Tuesday, December 14, 2010

ఔరౌర... నాగవల్లి నగలు

లక లక లక.. అంటూ భయపెట్టిన చంద్రముఖి ఇప్పుడు ఔర.. ఔర.. అంటూ నాగవల్లిగా వస్తోంది. ఆమె ఆంగికం, అభినయమే కాదు.. ఆమె ఆభరణాలు కూడా ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికల నగలు ఒక ఎత్తయితే హీరో వెంకటేష్ నగలు మరో ఎత్తు. సినిమా విడుదలవ్వకముందే క్రేజ్ సంపాదించుకున్న ఈ నగలను రూపొందించింది ఎవరో తెలుసా? క్రిసాలా జ్యువలరీ అధినేత్రి బంటి బజాజ్. ఆమె గురించి.. ఆమె రూపొందించిన నగల గురించే ఈ కథనం.
బాలీవుడ్‌లో జోధాఅక్బర్, దేవదాసు చిత్రాల్లో నటీనటులు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఆ సినిమాలకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా మొదలయ్యింది. సినిమా పేర్లు పడుతున్నప్పుడు కనిపించే కాస్ట్యూమ్స్ టైటిల్‌తోపాటు ఈ మధ్య స్టయిలింగ్ అని మరో కొత్త టైటిల్‌ను కూడా వేస్తున్నారు తెలుగువాళ్లు. చాలామంది తారలకిప్పుడు పర్సనల్ స్టయిలిస్ట్‌లున్నారు. అయితే కొందరు ఇంకో ముందడుగు వేసి ప్రత్యేక జ్యువలరీ డిజైనర్లను నియమించుకుంటున్నారు.

అరుంధతి సినిమాలో అనుష్క, సింహ సినిమాలో నయనతారలు ధరించిన నగలు అలా రూపొందించినవే. అయితే తెలుగు సినిమాల్లో హీరోతో సహా దాదాపు అన్ని ముఖ్య పాత్రలకోసం ప్రత్యేక జ్యువలరీని తయారుచేసిన క్రెడిట్ మాత్రం నాగవల్లి సినిమాకే దక్కుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా గిల్టీనగలనే వాడతారు. కానీ నాగవల్లి సినిమాలో తారలందరూ మేలిమి బంగారు ఆభరణాలనే ధరించారు. పైగా అవి ఆయా పాత్రల స్వభావాలకు అద్దం పట్టేలా ప్రత్యేకంగా రూపొందించారు బంటి బజాజ్.

ఏవరీ బజాజ్?

బంటి బజాజ్ పక్కా హైదరాబాదీ. కాకపోతే ఎక్కువకాలం ముంబయిలోనే ఉన్నారు. ఆమె 1993లో హైదరాబాద్‌కి వచ్చి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుండేవారు. ఎన్నో ఫ్యాషన్ షోలను నిర్వహించారు. ఆమెకి చిన్నప్పటి నుంచీ జ్యువలరీ డిజైన్ చేయడంలో ఆసక్తి ఉండేది. ముంబయికి వెళ్లాక చిన్న చిన్న నగలను డిజైన్ చేయడం మొదలెట్టారు. చాలామంది బాలీవుడ్ తారలతో పరిచయాలు ఉండడంతో మొదట్లో ఆమె రూపొందించిన నగలను వారికి కానుకగా ఇస్తుండేవారు. అయితే ఆమె దీన్ని వృత్తిగా కాకుండా కేవలం హాబీగానే భావించేవారు.

అయితే ఆమె నగలను ఇష్టపడేవారు తమకోసం నగలు డిజైన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అడిగేవాళ్లు. అలా అడిగిన వారిలో అనిల్ కపూర్ భార్య సునీల్ కపూర్, రాణీముఖర్జీ, టబు, సోనాక్షి, విద్యాబాలన్ ఉన్నారు. బంటి బజాజ్ వారికోసం ఎన్నో నగలను ప్రత్యేకంగా రూపొందించారు. హైదరాబాద్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చే స్తూనే, ముంబయి ముద్దుగుమ్మలకు ఆభరణాలు రూపొందిస్తున్నప్పుడు త్రిభువన్‌దాస్ శ్రీకాంత్ జవేరీ ప్రోత్సాహంతో 2001లో పుల్‌టైమ్ డిజైనర్‌గా మారిపోయారు.
డిజైనర్‌గా..
బంటి బజాజ్‌కు ఎన్నో ఫ్యాషన్ షోలతో అనుబంధం, ఆమె ఆభరణాల పట్ల బాలీవుడ్ తారలకు సైతం ఆసక్తి ఉండడంతో ఆమె డిజైనర్‌గా గుర్తుంపు తెచ్చుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. లాక్మే ఫ్యాషన్ షోలో ఆనంద్ కాబ్రా, నీతూ లుల్లా లాంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దుస్తులకు జ్యువెలరీని రూపొందించారు. సొంత సిగ్నేచర్ జ్యువలరీని రూపొందించాలన్న ఆలోచనతో 2006లో క్రిసాలా జ్యువలరీ పేరుతో హైదరాబాద్‌లో షోరూమ్ ప్రారంభించారు. ఆ తర్వాత ముంబయి, పూణెల్లో కూడా బ్రాంచీలను మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే బంటి బజాజ్‌కు డి. రామానాయుడు కుటుంబంతో చాలాకాలంగా అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే నిర్మాత సురేష్ బాబు నాగవల్లి సినిమా కోసం ప్రత్యేకంగా జ్యువలరీని రూపొందించాల్సిందిగా కోరారు.

ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో నేను చేసిన రాజు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులను ఒక్క క్షణంలో ఆ కాలానికి తీసుకువెళ్లడానికి ఒక కొత్తదనం కావాలి. అందుకు ఆహార్యం విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే అన్ని పాత్రలకీ ప్రత్యేకంగా కాస్టూమ్స్‌ని, జ్యువలరీని డిజైనింగ్ చేయించారు నిర్మాతలు. అందుకు రమా రాజామౌళి స్టయిలింగ్, బంటి బజాజ్ రూపొందించిన ఆభరణాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమా విడుదలవ్వకముందే ఆ ఆభరణాల పట్ల ఏర్పడ్డ క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
- వెంకటేష్, కథానాయకుడు

నాగవల్లికి అనుగుణంగా..
'అవకాశం వచ్చినంత మాత్రాన అయిపోలేదు.. అసలు కథ అక్కడే మొదలయింది నాకు. ఈ నగల గురించి చెప్పాలంటే ఆ సినిమా కథ సగం చెప్పాల్సి వస్తుంది. అందుకే క్లుప్తంగా చెపా'్తనని మొదలెట్టారు బంటి బజాజ్. 'చంద్రముఖి చూసిన వారికి నాగవల్లి సినిమా పట్ల కొంత అవగాహన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఉండాలన్నది మా ఉద్దేశ్యం. కథ, పాత్రల గురించి విన్న తర్వాత నా పరిశోధన మొదలుపెట్టాను. సినిమా రెండు భాగాలుగా ఉంటుంది.. ప్రస్తుతం.. గతం.. రెండు ఎపిసోడ్‌లలో కనిపించే జ్యువలరీ విభిన్నంగా ఉండాలి.

మోడ్రన్ జ్యువలరీ రూపొందించడం పెద్ద కష్టమేం కాదు.. ఫ్లాష్‌బ్యాక్ కోసం అప్పటి రాజులు, రాణులు, సామాన్యులు వాడిన దుస్తులు, ఆభరణాల గురించి పుస్తకాలు తిరగేశాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజుల గురించి, నిజాం నవాబుల గురించి, తంజావూరు గురించి చదివి కొంత నోట్స్ రాసుకున్నాం. తర్వాత సినిమాలో పాత్రలు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నాం. మేళవిస్తూ 200కు పైగా ఆభరణాలని రూపొందించాం. ఇందుకు ఆరునెలల సమయం పట్టింది' అని చెప్పారు బంటి బజాజ్.

నేను నటించిన అరుంధతి సినిమాలో కూడా నా పాత్రకోసం ప్రత్యేకంగా నగలను రూపొందించారు. ఆ ఆభరణాలను నా పాత్రకి ప్లస్ అయ్యాయి. ఆ పాత్రకి నాకు మంచి పేరొచ్చింది. కాకపోతే అవన్నీ గిల్ట్ నగలు. ఒరిజినల్ జ్యువలరీతో నటించడం మాత్రం ఇదే తొలిసారి. ఆనాటి కాలాన్ని డిజైనర్లు తమ ఆభరణాలతో ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. అరుంధతి పాత్రలాగే ఈ సినిమాలో నా పాత్ర మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.
- అనుష్క శెట్టి, కథానాయిక

ఎవరికి ఏ ఆభరణాలు..
నాగవల్లి సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వెంకటేష్, అనుష్కలతో పాటు కమలినీ ముఖర్జి, రిచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్‌లకు బంటి బజాజ్ ఆభరణాలు రూపొందించారు. ఈ అన్ని పాత్రలకూ రమా రాజమౌళి స్టయిలింగ్ చేశారు. ఒక సీన్ కోసం ఆమె ఎంచుకున్న దుస్తులను ఫోటో తీసి, క థలో ఆ సీన్‌ను బట్టి ముందుగా బొమ్మలు గీసుకున్నారు బంటి బజాజ్. సినిమాలో తమిళనాడులోని తంజావూరు నేపథ్యం కొంత ఉంటుంది. అందుకే కథనాయికల ఆభరణాల కోసం అక్కడ గుళ్లలో కనిపించే బొమ్మలు, పుస్తకాల్లో చదివిన ఆ కాలం నాటి డిజైన్లను ఎంచుకున్నారు.

ఒడ్డాణం, వంకీలు, జడ, కాసులదండ, ఉంగరాలను బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలు ఉపయోగించి రూపొందించారు. వెంకటేష్‌ది విజయనగరానికి చెందిన రాజు పాత్ర. ఈ పాత్ర కోసం ఎక్కువగా నిజాం నగలను, దక్షిణ భారతాన్ని పాలించిన రాజులు వాడిన ఆభరణాలను రూపొందించారు. సర్పెంచ్(రాజులు తలపాగాకు పెట్టుకునేవి), కమర్‌బంద్(షేర్వాణీ మీద మెడలో వేసుకునే ఆభరణం), బాజూబంద్(భుజాలకు కట్టుకునే కంకణాలు), మెడ నుంచి భుజాల వరకు వేలాడే పచ్చల హారాలు రాజు పాత్ర కోసం రూపొందించారు.
- బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫోటోలు: రాజ్‌కుమార్

No comments: