Monday, February 21, 2011

కళ్యాణ కాస్ట్యూమ్స్ ...... హిట్ ఫిట్.

పెళ్ళి...
హిట్ ఫార్ములా సినిమాలాంటిది!
వధూవరులు... హీరో హీరోయిన్లు
బామ్మలు, అమ్మమ్మలు, మావయ్యలు... తారాగణం
స్పెషల్ అపియరెన్స్‌లో బంధువులు, మిత్రులు...
బోలెడంత హడావిడి... బాజా బజంత్రీలు...
అలకలు, సముదాయింపులు...!
ఇవన్నీ ఉన్నా... ఈ పెళ్లి హిట్ అవ్వాలంటే
వధూవరులు ఒకరికొకరు ఫిట్ అవ్వాలి.
మనసులే కాదు, వారి కాస్ట్యూమ్స్ కూడా!
అందుకే ఇప్పుడు కళ్యాణం కాస్ట్యూమ్స్‌లో కూడా డిజైనర్ వేర్ వస్తున్నాయి. ఆ డిజైన్‌లలో వధూవరులతో బాటు పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా తళుక్కున మెరిసే తారల్లా ఉంటే... ఆ పెళ్లి హిట్ కాక ఏమవుతుంది..?
మీ ఇంట్లో జరిగే పెళ్లి కూడా అలా హిట్ కావాలని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్‌ పరిచయం ...


ఊరు ఊరంతా కలిస్తే అంబరాన్ని అంటే సంబరాల పెళ్లి. ఇద్దరి హృదయాలను ఏకం చేసే పెళ్లి, పిల్లాపాప చిన్నాపెద్దా హుషారుగా హోరెత్తే పెళ్లి. అందరి సమక్షంలో ఆనందంగా, ఆర్భాటంగా జరుపుకునే ఈ సందర్భాన్ని మించిన శుభకార్యం మన సంప్రదాయంలో మరొకటి లేదేమో! ప్రధాన పాత్రధారులు వధూవరులు అయినా ప్రత్యేక పాత్ర ల్లో బంధు, మిత్రుల హడావిడి, అల్లరి తప్పని సరి.

పెళ్లి పనులన్ని ఒక ఎతైతే పెళ్లిరోజు నాటి అలంకర ణ మరో ఎత్తు. ఆరోజు ప్రధాన ఆకర్షణ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయినా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఆ శుభకార్యం రోజున ఏం వేసుకోవాలి? ఎలా తయారవ్వాలి? అనే ఆలోచనలో పడతారు.


ఒకప్పుడు మధుపర్కాలతో వధూవరుల గెటప్ పూర్తయితే, పట్టుచీరలు, ప్యాంటు చొక్కాలతో మిగతావారి అలంకరణ పూర్తి అయ్యేది. రోజులు మారాయి, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.


దీంతో అన్ని సంబరాలకు సరిపడా దుస్తులని ధరించటానికి కనీసం మూడునాలుగు విభిన్నమైన లుక్స్‌ని రెడీ చేసుకోవలసిన అవసరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు కూడా తప్పని సరి అయిపోయింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్, వాటికి అవసరమయ్యే డ్రెస్సింగ్ గురించి అవగాహన కలిగిస్తూ మీరు ‘ఇన్ ఫ్యాషన్‌‘గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. డిజైనర్లు, వెడ్డింగ్ ప్లానర్స్, బ్యూటీషన్స్ నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన సూచనలు మీ కోసం:

ఏ ఫంక్షన్‌కి ఏం ధరించాలి...

సంగీత్ ఫంక్షన్:
‘‘పెళ్లికి ముందు జరిగే ఈ కార్యక్రమంలో హడావిడంతా స్నేహితులదే. ఆట పాటలతో సాగిపోయే ఈ రోజు కోసం ప్రత్యేకమైన దుస్తులు అవసరం. లేటెస్ట్ స్టయిల్స్‌లో డిజైన్ చేసిన గాగ్రా చోలీలో వధువు మెరిసిపోతే ఆమె స్నేహితులు కూడా గాగ్రా, అనార్కలి చుడిదార్ లేదా షార్ట్ టాప్ పై పటియాలా పైజామాలాంటి లేటెస్ట్‌డిజైన్లను ధరించవచ్చు. పెళ్లికొడుకు సిల్క్ కుర్తా పైజమా లేదా లైట్‌గా వర్క్ చేసిన జోధ్‌పురీ స్టైల్ డ్రెస్‌ని ధరిస్తే రాకుమారుడిలా వెలిగిపోవచ్చు. వరుడి స్నేహితులు కూడా సంప్రదాయంగా కనిపించేలా అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా కుర్తా పైజామాలు ధరించడం నేటి ఫ్యాషన్.. మిగిలిన బంధువులు లేటెస్ట్ డిజైన్స్‌లో వస్తున్న క్రేప్, జార్జెట్, షిఫాన్ చీరలు ధరించటానికి ఇది మంచి సమయం. పురుషులు కుర్తా పైజామాలు ధరిస్తే... సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. అందరూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపే ఈ రోజుని మరింత ఎంజాయ్ చేయటానికి ఈ తరహా డ్రెస్సింగ్ అనువుగా ఉంటుంది’’ అంటున్నారు డిజైనర్ సంగీత. ఈ రోజు ట్రెడిషనల్ లుక్‌తో వెస్ట్రన్ లుక్ కూడా మిక్స్ చేయవచ్చు. డ్రెస్సింగ్ ట్రెడిషనల్‌గా ఉంచి హెయిర్ స్టైల్స్‌లో వేరియేషన్ తీసుకు రావచ్చు. అలాగే జ్యువెలరీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ధరిస్తే లుక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కూడా ఆమె అంటున్నారు.
మెహందీ ఫంక్షన్: పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి ఆడవాళ్లు మాత్రమే జరుపుకునేది. ‘‘ఈ రోజుల్లో పెళ్లి కూతురికి పెట్టే గోరింటాకుకి పట్టే సమయం కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు. దాని కోసం పెళ్లికూతురుకు సౌకర్యంగా ఉండే గాగ్రా లేదా సల్వార్ సూట్‌ని ధరిస్తే బాగుంటుంది. షార్ట్ స్లీవ్స్ టాప్ అయితే మరీ మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు మోచేతిని దాటి పైకి దాకా పెట్టటం ఫ్యాషన్’’ అంటున్నారు బ్యుటీషియన్ మిని లింగ్. అలాగే ఫంక్షన్‌కి వచ్చే ఆడవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ కాబట్టి వీరు కూడా చేతులకు సింపుల్ జ్యువెలరీ, సౌకర్యంగా ఉండే లైట్ వెయిట్ చీరలు, ఎక్కువ ఆర్భాటం లేని హెయిర్ స్టయిల్ ఉంటే ఫంక్షన్‌ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.
వెడ్డింగ్ డే...

కలర్ కోఆర్డినేటెడ్ లుక్: వధూవరులు కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సులు ధరించటం ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్ శిల్పా రెడ్డి. అంటే వధూవరులు పెళ్లిరోజు తమ దుస్తులు మ్యాచ్ అయ్యేలా తయారవ్వటం.‘‘ఈ ట్రెండ్ పాశ్చాత్యదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తరహా ట్రెండ్ ఊపందుకుంది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా...వివేక్ ఒబెరాయ్, మాల్వికా.. మొదలైన బాలివుడ్ సెలబ్రిటీలు పెళ్లిరోజు ఈ విధంగా ముస్తాబై ఈ ట్రెండ్‌ని మరింత పాప్యులర్ చేస్తున్నారు’’ అంటున్నారు శిల్పా. మరో ట్రెండ్... మండపం డెకరేషన్ కూడా వధూవరుల దుస్తులను కాంప్లిమెంట్ చేస్తూ ఉండేలా డిజైన్ చేయటం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల వివాహ వేడుకల్లో వధువు ధరించిన బంగారు రంగు చీర, వరుడు ధరించిన క్రీం కలర్ జోధ్‌పురీ సూట్‌కి మ్యాచ్ అయ్యేలా మండపాన్ని డెకరేట్ చేశారు. అంతే కాదు వీరి వివాహం సందర్భంగా మరో ట్రెండ్‌ని కూడా చూసాం. అమితాబ్, జయతో పాటు సోదరి శ్వేత తదితర ముఖ్య కుటుంబ సభ్యులంతా అభిషేక్ బచ్చన్ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా అదేరంగు దుస్తులని ధరించారు. ఈ విధంగా చేయటంతో ఎంతో వైవిధ్యంగా కనిపించటమే కాదు ‘మేమంతా ఒకటి‘ అని చాటి చెప్పారు .
ఐషా ట్రెండ్: మరో ట్రెండ్ కూడా ఇటీవల విడుదలై హిట్ సినిమా ‘ఐషా’ పాప్యులర్ చేసింది. విదేశాలలోఉన్న బ్రైడ్స్ మెయిడ్, బెస్ట్ మ్యాన్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో ఎంతో ఫ్యాషనబుల్‌గా చూపించారు. వధూవరులకు సంబంధించిన ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితమైన స్నేహితులకు పెళ్లిలో పెద్ద పీట వేసే ఈ సంప్రదాయాన్ని ‘ఐషా’లో చూపించారు. ఈ ట్రెండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ముఖ్యులంతా వధూవరులకి మ్యాచింగ్‌గా ఒకే కలర్‌లో వేర్వేరు స్టైల్స్‌లో డ్రెస్సింగ్ చేసుకుంటారు. ‘ఐషా’లో ఎంతో పాప్యులర్ అయినా ‘గల్ మిట్టి మిట్టి బోల్’ పాటలో ఈ తరహా డ్రెస్సింగ్ స్టైయిల్‌ని చూడవచ్చు. చీర కలర్ ఒకటే అయినా డిఫరెంట్ డిజైన్ దానికి తోడు జ్యువెలరీ, హెయిర్‌స్టయిల్ వేరుగా ఉండటంతో పెళ్లి కూతురుకి ఏ మాత్రం పోటీ కాకుండా ఎవరి స్టైయిల్‌లో వాళ్లు కనిపిస్తారు. వరుడి వైపు బంధువులు, స్నేహితులు కూడా వరుడికి మ్యాచింగ్ దుస్తులను ధరిస్తారు ఈ పాటలో. త్వరలో ఈ ట్రెండ్ మరింతగా పాప్యులర్ అవుతుంది అంటున్నారు శిల్ప.

తాటాకు పందిరి కింద మధుపర్కాలలో సిగ్గుపడుతూ పెళ్లిళ్లు చేసుకునే రోజులు దాదాపుగా పోయాయి. ఇప్పుడంతా స్పెషల్‌గా వెడ్డింగ్ ప్లానర్స్ డిజైన్ చేసిన డిజైనర్ వెడ్డింగ్ రోజులు. అంత మాత్రం చేత సంప్రదాయానికి తిలోదకాలిస్తున్నారనుకోవటం పొరపాటే! సంప్రదాయాన్ని, ఆధునికతను కలబోసుకుంటున్న కళాత్మక ట్రెండ్‌లు పెళ్లికి నిండుదనం చేకూరుస్తాయి. వధువరులకు సరికొత్తకళను తెచ్చిపెడతాయి.

పెళ్లి సందడి
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.

రూ. 40 కోట్ల పెళ్లి! పసందైన విందు... వెరైటీ వినోదాలు

మూడే ముళ్లు. ఏడే అడుగులు. మొత్తం కలిపి... రూ. 40 కోట్లు. అవును! రాష్ట్రంలో ఎవరూ పెట్టనంత ఖర్చుతో, భారీ బడ్జెట్ సినిమాను కూడా తలదన్నే రీతిలో పెళ్లి వేడుక జరుగుతోంది. అది కూడా మన రాష్ట్రంలోనే, రాజధాని నగరంలోనే! న్యూజిలాండ్‌లో వ్యాపారం చేసే ఏఆర్ ప్రాపర్టీస్ ఎండీ రవీంద్ర తన ఇద్దరు కొడుకులనూ అతి ఖరీదైన పెళ్లి వేడుక ద్వారా ఒకేసారి ఓ ఇంటివారిని చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు కూడా అక్కాచెల్లెళ్లే కావడం విశేషం. వారిద్దరూ నగరంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతున్నారు. 


ఆదివారం హైటెక్స్‌లో మొదలైన ఈ పెళ్లి వేడుకలు ఏకంగా వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆహ్వాన పత్రిక నుంచి పెళ్లి దుస్తుల దాకా ఏర్పాట్లన్నీ ఒక రేంజ్‌లో ఉన్నాయట. పత్రికను హైదరాబాదీ ముత్యాల్లో పెట్టి మరీ ఇవ్వగా, విదేశాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు, నగా నట్రా కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేశారట. 
పెళ్లి కోసం మయసభను తలపించే రీతిలో, జోధా అక్బర్ సినిమా తరహాలో సెట్టింగ్ ఇప్పటికే ముస్తాబయింది.
రిసెప్షన్‌కు దాన్ని తలదన్నేలా అండర్‌వాటర్ థీమ్‌తో ముత్యపు చిప్ప ఆకృతిలో సెట్ తయారవుతోంది.


పసందైన విందు... వెరైటీ వినోదాలు

పెళ్లి భోజనాలు మాయాబజార్ వివాహ భోజనాన్ని తలదన్నే రీతిలో ఉంటాయట. ఒకరోజు బెంగాలీ, మరో రోజు నిజాం, ఇంకో రోజు రాజస్థానీ, తర్వాత పంజాబీ... ఇలా దేశంలోని పాపులర్ రకాలన్నీ కనువిందు చేస్తాయట. ఇవిగాక రిసెప్షన్, సంగీత్ కార్యక్రమాలకు స్పెషల్ విందులుంటాయి. ఇక్కడితోనే అయిపోలేదు. అరేబియన్ ఎడారి సెట్టింగ్‌లో వైవిధ్యభరితమైన సంగీతం నడుమ వినోద కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రష్యన్ బెల్లీ డ్యాన్సులు ప్రత్యేకమట. వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.


కొసమెరుపు:  ఇంతా చేస్తే, ఇంత ఖరీదైన ఈ పెళ్లిలో ఎక్కడా బాజాభజంత్రీల చప్పుడే విన్పించదు. అంతేకాదు, మాంగల్యధారణ కూడా ఉండదని పెళ్లి కొడుకులు, వారి తండ్రి చెబుతున్నారు. అదంతా తమకు పెద్దగా ఇష్టముండదని వారు చెప్పుకొచ్చారు.

Thursday, February 10, 2011

మ్యాచింగ్ మెహందీ

మాఘమాసం వచ్చిందంటే పార్లలో బ్యూటీషియన్స్ లేటెస్ట్ మెహందీ డిజైన్స్ ఎంచుకునే పనిలో పడిపోతారు. పెళ్లికూతురికి మెహందీ పెట్టడం అంటే చాలా పెద్ద పని. అరచేతి నిండా పెడితే సరిపోవడం లేదు. మోచేతి నుంచి మొదలుపెట్టాలి. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం. మార్వాడి బ్రైడల్ మెహందీలో పెళ్లికూతురు చేతులు, కాళ్లు అన్నీ ఎర్రగా మెరిసిపోవాలి.

ఎన్ని రకాలు...

పూర్వం డిజైన్ గురించి కంటే ఆకుమీదే ఎక్కువగా దృష్టిపెట్టేవారు. ఎవరి చెట్టు ఆకు ఎక్కువగా పండుతుందో తెలుసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. కోన్‌లలో కలిపే రకరకాల పదార్థాల వల్ల కలర్ వద్దన్నా వస్తోంది. ఎటొచ్చీ ఆలోచనంతా డిజైన్ గురించే. వీటిలో అరబిక్, అరబిక్ బ్రైడల్, మార్వాడి బ్రైడల్, దేవదాస్ చాలా ప్రముఖమైనవి. పెళ్లికూతురికి మాత్రం ఎక్కువగా మార్వాడి బ్రైడల్ వేస్తారు. చిన్న చిన్న డిజైన్లతో మొత్తం చేయంతా నిండుగా కనిపిస్తుంది. ఎక్కడా లింక్‌పోకుండా డిజైన్ వేస్తారు.

చాలా సమయం పడుతుంది. రెండవది అరబిక్. పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది. గీతలు, చుక్కలు వేయకుండా ఆకులు, పువ్వులు వంటి డిజైన్లు కనిపిస్తాయి. చూడ్డానికి సింపుల్‌గా, అందంగా ఉంటుంది. వేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఇందులో బ్రైడల్ డిజైన్ మళ్లీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక చివరిది దేవదాస్. ప్రస్తుతం దేవదాస్ ట్రెండే నడుస్తోంది. అరచేతిలో సింపుల్‌గా రెండు పువ్వులు, కాలికి ఓ మూడు పువ్వులు విడివిడిగా వేస్తారు. చాలా సింపుల్‌గా ఉండే ఈ డిజైన్ అన్ని తరాలవారిని ఆకట్టుకుంటుంది.

మ్యాచింగ్ మహిమ...

మనకి తెలిసిన గోరింటాకు ఎర్రగానే పండుతుంది. మరీ బాగా పండితే మర్నాటికి నల్లబడుతుంది. కాని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కోన్‌లు ఎర్రగా, నల్లగా, పచ్చగా, తెల్లగా కూడా పండుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకోకండి. ఇదంతా మ్యాచింగ్ కోసం. పెళ్లికూతరు కట్టుకునే చీరకు తగ్గట్టు చేతిలో రంగులు మెరవాలన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాంతో రకరకాల మిక్సింగ్ ప్రాడెక్ట్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇందులో మొదటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ముందుగా కోన్ పెట్టుకుని చివర్లో మెహందీ బ్లాక్ పౌడర్‌ని నీళ్లలో కలిపి డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు.

రెండవది జర్దోసి. చీరలపైన చేసే జర్దోసి వర్క్‌లాగే చేతులపై కూడా ప్రత్యేకంగా డిజైన్ గీస్తారు. ముందు కోన్‌తో డిజైన్ పెట్టుకుని తరువాత జర్దోసి పొడిని గమ్‌లో కలుపుకుని డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు. ఈ జర్దోసి పొడి గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. పెళ్లి చీరపై ఉండే రంగును బట్టి మెహందీ అవుట్‌లైన్ గీసుకోవాలి. మూడోది మిర్రర్ వర్క్ మెహందీ. సన్నగా, చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మందంలో ఉండే మెహందీ మిర్రర్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. మెహందీ డిజైన్ వేసిన తర్వాత సందుల్లో ఈ మిర్రర్‌ని అతికిస్తారు. ఆరిన తర్వాత నీళ్లతో కడుగుతారు. పండిన గోరింటాకు మధ్యలో అద్దం ముక్కలు అలాగే ఉంటాయి.

ఐదారు రోజులు అలాగే మెరుస్తూ కనిపిస్తాయి. వీటన్నింటికంటే భిన్నమైంది నెయిల్‌పాలిష్ మెహందీ. మనకి కావల్సిన రంగు నెయిల్‌పాలిష్‌ని తీసుకుని పలుచగా చేసి కోన్‌లో కలుపుకోవాలి. ఏ రంగు నెయిల్‌పాలిష్ కలిపితే ఆ రంగు షేడ్ చేతిపై కనిపిస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మెహందీని చేతిపైకి తెస్తున్నారు. ఫలితంగా రకరకాల రంగుల్లో మెహందీని చూడగలుగుతున్నాం.

రెడ్ టాటూలుగా...
మనం గోరింటాకు అని నోటినిండా పిలుచుకునే మెహందీని విదేశీ వనితలు రెడ్‌టాటూ అని పిలుస్తారు. నిజానికి టాటూ అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాని ఒంటిపైన రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోడానికి అందరూ ఇష్టపడడం లేదు. అలాగని టెంపరరీ టాటూలను వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీని గురించి మనకు మిర్రర్ పార్లర్ డైరెక్టర్ విజయలక్ష్మి బాగా చెబుతారు..."మనకి మెహందీ అంటే ఎంత మక్కువో విదేశీ అమ్మాయిలకు టాటూలంటే అంతే ప్రాణం. కాని అవి వేసుకుంటే ప్రతీ రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోవాలి. ఇలా ఒకే డిజైన్‌ని చూసుకోడానికి ఇష్టపడని అమ్మాయిలు టెంపరరీ టాటూలను వేయించుకుంటున్నారు.

అయితే ఆ టాటూలు వేసే ముందు వాడే లిక్విడ్స్ వల్ల చాలామంది శరీరంపైన దద్దుర్లొస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటాలనుకుని వాళ్లు టాటూల జోలికి వెళ్లడం లేదు. అలాంటివారి దృష్టి ఇప్పుడు మన మెహందీపై పడింది. చక్కగా వారికిష్టమైన చోట నచ్చిన డిజైన్ వేయించుకుని మురిసిపోతున్నారు. మెడపైనా, నడుంపైనా, కాళ్లపైనా...ఇలా వారికి నచ్చినచోట మెహందీ టాటూలను వేయించుకుంటున్నారు. వాటికి 'రెడ్ టాటూ' అని పేరు పెట్టారు. కెమికల్స్‌తో కూడిన ఆ టాటూల కంటే ఈ మెహందీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమని ఇతరులకు సలహా కూడా ఇస్తున్నారు'' అని చెప్పారామె.

మెహందీ పండుగ ...

మనకు పెళ్లికూతుర్ని చేయడం అంటే నలుగుపెట్టి స్నానం చేయించడం, పట్టుచీర కట్టి ముస్తాబు చేసి గాజులు తొడగడం, వచ్చిన ముత్తైదువులకి పసుపుకుంకం తాంబూలం ఇవ్వడం. ఇప్పుడు వీటి జాబితాలో మెహందీ కూడా చేరింది. ఉత్తరభారతదేశంలో 'మెహందీ రసం' పేరుతో చేసుకునే ప్రత్యేక వేడుక కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ధనవంతుల ఇళ్లలో తన ప్రత్యేకతను చాటుచుంటోంది. మెహందీ వేడుక అంటే పెళ్లికూతుర్ని చూడ్డానికి వచ్చిన ఆడవాళ్లందరికీ గోరింటాకు పెట్టిస్తారు. పదిమంది కానీ వందమంది కానీ అందరికీ పెట్టాల్సిందే. ఏడేళ్లుగా మెహందీ పెడుతున్న ధనలక్ష్మి తన అనుభవం చెబుతోంది.

"ఒక పెళ్లికి జరిగిన మెహందీరసానికి వెళ్లాను. నేనూ నాతో మరో అమ్మాయి కూడా వచ్చింది. చాలామంది పేరంటాళ్లు వచ్చారు. అందరికీ మెహందీ పెట్టాలి. అంతమందికి పెట్టాలంటే త్వరగా పెట్టే డిజైన్‌లని ఎంచుకోవాలి. అందుకే అందరికీ దేవదాస్ డిజైన్స్ వేసేసాము. ఇద్దరం కలిసి నాలుగు గంటల్లో నలభైమందికి పెట్టేశాం'' అని గుర్తుచేసుకున్నారామె. ఇక ఇందులో ఖరీదుల విషయానికొస్తే...కాళ్లూ చేతులూ ఫుల్‌గా వేయించుకుంటే వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. పెళ్లికూతురికైతే చేతులు, కాళ్లకు కలిపి మూడువేల నుంచి ఐదువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. ఐదారొందల రూపాయలకు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి, పార్లర్స్‌ని బట్టి ఖరీదులు చెబుతున్నారు.

ఫ్లయిట్ ఎక్కేవారికి ప్రత్యేకం..
పెళ్లయిన వెంటనే ఫ్లయిట్ ఎక్కి వెళ్లె పెళ్లికూతుర్లకి మెహందీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు విజయలక్ష్మి. " పెళ్లయిన వెంటనే విదేశాలకి వెళ్లే పెళ్లికూతుళ్లు ఎక్కువవుతున్నారు. భర్త ఉద్యోగనిమిత్తమో, హనీమూన్ ప్రయాణమో...మొత్తానికి పెళ్లయిన వారంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లాల్సివస్తోంది. అక్కడ వేలిముద్రలు తీసుకుంటారు. ఆ సమయంలో వేళ్లకి గోరింటాకు ఉంటే ఒప్పుకోరు.

ఒకసారి దీని వల్లే ఒక పెళ్లికూతురు ప్రయాణం రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా దగ్గరికి వచ్చే పెళ్లికూతుర్లని ముందే అన్ని వివరాలు అడుగుతున్నాం. విదేశీయానం ఉన్నట్లయితే చేతినిండా మెహందీ పెట్టినా వేళ్లకి పెట్టం. పెళ్లిసమయంలో అందంగా కనిపించడం కోసం ఆ ప్రాంతంలో స్కెచ్‌తో రంగు వేస్తున్నాం. తరువాత కడిగేస్తే పోతుంది. విదేశాలకు వెళ్లాక ఆ వేళ్లభాగంలో కోన్ పెట్టుకోమని చెబుతాం. ఈ చిన్న జాగ్రత్త తెలియక చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు.'' అని వివరించారామె.