
"ఈద్''అనేది ఒక అరబీ పదబంధం. ఒక మహనీయుని, లేక మహా సంఘటనను స్మరించుకుంటూ, ఏటా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రతి శుభ సందర్భాన్ని 'ఈద్'అంటారు. దీన్నే మనం తెలుగు భాషలో 'పండగ' అంటున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్(సం)మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్దెనిమిది మాసాల తరువాత, అంటే రమజాన్ మాసం మరి రెండు రోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రి శకం రెండవ సంవత్సరంలో సదఖా, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.
"ఎవరైతే పరిశుద్ధతను పొంది, అల్లాహ్(దైవ)నామాన్ని స్మరిస్తూ(ఈద్)నమాజ్ ఆచరించారో వారు సాఫల్యం పొందారు''(పవిత్ర ఖురాన్ 18-14). ఈ వాక్యానికి సంబంధించిన ఒక వ్యాఖ్యానంలో 'ఎవరైతే జకాత్, ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందారు'అని ఉంది. ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా, అబూఖుల్‌దాతో, 'రేపు మీరు ప్రార్థన కోసం ఈద్‌గాహ్‌కు వెళ్ళే ముందు ఒకసారి నా వద్దకు వచ్చి వెళ్ళండి' అన్నారు.
మరునాడు అబూఖుల్‌దా ఆయన వద్దకు వెళ్ళినపుడు 'ఏమైనా భుజించారా?'అని ప్రశ్నించారు. సమాధానంగా అబూఖుల్‌దా 'ఆ.. భుజించాను'అన్నారు. 'గుస్ల్(స్నానం)చేశారా?'అని మళ్ళీ ప్రశ్నించారు. 'ఆ.. చేశాను'అన్నారాయన సమాధానంగా. 'మరి జకాత్, ఫిత్రాలు చెల్లించారా?' 'ఆ.. చెల్లించాను'అని చెప్పాడరు అబూఖుల్‌దా. 'ఇక చాలు ఈ విషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఈ దైవ వాక్యం అర్థం కూడా ఇదే.'అన్నారాయన. హజ్రత్ ఉమర్‌బిన్ అబ్దుల్ అజీజ్ కూడా ప్రజలను ఫిత్రా చెల్లించమని ఆదేశించి, ఈ వాక్యాన్నే చదివి వినిపించేవారు.
ఉత్సాహవేళ...
పవిత్ర ఖురాన్‌లో 'ఈద్'అనే పదం ఓ ప్రత్యేక అర్థంలో మనకు కనిపిస్తుంది. మాయిదా సూరాలో దేవుని ప్రవక్త హజ్రత్ ఈసా అలై హిస్సలాం(క్రీస్తు మహనీయులు)ఆకాశం నుంచి 'మాయిదా'ను(ఆహార పదార్థాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపచేయమని దైవాన్ని వేడుకుంటారు. "మా ప్రభువా!! మా ముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుంచి అవతరింపచేయి.
అది మాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ పండగ(ఈద్) ఈ రోజు అవుతుంది.''(పవిత్ర ఖురాన్ 5-114) అల్లమా ఇచ్నెకసీర్, హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్(రజి) మహనీయుల్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు.
హ!! ఈసా అలై హిస్సాలాం, ఇజ్రాయేలీయులతో, 'మీరు 30రోజుల వరకు ఉపవాసవ్రతం పాటించి, ఆకాశం నుంచి మాయిదాను వర్షింపచేయమని అల్లాహ్‌ను ప్రార్థిస్తే ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికేదాని ప్రతిఫలం దొరుకుతుంది''అన్నారు. అప్పుడు క్రీస్తు మహనీయుల వారి వాక్కు ప్రకారం ఇజ్రేయెలీయులు 30రోజులు ఉపవాసాలు పాటించారు. దీంతో ఆకాశం నుంచి 'మాయిదా' అవతరించింది.
హ.. అమ్మార్ బిన్ యాసిర్(రజి) కథనం ప్రకారం, 'ఈ మాయిదాను ప్రజలు ఎంత తిన్నా తరిగేది కాదు'అందుకే మాయిదా అవతరణను క్రీస్తు మహనీయులు పండగ(ఈద్)తో పోల్చారు. అంటే, దేవుని అనుగ్రహాలను పొంది మనం సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్రఖురాన్‌లో కూడా ఇలా ఉంది. 'ప్రవక్తా! వారికిలా చెప్పండి. ఈ మహా భాగ్యాన్ని దైవం మీ కోసం పంపాడంటే, అది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి'(పవిత్ర ఖురాన్ 10-58).
దైవ కృప అపారం
మరో చోట.. 'మీ ప్రభువు అనుగ్రహాలను గురించి బాగా చర్చించండి, వాటిని దాటుతూ ఉండండి'అని ఉంది(పవిత్ర ఖురాన్ 93-11). నిజానికి రమజాన్ ఉపవాసాలు దైవం మానవులపై కురిపించిన అపార దయానుగ్రహాలు. పండగ ఆ అనుగ్రహాలను స్మరించుకుంటూ దైవానికి కృతాజ్ఞతాంజలులు సమర్పించుకొనే ఓ చక్కని సందర్భం.
అంతేకాకుండా ఈ పవిత్ర రమజాన్‌లోనే దైవం మానవాళికి మరో మహత్తర కానుక కూడా బహుకరించాడు. అదే పవిత్ర ఖురాన్ అవతరణ. ఇది సమస్త మానవాళికి సన్మార్గ ప్రదాయిని. మానవ కల్యాణం కోసం ఇంతటి మహత్తర, మహిమాన్విత గ్రంథ రాజాన్ని అవతరిపంచేసినందుకు, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకొని, ఆయన ఘనతను, కొనియాడండి.
ఆయనకు కృతజ్ఞతలు తెలపండి'(పవిత్ర ఖురాన్ 2-185) ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారం, హద్దుల్ని అతిక్రమించకుండా, దుబారాలకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు తావీయకుండా దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండగ.

పండగ సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త(స)వారి ఆచరణ ఇలా ఉండేది. ఆయన పండగ నమాజును ఈద్‌గాహ్‌లో చేసేవారు. అందుకే ప్రవక్త సంప్రదాయన్ననుసరించి ఈద్ నమాజును ఊరి బయట బహిరంగ ప్రదేశంలో (ఈద్‌గాహ్‌లో)నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచ దేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం.
అయితే అనివార్య పరిస్థితుల్లో మాత్రం ఈద్ నమాజ్‌ను మసీదులోనే చేసుకోవచ్చు. ప్రవక్త వారు కూడా ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్‌గాహ్‌లో పండగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ప్రవక్త మహనీయులు ఉన్నంతలోనే కొత్త వస్త్రాలు ధరించేవారు.
శుక్రవారం నమాజుకు, పండగ నమాజులకు ధరించేందుకు ఆయనకు ప్రత్యేకంగా ఒక జత దుస్తులు ఉండేవి. పండగపూట మంచి బట్టలు ధరించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు వాడడం కూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్‌గాహ్‌కు వెళ్లే ముందు కొద్దిగా అల్పాహారం (అంటే ఆ రోజుల్లో ఖర్జూరాలు) తీసుకొనే వారు.
బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్‌గాహ్‌కు వెళ్లేవారు. రమజాన్ నమాజును కాస్త ఆలస్యంగా బక్రీద్ నమాజును కాస్త తొందరగా చేసేవారు. ఈదుల్ ఫిత్ర్‌లో సదఖ, ఫిత్రా, ఈదుల్ అజహాలో ఖుర్బానీ ముఖ్య విధులు. యావత్ ప్రపంచంలో ఈ పండగను అత్యంత భక్తి ప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
పేదసాదలను ఆదుకోవాలి
కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండగ రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ధనవంతులు జకాత్, ఫిత్రాల రూపంలో తమను ఆదుకుంటారని వారు ఆశిస్తారు. కాబట్టి ధనవంతులు నిరుపేదల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా, అభాగ్యులకు సాయం చేసి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రయత్నించాలి. ఇస్లామియా ధర్మశాస్త్రం డబ్బు దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా చేసేవారు సైతాన్ సోదరులని చెప్పింది.
అవసరార్థులకు, పేదసాదలకు ధనసాయం చేసేందుకు ఖర్చు చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది.
సేమియా, షీర్‌ఖుర్మాల తీపితో పాటు కులమతాలకు అతీతంగా అందరి మధ్య ఆత్మీయతలు, అనుబంధాలను ప్రోది చేస్తుంది. ఎలాంటి అసమానత, అణచివేత, దోపిడీ, పీడన, దారిద్య్రం లేని ఓ సుందర సమాజ నిర్మాణానికి పండగలు దోహదం చేయాలని, రమజాన్ స్ఫూర్తి అందరి గుండెల్లో నిండుగా వెలగాలని కోరుకుందాం.
* యం.డి. ఉస్మాన్ ఖాన్
No comments:
Post a Comment