Monday, February 21, 2011

రూ. 40 కోట్ల పెళ్లి! పసందైన విందు... వెరైటీ వినోదాలు

మూడే ముళ్లు. ఏడే అడుగులు. మొత్తం కలిపి... రూ. 40 కోట్లు. అవును! రాష్ట్రంలో ఎవరూ పెట్టనంత ఖర్చుతో, భారీ బడ్జెట్ సినిమాను కూడా తలదన్నే రీతిలో పెళ్లి వేడుక జరుగుతోంది. అది కూడా మన రాష్ట్రంలోనే, రాజధాని నగరంలోనే! న్యూజిలాండ్‌లో వ్యాపారం చేసే ఏఆర్ ప్రాపర్టీస్ ఎండీ రవీంద్ర తన ఇద్దరు కొడుకులనూ అతి ఖరీదైన పెళ్లి వేడుక ద్వారా ఒకేసారి ఓ ఇంటివారిని చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు కూడా అక్కాచెల్లెళ్లే కావడం విశేషం. వారిద్దరూ నగరంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతున్నారు. 


ఆదివారం హైటెక్స్‌లో మొదలైన ఈ పెళ్లి వేడుకలు ఏకంగా వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆహ్వాన పత్రిక నుంచి పెళ్లి దుస్తుల దాకా ఏర్పాట్లన్నీ ఒక రేంజ్‌లో ఉన్నాయట. పత్రికను హైదరాబాదీ ముత్యాల్లో పెట్టి మరీ ఇవ్వగా, విదేశాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు, నగా నట్రా కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేశారట. 
పెళ్లి కోసం మయసభను తలపించే రీతిలో, జోధా అక్బర్ సినిమా తరహాలో సెట్టింగ్ ఇప్పటికే ముస్తాబయింది.
రిసెప్షన్‌కు దాన్ని తలదన్నేలా అండర్‌వాటర్ థీమ్‌తో ముత్యపు చిప్ప ఆకృతిలో సెట్ తయారవుతోంది.


పసందైన విందు... వెరైటీ వినోదాలు

పెళ్లి భోజనాలు మాయాబజార్ వివాహ భోజనాన్ని తలదన్నే రీతిలో ఉంటాయట. ఒకరోజు బెంగాలీ, మరో రోజు నిజాం, ఇంకో రోజు రాజస్థానీ, తర్వాత పంజాబీ... ఇలా దేశంలోని పాపులర్ రకాలన్నీ కనువిందు చేస్తాయట. ఇవిగాక రిసెప్షన్, సంగీత్ కార్యక్రమాలకు స్పెషల్ విందులుంటాయి. ఇక్కడితోనే అయిపోలేదు. అరేబియన్ ఎడారి సెట్టింగ్‌లో వైవిధ్యభరితమైన సంగీతం నడుమ వినోద కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రష్యన్ బెల్లీ డ్యాన్సులు ప్రత్యేకమట. వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.


కొసమెరుపు:  ఇంతా చేస్తే, ఇంత ఖరీదైన ఈ పెళ్లిలో ఎక్కడా బాజాభజంత్రీల చప్పుడే విన్పించదు. అంతేకాదు, మాంగల్యధారణ కూడా ఉండదని పెళ్లి కొడుకులు, వారి తండ్రి చెబుతున్నారు. అదంతా తమకు పెద్దగా ఇష్టముండదని వారు చెప్పుకొచ్చారు.

No comments: