Wednesday, December 15, 2010

అష్టావక్రులు అనే రింగు లీడర్లు 'రాజ'మార్గంలో దారి దోపిడీ

పేదలను కొట్టి పెద్దలకు పంచి..
రూ.35వేల కోట్లు వెనకేసుకున్న అక్రమార్కులు
భూ సేకరణలో భారీ గోల్‌మాల్
అస్మదీయులకు అభయ హస్తం
మాటిమాటికీ మారిన రూటు
ప్రతిసారీ బక్కరైతులే బలి
విపక్షాలపైనా ప్రలోభాల వల
సీబీఐ విచారణకు సహాయ నిరాకరణ
50... 70... 80... 90... 100.... 120.... స్పీడో మీటర్ గిర్రున తిరుగుతుంది. విలాసాల వాహనం సర్రున దూసుకుపోతుంది. వారెవ్వా... ఔటర్ సూపర్! కానీ... ఔటర్ రింగ్ రోడ్డు కింద వేల బతుకులు నలిగిపోయాయని, అక్రమార్కులకు ఇది రాచబాట వేసిందని, కుంభకోణాలకు 'రాజా' వంటిదని కొంచెం లోతుల్లోకి వెళితేనే తెలుస్తుంది. రాజా వారు, ఆయన అనుచర వర్గం కోసం అనేకసార్లు రింగులు తిరిగిన ఔటర్ భూతం పేద రైతులను బలి చేసింది.

అసలు ప్రయోజనాల కంటే పెద్దలకు కాసుల వర్షం కురిపించే ప్రాజెక్టుగా ఇప్పటికే విజయం సాధించింది. తన లేఖలో జలయజ్ఞంలో అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించిన కొండా సురేఖ ఊహకు కూడా అందనన్ని మలుపులు తిరిగింది. అన్ని వ్యవస్థలను నిర్యీర్యం చేస్తూ అక్రమాల మధ్యనే సాగిన ఔటర్ రోడ్డు నిర్మాణం రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణం. అప్పటి సీఎం వైఎస్, ఆయన ఆంతరంగికుడు కేవీపీ కలిసి నడిపించిన మంత్రాంగం! అప్పటి హుడా చైర్మన్ సుధీర్ రెడ్డి, సెక్రటరీ వెంకట్రామ రెడ్డి కనుసన్నల్లో జరిగిన మాయాజాలం!

రంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 15 : ఔటర్‌తో హైదరాబాద్ దశ, దిశ మారుతుందని అప్పట్లో ఊదరగొట్టారు. ఆ మాటలో నిజమెంతోగానీ... దీనివల్ల చాలామంది దశ, దిశలు మారిపోయాయి. కొందరు కోట్లకు పడగలెత్తారు. మరికొందరు తిరిగి లేవలేనంతగా పడిపోయారు. దీనివల్ల లబ్ధిపొందిన వారిలో మన రాష్ట్ర నేతలే కాదు... ఒకరిద్దరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉన్నారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

ప్రతిపక్షానికి చెందిన నాయకులూ 'రింగ్' అయ్యారు. పార్టీలకు అతీతంగా పెద్దలంతా, ఔటర్ పాపాన్ని తలా తట్టెడు పంచుకున్నారు. రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న పెద్దల భూములకు నష్టం వాటిల్లకుండా... నోరులేని బక్క రైతుల భూముల మీదే రింగు రోడ్డు వేశారు. దీనికోసం కొన్నిచోట్ల మూడుసార్లు మ్యాప్‌లో మార్పు చేర్పులు చేశారు. ఔటర్ గోల్‌మాల్‌కు పాల్పడిన వారిలో 20 మంది ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు. వీరి విజయానికి ఔటర్‌లో కొట్టేసిన డబ్బులే పెట్టుబడి అయ్యాయి.

భూసేకరణ అస్త్రం
ఔటర్ రింగ్‌రోడ్డు దోపిడీలో కనిపించినంత వైవిధ్యం మరెక్కడా కనిపించదేమో! ఈ దోపిడీలో తొలి అంకం... భూసేకరణ. ఈ చట్టాన్నే బూచిగా చూపి 'ఇస్తావా? చస్తావా?' అంటూ పేదరైతుల మెడపై కత్తి పెట్టారు. వారి భూములు లాక్కున్నారు. అదే సమయంలో... కొందరు పెద్దలు ముందుగానే రంగంలోకి దిగి రైతులపై వల వేశారు. "మీ భూమి ఔటర్‌లో పోతుంది.

ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఎక్కువ ఇస్తాం. మాకే విక్రయించండి'' అంటూ ముందే భూములు కొన్నారు. ఆ తర్వాత తమ పలుకుబడి ఉపయోగించి ఔటర్ మార్గాన్ని మార్పించి, తాము కొన్న భూముల ధరలు అమాంతంగా పెంచుకున్నారు. ఔటర్ ఆలోచన, అది వెళ్లే మార్గం ముందే తెలిసిన ముఖ్య నేతలు, వారి బంధువులు, అనుచరులు ముందే రంగంలోకి దిగి... సమీప ప్రాంతాల్లో భారీగా భూములను కొనేశారు.

ఎకరా రూ.లక్షల్లో కొనుగోలు చేసిన భూములను రూ.10 నుంచి 15 కోట్ల చొప్పున విక్రయించుకున్నారు. అలాగే... 'మా భూములు పోకుండా చూడండి' అని ఆశ్రయించిన వాళ్లకు పాలకులు అభయ హస్తం ఇచ్చారు. వారి దగ్గర ముడుపులు పుచ్చుకుని... అలైన్‌మెంట్ మార్చేశారు. జంక్షన్లు, ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌ల పేరుతో అలైన్‌మెంట్లు మార్చారు. ఈ మొత్తం ప్రక్రియలో బలైపోయింది అమాయకులైన రైతులే.

వేసిందే రోడ్డు..
ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్రియలో అప్పటి అధికారులు గీసిందే మ్యాపు... వేసిందే రోడ్డుగా మారింది. ప్రమాణాల ప్రకారం 250 గజాల వెడల్పు ఉండాల్సిన రహదారి... ఒక్కోచోట సగానికి పడిపోయింది. అటూ ఇటూ ఉన్న వారి ఆస్తులను టచ్ చేయకుండా... రోడ్డే కుచించుకుపోయింది. గండిపేట చెరువు వద్ద పర్యావరణ కారణాలు చూపుతూ అలైన్‌మెంట్ మార్చేశారు.

అదేసమయంలో... కండ్లకోయి వద్ద చెరువులోంచే రోడ్డును వేశారు. ఏం జరిగినా, ఎందుకు మార్చినా కారణం ఒక్కటే! అస్మదీయుల భూములను కాపాడటం! గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల పెద్దల భూములను సేకరించినా... వారికి పుష్కలంగా పరిహారం అందించారు. ప్రత్యేక ప్యాకేజీలు తయారు చేశారు. పేదలపై మాత్రం వివక్ష ప్రదర్శించారు.

నష్ట పరిహారం ప్యాకేజీ నిర్ణయించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, గనుల శాఖమంత్రి సబితారెడ్డితో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏ ఒక్కరితోనూ చర్చించకుండానే ప్యాకేజీ రూపొందించడం విశేషం.

అందరూ... ష్ గప్‌చుప్!
ముంజేతి కంకణం చూడటానికి అద్దం అవసరంలేదు. అలాగే... ఔటర్ రింగ్ రోడ్డులో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని చెప్పేందుకు ఎలాంటి విచారణలూ అక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ చిక్కిపోయిన రోడ్డు, ముమ్మార్లు మారిన ప్లాన్, ఆ సమయంలో జరిగిన క్రయవిక్రయాలను పరిశీలిస్తే... నాటి పాలకులు నిస్సిగ్గుగా, నిర్భయంగా అక్రమాలకు పాల్పడినట్లు ఇట్టే తెలిసిపోతుంది.

అయినప్పటికీ... దీనిపై విపక్షాలు పెద్దగా ఆందోళనలు చేయలేదు. సర్కారును నిలదీయలేదు. కారణం... నాటి పెద్దలు నయానో భయానో వారందరి నోళ్లను మూయించారు. 'మీ భూములకు భంగం వాటిల్లకుండా చూస్తాం' అని ప్రలోభపెట్టో... 'మీ భూములనూ మింగేస్తాం జాగ్రత్త!' అని భయపెట్టో వాళ్లను దారికి తెచ్చారు.

రకరకాలుగా వారికి ఎర వేశారు. అప్పట్లో సీపీఐ, బీజేపీ మాత్రమే అంతో ఇంతో ఔటర్ అక్రమాలపై గళమెత్తాయి. మిగిలిన పార్టీలన్నీ గప్‌చుప్! 'ఔటర్ అక్రమాలపై ఆందోళన చేద్దాం రండి' అని చంద్రబాబు పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరూ ముందుకురాని పరిస్థితి!

ఒక ప్రాజెక్టు చేపట్టినప్పడు కొందరు భూములు కోల్పోవడం సహజమే! కానీ... ఒకరి భూములు కాపాడేందుకు మరొకరిని బలి చేయడమే ఔటర్‌లో జరిగిన పాపం. ఈ రహదారి కోసం జరిపిన భూసేకరణలో సుమారు పది వేల కుటుంబాలు నష్టపోయాయి. ఇందులో నాలుగు వేల మంది రైతులుకాగా... మరో ఆరువేల మంది ప్లాట్లు, ఇళ్లు కోల్పోయారు.

వ్యవస్థలపై దాడి
ఔటర్ రింగు రోడ్డులో అక్రమాలపై 'ఆంధ్రజ్యోతి' అనేక కథనాలు ప్రచురించింది. అయినా... పాలకుల్లో చలనం లేదు. ప్రశ్నించిన వ్యవస్థలపై ఎదురుదాడికి దిగారు. పత్రికల యాజమాన్యాలపై దాడులకు పురిగొల్పారు. ప్రతిపక్షాలను చీల్చారు. పత్రికల్లో కథనాలకు 'కౌంటర్'గా జనం సొమ్ముతో అనుకూలమైన ప్రకటనలు ఇచ్చారు.

అప్పట్లో విపక్షాలు డిమాండ్ చేయడమే ఆలస్యమన్నట్లుగా అనేక అంశాలపై వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ధీరోదాత్తుడిగా మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత సీబీఐ విచారణను తనదైన శైలిలో మడత పెట్టేసేవారు. రింగ్ రోడ్డు విషయంలోనూ అదే జరిగింది. సీబీఐ విచారణను ఆయన నీరుగార్చారు. వాస్తవాలు బయటకు రాకుండా అధికారులను కట్టడి చేశారు.

సర్కారు సహాయ నిరాకరణ చేస్తోందంటూ సీబీఐ అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు మొరబెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు... అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు ఇప్పుడు ప్రమోషన్లు పొంది ఎంచక్కా మంచి పోస్టుల్లో వెలిగిపోతున్నారు. పేద రైతులు మాత్రం పెద్దలు చేసిన పాపాలకు బలైపోయి కుమిలిపోతున్నారు. వీరికి సమాధానం చెప్పేదెవరు? వీరి ఆవేదనలు తీరేదెన్నడు?

హైకోర్టు తీర్పే నిదర్శనం
ఔటర్ రింగురోడ్డులో భాగంగా కండ్లకోయిలో జరిగిన భూసేకరణపై ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. మొత్తం భూసేకరణ తీరుపైనే అనుమానాలను వ్యక్తం చేసింది. కండ్లకోయిలో పెద్దల కోసం మూడుసార్లు అలైన్‌మెంట్ మార్చారు.

ఇతరుల భూములు, పక్కనే చెరువు మీదుగా రోడ్డు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాధితులు హైకోర్టుకెక్కారు. 55 ఎకరాల్లో అక్రమంగా భూసేకరణ జరిగినట్లు కోర్టు తేల్చి చెప్పింది. ఒక్కచోట జరిగిన భూసేకరణలోనే ఇంత గోల్‌మాల్! మరి... 162 కిలోమీటర్ల పొడవునా ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉండాలి?

* ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు వ్యయం రూ.5500 కోట్లు. కానీ.. ఈ భూసేకరణను అడ్డుపెట్టుకుని రాజుగారి మందీ మార్బలం రూ. 35 వేలకోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టుకుంది.
* ఇందులో సాధారణ ప్రజలు రూ.10వేల కోట్లు నష్టపోగా పెద్దలు అంతకు ఎన్నో రెట్లు అధికంగా లబ్ధిపొందారు.
* నష్ట పరిహారం పంపిణీలో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో తప్పుడు రికార్డులు సృష్టించి 16 ఎకరాల ప్రభుత్వ భూమికి నష్ట పరిహారం పొందారు.
* హయత్‌నగర్ మండలం బాచారంలో సుమారు 25 లక్షల రూపాయలను అక్రమంగా చెల్లించారు.

అంతా ఇష్టానుసారం...
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రింగురోడ్డును ఇష్టానుసారంగా నిర్మిస్తోంది. పెద్దల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా... ఒక్కో చోట ఒక్కో విధంగా వెడల్పు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. నార్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు 125 మీటర్లు, శంషాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు 150 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు.
click here

No comments: