Sunday, March 13, 2011

విజయం ఓ వరం!

రంగస్థలంపై చాలా మందే యాక్టర్లు తారసపడతారు. వారిలో హీరో కూడా ఒక యాక్టరే అయినప్పటికీ తన హీరోయిజంతో స్టార్ అనిపించుకుంటాడు. తనదైన ముద్రతో నిజజీవితంలో సైతం ఆకర్షిస్తాడు. కాబట్టి కథలో మనం ఉండకూడదు...మనమే కథకులం కావాలి. కథా నాయకులం కావాలి.
జీవితాన్ని క్షణభంగురం అంటుంటాం. నిజానికి జీవితం విలువ క్షణమేనా? కాదు. కొన్ని కోటానుకోట్ల క్షణాల సముదాయమే జీవితం! అంతటి జీవితమూ 'క్షణం'లో చేజారిపోవచ్చు. అలా చేజారిపోవటం క్షణానికే పరిమితమైనప్పటికీ దాని నీడలు కోట్ల క్షణాలపై పరుచుకుని ఉంటాయి. ఆ ఒక్క క్షణం కోసం కోట్ల క్షణాలలో మనం భయభ్రాంతిలో ఉంటాం. నిజానికి ఆ ఒక్క క్షణానికి భయ కంపితులమైతే జీవితమంతా బలహీనంగానే గడిచిపోతుంది. అలాకాక ఆ క్షణాన్ని శక్తిమంతంగా మార్చుకోగలిగితే జీవితమంతా శక్తి సంపన్నం అవుతుంది. ఓటమిని విజయానికి శ్రీకారం అనుకుంటే గెలుపులో హీరోయిజం కనిపిస్తుంది.

జీవితం క్షణభంగురం కాదు
పవర్‌ఫుల్ కావాలి

ఒక ఓటమి అనేక గెలుపులకు దోహదకారి అవుతుంది. రేయింబవళ్లలా జీవితంలో చీకటి వెలుగులు ఉంటాయి. బలాలు బలహీనతలూ ఉంటూనే ఉంటాయి. మెలకువకు నిద్ర ఉపకరించినట్లే బలపడటానికి బలహీనతలూ దోహదపడుతుంటాయి. ఒక సమస్యకు రెండవది పరిష్కారం అవుతుంది. సుఖాన్ని వెన్నంటి కష్టం ఉంటుంది. అలాగే కష్టాన్ని వెన్నంటి సుఖమూ ఉంటుంది. విషాద యోగమూ, ఆనందయోగమూ మానవగీతలో రచింపబడే ఉంటాయి.

సృష్టిలో ఈ విరుద్ధతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మనకున్న వనరులు ఏమిటి అని చూసుకుని, వాటిల్లో పనికొచ్చేవి ఏమిటి? పనికి రానివి ఏమిటి? అని మనమే నిర్ణయించుకోవాలి. అప్పుడే మన వ్యక్తిత్వం ఒక నిర్ణయాత్మక ప్రణాళిక అవుతుంది. నిర్దేశిత లక్ష్యంతో ఈ నిర్ణయాత్మక ప్రణాళిక సాధ్యమవుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉంటే, ప్రణాళిక పకడ్బందీగా సాగితే ఏ జీవితమూ కేవలం సాదాసీదాగా సాగిపోదు. దేన్నీ అనాలోచితంగా చేయటం జరగదు. దేన్నీ ఆయాచితంగా అందుకోవాలనుకోవటం జరగదు.

నేడు ఒకలా రేపు మరోలా వర్తించటం జరగదు. జీవితంలో, వ్యక్తిత్వంలో, వర్తనంలో, ఆలోచనలో, చేతలో స్పష్టత ఉంటుంది. అపుడ 'కాలం' చేజారిపోతుందేమో నన్న బెంగ, భయం ఉండదు. ఫలితంగా మనం పవర్‌ఫుల్ అవుతాం. ఆ శక్తి సంపన్నత మనదే తప్ప, మనలో నుంచి ఉబికివచ్చిందే తప్ప ఎక్కడి నుంచో వచ్చింది కాదు. సాధన ద్వారా అందివచ్చింది ప్రతిభతో ప్రకాశమయ్యింది. రైట్‌థాట్, రైట్‌స్పీచ్, రైట్ యాక్షన్‌ల సమాహారమే ఈ పవర్.

కాలాన్ని గెలువు

విజయాన్ని వరించాలంటే మనలో త్రికరణ శుద్ధి ఉండాలి. మన ఆలోచన, మన చేతన, మన మాట సన్మార్గంలో ఉండాలి. అప్పుడే జీవితం విజయపథం అవుతుంది. "నా ఆలోచన తప్పుకాదు...నేను మాట్లాడింది తప్పుకాదు...నేను చేసింది తప్పు కాదు'' అని ఘంటాపధంగా చెప్పగలిగిన వారిలో చంచల స్వభావం ఏ కోశానా కనిపించదు. అనుమాన బీజాలు అగుపించవు. పైగా అటువంటి వ్యక్తిత్వం ఒక సస్యశ్యామల క్షేత్రమే అవుతుంది.

వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. ఫలవంతమవుతుంది. ఇటువంటి వ్యక్తిత్వ సంపన్నులు దేనికీ తొందరపడరు. సహనాన్ని కోల్పోరు. విజయం వరించకపోయినా సహనంగా సాధన సాగిస్తారు. ప్రయత్నలోపమూ, సాధనా లోపమూ ఉండుద కాబట్టి గెలుపు తథ్యమే అవుతుంది. వీరి ప్రణాళిక పకడ్బందీగా ఉంటుంది. కాబట్టి కాలం సైతం వీరిని పరీక్షించదు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారు కాబట్టి కాలవ్యవధిని సైతం నిర్దేశించుకునే ఉంటారు. కాబట్టి ఆ కాలానికి లోబడే విజయం వీరిని వరిస్తుంది.

గెలుపు మాత్రమే కాదు కాలంసైతం వీరి గుప్పిటనే ఉంటుంది. వీరు కాలాన్ని జయించగలరు కాబట్టి ప్రపంచాన్నీ జయించగలరు. ఇన్ని తెలుసు కాబట్టి విజయానికి కావలసిన వనరులు ఏమిటో వీరికి స్పష్టంగా తెలిసే ఉంటుంది. అవి తమ వద్ద ఎంత పుష్కలంగా ఉన్నదీ తెలుసు. లేని వాటిని సమీకరించుకోగలరు. ఈ సమీకరణ ద్వారా మార్పు సాధ్యమవుతుంటుంది. ఈ మార్పు స్వభావ వ్యతిరేకి మాత్రం కాదు. అన్న సక్సెస్ సూత్రం తెలిసిన వారు కాబట్టి తమ స్వభావానికి ఎదురీదకుండానే మార్పును ఆహ్వానిస్తారు. ఆ మార్పు గెలుపొందటం కొరకే అని స్పష్టంగా తెలుసు.

గెలుపు అవకాశం కాదు

గెలుపు లక్ష్యమే తప్ప అవకాశం కాదు... అవసరం. అది ఒక పరిణత ప్రతిభ. వాస్తవం, యదార్థం కావాలని పట్టు పడితేనే గెలుపు సాధ్యమవుతుంది. ఎవరికి కానీ శ్రమ, సాధన వృధా పోవు. శ్రమకు, సాధనకు తగ్గ ప్రతిఫలం విజయం రూపంలో వరిస్తుంది. ప్రస్తుతానికి ఆ విజయం విలువ ఎంతటిదయినా అది భవిష్య విజయానికి భూమిక అవుతుంది. అలా భవిష్య విజయ సౌధానికి వర్తమాన విజయాలనే సోపానాలుగా చేసుకుంటూ పోవాలి. ఇంతవరకు విజయపరంపరలతో ఒక్కోమెట్టు ఎక్కుతున్న కొద్దీ మరింత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటారు. ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిస్తూ కనిపిస్తుంటారు. మనకంటే ఎంతో ఎత్తులో ఉంటారు.

మనం మొదటి మెట్టుపై నిలబడి చూస్తుంటే వారి విజయం వినోదంలా ఉంటుంది. శిఖరం చేరుతున్న వ్యక్తి అద్భుత వ్యక్తి అనిపిస్తుంటాడు. హీరోలా అనిపిస్తుంటాడు. ఆ స్ఫూర్తితో మనమూ మెట్లెక్కడం ప్రారంభిస్తే ఆ అద్భుతం మన నీడలో తలదాచుకుంటుంది. మన వ్యక్తిత్వంలో ప్రకాశిస్తుంది. ఆ హీరో మనకు చేయి అందించిన పరవశం కలుగుతుంది. ఆ పారవశ్యంతో మనమూ అతడి పక్కకు చేరుకోగలుగుతాం. శిఖరాగ్రాన అతడి పక్కన నిలబడగలుగుతాం. మనమూ హీరో అవుతాం...అనిపించుకుంటాం.

మనమూ చేయి అందించి ఇతరులూ హీరోలు అనిపించేలా చేస్తాం. రంగస్థలంపై చాలా మందే యాక్టర్లు తారసపడతారు. వారిలో హీరో కూడా ఒక యాక్టరే అయినప్పటికీ తన హీరోయిజంతో స్టార్ అనిపించుకుంటాడు. తనదైన ముద్రతో నిజజీవితంలో సైతం ఆకర్షిస్తాడు. అందుకే మోర్గాన్ ఫ్రీమన్ అంటాడు. కాబట్టి కథలో మనం ఉండకూడదు...మనమే కథకులం కావాలి. కథా నాయకులం కావాలి.


డా. వాసిలి వసంతకుమార్
యోగాలయ రీసెర్చ్ సెంటర్
ఫోన్ : 9393933946

No comments: