
ఎన్ని రకాలు...
పూర్వం డిజైన్ గురించి కంటే ఆకుమీదే ఎక్కువగా దృష్టిపెట్టేవారు. ఎవరి చెట్టు ఆకు ఎక్కువగా పండుతుందో తెలుసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. కోన్‌లలో కలిపే రకరకాల పదార్థాల వల్ల కలర్ వద్దన్నా వస్తోంది. ఎటొచ్చీ ఆలోచనంతా డిజైన్ గురించే. వీటిలో అరబిక్, అరబిక్ బ్రైడల్, మార్వాడి బ్రైడల్, దేవదాస్ చాలా ప్రముఖమైనవి. పెళ్లికూతురికి మాత్రం ఎక్కువగా మార్వాడి బ్రైడల్ వేస్తారు. చిన్న చిన్న డిజైన్లతో మొత్తం చేయంతా నిండుగా కనిపిస్తుంది. ఎక్కడా లింక్‌పోకుండా డిజైన్ వేస్తారు.
చాలా సమయం పడుతుంది. రెండవది అరబిక్. పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది. గీతలు, చుక్కలు వేయకుండా ఆకులు, పువ్వులు వంటి డిజైన్లు కనిపిస్తాయి. చూడ్డానికి సింపుల్‌గా, అందంగా ఉంటుంది. వేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఇందులో బ్రైడల్ డిజైన్ మళ్లీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక చివరిది దేవదాస్. ప్రస్తుతం దేవదాస్ ట్రెండే నడుస్తోంది. అరచేతిలో సింపుల్‌గా రెండు పువ్వులు, కాలికి ఓ మూడు పువ్వులు విడివిడిగా వేస్తారు. చాలా సింపుల్‌గా ఉండే ఈ డిజైన్ అన్ని తరాలవారిని ఆకట్టుకుంటుంది.
మ్యాచింగ్ మహిమ...
మనకి తెలిసిన గోరింటాకు ఎర్రగానే పండుతుంది. మరీ బాగా పండితే మర్నాటికి నల్లబడుతుంది. కాని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కోన్‌లు ఎర్రగా, నల్లగా, పచ్చగా, తెల్లగా కూడా పండుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకోకండి. ఇదంతా మ్యాచింగ్ కోసం. పెళ్లికూతరు కట్టుకునే చీరకు తగ్గట్టు చేతిలో రంగులు మెరవాలన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాంతో రకరకాల మిక్సింగ్ ప్రాడెక్ట్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇందులో మొదటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ముందుగా కోన్ పెట్టుకుని చివర్లో మెహందీ బ్లాక్ పౌడర్‌ని నీళ్లలో కలిపి డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు.
రెండవది జర్దోసి. చీరలపైన చేసే జర్దోసి వర్క్‌లాగే చేతులపై కూడా ప్రత్యేకంగా డిజైన్ గీస్తారు. ముందు కోన్‌తో డిజైన్ పెట్టుకుని తరువాత జర్దోసి పొడిని గమ్‌లో కలుపుకుని డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు. ఈ జర్దోసి పొడి గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. పెళ్లి చీరపై ఉండే రంగును బట్టి మెహందీ అవుట్‌లైన్ గీసుకోవాలి. మూడోది మిర్రర్ వర్క్ మెహందీ. సన్నగా, చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మందంలో ఉండే మెహందీ మిర్రర్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. మెహందీ డిజైన్ వేసిన తర్వాత సందుల్లో ఈ మిర్రర్‌ని అతికిస్తారు. ఆరిన తర్వాత నీళ్లతో కడుగుతారు. పండిన గోరింటాకు మధ్యలో అద్దం ముక్కలు అలాగే ఉంటాయి.
ఐదారు రోజులు అలాగే మెరుస్తూ కనిపిస్తాయి. వీటన్నింటికంటే భిన్నమైంది నెయిల్‌పాలిష్ మెహందీ. మనకి కావల్సిన రంగు నెయిల్‌పాలిష్‌ని తీసుకుని పలుచగా చేసి కోన్‌లో కలుపుకోవాలి. ఏ రంగు నెయిల్‌పాలిష్ కలిపితే ఆ రంగు షేడ్ చేతిపై కనిపిస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మెహందీని చేతిపైకి తెస్తున్నారు. ఫలితంగా రకరకాల రంగుల్లో మెహందీని చూడగలుగుతున్నాం.

మనం గోరింటాకు అని నోటినిండా పిలుచుకునే మెహందీని విదేశీ వనితలు రెడ్‌టాటూ అని పిలుస్తారు. నిజానికి టాటూ అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాని ఒంటిపైన రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోడానికి అందరూ ఇష్టపడడం లేదు. అలాగని టెంపరరీ టాటూలను వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీని గురించి మనకు మిర్రర్ పార్లర్ డైరెక్టర్ విజయలక్ష్మి బాగా చెబుతారు..."మనకి మెహందీ అంటే ఎంత మక్కువో విదేశీ అమ్మాయిలకు టాటూలంటే అంతే ప్రాణం. కాని అవి వేసుకుంటే ప్రతీ రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోవాలి. ఇలా ఒకే డిజైన్‌ని చూసుకోడానికి ఇష్టపడని అమ్మాయిలు టెంపరరీ టాటూలను వేయించుకుంటున్నారు.
అయితే ఆ టాటూలు వేసే ముందు వాడే లిక్విడ్స్ వల్ల చాలామంది శరీరంపైన దద్దుర్లొస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటాలనుకుని వాళ్లు టాటూల జోలికి వెళ్లడం లేదు. అలాంటివారి దృష్టి ఇప్పుడు మన మెహందీపై పడింది. చక్కగా వారికిష్టమైన చోట నచ్చిన డిజైన్ వేయించుకుని మురిసిపోతున్నారు. మెడపైనా, నడుంపైనా, కాళ్లపైనా...ఇలా వారికి నచ్చినచోట మెహందీ టాటూలను వేయించుకుంటున్నారు. వాటికి 'రెడ్ టాటూ' అని పేరు పెట్టారు. కెమికల్స్‌తో కూడిన ఆ టాటూల కంటే ఈ మెహందీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమని ఇతరులకు సలహా కూడా ఇస్తున్నారు'' అని చెప్పారామె.
మెహందీ పండుగ ...
మనకు పెళ్లికూతుర్ని చేయడం అంటే నలుగుపెట్టి స్నానం చేయించడం, పట్టుచీర కట్టి ముస్తాబు చేసి గాజులు తొడగడం, వచ్చిన ముత్తైదువులకి పసుపుకుంకం తాంబూలం ఇవ్వడం. ఇప్పుడు వీటి జాబితాలో మెహందీ కూడా చేరింది. ఉత్తరభారతదేశంలో 'మెహందీ రసం' పేరుతో చేసుకునే ప్రత్యేక వేడుక కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ధనవంతుల ఇళ్లలో తన ప్రత్యేకతను చాటుచుంటోంది. మెహందీ వేడుక అంటే పెళ్లికూతుర్ని చూడ్డానికి వచ్చిన ఆడవాళ్లందరికీ గోరింటాకు పెట్టిస్తారు. పదిమంది కానీ వందమంది కానీ అందరికీ పెట్టాల్సిందే. ఏడేళ్లుగా మెహందీ పెడుతున్న ధనలక్ష్మి తన అనుభవం చెబుతోంది.
"ఒక పెళ్లికి జరిగిన మెహందీరసానికి వెళ్లాను. నేనూ నాతో మరో అమ్మాయి కూడా వచ్చింది. చాలామంది పేరంటాళ్లు వచ్చారు. అందరికీ మెహందీ పెట్టాలి. అంతమందికి పెట్టాలంటే త్వరగా పెట్టే డిజైన్‌లని ఎంచుకోవాలి. అందుకే అందరికీ దేవదాస్ డిజైన్స్ వేసేసాము. ఇద్దరం కలిసి నాలుగు గంటల్లో నలభైమందికి పెట్టేశాం'' అని గుర్తుచేసుకున్నారామె. ఇక ఇందులో ఖరీదుల విషయానికొస్తే...కాళ్లూ చేతులూ ఫుల్‌గా వేయించుకుంటే వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. పెళ్లికూతురికైతే చేతులు, కాళ్లకు కలిపి మూడువేల నుంచి ఐదువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. ఐదారొందల రూపాయలకు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి, పార్లర్స్‌ని బట్టి ఖరీదులు చెబుతున్నారు.

పెళ్లయిన వెంటనే ఫ్లయిట్ ఎక్కి వెళ్లె పెళ్లికూతుర్లకి మెహందీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు విజయలక్ష్మి. " పెళ్లయిన వెంటనే విదేశాలకి వెళ్లే పెళ్లికూతుళ్లు ఎక్కువవుతున్నారు. భర్త ఉద్యోగనిమిత్తమో, హనీమూన్ ప్రయాణమో...మొత్తానికి పెళ్లయిన వారంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లాల్సివస్తోంది. అక్కడ వేలిముద్రలు తీసుకుంటారు. ఆ సమయంలో వేళ్లకి గోరింటాకు ఉంటే ఒప్పుకోరు.
ఒకసారి దీని వల్లే ఒక పెళ్లికూతురు ప్రయాణం రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా దగ్గరికి వచ్చే పెళ్లికూతుర్లని ముందే అన్ని వివరాలు అడుగుతున్నాం. విదేశీయానం ఉన్నట్లయితే చేతినిండా మెహందీ పెట్టినా వేళ్లకి పెట్టం. పెళ్లిసమయంలో అందంగా కనిపించడం కోసం ఆ ప్రాంతంలో స్కెచ్‌తో రంగు వేస్తున్నాం. తరువాత కడిగేస్తే పోతుంది. విదేశాలకు వెళ్లాక ఆ వేళ్లభాగంలో కోన్ పెట్టుకోమని చెబుతాం. ఈ చిన్న జాగ్రత్త తెలియక చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు.'' అని వివరించారామె.
No comments:
Post a Comment