Thursday, October 21, 2010

జీనాలజీ

నడుము
నడుము, పిరుదులు, తొడలు- ఈ మూడింటి ఆకృతిని బట్టి జీన్‌ను ఎంచుకోవాలి. జీన్ వేసుకున్నప్పుడు- ఈ మూడు భాగాల్లోను ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కచ్చితంగా అతికినట్లు ఉంటేనే అందంగా కనిపిస్తుంది. కొందరికి నడుము దగ్గర ఎక్కువ కొవ్వు ఉంటుంది. పొట్ట కూడా ఉంటుంది. ఇలాంటి వారు నడుము భాగం ఎక్కువ కనిపించకుండా ఉండే- హై రెయిజ్, మిడ్ రెయిజ్ జీన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. కాళ్లు సన్నగా ఉండి.. నడుము దగ్గర ఎక్కువ కొవ్వు లేనివారు లో రెయిజ్ జీన్స్‌ను ఎంచుకోవాలి.

పిరుదులు
జీన్స్‌ని ఎంచుకునేటప్పుడు వాటి వెనక జేబులు ఎక్కడ ఉన్నాయో చూడాలి. జీన్ వేసుకున్నప్పుడు వెనక జేబులు- మరీ పక్కకు రాకూడదు. పిరుదు మధ్యకు రావాలి. దీనితో పాటుగా ముందు జేబులలో చేతులు పెట్టి ఒక సారి చూసుకోవాలి. వాటిలో పర్సు లేదా సెల్‌ఫోన్ పెట్టుకోవటానికి వీలు ఉండాలి. కొందరికి పిరుదులు పెద్దవిగా ఉంటాయి. అలాంటి వారు వెనక భాగంలో మరీ ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేసిన జీన్స్‌ను ఎంపిక చేసుకోకపోవటం మంచిది. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కాని జేబులకు కవర్లు ఉన్న జీన్స్ కాని ఎంచుకుంటే మంచిది.

ముందు భాగం
జిప్ ఉండే భాగం ఆధారంగా కూడా జీన్స్ షేప్ మారిపోతూ ఉంటుంది. ఈ భాగంలో బాగా బిగుతుగా ఉన్న జీన్స్‌ను ఎంచుకోకూడదు. అక్కడ మాత్రం శరీరాకృతికి కచ్చితంగా పట్టినట్లు కాకుండా- ఒకటి ఒకటిన్నర అంగుళాలు వదులుగా ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. లేకపోతే కూర్చునే సమయంలో ముందు భాగంలో ముడతలు పడిపోతుంది.

తొడలు
జీన్స్ తొడ దగ్గర భాగం కొద్దిగా వదులుగా ఉండాలి. అప్పుడే నడవటానికి సౌకర్యంగా ఉంటుంది. కొందరికి తొడలు వెడల్పుగా ఉంటాయి. అలాంటి వారు తొడల వద్ద టైట్‌గా పట్టేసే జీన్స్‌ను ఎంచుకోకూడదు.

పిక్కలు
పిక్కల దగ్గర జీన్స్ బిగుతుగా ఉండాలనుకుంటే జెగ్గింగ్స్‌ను ఎంచుకోవాలి (జీన్స్‌లా ఉండే లెగ్గింగ్స్‌ను జెగ్గింగ్స్ అంటారు). మంచి శరీరాకృతి ఉన్నవారి కోసం మార్కెట్లోకి బూట్‌కట్ ఫిట్, ఫ్లేర్డ్ ఫిట్‌లు వచ్చాయి. సన్నగా ఉన్నవారు బ్యాగీలను కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు.

హెమ్
జీన్స్ కింది భాగాన్ని హెమ్ అంటారు. శరీరాకృతిని బట్టి ఇది ఎంత ఉండాలనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. పొట్టిగా ఉండే అమ్మాయిలు- పిక్కల దాకా ఉండే జీన్స్‌ను(3/4 జీన్స్) వేసుకోకూడదు. హై హీల్స్ వేసుకొని పాదం కింది దాకా ఉండే జీన్స్‌ను వేసుకోవాలి. కొందరు ఫ్లాట్ జీన్స్‌ను ఎక్కువ ఇష్టపడతారు. ఇలాంటి వారు చెప్పులు లేదా బూట్లు దాకా ఉండే జీన్స్‌ను వేసుకుంటే బావుంటుంది.

చెక్‌లిస్ట్
మరీ వదులుగా లేదా మరీ టైట్‌గా ఉన్న జీన్స్‌ను ఎప్పుడూ కొనొద్దు. మరీ టైట్ జీన్స్‌ను కొంటే తొడల వద్ద ముడతలు పడిపోతాయి. మరీ లూజ్‌గా ఉన్న జీన్స్‌ను కొంటే బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా సౌకర్యంగా ఉండదు.

మార్కెట్లో ఉన్న ట్రెండ్‌ను ఫాలో కావాలి. సన్నగా ఉన్నవారికి స్కిన్నీ జీన్స్ బాగుంటాయి. తొడల దగ్గర కొద్దిగా లావుగా ఉన్నవారు కూడా స్కిన్నీ జీన్స్‌ను వేసుకోవచ్చు కాని దానిపై పొడవైన టాప్‌ను లేదా కుర్తీని వేసుకోవాలి.

మార్కెట్‌లోకి అనేక రకాల జీన్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఒకే రకం జీన్‌ను పదే పదే కొనటం అనవసరం. వేర్వేరు రకాలు కొనుగోలు చేస్తే బావుంటుంది.

ట్రెండీగా ఉండే జీన్స్‌నైనా సరే ఒకటి రెండుకు మించి కొనొద్దు. ఎంబ్రాయిడరీ, యాసిడ్ వాష్ రకాలు ఏడెనిమిది సంవత్సరాలుగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. అలాంటి వాటికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వాటిని ఎంచుకుంటే మంచిది.

జీన్స్ కొనేందుకు వెళ్లినప్పుడు స్కర్ట్ వేసుకొని వెళ్లటం ఉత్తమం. దీని వల్ల జీన్‌ను వేసి చూసుకోవటం సులభమవుతుంది.

షాపులో జీన్స్ ట్రయల్ వేసినప్పుడు నడవటంతో పాటుగా వంగి పైకి లేచి చూసుకోవాలి. అప్పుడు జీన్ కచ్చితంగా ఫిట్ అయిందో లేదో తెలుస్తుంది.

No comments: