
సల్మాన్ రష్డీ రచించిన 'సెటానిక్ వెర్సెస్' వివాదం, ఫత్వా సందర్భంగా, పది సంవత్సరాల క్రితం నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను. అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనపరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో జరిగిన దారుణమైన సంఘటనల తరువాత కూడా ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా ఉన్న ఒక మతం పట్ల మనం అస్ఫుటమైన అసత్యమైన అభిప్రాయాలను పెంచి పోషించకూడదనిపించింది. సల్మాన్ రష్డీపై అయెతుల్లా ఖొమైనీ ఫత్వా విధించినపుడు ఈ అహేతుక ద్వేషం అనేక పశ్చిమ దేశాలలో మరింత ప్రత్యక్షంగా కనపడింది.
1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న 45 రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఈ ఫత్వాని ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్‌లో ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సౌదీ అరేబియా షేకులు, కైరోలోని అల్ అజ్‌హర్ మదర్సా కూడా ఈ ఫత్వా ఇస్లామ్ మత వ్యతిరేకమైనదన్నది. కానీ ఇదంతా పశ్చిమ దేశాలవారు వినదలచుకోలేదు. అయెతుల్లాతో విభేదించేవారూ, రష్డీని చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది ఉన్నారు.
అయితే సల్మాన్ రష్డీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వీరిని తీవ్రంగా కలత పెట్టింది. పశ్చిమ మేధావులు మాత్రం , ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ళ జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటిష్ రచయితలు, మేధావులు, తత్వవేత్తలు కూడా ఇస్లాముని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనపరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గది కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్టింల సున్నితమైన మనోభావాలను వారు పట్టించుకోలేదు.
అదంత ముఖ్యమైన విషయం కాదనుకున్నారు. ముహమ్మద్ గురించి రష్డీ చెప్పింది మాత్రమే పశ్చిమ దేశాల పాఠకులు చదవడం విచారకరం అనిపించింది. రష్డీ నిజంగా తన నవలలో ఏం చెప్పదలిచాడో నేను అర్ధం చేసుకోగలిగినప్పటికీ, ఒక గొప్ప వ్యక్తి నిజమైన జీవిత కథ అందరికీ తెలియాలనే నేనీ పుస్తక రచనకి పూనుకున్నాను. నాకు ప్రచురణ కర్త దొరకడం కూడా కష్టమైంది.
ఎందుకంటే నా లాంటి మహిళ, వారి ప్రవక్త గురించి వ్రాస్తే ముస్లిమ్‌లకి కోపం వచ్చి నేను కూడా రష్డీ వలె రహస్య జీవితం గడపవలసిన పరిస్థితి సంభవం కావచ్చు అని చాలామంది భావించారు. కానీ నా పుస్తకానికి ముస్లిముల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడం నన్నెంతో కదిలించింది. నేనీ పుస్తకం కేవలం సంచలనం సృష్టించడానికే వ్రాయలేదని నమ్మారు. తరువాత పది సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో ఉన్న ఈ 'ఇస్లామోఫోబియా' తగ్గుతూ వచ్చింది. ముస్లిములకి వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు.
ఇప్పుడు విద్యుద్ఘాతం వంటి సెప్టెంబర్ పదకొండు సంఘటన - న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రమూ, పెంటగాన్‌లో ఒక భాగమూ ధ్వంసమైన తీరు - ముస్లిమ్ ఉగ్రవాదులు ఈ దారుణ మారణకాండకి తలపడి దాదాపు 5000ల మంది మరణానికి కారంణం కావడం, పశ్చిమ దేశాలలో ముస్లిమ్ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌పై ఉండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది. ముస్లిములు హింసనూ తీవ్రవాదాన్నీ సమర్ధించే మత మౌడ్యులనే భావనను ఈ ఘోరమైన చర్య స్థిరపరిచింది.
ఈ విపత్కర సంఘటన తరువాత ఒక నెలకి నేనీ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. ఇదొక ప్రత్యేక సందర్భం. ఇస్లామ్, హింసను సమర్ధిస్తుందనే భావాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాద వివాదాల్లో చాలామంది కుర్ఆన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. ఇటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్, జ్యూయిష్ మత గ్రం«థాలలో కూడా ఇటువంటి కలహశీలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయని మర్చిపోయారు.
జ్యూయిష్ బైబిల్‌లో అతి పవిత్రమైనదిగా భావించే 'తోరా'లో ఇజ్రాయిల్ వారిని, వారికి ప్రభువు వాగ్దానం చేసిన భూమినించి తరిమికొట్టమని, వారి పవిత్ర చిహ్నాలను ధ్వంసం చెయ్యమనీ ఉంది. వారితో ఎటువంటి ఒడంబడికలూ ఉండకూడదంది. కొంతమంది యూదు మతవాదులు, ఇలాంటి వాటిని పాలస్తీనియన్లపై హింసను సమర్ధించడానికి వాడుకుంటారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపన ప్రక్రియను విమర్శించడానికి కూడా వాడుతుంటారు. కాని జుడాయిజమ్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరూ ఈ వాక్యాలను ప్రామాణికంగా తీసుకోరు. వాటిని ఆ విధంగా వాడుకోవడం న్యాయవిరుద్ధమంటారు.
జీసస్‌ని ఎల్లప్పుడూ శాంతికాముకునిగా భావిస్తాము. కానీ కొన్ని గోస్పెల్స్ ఆయన్ని పోరాటశీలునిగా కూడా చిత్రిస్తాయి. ఒక సందర్భంలో ఆయన, తను శాంతిని కాక ఖడ్గాన్ని తెచ్చానంటాడు. అయితే ఎవరూ కూడా సెబ్రెనీసాలో క్రిష్టియన్ సెర్బులు 8000ల మంది ముస్లిములని చంపినపుడు ఈ వాక్యాన్ని ఉల్లేఖించలేదు. ఎవరూ క్రైస్తవ మతం హింసను ప్రోత్సహిస్తుందనలేదు. అటువంటి ఆరోపణలు చెయ్యడం అనుచితం అని చాలామందికి తెలుసు. పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.
(సెప్టెంబర్ ఘాతుకానికి పాల్పడిన) తీవ్రవాదులు తాము ముహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తున్నామనుకోవడం నన్నెక్కువ బాధ పెట్టింది. ఈ దాడికి కీలకమైన వ్యక్తిగా భావించే ఒసామా బిన్ లాడెన్, ముహమ్మద్ ప్రవక్త జీవిత విధానంలోని సనాతన వాదాన్ని (ఫండమెంటలిజమ్) అనుసరించాడు. సయ్యిద్ ఖుతుబ్ అనే ఈజిప్షియన్ మేధావి మొట్టమొదట చేసిన ఫండమెంటలిస్టు సూత్రీకరణ ప్రకారం ముహమ్మద్ జీవితం ఒక దివ్య సాక్షాత్కారం. భగవంతుడు ముహమ్మద్‌కు చెప్పిన మార్గం ఒక్కటే సత్సమాజ స్థాపనకు మార్గం.
(ఖుతుబ్‌కి 1966లో ప్రెసిడెంట్ జమాల్ అబ్దుల్ నాజర్ మరణశిక్ష విధించాడు.) ముహమ్మద్ ప్రవక్త ముస్లిములు చెప్పే 'జాహిలియా'ని (అంటే చీకటి యుగం) అంతం చేయడానికి పోరాడాడు. ఈ జాహిలియా అనే పదాన్ని ముస్లిమ్‌లు రాక ముందు అరేబియాలో ఉండి అవినీతి, బర్బరత్వం రాజ్యమేలిన కాలానికి ప్రతీకగా వాడతారు. ఖుతుబ్ అభిప్రాయం ప్రకారం ప్రతి యుగంలోనూ ఒక జాహిలియా ఉంటుంది. కనుక ఇరవయ్యో శతాబ్దంలో కూడా ముహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తూ తమ ప్రాంతాల్లోని జాహిలియాని నిర్మూలించాలి. ఇందుకోసం వాళ్లు ముందుగా ప్రధాన స్రవంతిగా ఉన్న 'జాహిలి' సమాజం నుంచి విడివిడి అంకిత భావంతో పని చేసే ఒక అగ్ర నాయకత్వాన్ని తయారు చెయ్యాలి.

తమ స్వలాభం కోసం ముస్లిమ్ అతివాదులు ముహమ్మద్ జీవితాన్ని వక్రీకరించడాన్ని మనం ఒప్పుకోకూడదు. అమితంగా మారిపోయిన ఈనాటి ప్రపంచంలో మనం ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోడానికి కూడా మనం ముహమ్మద్ జీవితాన్ని చదవాలి. పశ్చిమ దేశ వాసులమైన మనకి ఎప్పుడూ ఇస్లాంతో సరిపడలేదు. ఆ మతాన్ని గురించి మనకి చాలా అహంకారపూరితమైన, మొరటు అభిప్రాయాలుండేవి. తీసిపారేసే చూపు ఉండేది. మనం ఇంకా అటువంటి అజ్ఞానంతో అపార్ధాలతో కూడిన వైఖరి అవలంబించలేమని ఇప్పుడు తెలియ వచ్చింది. ఈ పుస్తకం చివరన నేను ప్రఖ్యాత కెనెడియన్ పండితుడు విల్ ఫ్రెడ్ క్యాంట్వెల్ స్మిత్ వాక్యాలని ఉల్లేఖించాను.
ఆయన రచనలు నాకు నిరంతర స్పూర్తిదాయకాలు. ఇరవయ్యో శతాబ్దపు సవాళ్ళను జయప్రదంగా ఎదుర్కోవాలంటే పశ్చిమదేశాలూ, ఇస్లామిక్ ప్రపంచమూ కూడా గట్టి కృషి చెయ్యాలని ఆయన 1956లోనే హెచ్చరించాడు. ముస్లిములు పశ్చిమ సమాజాన్నీ, పశ్చిమం సాధించిన విజయాలనూ అంగీకరించాలనీ, అట్లాగే పశ్చిమ దేశవాసులు కూడా ముస్లిములను తమకన్నా తక్కువవారుగా కాక సమానులుగా చూడాలనీ అన్నాడు.
పాశ్చాత్య నాగరికతా, క్రైస్తవ మత ధర్మశాస్త్రమూ కూడా తక్కిన వారిని సరైన గౌరవ మర్యాదలతో చూడ్డం నేర్చుకోకపోతే ఆ రెండూ కూడా ఇరవయ్యో శతాబ్దపు వాస్తవాలను ఎదుర్కోలేవని ఆయన అన్నాడు. ఈ క్రమంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ - సెప్టెంబర్ విషాదం, అటు పాశ్చాత్యులూ, ఇటు ముస్లిములూ కూడా ఈ పరీక్షలో నెగ్గలేదని తేల్చింది.
ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లిమ్‌లను అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాట పోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి. అందుకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు. ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.
No comments:
Post a Comment