Monday, February 21, 2011

కళ్యాణ కాస్ట్యూమ్స్ ...... హిట్ ఫిట్.

పెళ్ళి...
హిట్ ఫార్ములా సినిమాలాంటిది!
వధూవరులు... హీరో హీరోయిన్లు
బామ్మలు, అమ్మమ్మలు, మావయ్యలు... తారాగణం
స్పెషల్ అపియరెన్స్‌లో బంధువులు, మిత్రులు...
బోలెడంత హడావిడి... బాజా బజంత్రీలు...
అలకలు, సముదాయింపులు...!
ఇవన్నీ ఉన్నా... ఈ పెళ్లి హిట్ అవ్వాలంటే
వధూవరులు ఒకరికొకరు ఫిట్ అవ్వాలి.
మనసులే కాదు, వారి కాస్ట్యూమ్స్ కూడా!
అందుకే ఇప్పుడు కళ్యాణం కాస్ట్యూమ్స్‌లో కూడా డిజైనర్ వేర్ వస్తున్నాయి. ఆ డిజైన్‌లలో వధూవరులతో బాటు పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా తళుక్కున మెరిసే తారల్లా ఉంటే... ఆ పెళ్లి హిట్ కాక ఏమవుతుంది..?
మీ ఇంట్లో జరిగే పెళ్లి కూడా అలా హిట్ కావాలని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్‌ పరిచయం ...


ఊరు ఊరంతా కలిస్తే అంబరాన్ని అంటే సంబరాల పెళ్లి. ఇద్దరి హృదయాలను ఏకం చేసే పెళ్లి, పిల్లాపాప చిన్నాపెద్దా హుషారుగా హోరెత్తే పెళ్లి. అందరి సమక్షంలో ఆనందంగా, ఆర్భాటంగా జరుపుకునే ఈ సందర్భాన్ని మించిన శుభకార్యం మన సంప్రదాయంలో మరొకటి లేదేమో! ప్రధాన పాత్రధారులు వధూవరులు అయినా ప్రత్యేక పాత్ర ల్లో బంధు, మిత్రుల హడావిడి, అల్లరి తప్పని సరి.

పెళ్లి పనులన్ని ఒక ఎతైతే పెళ్లిరోజు నాటి అలంకర ణ మరో ఎత్తు. ఆరోజు ప్రధాన ఆకర్షణ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయినా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఆ శుభకార్యం రోజున ఏం వేసుకోవాలి? ఎలా తయారవ్వాలి? అనే ఆలోచనలో పడతారు.


ఒకప్పుడు మధుపర్కాలతో వధూవరుల గెటప్ పూర్తయితే, పట్టుచీరలు, ప్యాంటు చొక్కాలతో మిగతావారి అలంకరణ పూర్తి అయ్యేది. రోజులు మారాయి, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.


దీంతో అన్ని సంబరాలకు సరిపడా దుస్తులని ధరించటానికి కనీసం మూడునాలుగు విభిన్నమైన లుక్స్‌ని రెడీ చేసుకోవలసిన అవసరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు కూడా తప్పని సరి అయిపోయింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్, వాటికి అవసరమయ్యే డ్రెస్సింగ్ గురించి అవగాహన కలిగిస్తూ మీరు ‘ఇన్ ఫ్యాషన్‌‘గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. డిజైనర్లు, వెడ్డింగ్ ప్లానర్స్, బ్యూటీషన్స్ నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన సూచనలు మీ కోసం:

ఏ ఫంక్షన్‌కి ఏం ధరించాలి...

సంగీత్ ఫంక్షన్:
‘‘పెళ్లికి ముందు జరిగే ఈ కార్యక్రమంలో హడావిడంతా స్నేహితులదే. ఆట పాటలతో సాగిపోయే ఈ రోజు కోసం ప్రత్యేకమైన దుస్తులు అవసరం. లేటెస్ట్ స్టయిల్స్‌లో డిజైన్ చేసిన గాగ్రా చోలీలో వధువు మెరిసిపోతే ఆమె స్నేహితులు కూడా గాగ్రా, అనార్కలి చుడిదార్ లేదా షార్ట్ టాప్ పై పటియాలా పైజామాలాంటి లేటెస్ట్‌డిజైన్లను ధరించవచ్చు. పెళ్లికొడుకు సిల్క్ కుర్తా పైజమా లేదా లైట్‌గా వర్క్ చేసిన జోధ్‌పురీ స్టైల్ డ్రెస్‌ని ధరిస్తే రాకుమారుడిలా వెలిగిపోవచ్చు. వరుడి స్నేహితులు కూడా సంప్రదాయంగా కనిపించేలా అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా కుర్తా పైజామాలు ధరించడం నేటి ఫ్యాషన్.. మిగిలిన బంధువులు లేటెస్ట్ డిజైన్స్‌లో వస్తున్న క్రేప్, జార్జెట్, షిఫాన్ చీరలు ధరించటానికి ఇది మంచి సమయం. పురుషులు కుర్తా పైజామాలు ధరిస్తే... సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. అందరూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపే ఈ రోజుని మరింత ఎంజాయ్ చేయటానికి ఈ తరహా డ్రెస్సింగ్ అనువుగా ఉంటుంది’’ అంటున్నారు డిజైనర్ సంగీత. ఈ రోజు ట్రెడిషనల్ లుక్‌తో వెస్ట్రన్ లుక్ కూడా మిక్స్ చేయవచ్చు. డ్రెస్సింగ్ ట్రెడిషనల్‌గా ఉంచి హెయిర్ స్టైల్స్‌లో వేరియేషన్ తీసుకు రావచ్చు. అలాగే జ్యువెలరీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ధరిస్తే లుక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కూడా ఆమె అంటున్నారు.
మెహందీ ఫంక్షన్: పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి ఆడవాళ్లు మాత్రమే జరుపుకునేది. ‘‘ఈ రోజుల్లో పెళ్లి కూతురికి పెట్టే గోరింటాకుకి పట్టే సమయం కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు. దాని కోసం పెళ్లికూతురుకు సౌకర్యంగా ఉండే గాగ్రా లేదా సల్వార్ సూట్‌ని ధరిస్తే బాగుంటుంది. షార్ట్ స్లీవ్స్ టాప్ అయితే మరీ మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు మోచేతిని దాటి పైకి దాకా పెట్టటం ఫ్యాషన్’’ అంటున్నారు బ్యుటీషియన్ మిని లింగ్. అలాగే ఫంక్షన్‌కి వచ్చే ఆడవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ కాబట్టి వీరు కూడా చేతులకు సింపుల్ జ్యువెలరీ, సౌకర్యంగా ఉండే లైట్ వెయిట్ చీరలు, ఎక్కువ ఆర్భాటం లేని హెయిర్ స్టయిల్ ఉంటే ఫంక్షన్‌ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.
వెడ్డింగ్ డే...

కలర్ కోఆర్డినేటెడ్ లుక్: వధూవరులు కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సులు ధరించటం ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్ శిల్పా రెడ్డి. అంటే వధూవరులు పెళ్లిరోజు తమ దుస్తులు మ్యాచ్ అయ్యేలా తయారవ్వటం.‘‘ఈ ట్రెండ్ పాశ్చాత్యదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తరహా ట్రెండ్ ఊపందుకుంది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా...వివేక్ ఒబెరాయ్, మాల్వికా.. మొదలైన బాలివుడ్ సెలబ్రిటీలు పెళ్లిరోజు ఈ విధంగా ముస్తాబై ఈ ట్రెండ్‌ని మరింత పాప్యులర్ చేస్తున్నారు’’ అంటున్నారు శిల్పా. మరో ట్రెండ్... మండపం డెకరేషన్ కూడా వధూవరుల దుస్తులను కాంప్లిమెంట్ చేస్తూ ఉండేలా డిజైన్ చేయటం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల వివాహ వేడుకల్లో వధువు ధరించిన బంగారు రంగు చీర, వరుడు ధరించిన క్రీం కలర్ జోధ్‌పురీ సూట్‌కి మ్యాచ్ అయ్యేలా మండపాన్ని డెకరేట్ చేశారు. అంతే కాదు వీరి వివాహం సందర్భంగా మరో ట్రెండ్‌ని కూడా చూసాం. అమితాబ్, జయతో పాటు సోదరి శ్వేత తదితర ముఖ్య కుటుంబ సభ్యులంతా అభిషేక్ బచ్చన్ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా అదేరంగు దుస్తులని ధరించారు. ఈ విధంగా చేయటంతో ఎంతో వైవిధ్యంగా కనిపించటమే కాదు ‘మేమంతా ఒకటి‘ అని చాటి చెప్పారు .
ఐషా ట్రెండ్: మరో ట్రెండ్ కూడా ఇటీవల విడుదలై హిట్ సినిమా ‘ఐషా’ పాప్యులర్ చేసింది. విదేశాలలోఉన్న బ్రైడ్స్ మెయిడ్, బెస్ట్ మ్యాన్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో ఎంతో ఫ్యాషనబుల్‌గా చూపించారు. వధూవరులకు సంబంధించిన ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితమైన స్నేహితులకు పెళ్లిలో పెద్ద పీట వేసే ఈ సంప్రదాయాన్ని ‘ఐషా’లో చూపించారు. ఈ ట్రెండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ముఖ్యులంతా వధూవరులకి మ్యాచింగ్‌గా ఒకే కలర్‌లో వేర్వేరు స్టైల్స్‌లో డ్రెస్సింగ్ చేసుకుంటారు. ‘ఐషా’లో ఎంతో పాప్యులర్ అయినా ‘గల్ మిట్టి మిట్టి బోల్’ పాటలో ఈ తరహా డ్రెస్సింగ్ స్టైయిల్‌ని చూడవచ్చు. చీర కలర్ ఒకటే అయినా డిఫరెంట్ డిజైన్ దానికి తోడు జ్యువెలరీ, హెయిర్‌స్టయిల్ వేరుగా ఉండటంతో పెళ్లి కూతురుకి ఏ మాత్రం పోటీ కాకుండా ఎవరి స్టైయిల్‌లో వాళ్లు కనిపిస్తారు. వరుడి వైపు బంధువులు, స్నేహితులు కూడా వరుడికి మ్యాచింగ్ దుస్తులను ధరిస్తారు ఈ పాటలో. త్వరలో ఈ ట్రెండ్ మరింతగా పాప్యులర్ అవుతుంది అంటున్నారు శిల్ప.

తాటాకు పందిరి కింద మధుపర్కాలలో సిగ్గుపడుతూ పెళ్లిళ్లు చేసుకునే రోజులు దాదాపుగా పోయాయి. ఇప్పుడంతా స్పెషల్‌గా వెడ్డింగ్ ప్లానర్స్ డిజైన్ చేసిన డిజైనర్ వెడ్డింగ్ రోజులు. అంత మాత్రం చేత సంప్రదాయానికి తిలోదకాలిస్తున్నారనుకోవటం పొరపాటే! సంప్రదాయాన్ని, ఆధునికతను కలబోసుకుంటున్న కళాత్మక ట్రెండ్‌లు పెళ్లికి నిండుదనం చేకూరుస్తాయి. వధువరులకు సరికొత్తకళను తెచ్చిపెడతాయి.

పెళ్లి సందడి
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.

No comments: