Monday, October 25, 2010

తళుకుల తారల చేతిలో కత్తెర్లు ........

వీళ్ల 'కటింగ్'లకు ఖరీదెక్కువ!

దసరా, దీపావళి వచ్చిందంటే చాలు. వాళ్ల కత్తెర్లకు చేతినిండా పని. కత్తెర్లకు పనంటే ఏ హెయిర్‌సెలూన్‌లోనో బిజీ అయిపోయారని కాదండోయ్. ఈ తళుకుల తారల చేతిలో కత్తెర్లు కొత్తరకం హెయిర్‌స్టయిల్స్ కట్ చేసి ఏ యాభయ్యో వందో తీసుకోవు. అలా వయ్యారంగా వచ్చి ఒక చేత్తో 'కటింగ్' ఇచ్చి.. మరో చేత్తో లక్షలు సంపాదించి పెడుతున్నాయి వీళ్ల కత్తెర్లు

అలాగని అన్ని కత్తెర్లకూ ఒకే రేటు కాదు. ఎంత పదునుకు అంత రేటన్నమాట. పదునంటే గ్లామర్. గ్లామర్ అంటే స్టార్‌డమ్. టాలీవుడ్ భామలంతా పండుగలొస్తే కత్తెర్లకు పనిజెప్పే ట్రెండు ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఏటా దసరా, దీపావళి పండుగలకు హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడల్లో షాపింగ్‌మాల్స్ బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీపడుతుంటాయి.

ఈ రోజుల్లో చడీచప్పుడు లేకుండా ఊరికినే ఆకట్టుకోవాలంటే కుదిరేపని కాదు. అందుకే షాపింగ్ యజమానులు గ్లామర్ తారల చేత్తో ఖరీదైన కటింగ్స్ ఇస్తుంటారు. అప్పుడు బోలెడు డిస్కౌంట్లు, బంపర్ బహుమతులు, ప్రారంభోత్సవాలతో అందర్నీ ఆకర్షిస్తారు.

ప్రకటన ఉత్తినే చేస్తే ఎవ్వరి చూపూ షాపింగ్‌ల వైపు పడదని.. ఏ అనుష్కాతోనో, ఇలియానాతోనో సందడి చేయిస్తుంటారు. కస్టమర్లకు పండుగ ఆఫర్లు ఎంత సంతృప్తినిస్తున్నాయో కానీ, కటింగ్‌లు ఇచ్చే తారలకు మాత్రం నిజంగా పండగే పండగ. తెలుగు సినీ పరిశ్రమలో మంచి బూమ్‌లో ఉన్న అనుష్క ఒక కార్యక్రమ ప్రారంభోత్సవానికి గంటకు 20 లక్షలు తీసుకుంటుందట.

'మగధీర'తో అందరినీ ఆకర్షించిన కాజల్ 5 నుంచి 8 లక్షలు తీసుకుంటుందట. ఈ మధ్యనే 'బృందావనం' సూపర్‌హిట్ కొట్టడంతో ప్రారంభోత్సవాల రేటును 10 లక్షలకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియమణి, నికిషాపటేల్ 4 లక్షలు, సమంతా, తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, మమతా మోహన్‌దాస్‌లు ఒక్కో ప్రైవేటు కార్యక్రమానికి రెండు నుంచి మూడు లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

" దుకాణాలకు తారలను ఆహ్వానించడం కొంత ఖర్చుతో కూడుకున్న పనే అయినా, తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రచారం వస్తుంది...'' అంటున్నారు యజమానులు.

ఎవరి కత్తెరకు ఎంత పదును..?
అనుష్క, ఇలియానా, జెనీలియా : రూ.15 నుంచి 20 లక్షలు
కాజల్ : రూ.5 నుంచి 8 లక్షలు
ప్రియమణి, నికిషా పటేల్ : రూ. 4 లక్షలు
సమంతా, తాప్సీ, రిచా, మమతా మోహన్‌దాస్ : రూ.2 నుంచి 3 లక్షలు
ప్రియా ఆనంద్ : రూ.2 లక్షలు
మధురిమ, బిందుమాధవి, పద్మప్రియ : రూ.50 వేల నుంచి లక్ష

No comments: