (1626-1672) సమాధిని ఇబ్రహీంబాగ్ తోటకు ఆవలి వైపున నిర్మించడం విశేషం. అంతే కాకుండా ఈసముదాయంలో హైదరాబాద్ న గర వ్యవస్థాపకులు మహ్మద్‌కులీ కు తుబ్‌షా కూతురు హయత్‌భక్షీ బేగం సమాధి, ఇబ్రహీం కుతుబ్‌షా ఆరవ కుమారుడు మీర్జా మహ్మద్ అమీన్ సమాధి,అబ్దుల్‌కుతుబ్‌షా పెద్ద అల్లు డు సయ్యద్ అహ్మద్ సమాధి, రాజకుమారికుల్సుంబేగంసమాధులున్నాయి. అప్పట్లో రంగుల పుష్పాలనిచ్చే ఉద్యానవనంలో రాజుల స్మృతి సౌధలను ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. బా హ్యతలంలో సమాధులన్నీ రూపంలో ఒకే రకంగా కన్పించినా పరిమాణంలోనూ, నిర్మాణంలోనూ, కుడ్యవాస్తు నగిషీల్లో వైవిధ్యం కన్పిస్తుంది.

ఇరాన్ వాస్తు శైలికి ప్రతీకగా నిలిచే సమాధుల నిర్మాణంలో ఇండో-ఇస్లామిక్ సమ్మిశ్రిత వాస్తు వైవిధ్యం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. సమాధుల లోపలి భాగాలను ఇరాన్ సెరామిక్ టైల్స్‌తో అలంకరించి ఉండడం విశేషం. అసఫ్‌జాహిలు ఈ నిర్మాణాలను పరిరక్షించేందుకు విశేషంగా కృషి చేశారు. ప్రధానంగా సాలార్‌జంగ్-1 ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో కుతుబ్‌షాహి టోంబ్స్ పరిరక్షణకోసం లక్షలాది నిధులు వ్యయం చేయించారు. అలాగే వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సమాధుల పునాదులు వర్షపు నీటితో బలహీనమైనట్టు గుర్తించిన పురాతత్వ శాఖ అధికారులు సమాధుల భాగాలను పటిష్టపరిచే పనులు చేపట్టారు.
ఆక్రమణలతో అన్యాక్రాంతమైన సుమారు మూ డు ఎకరాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కుతుబ్‌షాహి సమాధుల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా తక్షణం గుర్తించాల్సిన అవసరం ఉంది.

పైగా టూంబ్స్ పరిరక్షణపై నిర్లక్ష్యం


ధ్వంసమవుతున్న పాలరాతి నిర్మాణాలు
అన్యాక్రాంతమవుతున్న సమాధుల స్థలాలు


నిజాం నవాబుల వద్ద ప్రధానులుగా ఇతర కీలక బాధ్యతలు నిర్వహించిన పైగా నవాబుల కుటుంబ సభ్యుల సమాధులన్నీ ఒకే చోట ఉన్నాయి. సంతోష్‌నగర్ సమీపం లోని ఈ సమాధులు పాలరాయి, రంగు రాళ్లతో అలంకరించిన ఇవి హైదరాబాద్ తాజ్‌మహల్‌గా సుప్రసిద్ధం. 1786లో మరణించిన నవాబ్ తేజ్ జంగ్ షంషూల్ ఉమ్రా బహదూర్ సమాధి మొట్టమొదటి సమాధి. దాని పక్కనే నవాబ్ సర్ అసమాస్‌జా బహదూర్, నవాబ్ సర్ ఖుర్షీద్‌జా బహదూర్, సర్ వికార్ ఉల్ ఉమ్రా బహదూర్, నవాబ్ సెషర్ జంగ్ బహదూర్‌ల సమాధులు వరుసగా ఉన్నాయి. కాగా మూడో నవాబ్ షంషుల్ ఉమ్రా, బేగం ఖుర్‌షీజా బహదూర్ సమాధులను రంగు రాళ్లతో నిర్మించడం విశేషం. సమాధుల సముదాయానికి ప్రవేశించే ద్వారం రెండంతస్థుల్లో ఉంది. నౌబత్ ఖానాగా వ్యవహరించే ఈ ద్వారం పై భాగంలో నిర్ణీత సందర్భంలో ఢంకా వాయిధ్యాలను వినియోగించేవారు. ఇక సమాధుల ఆవరణకు కప్పి ఉంచినట్టుగా పాలరాతి అల్లికల కమాన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

కాగా పురాతత్వ శాఖ పర్యవేక్షణలోని ఈ నిర్మాణాల పరిరక్షణ పై నిర్లక్ష్యం కారణంగా చోరుల దాడిలో అమూల్యమైన రంగురాళ్ల అలంకరణలు అదృశ్యమవుతున్నాయి. పాలరాతి నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. ఆక్రమణదారుల చేతిలో చిక్కిన సమాధుల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రపంచ పర్యాటకులకు అమితంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దిన పయిగా నవాబుల స్మృతి సౌధాలు శిథిల కేంద్రాలుగా మారుతున్నాయి. పరిరక్షణ పనులను ఉపేక్షిస్తే చారిత్రాత్మక ఆనవాళ్లు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. 

ఖరీదైన హోటల్‌గా సోకు చేసుకున్న ఫలక్‌నుమా ప్యాలెస్


నిజాం కాలంనాటి రాజభవనం నేడు సంపన్నుల విడిది కేంద్రంగా రూపుదాల్చింది. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో స్టార్ హోటల్‌గా గుర్తింపు పొందింది. చార్మినార్‌కు సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో చిన్న కొండపై రాజభవన నిర్మాణానికి అప్పటి నిజాం ప్రధాని వికారుల్ ఉమ్రా 1884లో పునాది వేశారు.1892-93లో పనులు పూర్తి చేయించారు. అప్పట్లో ఈ నిర్మా ణం కోసం సుమారు రూ. 40 లక్షలు వ్యయం చేశారు. కాగా ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ భవనంలోని విశిష్టతను గుర్తించి 1895 లో నిర్మాణ వ్యయాన్ని చెల్లిం చి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1911లో ఈ భవనంలోనే ఆయన కన్నుమూశారు. కాగా, ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయి, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న కలపను వినియోగించారు. ఇందులోని ప్రతిగది వైవిధ్యంతో కళాత్మకంగా దర్శనమిస్తుంది.

పొద్దుతిరుగుడు పూలు, ఇతర పుష్పాకృతులు సౌందర్య భరింతగా కన్పిస్తాయి. సీలింగ్‌పై పక్షి చిత్రం విశేషమైనది. గదిలో కూర్చుని ఎటువైపు చూస్తే అటువైపునే ఎగిరిపోతున్నట్టు కన్పించే ఈ చిత్రం నాటి కళాకారుల నైపుణ్యతను ప్రదర్శిస్తుంది. ఇందులో 36 షాండిలియర్స్‌తో వెలుగులు విరజిమ్మే సింహాసన గది, సువిశాల గదుల గోడలను నగిషీలతో అద్భుతంగా తీర్చి దిద్దారు. విశాలమైన డైనింగ్ టేబుల్ లో 102 టేబుల్స్ ఉన్నాయి. కార్డ్ రూం, బిలియర్డ్స్ రూం, స్మోకింగ్ సూట్స్ ఒకటేమిటి ఒక్కోహాల్‌కు ఒక్కో విశిష్టత ఉంది. ఈ రాజఠీవిని ప్రదర్శించే ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అద్భుత నిర్మాణంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో సంపన్నుల విడిది కేంద్రంగా మారింది. తాజ్‌గ్రూపు పర్యవేక్షణలోని ప్యాలెస్ హోటల్‌లో ఒక్కో సూట్‌కు రోజుకు రూ.4.5 లక్షలకు పైగా అద్దె రూపంలో ఆదాయం చేకూరుతోంది.

చౌమహల్లా ప్యాలెస్‌కు అరుదైన గౌరవం


యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు జాబితా - 2010 లో స్థానం దక్కించుకున్న చారిత్రక కట్టడం

అసఫ్‌జాహి నవాబుల రాజసానికి, గాంభీర్యానికి మొఘలాయి రీతి శిల్పకళా పాటవానికి అరుదైన గౌరవం దక్కింది. 1857-1869 మధ్య కాలంలో అయిదో నిజాం నవాబు అఫ్జలుద్దౌలా బహదూర్ కాలంలో నిర్మించిన చౌ మహల్లా ప్యాలెస్‌కు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు బాబితా-2010లో చోటు దక్కింది. ఈ ప్యాలెస్‌లోని అప్‌తబ్‌మహల్, మహతబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్‌మహల్‌లు ప్రధాన నిర్మాణాలు. వీటితోనే ఆ ప్యాలెస్‌కు చౌమహల్లా ప్యాలెస్ అని పేరు వచ్చింది.

ఈ ప్యాలెస్ ఉద్యానవనంలోని వాటర్ ఫౌంటేన్‌లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక దర్బార్‌హాల్‌లో రంగురంగుల విద్యుత్ దీపకాంతులను విరజిమ్మే షాండిలియర్స్ ప్రత్యేక ఆకర్షణ. ఈ భవన సుముదాయంలోని చాందినీ బేగం కీ హవేలీ, ఖక్షీబేగంకీ హవేలీ, మంజిలీ బేగంకీ హవేలీ, మోతిబంగ్లా, తోషాఖానా, కుల్‌హి పిరాన్, రసగ్‌మహల్‌ల్‌లో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. నిజాం ట్రస్ట్ పర్యవేక్షణలోని ప్యాలెస్ కోసం కోట్లాది నిధులు వెచ్చించి నాలుగేళ్ల పాటు మరమ్మతులు చేయించి పునరుద్ధరించారు. సుమారు అర్ధ దశాబ్దం పాటు నిరాదరణకు గురైన ప్యాలెస్‌కు పూర్వ వైభవం చేకూర్చడంతో గతేడాది యునెస్కో 2010 ఆసియా పసిఫిక్ హెరిటేజ్ అవార్డు ఫర్ కల్చర్ హెరిటేజ్ కన్జర్వేషన్‌ను దక్కించుకుంది.

మృతవీరులకు అశ్రుతర్పణం చేసే... బాద్‌షాహి అషూర్‌ఖానా

మూసీనదితీరానికి సమీపంలో మదీనా భవనానికి ఎదురుగా సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలోని బాద్‌షాహి ఆషూర్‌ఖానా కుతుబ్‌షాహి పాలకుల అద్భుత నిర్మాణం. 1594లోమహ్మద్ కులీ కుతుబ్‌షా ని ర్మించారు. 1611లో సుల్తాన్ మహ్మద్ కాలంలో నీలిరంగు ఖురాన్ సూక్తుల టైల్స్‌తో అలంకరించారు. బాద్‌షాహి అషూర్‌ఖానాలో మొహరంసందర్భం గా షియాలో సంతాపదినాలను పాటిస్తారు.సుమారు 38 అడుగుల ఎత్తు లో రాతి స్థంభాలపై నిర్మించిన అషూర్‌ఖానా ముందుభాగంలోని నిర్మాణాలు శి«థిలావస్థకు చేరుకుని ఇటీవ లే కుప్పకూలాయి.

నగర్ ఖానా గోడ లు శి«థిలమయ్యాయి. కొంత మంది ఆక్రమించి అషూర్‌ఖానా ప్రాశస్త్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించగా హైకోర్టు చొరవతో ఆర్కియాలజీ విభాగం అధికారులు స్పందించి ఆక్రమణ దారులనుతొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో ఈ శి«థిల నిర్మాణాలను పునరుద్ధ్దరించి హైదరాబాద్ ఇస్లామిక్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికై ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వందలాది ఏళ్ల ఇండో- ఇరాన్ సమ్మిళిత వాస్తు సంస్కృతికి కేంద్రంగా నిలిచిప బాద్‌షాహి అషూర్‌ఖానాను పరిరక్షించి భవిష్యత్ తరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

కాలుష్యం నుంచి చార్మినార్‌కు విముక్తి

ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని యునెస్కోకు ప్రతిపాదనలు
గోల్కొండ కోటలో జనాభా పెరిగి కిక్కిరిసి పోవడంతో అప్పటి పాదుషా మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీనది తీరంలో చార్మినార్‌తో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేశారు. సుమారు 180 అడుగుల ఎత్తులో నాలుగు వైపులా విస్తరించిన చార్మినార్ దేశ, విదేశీ పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తోంది. 1591 లో చేపట్టిన ఈ నిర్మాణం పనులు 1594లో పూర్తి చేశారు. దీనిపైకి ఎక్కడానికి నాలుగు మినార్‌ల నుంచి సుమారు 149 మెట్లున్నాయి. రెండో అంతస్థులో ప్రార్థనలు జరుపుకునేందుకు అనువుగా మసీదు ఉంది. అలాగే ఒకటో అంతస్థును నగర వాసులకు ప్రభుత్వ ఆదేశాలు తెలియజేసేందుకు అప్పట్లో దండోరాకు వినియోగించేవారని ప్రచారం.

ఇస్లామిక్ వాస్తు శైలిలో కింది నుంచి చార్మినార్‌ను పరిశీలిస్తే ఆకాశం మబ్బుల నుంచి తేలిపోతున్నట్టుగా కన్పించే చార్మినార్ నిర్మాణం ధ్వని, వాయు కాలుష్యాలతో శిథిలావస్థకు చేరుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కేవలం పాదచారులకే పరిమితం చేస్తూ గ్రేటర్ పాలక సంస్థ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. గత ఆగస్టులో కురిసిన వర్షాలతో చార్మినార్ ఆగ్నేయ మూల రెండో అంతస్థులోని పై కప్పు పెళ్లలూడిపోయాయి. నగిషీల భాగం కూలిపోయింది. అంతకు ముందు చార్మినార్ పిడుగు తాకిడికి గురికావడంతో కొంత భాగం ధ్వంసమైంది.

దీంతో భవిష్యత్‌లో పిడుగు పాటు సమస్య లేకుండా పంచలోహాల తీగను అమర్చారు. అలాగే ఈ ప్రాంతంలో వాయు కాలుష్యానికి ఆస్కారం లేకుండా వాహనాల రాకపోకలు నిషేధించేందుకు పాదచారుల ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. చార్మినార్‌కు నాలుగు వైపులా గుల్జార్‌హౌస్, లాడ్‌బజార్, ఆర్టీసీ బస్ స్టేషన్, సర్దార్‌మహల్ వరకు రోడ్లపై గ్రానైట్‌ను నిర్మిస్తున్నారు. పాదాచారులు మాత్రమే వెళ్లి వచ్చేందుకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర పురాతత్వ శాఖ పర్యవేక్షణలోని చార్మినార్‌ను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని కోరుతూ అధికారులు యునెస్కోకు ప్రతిపాదనలు పంపారు. 

స్టేట్ మ్యూజియంలో అపురూప సంపద

ఏడో నిజాం కూతురు బొమ్మల కొలువు కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం రాష్ట్ర పురావస్తు మ్యూజియం కొనసాగుతోంది. పబ్లిక్‌గార్డెన్స్‌లో ఇండో-పర్షిన్ పద్దతిలో 1914లో నిర్మించిన అపురూప వాస్తు శైలిలోని భవనం ద్వారాలు, కమాన్‌లపై నిజాం టోపీ గుర్తులు దర్శనమిస్తాయి. అప్పట్లో ఈ భవనంలో సైతాన్‌లున్నాయనే ప్రచారం జరుగడంతో నిజాం కూతురు బొమ్మల కొలువు రద్దయింది. 1928 లో దీన్ని పారిశ్రామిక ప్రదర్శనకు వినియోగించారు. 1930లో గులాం యజ్దానీ చొరవతో దీన్ని పురావస్తు సంపదను భద్రపరిచే నిలయంగా మార్చారు. ఇందులో గోల్కొండ కుతుబ్‌షాహీల ఆ యుధాలు, దుస్తు లు, నిజాంలు సేకరించిన ఇతర ఆయుధ సంపత్తి, నాణేలు, తదితర వస్తు సంపదను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభ్యమైన అపురూప పురావస్తు సంపద, బుద్దుని అవశేషాలు, శిల్పాలు, శిలలు, చిత్రకళాఖండాలు, శాసనాలను ప్రదర్శిస్తున్నారు.

అంతే కాకుండా 2500 ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ రాజకుమారి శవం (మమ్మీ) సందర్శకుల ప్రధాన ఆకర్షణ. శిల్పాలు, లోహవిగ్రహాలు, శిలా శాసనాల ప్రదర్శనల కోసం వేర్వేరు గ్యాలరీలను అభివృద్ధి చేశారు.

హెరిటేజ్ భవనాలకు నిధులు సమకూర్చాలి 

- ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనురాధారెడ్డి

రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలోని పురాతన నిర్మాణాల పరిరక్షణపై కేంద్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. కాని ఇనిస్టిట్యూషనల్ నిర్మాణాలపై శ్రద్ధ తీసుకునేవారు కరవయ్యారు. దీంతో అరుదైన వాస్తు శైలిలో ఉన్న నిర్మాణాల పరరక్షణ డోలాయమానంలో పడిపోయింది. ప్రభు త్వం ఇతోధికంగా నిధులు సమకూర్చాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ స్వాధీనంలోని కోఠి ఉమెన్స్ కళాశాల భవనం (కోఠి రెసిడెన్సీ) పరరక్షణ కు నిధుల కొరత తీవ్రంగా ఉంది. సిటీ కళాశాల సైతం అదే విధంగా మారింది. ఇన్‌టాక్ ప్రతినిధులు సమీక్షించి పునరుద్దరణకు నిధులు మంజూరు చేయాలని రెండు మూడు పర్యాయాలు అభ్యర్థలను పంపాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక గోల్కొండ టోంబ్స్, చార్మినార్ తదితర నిర్మాణాలు బాగానే ఉన్నాయి. 

యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం 

- ఆర్కియాలజీ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి

  ఏళ్ల తరబడి నుంచి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గోల్కొండ కుతుబ్‌షాహి సమాధులకు మరమ్మతులు చేపట్టి యునెస్కో గుర్తింపు కోసం మొదటి సారిగా ప్రతిపాదనలు పంపాం. యునెస్కో ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. గుర్తింపు నకు అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదనల రూపకల్పనలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. గోల్కొండ కోట, చారిత్రాత్మక చార్మినార్ నిర్మాణాలను కలిపి కుతుబ్‌షా వారసత్వం పేరుతో మళ్లీ సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో సహా పంపాం. యునెస్కో ప్రతినిధుల పరిశీలనలో ఉన్నాయి. ఈ యేడు కచ్చితంగా కుతుబ్‌షాహి టూంబ్స్, కోట, చార్మినార్ నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు లభిస్తుందని విశ్వసిస్తున్నాను.

Saturday, April 16, 2011

తెలంగాణ గడీలు ఎవరి ఆస్తి?

తెలంగాణలో శతాబ్దాల పాటు కొనసాగిన దొరతనానికి సాక్ష్యాలవి. ఓ వైపు దొరల దర్పానికి నిలువెత్తు దర్పణాలుగా, మరోవైపు గడీ అంటేనే గడగడ వణికిన ప్రజల భయాలకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నేటికీ నిలిచి ఉన్నాయి. పాతతరం మనుషుల్లో గడీ పేరు వినగానే ఇప్పటికీ కళ్లల్లో గగుర్పాటు... శరీరమంతా జలదరింపు కన్పిస్తాయి. దొర పిలుపు వచ్చిందంటే పులి బోనులోకి వెళుతున్న మేకపిల్లలా హడలెత్తిపోయేవారు జనం. ప్రాణాలకే కాదు ఆడవాళ్ల మానాలకూ... బయటకు విన్పించని ఆర్తనాదాలకూ ఆలవాలంగా ఉండే గడీలు ఇటీవల మళ్లీ వార్తల్లోకొచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయిన దొరలు, వారి వారసులు ఇప్పుడు మళ్లీ గ్రామాలకు వెళ్తున్నారు. ఊరు గుర్తుకొచ్చి కాదు. ఊళ్లలో ఉన్న తమ ఆస్తులు గుర్తుకొచ్చి. పల్లెల్లో కూడా భూముల విలువ పెరగడంతో దొరలు మళ్లీ పల్లెకొచ్చి తమ గడీల్ని, పొలాల్ని అమ్మకానికి పెడుతుంటే అవి తమని, తమ శ్రమని దోచుకుని నిర్మించినవి కాబట్టి అవి తమ ఉమ్మడి సొత్తని, వాటిని అమ్మడానికి వీల్లేదని గ్రామాల్లోని ప్రజలు తిరగబడుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్‌గల్ గ్రామంలో అదే జరిగింది...

చల్‌గల్ గడీ

చల్‌గల్‌లో ఉన్న గడి రాజుల కోటని తలపిస్తుంది. సిమెంట్ కన్నా బలమైన డంగు సున్నంతో నిర్మించిన ఆ గడీ గోడలు నేటికీ చెక్కు చెదరలేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్తంభాలతో ఉండే ఆ గడి రెండో అంతస్థుపైకెక్కి చూస్తే చుట్టూ ఐదారు కిలోమీటర్ల మేర ఉన్న పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణభూపాల్‌రావు చాలా ఏళ్ళ క్రితమే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. చల్‌గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలోనే ఉండడంతో భూమి రేట్లు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. దాంతో భూపాల్‌రావు గడీని అమ్మడానికి గతేడాది నవంబర్ 9న గ్రామానికొచ్చాడు. వాళ్ల కోరికను గడీని, గడీ స్థలాన్ని ఊరికి విరాళంగా ఇవ్వాలని చల్‌గల్ గ్రామస్తులు కోరారు. భూపాల్‌రావు పట్టించుకోకుండా గడీని అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన గ్రామస్థులు భూపాల్‌రావుని చుట్టుముట్టి మూడు, నాలుగు గంటల పాటు నిలువరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనని అక్కడి నుంచి పంపించేశారు. ఆ సమయంలో గ్రామస్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి చివరికది లాఠీచార్జి నుంచి కాల్పుల దాకా వెళ్లింది. చాలామంది గ్రామస్తులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎవరినైనా అరెస్టు చేస్తే ఐక్యంగా పోరాడాలని కూడా నిర్ణయించారు గ్రామస్తులు. చల్‌గల్ గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

ఎన్ని హంగులో..

ఇది మరో గడీ కథ... ఇప్పటి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ చుట్టుపక్కల ఉన్న జగ్గాసాగర్, అయిలాపూర్, భీమారం తదితర 80 గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్‌రావ్ ఆధీనంలో ఉండేవి. ఆ ఊళ్లో కట్టిన గడీలలో అప్పట్లోనే అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్మనీ నుంచి పాలరాతిని, విలాస వస్తువుల్ని తెప్పించినట్లు చెపుతా రు. అప్పట్లోనే విద్యుద్దీపాలతో (జనరేటర్ సాయంతో) వెలిగిపోతున్న గడీని కిరోసిన్ దీపాలు కూడా లేని ప్రజలు వింతగా, విచిత్రంగా చూసేవారట. గడీలకి పైప్‌లైన్లలో తాగునీటి సౌకర్యం కూడా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ని ఇప్పటికీ గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు.

1982-83 ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం వల్ల రాజా అనంత కిషన్‌రావ్ వారసులైన గజసింహరావ్, నరసింహరావుల కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. నక్సల్స్ ప్రభావం తగ్గుముఖం పట్టాక గ్రామంలో ఉన్న వారి స్థిరాస్తులు కొన్ని అమ్ముకున్నారు. పాత గడీని అమ్మేసి కొత్త గడీని కూల్చేసి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌ని తీసికెళ్లిపోయారు. బండలింగాపూర్ సంస్థానం పరిధిలో ఇప్పటికీ వాళ్ల వారసుల స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకుని ఉన్న స్థలాన్ని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసి)కి అప్పగిస్తే అందులో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. కల్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణుగోపాలస్వామి ఆలయానికి ఆండాళ్ దేవికి 4 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కల్యాణానికి సంస్థాన వారసులు గ్రామానికి వస్తారు. వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికే దొరలు దానం చేస్తున్నారని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు.

కొందరు దొరలు దాతలే!

ఆర్థిక సంస్కరణలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలతో ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. జనాభా కూడా పెరిగింది. పెరగనిదల్లా భూమి మాత్రమే. నక్సలైట్ల అలికిడి తగ్గిపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కొంతమంది దొరలు గడీల్ని, తమ భూముల్ని అమ్మకానికి పెట్టడంతో వివాదాలు మొదలవుతున్నాయి. ఎకరానికి ఇంత రేటని నిర్ణయించి... ఇన్నాళ్ళూ బీళ్లుగా ఉన్న తమ భూముల్ని సాగు చేసుకుని దాని నుంచి వచ్చిన ఆదాయంతో డబ్బు కట్టమని గ్రామస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలా నాలుగైదేళ్లు సాగు చేసుకున్నాక డబ్బు కట్టే విధంగా కౌలుదారుల చేత కాగితాలు రాయించుకుంటున్నారు. నాలుగైదేళ్లకైనా సొంత భూమి కల నెరవేరుతుందనిచాలామంది దొరల బీడుభూముల్ని మళ్లీ సాగుభూములుగా మారుస్తున్నారు. ఇలాంటి సౌలభ్యాలేవీ గడీలకు లేకపోవడంతో నేరుగా అమ్మకానికి పెడుతున్నారు దొరలు. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యే ఒక చిన్న గడీని 8 లక్షలకు అమ్మితే దాన్ని కొన్న వాళ్లు మెరుగులు దిద్ది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్‌ని ప్రారంభించారు. గడీలను పాఠశాలలకు, కమ్యూనిటీ హాళ్ళకు విరాళాలుగా ఇచ్చిన దొరలు కూడా ఉన్నారు.

కొత్త లీడర్లొచ్చారు..

కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991లో గ్రామస్థులు లూటీ చేస్తే పోలీసులు 120 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ వివాదం చాలా ఏళ్లు నడిచింది. అయితే ఇటీవల పల్లెల్లో సర్పంచులతో పాటు ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, మండలాధ్యక్షులు, నీటి సంఘాల చైర్మన్లు లాంటి చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. విద్యావంతులూ పెరిగిపోయారు. ప్రజలలో చైతన్యం కూడా పెరిగింది. ఆ చైతన్యమే గడీల్ని తమ ఉమ్మడి ఆస్తిగా భావించేలా, దాని కోసం ఎదురు తిరిగేలా చేస్తోంది. ఏదేమైనా 'ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చపడేది... ఇప్పుడు దాంట్లోనే పోస్తన్నం' అని కవి అన్నవరం దేవేందర్ అన్నట్టు ఇప్పుడు గడీలన్నీ ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగుబాటు చల్‌గల్ గడీతో మొదలైంది.

- కె.వి. నరేందర్, 94404 02871