Saturday, April 16, 2011

తెలంగాణ గడీలు ఎవరి ఆస్తి?

తెలంగాణలో శతాబ్దాల పాటు కొనసాగిన దొరతనానికి సాక్ష్యాలవి. ఓ వైపు దొరల దర్పానికి నిలువెత్తు దర్పణాలుగా, మరోవైపు గడీ అంటేనే గడగడ వణికిన ప్రజల భయాలకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నేటికీ నిలిచి ఉన్నాయి. పాతతరం మనుషుల్లో గడీ పేరు వినగానే ఇప్పటికీ కళ్లల్లో గగుర్పాటు... శరీరమంతా జలదరింపు కన్పిస్తాయి. దొర పిలుపు వచ్చిందంటే పులి బోనులోకి వెళుతున్న మేకపిల్లలా హడలెత్తిపోయేవారు జనం. ప్రాణాలకే కాదు ఆడవాళ్ల మానాలకూ... బయటకు విన్పించని ఆర్తనాదాలకూ ఆలవాలంగా ఉండే గడీలు ఇటీవల మళ్లీ వార్తల్లోకొచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయిన దొరలు, వారి వారసులు ఇప్పుడు మళ్లీ గ్రామాలకు వెళ్తున్నారు. ఊరు గుర్తుకొచ్చి కాదు. ఊళ్లలో ఉన్న తమ ఆస్తులు గుర్తుకొచ్చి. పల్లెల్లో కూడా భూముల విలువ పెరగడంతో దొరలు మళ్లీ పల్లెకొచ్చి తమ గడీల్ని, పొలాల్ని అమ్మకానికి పెడుతుంటే అవి తమని, తమ శ్రమని దోచుకుని నిర్మించినవి కాబట్టి అవి తమ ఉమ్మడి సొత్తని, వాటిని అమ్మడానికి వీల్లేదని గ్రామాల్లోని ప్రజలు తిరగబడుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్‌గల్ గ్రామంలో అదే జరిగింది...

చల్‌గల్ గడీ

చల్‌గల్‌లో ఉన్న గడి రాజుల కోటని తలపిస్తుంది. సిమెంట్ కన్నా బలమైన డంగు సున్నంతో నిర్మించిన ఆ గడీ గోడలు నేటికీ చెక్కు చెదరలేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్తంభాలతో ఉండే ఆ గడి రెండో అంతస్థుపైకెక్కి చూస్తే చుట్టూ ఐదారు కిలోమీటర్ల మేర ఉన్న పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణభూపాల్‌రావు చాలా ఏళ్ళ క్రితమే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. చల్‌గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలోనే ఉండడంతో భూమి రేట్లు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. దాంతో భూపాల్‌రావు గడీని అమ్మడానికి గతేడాది నవంబర్ 9న గ్రామానికొచ్చాడు. వాళ్ల కోరికను గడీని, గడీ స్థలాన్ని ఊరికి విరాళంగా ఇవ్వాలని చల్‌గల్ గ్రామస్తులు కోరారు. భూపాల్‌రావు పట్టించుకోకుండా గడీని అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన గ్రామస్థులు భూపాల్‌రావుని చుట్టుముట్టి మూడు, నాలుగు గంటల పాటు నిలువరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనని అక్కడి నుంచి పంపించేశారు. ఆ సమయంలో గ్రామస్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి చివరికది లాఠీచార్జి నుంచి కాల్పుల దాకా వెళ్లింది. చాలామంది గ్రామస్తులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎవరినైనా అరెస్టు చేస్తే ఐక్యంగా పోరాడాలని కూడా నిర్ణయించారు గ్రామస్తులు. చల్‌గల్ గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

ఎన్ని హంగులో..

ఇది మరో గడీ కథ... ఇప్పటి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ చుట్టుపక్కల ఉన్న జగ్గాసాగర్, అయిలాపూర్, భీమారం తదితర 80 గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్‌రావ్ ఆధీనంలో ఉండేవి. ఆ ఊళ్లో కట్టిన గడీలలో అప్పట్లోనే అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్మనీ నుంచి పాలరాతిని, విలాస వస్తువుల్ని తెప్పించినట్లు చెపుతా రు. అప్పట్లోనే విద్యుద్దీపాలతో (జనరేటర్ సాయంతో) వెలిగిపోతున్న గడీని కిరోసిన్ దీపాలు కూడా లేని ప్రజలు వింతగా, విచిత్రంగా చూసేవారట. గడీలకి పైప్‌లైన్లలో తాగునీటి సౌకర్యం కూడా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ని ఇప్పటికీ గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు.

1982-83 ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం వల్ల రాజా అనంత కిషన్‌రావ్ వారసులైన గజసింహరావ్, నరసింహరావుల కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. నక్సల్స్ ప్రభావం తగ్గుముఖం పట్టాక గ్రామంలో ఉన్న వారి స్థిరాస్తులు కొన్ని అమ్ముకున్నారు. పాత గడీని అమ్మేసి కొత్త గడీని కూల్చేసి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌ని తీసికెళ్లిపోయారు. బండలింగాపూర్ సంస్థానం పరిధిలో ఇప్పటికీ వాళ్ల వారసుల స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకుని ఉన్న స్థలాన్ని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసి)కి అప్పగిస్తే అందులో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. కల్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణుగోపాలస్వామి ఆలయానికి ఆండాళ్ దేవికి 4 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కల్యాణానికి సంస్థాన వారసులు గ్రామానికి వస్తారు. వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికే దొరలు దానం చేస్తున్నారని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు.

కొందరు దొరలు దాతలే!

ఆర్థిక సంస్కరణలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలతో ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. జనాభా కూడా పెరిగింది. పెరగనిదల్లా భూమి మాత్రమే. నక్సలైట్ల అలికిడి తగ్గిపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కొంతమంది దొరలు గడీల్ని, తమ భూముల్ని అమ్మకానికి పెట్టడంతో వివాదాలు మొదలవుతున్నాయి. ఎకరానికి ఇంత రేటని నిర్ణయించి... ఇన్నాళ్ళూ బీళ్లుగా ఉన్న తమ భూముల్ని సాగు చేసుకుని దాని నుంచి వచ్చిన ఆదాయంతో డబ్బు కట్టమని గ్రామస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలా నాలుగైదేళ్లు సాగు చేసుకున్నాక డబ్బు కట్టే విధంగా కౌలుదారుల చేత కాగితాలు రాయించుకుంటున్నారు. నాలుగైదేళ్లకైనా సొంత భూమి కల నెరవేరుతుందనిచాలామంది దొరల బీడుభూముల్ని మళ్లీ సాగుభూములుగా మారుస్తున్నారు. ఇలాంటి సౌలభ్యాలేవీ గడీలకు లేకపోవడంతో నేరుగా అమ్మకానికి పెడుతున్నారు దొరలు. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యే ఒక చిన్న గడీని 8 లక్షలకు అమ్మితే దాన్ని కొన్న వాళ్లు మెరుగులు దిద్ది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్‌ని ప్రారంభించారు. గడీలను పాఠశాలలకు, కమ్యూనిటీ హాళ్ళకు విరాళాలుగా ఇచ్చిన దొరలు కూడా ఉన్నారు.

కొత్త లీడర్లొచ్చారు..

కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991లో గ్రామస్థులు లూటీ చేస్తే పోలీసులు 120 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ వివాదం చాలా ఏళ్లు నడిచింది. అయితే ఇటీవల పల్లెల్లో సర్పంచులతో పాటు ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, మండలాధ్యక్షులు, నీటి సంఘాల చైర్మన్లు లాంటి చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. విద్యావంతులూ పెరిగిపోయారు. ప్రజలలో చైతన్యం కూడా పెరిగింది. ఆ చైతన్యమే గడీల్ని తమ ఉమ్మడి ఆస్తిగా భావించేలా, దాని కోసం ఎదురు తిరిగేలా చేస్తోంది. ఏదేమైనా 'ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చపడేది... ఇప్పుడు దాంట్లోనే పోస్తన్నం' అని కవి అన్నవరం దేవేందర్ అన్నట్టు ఇప్పుడు గడీలన్నీ ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగుబాటు చల్‌గల్ గడీతో మొదలైంది.

- కె.వి. నరేందర్, 94404 02871

No comments: