Saturday, November 27, 2010

400 ఏళ్లు..వెనక్కి! - ఆటోచెప్పే భాగ్యనగర కథ

నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. కాని నిజంగా మనకు మన భాగ్యనగరం గురించి తెలిసింది ఎంత? అప్పటి వీధులు ఎలా ఉండేవి? మనుషులు ఎలా ఉండేవారు? వేషభాషలు ఎలా ఉండేవి? కళలు, సంస్కృతి ఎలా ఉండేవి? పాత ఫోటోల్లోనో, పీరియడ్ సినిమాల్లోనో తప్ప వాటి గురించి మనకేం తెలుసు? తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత ఉన్నా అన్నిట్నీ ఒకేచోట తెలుసుకునే మార్గం ఇప్పటిదాకా లేదు మనకు. ఇప్పుడు 'హైదరాబాద్ గ్రాఫిక్ నవల' రూపంలో ఆ అవకాశం వచ్చింది.

ఏమిటీ నవల?
నాలుగొందల ఏళ్ల నాటి హైదరాబాద్ చరిత్ర యావత్తూ కాలానుగుణంగా బొమ్మల కథ రూపంలో చూపించడం హైదరాబాద్ గ్రాఫిక్ నవల ఉద్దేశం. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'యుగంతర్' చేపట్టిన 'ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్'లో భాగంగా ఈ మహత్తర కార్యానికి ఇద్దరు కుర్రాళ్లు పునుకున్నారు. వాళ్లు జయదీప్, జస్‌రామన్‌లు. ఇప్పటికే ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తిచేశారు కూడా.

సులువేం కాదు..
గ్రాఫిక్ నవలను తయారుచేయడం అంత సులువేం కాదు. ప్రతి ఎపిసోడ్‌లో ఎన్నో పేజీలు, ప్రతి పేజీలో ఎన్నో ప్యానల్స్ ఉంటాయి. ప్రతి ప్యానల్‌లో కనిపించే మనుషులు, కట్టడాలు, వీధులు, వస్తువుల కోసం కొన్ని వందల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అనుకున్న యాంగిల్‌లోనే ఉండాలి. స్క్రిప్ట్, విజువలైజేషన్ పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు.. స్క్రిప్ట్‌కి తగ్గట్లుగా బొమ్మలు గీసే ఆర్టిస్ట్‌కి ప్రతి ప్యానల్ ఎలా ఉండాలన్నది అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. మధ్యలో ఎన్నో చర్చలు, మార్పులు, చేర్పులు. ఇవన్నీ జరిగితే తయారయ్యేది ఒక్క ప్యానల్ మాత్రమే. జయదీప్, జస్‌రామన్‌లు ఇప్పటి వరకు ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీనికంటే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డాక్యుమెంటరీ తీయడం ఎంతో సులువని వారు పేర్కొంటారు.

'ఆటో'యే హీరో!
మనకు ఎన్నో ఇంగ్లీష్ బొమ్మల కథలు తెలుసు. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. సూపర్‌మాన్, బ్యాట్‌మాన్, స్పైడర్‌మాన్, ఫాంటమ్.. ఏ బొమ్మల కథ తీసుకున్నా సరే అందులోని హీరో.. విలన్లతో సాగించే వీరోచిత పోరాట సన్నివేశాలు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ గ్రాఫిక్ నవలలో కూడా హీరో ఉంటాడు. కాకపోతే అది ఒక ఆటో. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మీకు 'టైం మెషిన్' తెలుసుకదా? హాలీవుడ్‌లో ఈ థీమ్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. టైం మెషిన్‌లో కూర్చుని ఒక మీట నొక్కగానే అది కాలంలో ముందుకో, వెనక్కో తీసుకెళుతుంది. మన తెలుగులో కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్య 369' సినిమాలో కూడా ఇదే ఇతివృత్తం. సరిగ్గా ఈ ఆటో కూడా అలాంటి టైం మెషినే. ప్రతి ఎపిసోడ్‌లో ముందుగా ఆటో వస్తుంది.

అందులో ప్రయాణికుడు ఎక్కగానే అది భాగ్యనగర చరిత్రలో కొన్నేళ్ల వెనక్కో, ముందుకో తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇక అక్కడ్నించి కథ మొదలవుతుందన్నమాట. ఆ కాలంలో మన భాగ్యనగర వీధులు ఎలా ఉండేవో, మనుషులు ఎలా ఉండేవారో, ఏక్కడ ఏయే కట్టడాలు ఎలా ఉండేవో.. అన్నీ కాలానుగుణంగా కనిపిస్తూ పాఠకులకు కనువిందు చేస్తాయి. ఇలా మొత్తం 400 ఏళ్ల భాగ్యనగర చరిత్ర కాలాన్ని విభజించుకుంటూ ఆయా కాల, మాన పరిస్థితులలో భాగ్యనగర వైభవాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు ఈ గ్రాఫిక్ నవల ద్వారా కృషి చేస్తున్న జయదీప్, జస్‌రామన్‌లు కొత్తరకం చరిత్రకారులుగా అందరి ప్రశంసలు పొందడం ఖాయం. హైదరాబాద్ గ్రాఫిక్ నవల మొదటి ఎపిసోడ్, ఇతరత్రా వివరాల కోసం www.facebook.com/hydgraphicnovelను చూడవచ్చు.
ఈ గ్రాఫిక్ నవల ప్రాజెక్ట్ ఆలోచన మీదేనా? లేకపోతే..
జయదీప్: ఈ ఆలోచన పూర్తిగా మాదే. నిజానికి దీనికంటే ముందు మేం సత్యం ఫౌండేషన్ వాళ్ల కోసం ఒక ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేశాం. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. పాత తరం వాళ్లలో అన్ని వర్గాలకు చెందిన 30 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఇంటర్వ్యూ అంటే.. అసలు గతంలో హైదరాబాద్ ఎలా ఉండేదో, ఎక్కడెక్కడ ఏమేం ఉండేవో, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానం, స్థితిగతులు, సంప్రదాయాలు, సంస్కృతి ఎలా ఉండేవో అవన్నీ వాళ్ల నుంచి తెలుసుకున్నాం. అదంతా నేటి హైదరాబాదీలు ఏమాత్రం ఎరగరు.

జస్‌రామన్: అవన్నీ వింటున్నప్పుడు మాకు హైదరాబాద్ గురించి ఏదైనా డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తీయొచ్చు.. కానీ నాలుగొందల ఏళ్లు వెనక్కి వెళ్లి చూపించడం ఎలా? ఇదే పెద్ద సమస్య అయింది. ఆనాటి వీధులు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద కట్టడాలు, స్మారక చిహ్నాలు కూల్చివేతలకు గురయ్యాయి. అంతెందుకు.. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు తిరిగొచ్చి హైదరాబాద్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరంను చూపించడం ఎలా? పోనీ సెట్టింగ్స్ వేసి తీద్దామా అంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

జయదీప్: సెట్టింగ్స్ వేయడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే ఆనాటి వీధులు, కట్టడాలు, స్మారక చిహ్నాల గురించి తెలిసిన వాళ్లు ఎవరున్నారో, ఎక్కడున్నారో పట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది. ఇతర మార్గాలేవీ వర్కవుట్ అవవని నిర్ణయించుకున్నాక, గ్రాఫిక్స్.. అంటే బొమ్మల రూపంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇందులో మాకెలాంటి ఇబ్బందీ కనిపించలేదు. నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరం ఎలా ఉండేదో, ఎక్కడ ఏమేం ఉండేవో ఇప్పటికే మాకు ఒక అవగాహన ఉంది కదా. ప్రతి సీన్ ఆర్టిస్టుకి అర్థమయ్యేలా చెబుతాం. ఆ ప్రకా రం గ్రాఫిక్ తయారవుతుంది. ఇదీ మా ఆలోచన.

మరి, ఈ 'యుగంతర్' వాళ్లతో పరిచయం ఎలా?
జస్‌రామన్: యుగంతర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులోని డైరెక్టర్లలో కె.లలిత ఒకరు. ఆవిడ మాకు ఆంటీ అవుతారు. అప్పటికే వీళ్లు 'ఆర్కైవ్స్ హైదరాబాద్' అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలు తీసి భద్రపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మా గ్రాఫిక్ నవలా ప్రాజెక్టు వీరికి కూడా నచ్చడంతో అందుకు అవసరమయ్యే నిధులు, ఇతర సహాయ సహకారాలు అందజేసేందుకు యుగంతర్ సంసిద్ధమైంది. అలా ఈ ప్రాజెక్ట్ ప్రాణం పోసుకుంది. గత ఏడాది నవంబర్‌లో గ్రాఫిక్ నవలకు సంబంధించిన పని ప్రారంభించాం. ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్లు పూర్తి చేశాం. మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రాలు మా ఫేస్‌బుక్ పేజీలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది.

కథ ఎక్కడ్నించి, ఎలా మొదలవుతుంది?
జయదీప్: దాదాపు అరవై ఐదేళ్ల క్రితం.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కథ మొదలవుతుంది. ప్రముఖ వేటగాడు సర్ పెర్సీ పంజాగుట్ట అటవీప్రాంతంలో రాక్షస బల్లుల కోసం తిరుగాడుతూ సమీపంలో ప్రవహిస్తున్న నది నీటి ప్రవాహంలో ఏదో కొట్టుకొస్తుండడం గమనిస్తాడు. తీరా దగ్గరికి వచ్చేసరికి అదొక అతి పెద్ద రాక్షస బల్లి. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెడుతుండగా 'టైం మెషిన్ ఆటో' ఎదురవుతుంది.

"త్వరగా పోనీ.. ఇరవై ఒకటో శతాబ్దానికి..'' అంటూ ఆటో ఎక్కేస్తాడు. అయితే ఆ హైదరాబాదీ ఆటో డ్రైవర్ తాపీగా.. "ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా..?'' అంటూ బేరం మొదలెడతాడు. ఒక వైపున తరుముకొస్తున్న రాక్షసబల్లి.. మరో వైపున ఆటోవాలా బేరసారాలు.. దీంతో సర్ పెర్సీకి తిక్కరేగిపోతుంది. "జల్దీ.. జల్దీ..'' అని తొందరపెట్టి ఎట్టకేలకు రాక్షస బల్లి నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నగరంలోకి వచ్చిపడతాడు. ఇలా మొదలవుతుంది మొదటి ఎపిసోడ్ కథ. ఈ నవల మొత్తం పూర్తి అవడానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ఏడాది పాటు ఎంతో కష్టపడితే ఇప్పటికి రెండు ఎపిసోడ్లు అంటే.. దాదాపు 35 పేజీలే పూర్తిచేయగలిగాం.

ఎందుకింత సమయం?
జస్‌రామన్: అంటే.. మేం ఇక్కడుంటే మా ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు. ఉదాహ రణకు మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన బొమ్మలన్నీ హర్షో మోహన్ చత్తోరాజ్ గీశారు. ఈయన కోల్‌కతాలో ఉంటారు. మేం ఈమెయిల్ ద్వారా ప్రతి సీన్ ఆయనకి వివరించి, ఆ సీన్ ఎలా ఉండాలో కూడా రఫ్‌గా మేం గీసి, దానికి సంబంధించిన ఫొటోలన్నీ ఆయనకు పంపితే వాటిని ఆధారంగా చేసుకుని, సీన్ అర్థం చేసుకుని ఆయన బొమ్మలు గీస్తారు. ఈ ప్రక్రియలో ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్ ద్వారా మేం పరస్పరం సంప్రదించుకుని, సందేహాలు తీర్చుకోడానికి, సూచనలు ఇచ్చుకోవడానికే అధిక సమయం ఖర్చయిపోతోంది.

ఇంత ఇబ్బంది పడేకంటే ఇక్కడే ఆర్టిస్ట్‌ని చూసుకోవచ్చు కదా?
జయదీప్: చూసుకోవచ్చు.. కానీ ఇక్కడి ఆర్టిస్టులందరూ చాలా బిజీ. వీళ్లంతా ఇక్కడ ఉంటూ విదేశాల నుంచి గ్రాఫిక్స్,యానిమేషన్లకు సంబంధించి వచ్చే పనులు చేస్తున్నారు. ఇక్కడి ఆర్టిస్టులను తప్పు పట్టాలన్నది కాదు మా ఉద్దేశం. కమర్షియల్ వర్క్స్ చేస్తే వాళ్లకు రూపాయలు కాదు, డాలర్స్ వస్తాయి. అలాంటి సమయంలో మేం ఇచ్చే రూపాయలు పుచ్చుకుని మా వర్క్ చేయమని మేం అడగలేం కదా! అందుకని మా ప్రాజెక్ట్ కోసం మేం ఇతర ప్రాంతాల ఆర్టిస్ట్‌లపై ఆధారపడ్డాం. మా గ్రాఫిక్ నవలకు సంబంధించి ఒకో ఎపిసోడ్ బొమ్మలు ఒకో ఆర్టిస్ట్ చేత వేయిస్తున్నాం. మొదటి ఎపిసోడ్‌కు హర్షో మోహన్ చత్తోరా బొమ్మలు గీస్తే, రెండో ఎపిసోడ్‌కు అర్జెంటీనా ఆర్టిస్ట్ ఫెదరికో జూమెన్ గీశారు. అలా ప్రతి ఎపిసోడ్‌కు ఆర్టిస్ట్ మారిపోతారు.

మరి ఆర్టిస్ట్ మారినప్పుడు బొమ్మల శైలి కూడా మారుతుంది కదా?
జయదీప్: మారుతుంది. అయితే కాలం కూడా మారిపోతుందిగా. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చార్మినార్, దాని పరిసర ప్రాంతాలు ఉన్నాయనుకోండి. నాలుగొందల ఏళ్ల క్రితం ఉన్నట్లే మూడొందల ఏళ్ల క్రితం ఉండదు కదా. కాలంతోపాటే ఆ ప్రాంతం కూడా మారుతుంది. మరో వంద సంవత్సరాలు గడిచాక ఇంకా మారిపోతుంది. కాబట్టి బొమ్మలు కచ్చితంగా మారాలి. స్క్రిప్ట్ మాత్రం మారిపోకూడదు, అదీ అసలు విషయం.
ఓకే, చిన్న వయసులోనే పెద్ద బాధ్యత భుజాన వేసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!
- వై.రమేష్‌బాబు,

Friday, November 19, 2010

బ్యాడ్‌ హ్యాబిట్‌

కాలేజీ ఫ్రెషర్స్‌ డే పార్టీ జరుగుతోంది. అందులో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ లోపుగా ఒక విద్యార్థి మైకంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అతను మద్యం ఎక్కువగా సేవించడం వల్ల తూలి పడ్డాడని తెలుసుకోవడానిి మిగతా వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు అందరూ డ్రింక్‌ తాగుతున్నవారే. చివరకు ఆ అబ్బా యిని తమ ఫ్రెండ్స్‌ ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఆ అబ్బాయి విపరీతమైన హ్యాంగోవర్‌తో బాధపడడంతో పాటు తన మొహాన్ని తన తల్లిదండ్రులకు చూపించడానికి సిగ్గుపడ్డాడు. ఈ విధమైన పరిస్థితులు నేడు చాలా మంది యంగ్‌ స్టర్స్‌కు ఎదురవుతూనే ఉన్నాయి.

పార్టీలలో, పబ్‌లలో మిత్ర బృందమంతా కలుసుకున్నప్పుడు బీర్‌, ఆల్క హాల్‌ తీసుకోవడం నేడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు కొంతమంది కుర్ర కారు. అబ్బాయిలే కాకుండా నేడు కొంతమంది అమ్మాయిలు కూడా మద్యం సేవించడం నేర్చుకుంటున్నారు. ఇలా సరదా కోసం అలవాటు చేసుకున్నవే చివరకు వ్యసనాలుగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీ లైనంత వరకు వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

మద్యంతో హాని...
badhabit1మద్యం తాగడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో చదువుకున్నవారికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ పబ్బులు, పార్టీలలో డ్రింకింగ్‌ తప్పని సరి అంటున్నారు నేటి యంగ్‌స్టర్స్‌. యంగ్‌ జనరేషన్‌ కలిసినప్పుడు ఫన్‌ ఉండాలంటే ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాల్సిందేనని అంటున్నారు. అదీకా కుండా ఇంతకు ముందు పార్టీలకు యువకులు మాత్రమే హాజరయ్యేవారు. ఇందులో వారు మద్యం సేవించేవారు. నేడు ఆడా, మగా తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లడం అలవాటయిపోయింది. అందువల్ల ప్రస్తుతం తమ స్నేహితులతో (బాయ్‌ ఫ్రెండ్స్‌) కలిసి కొందరు అమ్మాయిలు కూడా డ్రింక్‌ చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అయింది. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌ అందరం కలిసినప్పుడు సరదాగా కొంచెం తాగడంలో పెద్ద తప్పులేదు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్‌ అని చెప్పుకొంటున్నారు నేటి యువతీ యువకులు. మన దేశ చట్టం ప్రకారం 21 సంవత్సరాలు నిండని వారికి మద్యం అమ్మ రాదని రూలు ఉంది. షాపుకు వచ్చిన విద్యార్థుల ఐడెంటీ కార్డును పరిశీలించిన తరువాతే అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది తమకు కావలసిన డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తున్నారని పెద్దలు వాపోతున్నారు.

తక్కువ మోతాదులో...
badhabitస్నేహితులందరం ఎప్పుడైనా కలిసినప్పుడు, క్లబ్‌లకు వెళ్లినప్పుడు తప్పకుం డా బీర్‌కానీ, ఆల్కహాల్‌కానీ తీసుకుంటాం. అది కూడా తక్కువ మోతాదు లోనే పుచ్చుకుంటాం. దీనివల్ల హాని సంగతి కాసేపు పక్కన పెడితే అమ్మాయి లను ఆకట్టుకోవడానికి ఇది షార్ట్‌ రూట్‌ అని నేననుకుంటున్నాను. అమ్మా యిల ముందు అటెన్ష్‌గా, స్టైల్‌గా మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు అది చాలా చక్కగా పనిచేసి నాలోని మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చి పార్టీలో ఆనందంగా గడపగల్గుతున్నాను’ అని 18 సంవత్స రాల స్టూడెంట్‌ విష్ణు అంటున్నాడు.

జాగ్రత్తలు తీసుకుంటున్నారు...
నేటి రోజుల్లో చాలా మంది యూత్‌ లేట్‌నైట్‌ పార్టీలలో, పబ్బులలో డ్రింక్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా ఉం డేందుకు మందు తాగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న చిట్కాల ను ఉపయోగించి తల్లిదండ్రుల నుంచి తప్పించుకుంటున్నారు. ‘ఒకసారి మా కాలేజీ మిత్రులతో పార్టీలో పాల్గొన్నాను. అపుడు వారి బలవంతం మీద మొదటిసారిగా మద్యం తీసుకున్నాను. తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు పేరెంట్స్‌ పసిగట్టకుండా ఉండేందుకు మౌత్‌ ఫ్రెషనర్‌ను ఉపయోగించి వారి నుంచి తప్పించుకున్నాను. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా డ్రిం్‌ చేయాల్సి వచ్చినప్పుడు నా బ్యాగ్‌లో పిప్పర్‌మెంట్లు, మౌత్‌ఫ్రెషనర్‌ను తప్పకుండా తీసుకవెళతాను’ అని స్టూడెంట్‌ ప్రభాకర్‌ అన్నాడు.

గుణపాఠం నేర్చుకున్నాను...
రాత్రి పార్టీలలో డ్రింక్‌ చేసిన తరువాత రోజు ఉదయం హ్యాంగ్‌ఓవర్‌తో, తలనొప్పితో బాధపడాల్సి వస్తుంటుందని కొంత మంది యంగ్‌స్టర్‌ తమ అనుభవాలను చెబుతున్నారు. ‘నాకు మా కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే పార్టీలో ఒక చేదు అనుభవం ఎదురైంది. నాకు ఇంకా గుర్తుంది. ఆ పార్టీ అయిన తరువాత నా స్నేహితులే నన్ను మా ఇంటి వద్దకు చేర్చారు. ఎందుకంటే ఆరోజు రాత్రి దాదాపు ఐదు పెగ్గులకు మించి తాగడంతో నేను కిందపడిపోయాను. లేచే ఓపికలేక పోయింది. ఇది అయిన మరుసటిరోజు విపరీతమైన తలనొప్పి (హ్యాంగోవర్‌)తో బాధపడాల్సి వచ్చింది. అంతేకాకుండా తెల్లారి మా తల్లిదండ్రు లకు నా మొహం చూపించలేకపోయాను. సిగ్గుతో నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఆ సంఘటన వల్ల నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. పార్టీలలో సరదాల కోసం మందుకు బానిసలు కావడం తప్పని తెలుసుకున్నాను. తాగితేనే ఎంజాయ్‌ చేయగలమను కుంటే అసలు పార్టీలకే పోనవసరంలేదు’ అని 22 సంవత్సరాల సతీష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వ్యసనంగా మారే అవకాశం ఉంది...
యవ్వనంలో తాము చేసే పని చాలా కరెక్ట్‌ అని టీనేజర్స్‌ ఆనుకుంటారు. అది భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలను కలిగిస్తుందని తెలిసినా కూడా వాటివైపే మొగ్గుచూపుతారు. తాత్కాలిక సుఖం కోసం తమ అమూల్యమైన సమయాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. ‘ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలూ అబ్బాయిలూ అనే తేడాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇరువురూ వెళ్లడం పరిపాటయింది. ఇంతకు ముందు విదేశాల్లోనే ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోని నగరాలకు కూడా వ్యాపించింది. పబ్బులకు వెళ్లడం సాధారణ విషయంగా పరిగణించే స్థాయికి నేటి యంగ్‌స్టర్స్‌ వచ్చారు. ఇలా పబ్బుల్లో అబ్బాయితో సమానంగా యువతులు కూడా డ్రింక్‌ (మద్యం) తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఇలాంటివి ముందు సరదాల కోసం అలవాటు చేసుకొన్నా చివరకు వ్యసనంగా మారుతుంది. ఎంజాయ్‌ చేయడం తప్పులేదు కానీ అందుకోసం ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావడం తమ భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని నేటితరం తెలుసుకోవాలి’ అని మాససిక నిపుణులు తెలియజేస్తున్నారు.
-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Sunday, November 7, 2010

e - తరం .... ఓన్లీ వన్ కాంటాక్ట్ ప్లీజ్!

డియర్ ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్, కొలీగ్, క్లాస్‌మేట్, రూమ్‌మేట్, ఎక్సెట్రా..,

ఫస్ట్ టైం యాహూ మెయిల్‌లో ఒకరికొకరం ఇ-ఉత్తరాలు రాసుకున్నాం. 'మెయిల్ ఐడి' లేని మనవాళ్లని ఇంటర్నెట్ సెంటర్లకి లాక్కెళ్లి మరీ వాళ్లచేత ఎకౌంట్లు ఓపెన్ చేయించాం. మొత్తమ్మీద అందరం ఆన్‌లైన్లోకి ఎంటరయ్యాం. ఆ తర్వాత పాతవాళ్లమే కొత్తగా జీ మెయిల్లో చూసుకున్నాం, చాటింగ్ చేసుకున్నాం. గ్రీన్ లైట్ చూసి చాటింగ్ మొదలెట్టి... రెడ్ లైట్ కనపడినా అంటిపెట్టుకునే ఉన్నాం. యాక్టివ్, ఇన్-యాక్టివ్ గుర్తులు కూడా మనల్ని సేవ్ చెయ్యలేకపోయాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొందరం, ఆన్‌లైన్లో చేసేదేమీ లేక ఇంకొందరం, ఏం చెయ్యాలో తెలియక మరికొందరం మెయిళ్లు చేసుకున్నాం, గంటలు గంటలు 'చాట్'భారతాలు రాసుకున్నాం. రైటింగ్ ప్రాక్టీస్ చేశాం. ఇష్టం వచ్చినట్టు షార్ట్‌కట్‌లు ఉపయోగించాం. ఆ షార్ట్‌కట్‌లని అర్థం చేసుకోవడానికి మళ్లీ షార్ట్ టర్మ్ రీసర్చ్ ప్రాజెక్టులు చేశాం.

కస్టమ్ మెసేజ్‌లో 'ఫుల్ బిజీ...కెనాట్ చాట్, సారీ' అని రాసుకుంటే మాత్రం ఒదిలిపెట్టామా? పాపం మనవల్ల మనకి ఎదురౌతున్న ఈ ప్రాబ్లమ్స్ గమనించేనేమో చివరికి జి మెయిల్ కరుణించింది. 'ఇన్‌విజిబుల్' ఆప్షన్ ఇచ్చింది. 'దీని చాటున దాక్కోవచ్చు' అంది. ఆన్‌లైన్లో ఉంటూనే లేనట్టు బిల్డప్పిచ్చి ఎలాగో కాంటాక్ట్‌ల నుండి తప్పించుకున్నాం. అదీ ఎంతకాలం... ఆన్‌లైన్‌కి అలవాటైన ప్రాణాలు అంత తేలిగ్గా ఆఫ్‌లైన్ అవుతాయా? అందుకే అందరం 'ఇన్‌విజిబుల్'గా ఉంటున్నామని అందరికీ తెలిసిపోయింది. ఇన్‌విజిబుల్ కాస్త విజిబుల్ అయిపోయింది.

వీటన్నిటి నుండి ఎలా బయట పడాల్రా దేవుడా అనుకుంటూ ఉండగానే అవతరించింది ఆర్కుట్. కథ మళ్లీ మొదటికొచ్చింది... యాహూ మెయిల్లో ఉన్న బ్యాచే జీ మెయిల్లోకి వెళ్లి ఇప్పుడు ఆర్కుట్‌లో చేరమని ఇన్వైట్ చేసుకున్నాం. అప్పటిదాకా మెయిల్లో కాంటాక్టులుగా మాత్రమే ఉన్న మనం ఆర్కుట్‌తో 'సోషల్ నెట్‌వర్క్'గా ఎదిగాం. ఓపక్క ఇ-మెయిళ్లు, చాటింగులు చేసుకుంటూనే ఆర్కుట్‌లో 'శ్క్రాప్'లు... అవును ఆ 'తుక్కే' రాసుకున్నాం. దాంతో మనకి మరో ఎడ్వాంటేజ్ వచ్చింది. ఎవరు ఎవరికి ఏ తుక్కు రాసినా దాన్ని వేరేవాళ్లు చదవొచ్చు. అందుకే తొంగిచూడడం ఎక్కువైపోయింది. మనం రాసేవాటికి కరెక్ట్‌గా సూట్ అవ్వాలనే ఆర్కుట్ వాళ్లు వాటికి 'శ్క్రాప్' అని పేరు పెట్టారట. ఆర్కుట్ బాటలోనే 'ట్యాగ్డ్', 'హై ఫైవ్', 'మై స్పేస్'...ఇలా కొత్తకొత్త నెట్‌వర్క్‌లెన్నో పుట్టుకొస్తే కనపడిన ప్రతి దాన్ని క్లిక్ చేశాం. జాయినయ్యాం. మారింది నెట్‌వర్కే కాని ఆ నెట్‌వర్క్‌లో చేరింది మళ్లీ మన గుంపే. ఇంతలో మొదలైంది ఫేస్‌బుక్ ఫీవర్!

'ఫేస్‌బుక్‌లో లేవా... యూ ఆర్ సో అన్‌కూల్ ఓకే...' అని అంతపెద్ద నోరేసుకుని అని తోటివాళ్లంటుంటే చివరికి దాన్లో కూడా చేరక తప్పలేదు. ఇక్కడ కూడా ఓల్డ్ ఫ్రెండ్సే తగిలారు. సో... వుయ్ మీట్ ఎవ్రివేర్... ఒకరినొకరం పలకరించుకోవడానికి ఇన్ని మార్గాలు అవసరమా? ఏదో పనుండి రెండ్రోజులు ఆన్‌లైన్‌కి రాకపోతే 'యు డిడ్ నాట్ గివ్ ఎనీ రిప్లయ్ టు మై మెయిల్, వాట్ హ్యాపెన్డ్' అని ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ మెసేజ్. అదీ చాలదన్నట్టు సెల్‌ఫోన్లో 'ప్లీజ్ రెస్పాండ్ టు మై మెయిల్' అని ఎస్ఎమ్ఎస్.

అంత అవసరం ఉందా? కాసేపైనా వదల్రా?
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనెక్ట్ చేసింది... నిజమే. అయితే ఇన్ని కనెక్షన్లు అవసరమా? 'టెక్నాలజీస్ ఆర్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ అవర్ బాడీ' అని మార్షల్ మెక్‌లూహన్ ఎప్పుడో చెప్పినట్టు సెల్‌ఫోన్ ఇప్పుడు మన శరీర భాగాల్లో ఒకటై ఉండనే ఉంది. కాబట్టి మన మధ్య సో మెనీ కాంటాక్టులు, కనెక్షన్లు, నెట్‌వర్కుల అవసరం లేదేమో. జస్ట్ ఒక్క ఇ-మెయిల్ చాలు. నో మోర్ న్యూ కనెక్షన్స్ ప్లీజ్!
- ఒక నెట్ బాధితుడు