సెప్టెంబర్ 17 దగ్గరపడింది. 63 ఏళ్ళ క్రితం నిజాంపాలన అంతమై నైజాం
సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు అది. చాలాకాలం దాన్ని 'విమోచన దినం'గా
జరుపుకున్నా ఇటీవల కాలంలో దాన్ని 'విద్రోహ దినం'గా పరిగణిస్తున్నవాళ్లూ
ఉన్నారు. ఆనాటి పరిస్థితులను తెలియజేసే కొంతమంది కథనాలతో పరవస్తు లోకేశ్వర్
ఇటీవల తీసుకొచ్చిన 'నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవవీరులు, 1948
సెప్టెంబర్ పోలీసు యాక్షన్ జ్ఞాపకాలు - గాయాలు' పుస్తకం నుంచి వెంకటమ్మ అనే
సీనియర్ హిందీ పండిట్ కథనాన్ని మీకు అందిస్తున్నాం..."నా పేరు వెంకటమ్మ. సీనియర్ హిందీ పండిట్ టీచర్‌ను. ఇప్పుడు నా వయస్సు 55 సంవత్సరాలు. తేదీ జ్ఞాపకం లేదు. కాని 1944లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‌లనే. నాకప్పుడు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు. యాఖుత్పురా దగ్గర్ల ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ సంబరంగ తియ్యటి జిలేబీలు తిన్న. మా అమ్మమ్మ నన్ను వెంబడి పెట్టుకుని అవతలి బస్తీలకు తీసుకపోయి మూడు రంగుల జండాలను చూపెట్టింది. అంతా హడావుడి పండుగ వాతావరణం. లౌడ్ స్పీకర్లల్ల దేశభక్తి గీతాలు వస్తున్నయి. స్వాతంత్య్రం వచ్చింది అన్న మాటలు నా చెవులల్ల బడ్డయి. అయితే అది రెండవ స్వాతంత్య్రదినం, పోలీస్ యాక్షన్ జర్గిన తర్వాత 15-08-49 అని నాకు చాలా కాలానికి తెల్సింది.
నిజానికి హైద్రాబాద్ స్టేట్ ప్రజలకు అది మొదటి స్వాతంత్య్ర దినం క్రిందనే లెక్క.
సరే ఇప్పుడు నేను నిజాం పరిపాలన చివరి సంవత్సరాలలో జరిగిన రజాకార్ల దినాలు, 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీస్ యాక్షన్ సంగతులు, అవి మా కుటుంబంపై, ముఖ్యంగా నా బాల్యంపై వాటి ప్రభావం గురించి వివరిస్త. ఒక పెద్ద తుఫాను వచ్చినపుడు ఆ గాలివానకు ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మా ఎట్లా చలించి చెదిరి పోతయో అట్లనే మామూలు వ్యక్తుల జీవితాలు కూడా రజాకార్ మరియు పోలీస్ యాక్షన్ దినాల తాకిడికి చెల్లాచెదరై కష్టాలకు కన్నీళ్లకు గురయినాయి. అట్ల ఎంత మంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు తల క్రిందులయినాయో? వాళ్లు హిందువులైతేనేం? ముస్లింలైతేనేం?
మా బాపుకు బీదర్ దగ్గరల టీచర్ ఉద్యోగం. నా బాల్యం అక్కడే గడచింది. కాని రాజాకార్ల గడ్‌బడ్‌లు ప్రారంభమయ్యేసరికి మా బాపు అమ్మను పిల్లలందర్ని హైద్రాబాద్ల అమ్మమ్మ ఇంట్ల వదిలిపెట్టిండు. నెలకో, రెండు నెలలకో ఒకసారి వచ్చిపోయేది. అవతల రజాకార్ల భయం, ఇంట్ల మా మధ్య ఎడబాటు. మా అందరి జీవితాలు అల్లకల్లోలం అయినాయి. అమ్మ - బాపులకే కాదు, మా చిన్నపిల్లల జీవితాలలో కూడా సుఖశాంతులు దెబ్బతిన్నాయి. అమ్మతోపాటు, మా అక్క, నేను, ఒక తమ్ముడు. పెరట్లో రెండు గదుల రేకుల షెడ్లో ఉండేవాళ్లం.
బాపు కోసం ఏడుస్తూ....
ప్రతిరోజు నేను మా బాపును తలచుకొని ఆయన కోసం బెంగతో ఏడ్చేదాన్ని. మా ఎడబాటుకు, దుఃఖానికి మూలకారణాలు నాకు తెలియవు కదా! రాత్రిళ్లు బాపు కావాలని నేను ఏడుస్త్తుంటే అక్క అమ్మలాగ వోదార్చేది. అప్పుడు అమ్మ ఉస్మానియా దవఖానలో ప్రసవం కోసం ఉంది. నిండు గర్భిణి. నా మోకాళ్లకన్నీ గజ్జిపుండ్లు అయినవి. క్రిందపడినపుడు అవి పగిలి రక్తం, చీము కార్తుంటే ఓదార్చేవారు లేక బాపూ బాపూ అని ఏడ్చిన. అక్క ఇంటికీ దవఖానకు కాలినడకన పొద్దు మాపు చెక్కర్లు కొట్టేది. రిక్షాలెక్కటం పెద్ద విలాసం, పైస గల్లోల్ల పని. ఇక ఇంట్ల మా తమ్మునికి పెద్ద జ్వరం. డాక్టర్లు, మందులు ఏమిలేవు. అవుతల బజార్లల్ల బస్తీలల్ల హిందు - ముస్లింల కొట్లాటలు, రజాకార్ల దౌర్జన్యాలు. నేను తమ్ముని మంచం పక్కనే వాణ్ణి చూస్తూ కూర్చునేదాన్ని. నాల్గురోజుల జ్వరం తర్వాత వాడికి పోలియో ఎఫెక్ట్ అయ్యి ఒక కాలు చచ్చు పడిపోయింది. అమ్మ పొత్తిళ్లల్లో ఆడపిల్లను పెట్టుకుని ఇంట్లకు రాంగనే కొడుకు కాలు కుంటి కాలయ్యిందని తెల్సి గుండెపగిలి పెద్దగ ఏడ్చింది. ఆ కాలం అట్ల ఆటుపోట్లకు, అలల తాకిడికి గురికాకపోతే, మా వ్యక్తిగత జీవితాలల్ల అటువంటి విషాదాలు జరుగక పోయేటివి కాదా?
పోలీస్ యాక్షన్ దినాలు సెప్టెంబర్ నెల కదా! అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు, చలి. ఆ వర్షం ముసురు చప్పుడుకు మా రేకుల షెడ్డు పెద్దగా శబ్దంచేసేది, ఇల్లంతా కారేది. రాత్రిల్లు నిద్ర కరువు. తమ్ముడు కాలు వేలాడేసుకుని మంచంలోనే ఉండేవాడు, అట్ల మా ఇంట్ల పేదరికంతో పాటు అవిటితనం కూడా తోడయ్యింది. కాలుకు నాటు వైద్యం చేయించింది అమ్మ. రోజుల తరబడి వాడికి చప్పిడి మెతుకులు, కారం పత్యం. వేడి పప్పన్నం కోసం రోజూ ఏడిచేవాడు. అదే నెలల వినాయక చవితి పండగ వచ్చింది. అమ్మమ్మ ఇంట్ల పాశం (పాయసం) సువాసనలు. దానికోసం వాడు సుదీర్ఘంగా ఏడుపు. అమ్మ బాలింత. చెల్లె పాలకోసం ఏడుపు. నేను బాపు కావాలని ఏడుపు. తమ్ముడు అవిటి వానిగనే కుంటుకుంటు రెండు మూడేండ్లు బ్రతికి, చివరికి ట్రాన్సిల్స్ రోగంతో చచ్చిపోయిండు. అప్పుడు వానికి ఆరేండ్లు. నిండ ఏడేండ్లు దాటకుండనే నూరేండ్లు నిండినయ్. ఈ విషాదాల కన్నీటికి మూల కారణాలు ఆనాటి సామాజిక పరిస్థితులే అని నేను బలంగా నమ్ముతున్నాను.
దినదిన గండంగా...
మా మామ కూడా స్కూల్ టీచర్ కనుక అన్ని సంగతులు ఆయనకు తెలుస్తుండేవి. రాత్రిపూట సిగరెట్ తాక్కుంట నిద్రపోకుండ, బెంచిమీదనే కూచోని, ఏదో దీర్ఘాలోచన చేస్తుండేవాడట. అమ్మ రాత్రిపూట నిద్రలేచి "ఏందన్నా అట్ల కూచున్నవ్, నిద్ర పోలేదా? అని అడిగితే "ఏం లేదమ్మా నిద్రపట్టలేదు'' అని దిగులుగ జవాబు ఇచ్చేటోడట. ఆ రోజులల్ల మా ఇండ్ల ముందుకు పొద్దుటిపూట మాదన్నపేట, సయిదాబాద్‌ల నుండి ఎరుకల ఆడవాళ్లు వచ్చి మాంసం అమ్మేటోళ్లు. గంపలల్ల వాట్ని పట్టుకొచ్చేది. వాళ్లు రవికెలు వేసుకోకపోయేది. వాల్ల నల్లటి శరీరాలు ఆ పొద్దుటపూట లేత ఎండలో మెరిసిపోవటం నేను బాగా గమనించేది.
మా మామ వాళ్లతో " రేపట్నించి మీరు రాకండి. పరిస్థితులు బాగలేవు, ఇట్ల తిరగకుండ్రి'' అని హెచ్చరించడం నాకు బాగా జ్ఞాపకముంది. యూనియన్ సైన్యాలు హైద్రాబాద్‌పై దాడి చోయబోతున్నాయని పుకార్లు మొదలయినాయి. నిజాం సర్కార్ ప్రతిరోజు రాత్రిపూట నగరంల బ్లాక్ అవుట్ చేసేది. నగరం అంతా చీకటి. కరెంట్ బంద్. బ్లాక్ అవుట్‌కు ముందు ఆకాశంలో ఎర్రలైట్ కాంతి వెలిగి పెద్దగా సైరన్ మోగేది, ఆ సిగ్నల్స్‌తో ఇండ్లల కూడా దీపాలు ఆర్పటం, కరెంట్ తీసేయటం చేయాలి. మా ఇంట్లో అందరు కూడా ఇంటి డాబా మీదికెక్కి విమానాలు వస్తున్నయా అని వాటి లైట్ల కాంతుల కోసం వెదికేవాళ్లం. విమానాలు వచ్చి మమ్మల్ని రక్షిస్తాయని ఎదురు చూసెటోళ్లం.
సరే పరిస్థితులన్నీ అట్ల ఉద్రిక్తంగ ఆందోళనగ ఉన్నప్పుడే బక్రీదు పండుగ సమీపించింది. ఆ పండుగకు కొన్ని రోజుల ముందు రజాకార్ల సమావేశంల దాని నాయకుడు కాసిం రజ్వీ ప్రసంగిస్తూ "ఈసారి బక్రీద్‌కు ఖుర్బానీగ గొర్రెల్ని కాదు, హిందువుల తలల్ని ఇవ్వాలని'' రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చిండు. కాని హిందువుల అదృష్టం కొద్దీ ఆ బక్రీద్ పండుగకన్న ముందే పోలీస్ యాక్షన్ జరిగి, హిందువులు రక్షింపబడ్డరు.
అయితే అతని ప్రకటన వినగానే హిందువుల గుండెలల్ల రైళ్లు పరిగెత్తినవి. ముఖ్యంగ హైద్రాబాద్ పట్నంల ఇక ఎట్లనన్న చావుతప్పదని, హిందువులు తాగటం, తినటం, విందులు చేసుకోవడం మొదలు పెట్టిండ్రు. మా మామ కూడా అన్ని కోపాలు తాపాలు మరచిపోయి ఇంట్ల పెద్ద దావతు ఏర్పాటు చేసిండు. పూరీలు, గారెలు, కోడిమాంసం, కల్లు, సారా అన్ని ఏర్పాట్లు చేసిండు. అందరికి దగ్గరుండి తృప్తిగ తినిపించిండు. అయితే ఆడోళ్లకు, పిల్లలకు ఈ అనుకోని సంబరాలేమిటో అర్థం కాలే. ఇప్పుడు పండుగలు ఏమీ లేవుకదా అని అడిగితే "మీకెందుకు తినరాదుండ్రి'' అని మెత్తగ కోపడ్డడు. కాని అసలు సంగతి చెప్పలే. మేము బెదురతమని, భయపడతమని. పోలీసు యాక్షన్ అయినంక తెల్లారి అసలు సంగతి చెప్పి"మనం బ్రతికి పోయినం. ఈ మిలిట్రీ రాకపోతే బక్రీద్ పండుగకు గొర్రెల్ని కోసినట్లు మనందర్నీ కోసేది'' అని సంతోషం ఆపుకోలేక అందర్ని కావలించుకుని ఏడ్చిండు.
జైహింద్..పలకరింపులు
సైన్యం వచ్చినంక ఇక ఆ సంబరాలు ఏమని వర్ణించను. పట్నంలనే కాదు, పల్లెపల్లెనా హిందువులు సైన్యానికి స్వాగతాలు పలికిండ్రు. హారతులు ఇచ్చిండ్రు. ఎక్కడ చూసిన గాంధీకీ జై, నెహ్రూకీ జై, భారత్ మాతాకీ జై నినాదాలు. ప్రతి గల్లీ మలుపులు, చౌరస్తాలల్ల, ఇండ్లమీద మూడు రంగుల జండాలు రెపరెపలాడినయ్. ఏ ఇద్దరు కల్సుకున్నా జై హింద్ అని పలకరింపులు.
పోలీస్ యాక్షన్ అయినంక తెల్లారి సాయంత్రం మేం ఆడపిల్లలం చాలా స్వేచ్చగా, సంతోషంగా గొబ్బెమ్మల పూజ చేసుకున్నం. ఆ సంతోష సందర్భంల నాకు మా ఇంటి ముందు రోడ్డు మీద ఆశ్చర్యం కల్గించే దృశ్యం కానవచ్చింది. ముందు మిలట్రీవాళ్లు మార్చ్‌పాస్ట్ చేస్తుంటే, వెనక మిలిటరీ ట్రక్కులు నెమ్మదిగ నడుస్తున్నయ్. ప్రతి ట్రక్కుకు పూల దండలు, గాంధీ నెహ్రు బొమ్మలు. ఆ మిలిట్రీ డ్రెస్సులు, టక్క టక్క బూట్ల చప్పుడు, వారి నెత్తుల మీద చిప్పటోపీలు చూడటం నాకు జీవితంల మొదటిసారి. ఆ దృశ్యాలు నా మనస్సుల నాటుకపోయినయి. "లిబరేషన్ ఆర్మీ'' అన్న పదం నాకు అప్పుడు తెలువదు కదా!
ఇక ఆ తెల్లవారి ఉదయం పది పదకొండు గంటలకు నేను ఇంటి ముంగిట అరుగు మీద ఆడుకుంటున్న. ఎందుకో తల ఎత్తి చూసేసరికి గల్లీ ప్రారంభంల, మసీదు పక్కనుండి వస్తున్న బాపు కనబడ్డడు. బాగా మాసి దుమ్ము పట్టిన దోవతి, కోటు మీద కండువా, చేతిల బట్టల సంచీ, చెదిరిన జుట్టూ... ఇదీ ఆయన రూపం. ఉత్త చేతులతోటి మా ముందుకు రావొద్దని ఆ సంచీల ఒక సేరు పుట్నాల పప్పు తీసుకొని వొచ్చిండు. నేను సంతోషం పట్టలేక బాపూ బాపూ అని అరుచుకుంట ఎదురుంగ ఉరికి ఆయన కాళ్లని గట్టిగా కావలించుకున్న. బాపు నవ్వుకుంట నన్ను ఎత్తుకొని ఇంట్ల కాలు బెట్టిండో లేదో పెంకలు ఎగిరిపోయేటట్లు "అమ్మా బాపు వొచ్చిండు'' అని గట్టిగ ఒర్లిన. అందరు పరిగెత్తుకొచ్చిండ్రు. బాపును కావలించుకుని అందరు ఏడ్చిండ్రు. బాపు కూడా ఏడ్చిండు.
స్కూల్లో చేరాను...
ఆ తర్వాత పోలీస్ యాక్షన్ కంప్లీట్ అయ్యి గడ్‌బడ్‌లన్నీ సద్దుమణిగినంక బాపు మమ్మలందర్నీ తీసుకుని తను పనిచేసే ఊరు కవేలీకి తీసుకపోయిండు. నాంపల్లి స్టేషన్ల రైలెక్కినం. మా స్వంత ఇంటికి మేం పోతున్నం అన్న సంతోషం మా అందరి ముఖాలల్ల వెలిగిపోయింది. నాకు ఆ ఊరు బాగా తెల్సిన ఊరే కదా! రైలుల కిటికీ పక్కన కూర్చుని బాపుతో విడవకుండ ముచ్చట్లు చెప్పిన. నీతోటి నేను కూడా రేపట్నించి బడికొస్త అని చెప్పిన. ఆ బడిల నా దోస్తులు నరేందర్‌రెడ్డి, శివారెడ్డిలు బాగున్నారా? వాళ్లు కలుస్తరా? అని అడిగిన. బుచ్చిరెడ్డి తాత ఎట్టున్నడు, మన చప్రాసి మామూ ఎట్లున్నడు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మా బాపు కసురుకోకుండ, విసుక్కోకుండా ఓపికగ అరటిపండు వొలిచి నోట్లె పెట్టినట్టు జవాబులు చెప్పెటోడు. ఆయన నన్ను ముందే సైకలాజికల్‌గ ప్రిపేర్ చేయించాలనుకున్నట్టుంది. చాలా నెమ్మదిగ నాకు సమ్జాయించిండు. చప్రాసీ మామూ లేడమ్మా, ఆయన వేరే స్కూలుకు తబాదలా అయ్యిండు. అది చాలా దూరం మనకు ఇక కనబడడు. మన బడి కూడా మునుపటిలాగ ఉండదు. దాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా కొత్త స్థలంల కొత్త బడి పెట్టుకుందాం అన్నడు.
ఆ తెల్లారి సాపాటు చేసి బాపు చిటికెన వేలు పట్టుకుని బడికి పొయ్యేసరికి నా గుండె గబిల్లుమంది. ఇంకెక్కడి స్కూలు అంతా కాలిపోయింది. కూలిపోయింది. మసిబారిన మొండిగోడలు నిలబడి ఉన్నయ్. నా నోట్లె మాట కరువయ్యింది. దుఃఖం పొంగుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న బాపు నన్ను దగ్గరికి తీసుకుని ఈపు నిమిరిండు. ఒక సంవత్సరం అక్కడున్నమో లేదో బాపుకు హైద్రాబాద్‌కు తబాదలా అయ్యింది. అలియాబాద్ స్కూల్‌కు మారిండు. నేను శంశీర్‌గంజ్‌లోని శారదా గర్ల్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న''
వెంకటమ్మ
ఇంటర్య్వూ తేదీ: 15-06-99
సీనియర్ హిందీ పండిట్
మహాబూబియా గర్ల్స్ హైస్కూల్, హైదరాబాద్
ఇంటర్య్వూ తేదీ: 15-06-99
సీనియర్ హిందీ పండిట్
మహాబూబియా గర్ల్స్ హైస్కూల్, హైదరాబాద్








మూసీనదితీరానికి సమీపంలో మదీనా భవనానికి ఎదురుగా సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలోని బాద్షాహి ఆషూర్ఖానా కుతుబ్షాహి పాలకుల అద్భుత నిర్మాణం. 1594లోమహ్మద్ కులీ కుతుబ్‌షా ని ర్మించారు. 1611లో సుల్తాన్ మహ్మద్ కాలంలో నీలిరంగు ఖురాన్ సూక్తుల టైల్స్‌తో అలంకరించారు. బాద్షాహి అషూర్‌ఖానాలో మొహరంసందర్భం గా షియాలో సంతాపదినాలను పాటిస్తారు.సుమారు 38 అడుగుల ఎత్తు లో రాతి స్థంభాలపై నిర్మించిన అషూర్ఖానా ముందుభాగంలోని నిర్మాణాలు శి«థిలావస్థకు చేరుకుని ఇటీవ లే కుప్పకూలాయి.
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని యునెస్కోకు ప్రతిపాదనలు
ఏడో నిజాం కూతురు బొమ్మల కొలువు కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం రాష్ట్ర పురావస్తు మ్యూజియం కొనసాగుతోంది. పబ్లిక్‌గార్డెన్స్‌లో ఇండో-పర్షిన్ పద్దతిలో 1914లో నిర్మించిన అపురూప వాస్తు శైలిలోని భవనం ద్వారాలు, కమాన్లపై నిజాం టోపీ గుర్తులు దర్శనమిస్తాయి. అప్పట్లో ఈ భవనంలో సైతాన్‌లున్నాయనే ప్రచారం జరుగడంతో నిజాం కూతురు బొమ్మల కొలువు రద్దయింది. 1928 లో దీన్ని పారిశ్రామిక ప్రదర్శనకు వినియోగించారు. 1930లో గులాం యజ్దానీ చొరవతో దీన్ని పురావస్తు సంపదను భద్రపరిచే నిలయంగా మార్చారు. ఇందులో గోల్కొండ కుతుబ్‌షాహీల ఆ యుధాలు, దుస్తు లు, నిజాంలు సేకరించిన ఇతర ఆయుధ సంపత్తి, నాణేలు, తదితర వస్తు సంపదను ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తవ్వకాల్లో లభ్యమైన అపురూప పురావస్తు సంపద, బుద్దుని అవశేషాలు, శిల్పాలు, శిలలు, చిత్రకళాఖండాలు, శాసనాలను ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్ర ఆర్కియాలజీ పరిధిలోని పురాతన నిర్మాణాల పరిరక్షణపై కేంద్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. కాని ఇనిస్టిట్యూషనల్ నిర్మాణాలపై శ్రద్ధ తీసుకునేవారు కరవయ్యారు. దీంతో అరుదైన వాస్తు శైలిలో ఉన్న నిర్మాణాల పరరక్షణ డోలాయమానంలో పడిపోయింది. ప్రభు త్వం ఇతోధికంగా నిధులు సమకూర్చాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ స్వాధీనంలోని కోఠి ఉమెన్స్ కళాశాల భవనం (కోఠి రెసిడెన్సీ) పరరక్షణ కు నిధుల కొరత తీవ్రంగా ఉంది. సిటీ కళాశాల సైతం అదే విధంగా మారింది. ఇన్టాక్ ప్రతినిధులు సమీక్షించి పునరుద్దరణకు నిధులు మంజూరు చేయాలని రెండు మూడు పర్యాయాలు అభ్యర్థలను పంపాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇక గోల్కొండ టోంబ్స్, చార్మినార్ తదితర నిర్మాణాలు బాగానే ఉన్నాయి.
ఏళ్ల తరబడి నుంచి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గోల్కొండ కుతుబ్షాహి సమాధులకు మరమ్మతులు చేపట్టి యునెస్కో గుర్తింపు కోసం మొదటి సారిగా ప్రతిపాదనలు పంపాం. యునెస్కో ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. గుర్తింపు నకు అన్ని అర్హతలున్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదనల రూపకల్పనలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. గోల్కొండ కోట, చారిత్రాత్మక చార్మినార్ నిర్మాణాలను కలిపి కుతుబ్‌షా వారసత్వం పేరుతో మళ్లీ సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో సహా పంపాం. యునెస్కో ప్రతినిధుల పరిశీలనలో ఉన్నాయి. ఈ యేడు కచ్చితంగా కుతుబ్షాహి టూంబ్స్, కోట, చార్మినార్ నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు లభిస్తుందని విశ్వసిస్తున్నాను.
తెలంగాణలో శతాబ్దాల పాటు కొనసాగిన దొరతనానికి సాక్ష్యాలవి. ఓ వైపు దొరల దర్పానికి నిలువెత్తు దర్పణాలుగా, మరోవైపు గడీ అంటేనే గడగడ వణికిన ప్రజల భయాలకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నేటికీ నిలిచి ఉన్నాయి. పాతతరం మనుషుల్లో గడీ పేరు వినగానే ఇప్పటికీ కళ్లల్లో గగుర్పాటు... శరీరమంతా జలదరింపు కన్పిస్తాయి. దొర పిలుపు వచ్చిందంటే పులి బోనులోకి వెళుతున్న మేకపిల్లలా హడలెత్తిపోయేవారు జనం. ప్రాణాలకే కాదు ఆడవాళ్ల మానాలకూ... బయటకు విన్పించని ఆర్తనాదాలకూ ఆలవాలంగా ఉండే గడీలు ఇటీవల మళ్లీ వార్తల్లోకొచ్చాయి.
ఇది మరో గడీ కథ... ఇప్పటి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ చుట్టుపక్కల ఉన్న జగ్గాసాగర్, అయిలాపూర్, భీమారం తదితర 80 గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్రావ్ ఆధీనంలో ఉండేవి. ఆ ఊళ్లో కట్టిన గడీలలో అప్పట్లోనే అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్మనీ నుంచి పాలరాతిని, విలాస వస్తువుల్ని తెప్పించినట్లు చెపుతా రు. అప్పట్లోనే విద్యుద్దీపాలతో (జనరేటర్ సాయంతో) వెలిగిపోతున్న గడీని కిరోసిన్ దీపాలు కూడా లేని ప్రజలు వింతగా, విచిత్రంగా చూసేవారట. గడీలకి పైప్లైన్లలో తాగునీటి సౌకర్యం కూడా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ని ఇప్పటికీ గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు.
ఆర్థిక సంస్కరణలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలతో ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. జనాభా కూడా పెరిగింది. పెరగనిదల్లా భూమి మాత్రమే. నక్సలైట్ల అలికిడి తగ్గిపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కొంతమంది దొరలు గడీల్ని, తమ భూముల్ని అమ్మకానికి పెట్టడంతో వివాదాలు మొదలవుతున్నాయి. ఎకరానికి ఇంత రేటని నిర్ణయించి... ఇన్నాళ్ళూ బీళ్లుగా ఉన్న తమ భూముల్ని సాగు చేసుకుని దాని నుంచి వచ్చిన ఆదాయంతో డబ్బు కట్టమని గ్రామస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలా నాలుగైదేళ్లు సాగు చేసుకున్నాక డబ్బు కట్టే విధంగా కౌలుదారుల చేత కాగితాలు రాయించుకుంటున్నారు. నాలుగైదేళ్లకైనా సొంత భూమి కల నెరవేరుతుందనిచాలామంది దొరల బీడుభూముల్ని మళ్లీ సాగుభూములుగా మారుస్తున్నారు. ఇలాంటి సౌలభ్యాలేవీ గడీలకు లేకపోవడంతో నేరుగా అమ్మకానికి పెడుతున్నారు దొరలు. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యే ఒక చిన్న గడీని 8 లక్షలకు అమ్మితే దాన్ని కొన్న వాళ్లు మెరుగులు దిద్ది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్‌ని ప్రారంభించారు. గడీలను పాఠశాలలకు, కమ్యూనిటీ హాళ్ళకు విరాళాలుగా ఇచ్చిన దొరలు కూడా ఉన్నారు.
కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991లో గ్రామస్థులు లూటీ చేస్తే పోలీసులు 120 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ వివాదం చాలా ఏళ్లు నడిచింది. అయితే ఇటీవల పల్లెల్లో సర్పంచులతో పాటు ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, మండలాధ్యక్షులు, నీటి సంఘాల చైర్మన్లు లాంటి చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. విద్యావంతులూ పెరిగిపోయారు. ప్రజలలో చైతన్యం కూడా పెరిగింది. ఆ చైతన్యమే గడీల్ని తమ ఉమ్మడి ఆస్తిగా భావించేలా, దాని కోసం ఎదురు తిరిగేలా చేస్తోంది. ఏదేమైనా 'ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చపడేది... ఇప్పుడు దాంట్లోనే పోస్తన్నం' అని కవి అన్నవరం దేవేందర్ అన్నట్టు ఇప్పుడు గడీలన్నీ ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగుబాటు చల్గల్ గడీతో మొదలైంది.
డా. వాసిలి వసంతకుమార్






