Showing posts with label youth. Show all posts
Showing posts with label youth. Show all posts

Sunday, March 13, 2011

విజయం ఓ వరం!

రంగస్థలంపై చాలా మందే యాక్టర్లు తారసపడతారు. వారిలో హీరో కూడా ఒక యాక్టరే అయినప్పటికీ తన హీరోయిజంతో స్టార్ అనిపించుకుంటాడు. తనదైన ముద్రతో నిజజీవితంలో సైతం ఆకర్షిస్తాడు. కాబట్టి కథలో మనం ఉండకూడదు...మనమే కథకులం కావాలి. కథా నాయకులం కావాలి.
జీవితాన్ని క్షణభంగురం అంటుంటాం. నిజానికి జీవితం విలువ క్షణమేనా? కాదు. కొన్ని కోటానుకోట్ల క్షణాల సముదాయమే జీవితం! అంతటి జీవితమూ 'క్షణం'లో చేజారిపోవచ్చు. అలా చేజారిపోవటం క్షణానికే పరిమితమైనప్పటికీ దాని నీడలు కోట్ల క్షణాలపై పరుచుకుని ఉంటాయి. ఆ ఒక్క క్షణం కోసం కోట్ల క్షణాలలో మనం భయభ్రాంతిలో ఉంటాం. నిజానికి ఆ ఒక్క క్షణానికి భయ కంపితులమైతే జీవితమంతా బలహీనంగానే గడిచిపోతుంది. అలాకాక ఆ క్షణాన్ని శక్తిమంతంగా మార్చుకోగలిగితే జీవితమంతా శక్తి సంపన్నం అవుతుంది. ఓటమిని విజయానికి శ్రీకారం అనుకుంటే గెలుపులో హీరోయిజం కనిపిస్తుంది.

జీవితం క్షణభంగురం కాదు
పవర్‌ఫుల్ కావాలి

ఒక ఓటమి అనేక గెలుపులకు దోహదకారి అవుతుంది. రేయింబవళ్లలా జీవితంలో చీకటి వెలుగులు ఉంటాయి. బలాలు బలహీనతలూ ఉంటూనే ఉంటాయి. మెలకువకు నిద్ర ఉపకరించినట్లే బలపడటానికి బలహీనతలూ దోహదపడుతుంటాయి. ఒక సమస్యకు రెండవది పరిష్కారం అవుతుంది. సుఖాన్ని వెన్నంటి కష్టం ఉంటుంది. అలాగే కష్టాన్ని వెన్నంటి సుఖమూ ఉంటుంది. విషాద యోగమూ, ఆనందయోగమూ మానవగీతలో రచింపబడే ఉంటాయి.

సృష్టిలో ఈ విరుద్ధతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మనకున్న వనరులు ఏమిటి అని చూసుకుని, వాటిల్లో పనికొచ్చేవి ఏమిటి? పనికి రానివి ఏమిటి? అని మనమే నిర్ణయించుకోవాలి. అప్పుడే మన వ్యక్తిత్వం ఒక నిర్ణయాత్మక ప్రణాళిక అవుతుంది. నిర్దేశిత లక్ష్యంతో ఈ నిర్ణయాత్మక ప్రణాళిక సాధ్యమవుతుంది. లక్ష్యం స్పష్టంగా ఉంటే, ప్రణాళిక పకడ్బందీగా సాగితే ఏ జీవితమూ కేవలం సాదాసీదాగా సాగిపోదు. దేన్నీ అనాలోచితంగా చేయటం జరగదు. దేన్నీ ఆయాచితంగా అందుకోవాలనుకోవటం జరగదు.

నేడు ఒకలా రేపు మరోలా వర్తించటం జరగదు. జీవితంలో, వ్యక్తిత్వంలో, వర్తనంలో, ఆలోచనలో, చేతలో స్పష్టత ఉంటుంది. అపుడ 'కాలం' చేజారిపోతుందేమో నన్న బెంగ, భయం ఉండదు. ఫలితంగా మనం పవర్‌ఫుల్ అవుతాం. ఆ శక్తి సంపన్నత మనదే తప్ప, మనలో నుంచి ఉబికివచ్చిందే తప్ప ఎక్కడి నుంచో వచ్చింది కాదు. సాధన ద్వారా అందివచ్చింది ప్రతిభతో ప్రకాశమయ్యింది. రైట్‌థాట్, రైట్‌స్పీచ్, రైట్ యాక్షన్‌ల సమాహారమే ఈ పవర్.

కాలాన్ని గెలువు

విజయాన్ని వరించాలంటే మనలో త్రికరణ శుద్ధి ఉండాలి. మన ఆలోచన, మన చేతన, మన మాట సన్మార్గంలో ఉండాలి. అప్పుడే జీవితం విజయపథం అవుతుంది. "నా ఆలోచన తప్పుకాదు...నేను మాట్లాడింది తప్పుకాదు...నేను చేసింది తప్పు కాదు'' అని ఘంటాపధంగా చెప్పగలిగిన వారిలో చంచల స్వభావం ఏ కోశానా కనిపించదు. అనుమాన బీజాలు అగుపించవు. పైగా అటువంటి వ్యక్తిత్వం ఒక సస్యశ్యామల క్షేత్రమే అవుతుంది.

వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. ఫలవంతమవుతుంది. ఇటువంటి వ్యక్తిత్వ సంపన్నులు దేనికీ తొందరపడరు. సహనాన్ని కోల్పోరు. విజయం వరించకపోయినా సహనంగా సాధన సాగిస్తారు. ప్రయత్నలోపమూ, సాధనా లోపమూ ఉండుద కాబట్టి గెలుపు తథ్యమే అవుతుంది. వీరి ప్రణాళిక పకడ్బందీగా ఉంటుంది. కాబట్టి కాలం సైతం వీరిని పరీక్షించదు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వారు కాబట్టి కాలవ్యవధిని సైతం నిర్దేశించుకునే ఉంటారు. కాబట్టి ఆ కాలానికి లోబడే విజయం వీరిని వరిస్తుంది.

గెలుపు మాత్రమే కాదు కాలంసైతం వీరి గుప్పిటనే ఉంటుంది. వీరు కాలాన్ని జయించగలరు కాబట్టి ప్రపంచాన్నీ జయించగలరు. ఇన్ని తెలుసు కాబట్టి విజయానికి కావలసిన వనరులు ఏమిటో వీరికి స్పష్టంగా తెలిసే ఉంటుంది. అవి తమ వద్ద ఎంత పుష్కలంగా ఉన్నదీ తెలుసు. లేని వాటిని సమీకరించుకోగలరు. ఈ సమీకరణ ద్వారా మార్పు సాధ్యమవుతుంటుంది. ఈ మార్పు స్వభావ వ్యతిరేకి మాత్రం కాదు. అన్న సక్సెస్ సూత్రం తెలిసిన వారు కాబట్టి తమ స్వభావానికి ఎదురీదకుండానే మార్పును ఆహ్వానిస్తారు. ఆ మార్పు గెలుపొందటం కొరకే అని స్పష్టంగా తెలుసు.

గెలుపు అవకాశం కాదు

గెలుపు లక్ష్యమే తప్ప అవకాశం కాదు... అవసరం. అది ఒక పరిణత ప్రతిభ. వాస్తవం, యదార్థం కావాలని పట్టు పడితేనే గెలుపు సాధ్యమవుతుంది. ఎవరికి కానీ శ్రమ, సాధన వృధా పోవు. శ్రమకు, సాధనకు తగ్గ ప్రతిఫలం విజయం రూపంలో వరిస్తుంది. ప్రస్తుతానికి ఆ విజయం విలువ ఎంతటిదయినా అది భవిష్య విజయానికి భూమిక అవుతుంది. అలా భవిష్య విజయ సౌధానికి వర్తమాన విజయాలనే సోపానాలుగా చేసుకుంటూ పోవాలి. ఇంతవరకు విజయపరంపరలతో ఒక్కోమెట్టు ఎక్కుతున్న కొద్దీ మరింత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటారు. ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిస్తూ కనిపిస్తుంటారు. మనకంటే ఎంతో ఎత్తులో ఉంటారు.

మనం మొదటి మెట్టుపై నిలబడి చూస్తుంటే వారి విజయం వినోదంలా ఉంటుంది. శిఖరం చేరుతున్న వ్యక్తి అద్భుత వ్యక్తి అనిపిస్తుంటాడు. హీరోలా అనిపిస్తుంటాడు. ఆ స్ఫూర్తితో మనమూ మెట్లెక్కడం ప్రారంభిస్తే ఆ అద్భుతం మన నీడలో తలదాచుకుంటుంది. మన వ్యక్తిత్వంలో ప్రకాశిస్తుంది. ఆ హీరో మనకు చేయి అందించిన పరవశం కలుగుతుంది. ఆ పారవశ్యంతో మనమూ అతడి పక్కకు చేరుకోగలుగుతాం. శిఖరాగ్రాన అతడి పక్కన నిలబడగలుగుతాం. మనమూ హీరో అవుతాం...అనిపించుకుంటాం.

మనమూ చేయి అందించి ఇతరులూ హీరోలు అనిపించేలా చేస్తాం. రంగస్థలంపై చాలా మందే యాక్టర్లు తారసపడతారు. వారిలో హీరో కూడా ఒక యాక్టరే అయినప్పటికీ తన హీరోయిజంతో స్టార్ అనిపించుకుంటాడు. తనదైన ముద్రతో నిజజీవితంలో సైతం ఆకర్షిస్తాడు. అందుకే మోర్గాన్ ఫ్రీమన్ అంటాడు. కాబట్టి కథలో మనం ఉండకూడదు...మనమే కథకులం కావాలి. కథా నాయకులం కావాలి.


డా. వాసిలి వసంతకుమార్
యోగాలయ రీసెర్చ్ సెంటర్
ఫోన్ : 9393933946

Monday, February 21, 2011

కళ్యాణ కాస్ట్యూమ్స్ ...... హిట్ ఫిట్.

పెళ్ళి...
హిట్ ఫార్ములా సినిమాలాంటిది!
వధూవరులు... హీరో హీరోయిన్లు
బామ్మలు, అమ్మమ్మలు, మావయ్యలు... తారాగణం
స్పెషల్ అపియరెన్స్‌లో బంధువులు, మిత్రులు...
బోలెడంత హడావిడి... బాజా బజంత్రీలు...
అలకలు, సముదాయింపులు...!
ఇవన్నీ ఉన్నా... ఈ పెళ్లి హిట్ అవ్వాలంటే
వధూవరులు ఒకరికొకరు ఫిట్ అవ్వాలి.
మనసులే కాదు, వారి కాస్ట్యూమ్స్ కూడా!
అందుకే ఇప్పుడు కళ్యాణం కాస్ట్యూమ్స్‌లో కూడా డిజైనర్ వేర్ వస్తున్నాయి. ఆ డిజైన్‌లలో వధూవరులతో బాటు పెళ్లికి వచ్చిన వాళ్లు కూడా తళుక్కున మెరిసే తారల్లా ఉంటే... ఆ పెళ్లి హిట్ కాక ఏమవుతుంది..?
మీ ఇంట్లో జరిగే పెళ్లి కూడా అలా హిట్ కావాలని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్‌ పరిచయం ...


ఊరు ఊరంతా కలిస్తే అంబరాన్ని అంటే సంబరాల పెళ్లి. ఇద్దరి హృదయాలను ఏకం చేసే పెళ్లి, పిల్లాపాప చిన్నాపెద్దా హుషారుగా హోరెత్తే పెళ్లి. అందరి సమక్షంలో ఆనందంగా, ఆర్భాటంగా జరుపుకునే ఈ సందర్భాన్ని మించిన శుభకార్యం మన సంప్రదాయంలో మరొకటి లేదేమో! ప్రధాన పాత్రధారులు వధూవరులు అయినా ప్రత్యేక పాత్ర ల్లో బంధు, మిత్రుల హడావిడి, అల్లరి తప్పని సరి.

పెళ్లి పనులన్ని ఒక ఎతైతే పెళ్లిరోజు నాటి అలంకర ణ మరో ఎత్తు. ఆరోజు ప్రధాన ఆకర్షణ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయినా కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా ఆ శుభకార్యం రోజున ఏం వేసుకోవాలి? ఎలా తయారవ్వాలి? అనే ఆలోచనలో పడతారు.


ఒకప్పుడు మధుపర్కాలతో వధూవరుల గెటప్ పూర్తయితే, పట్టుచీరలు, ప్యాంటు చొక్కాలతో మిగతావారి అలంకరణ పూర్తి అయ్యేది. రోజులు మారాయి, ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.


దీంతో అన్ని సంబరాలకు సరిపడా దుస్తులని ధరించటానికి కనీసం మూడునాలుగు విభిన్నమైన లుక్స్‌ని రెడీ చేసుకోవలసిన అవసరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు కూడా తప్పని సరి అయిపోయింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కొన్ని లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్స్, వాటికి అవసరమయ్యే డ్రెస్సింగ్ గురించి అవగాహన కలిగిస్తూ మీరు ‘ఇన్ ఫ్యాషన్‌‘గా ఉండటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. డిజైనర్లు, వెడ్డింగ్ ప్లానర్స్, బ్యూటీషన్స్ నుంచి తీసుకున్న కొన్ని ముఖ్యమైన సూచనలు మీ కోసం:

ఏ ఫంక్షన్‌కి ఏం ధరించాలి...

సంగీత్ ఫంక్షన్:
‘‘పెళ్లికి ముందు జరిగే ఈ కార్యక్రమంలో హడావిడంతా స్నేహితులదే. ఆట పాటలతో సాగిపోయే ఈ రోజు కోసం ప్రత్యేకమైన దుస్తులు అవసరం. లేటెస్ట్ స్టయిల్స్‌లో డిజైన్ చేసిన గాగ్రా చోలీలో వధువు మెరిసిపోతే ఆమె స్నేహితులు కూడా గాగ్రా, అనార్కలి చుడిదార్ లేదా షార్ట్ టాప్ పై పటియాలా పైజామాలాంటి లేటెస్ట్‌డిజైన్లను ధరించవచ్చు. పెళ్లికొడుకు సిల్క్ కుర్తా పైజమా లేదా లైట్‌గా వర్క్ చేసిన జోధ్‌పురీ స్టైల్ డ్రెస్‌ని ధరిస్తే రాకుమారుడిలా వెలిగిపోవచ్చు. వరుడి స్నేహితులు కూడా సంప్రదాయంగా కనిపించేలా అమ్మాయిలకు ఏ మాత్రం తీసిపోకుండా కుర్తా పైజామాలు ధరించడం నేటి ఫ్యాషన్.. మిగిలిన బంధువులు లేటెస్ట్ డిజైన్స్‌లో వస్తున్న క్రేప్, జార్జెట్, షిఫాన్ చీరలు ధరించటానికి ఇది మంచి సమయం. పురుషులు కుర్తా పైజామాలు ధరిస్తే... సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. అందరూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపే ఈ రోజుని మరింత ఎంజాయ్ చేయటానికి ఈ తరహా డ్రెస్సింగ్ అనువుగా ఉంటుంది’’ అంటున్నారు డిజైనర్ సంగీత. ఈ రోజు ట్రెడిషనల్ లుక్‌తో వెస్ట్రన్ లుక్ కూడా మిక్స్ చేయవచ్చు. డ్రెస్సింగ్ ట్రెడిషనల్‌గా ఉంచి హెయిర్ స్టైల్స్‌లో వేరియేషన్ తీసుకు రావచ్చు. అలాగే జ్యువెలరీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ధరిస్తే లుక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కూడా ఆమె అంటున్నారు.
మెహందీ ఫంక్షన్: పెళ్లి కూతురికి గోరింటాకు పెట్టే ఈ ఫంక్షన్ ప్రత్యేకించి ఆడవాళ్లు మాత్రమే జరుపుకునేది. ‘‘ఈ రోజుల్లో పెళ్లి కూతురికి పెట్టే గోరింటాకుకి పట్టే సమయం కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు. దాని కోసం పెళ్లికూతురుకు సౌకర్యంగా ఉండే గాగ్రా లేదా సల్వార్ సూట్‌ని ధరిస్తే బాగుంటుంది. షార్ట్ స్లీవ్స్ టాప్ అయితే మరీ మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో మెహందీ డిజైన్లు మోచేతిని దాటి పైకి దాకా పెట్టటం ఫ్యాషన్’’ అంటున్నారు బ్యుటీషియన్ మిని లింగ్. అలాగే ఫంక్షన్‌కి వచ్చే ఆడవాళ్లు కూడా గోరింటాకు పెట్టుకోవటం ఆనవాయితీ కాబట్టి వీరు కూడా చేతులకు సింపుల్ జ్యువెలరీ, సౌకర్యంగా ఉండే లైట్ వెయిట్ చీరలు, ఎక్కువ ఆర్భాటం లేని హెయిర్ స్టయిల్ ఉంటే ఫంక్షన్‌ని మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.
వెడ్డింగ్ డే...

కలర్ కోఆర్డినేటెడ్ లుక్: వధూవరులు కలర్ కోఆర్డినేటెడ్ డ్రెస్సులు ధరించటం ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్ శిల్పా రెడ్డి. అంటే వధూవరులు పెళ్లిరోజు తమ దుస్తులు మ్యాచ్ అయ్యేలా తయారవ్వటం.‘‘ఈ ట్రెండ్ పాశ్చాత్యదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ తరహా ట్రెండ్ ఊపందుకుంది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా...వివేక్ ఒబెరాయ్, మాల్వికా.. మొదలైన బాలివుడ్ సెలబ్రిటీలు పెళ్లిరోజు ఈ విధంగా ముస్తాబై ఈ ట్రెండ్‌ని మరింత పాప్యులర్ చేస్తున్నారు’’ అంటున్నారు శిల్పా. మరో ట్రెండ్... మండపం డెకరేషన్ కూడా వధూవరుల దుస్తులను కాంప్లిమెంట్ చేస్తూ ఉండేలా డిజైన్ చేయటం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల వివాహ వేడుకల్లో వధువు ధరించిన బంగారు రంగు చీర, వరుడు ధరించిన క్రీం కలర్ జోధ్‌పురీ సూట్‌కి మ్యాచ్ అయ్యేలా మండపాన్ని డెకరేట్ చేశారు. అంతే కాదు వీరి వివాహం సందర్భంగా మరో ట్రెండ్‌ని కూడా చూసాం. అమితాబ్, జయతో పాటు సోదరి శ్వేత తదితర ముఖ్య కుటుంబ సభ్యులంతా అభిషేక్ బచ్చన్ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా అదేరంగు దుస్తులని ధరించారు. ఈ విధంగా చేయటంతో ఎంతో వైవిధ్యంగా కనిపించటమే కాదు ‘మేమంతా ఒకటి‘ అని చాటి చెప్పారు .
ఐషా ట్రెండ్: మరో ట్రెండ్ కూడా ఇటీవల విడుదలై హిట్ సినిమా ‘ఐషా’ పాప్యులర్ చేసింది. విదేశాలలోఉన్న బ్రైడ్స్ మెయిడ్, బెస్ట్ మ్యాన్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలో ఎంతో ఫ్యాషనబుల్‌గా చూపించారు. వధూవరులకు సంబంధించిన ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితమైన స్నేహితులకు పెళ్లిలో పెద్ద పీట వేసే ఈ సంప్రదాయాన్ని ‘ఐషా’లో చూపించారు. ఈ ట్రెండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ముఖ్యులంతా వధూవరులకి మ్యాచింగ్‌గా ఒకే కలర్‌లో వేర్వేరు స్టైల్స్‌లో డ్రెస్సింగ్ చేసుకుంటారు. ‘ఐషా’లో ఎంతో పాప్యులర్ అయినా ‘గల్ మిట్టి మిట్టి బోల్’ పాటలో ఈ తరహా డ్రెస్సింగ్ స్టైయిల్‌ని చూడవచ్చు. చీర కలర్ ఒకటే అయినా డిఫరెంట్ డిజైన్ దానికి తోడు జ్యువెలరీ, హెయిర్‌స్టయిల్ వేరుగా ఉండటంతో పెళ్లి కూతురుకి ఏ మాత్రం పోటీ కాకుండా ఎవరి స్టైయిల్‌లో వాళ్లు కనిపిస్తారు. వరుడి వైపు బంధువులు, స్నేహితులు కూడా వరుడికి మ్యాచింగ్ దుస్తులను ధరిస్తారు ఈ పాటలో. త్వరలో ఈ ట్రెండ్ మరింతగా పాప్యులర్ అవుతుంది అంటున్నారు శిల్ప.

తాటాకు పందిరి కింద మధుపర్కాలలో సిగ్గుపడుతూ పెళ్లిళ్లు చేసుకునే రోజులు దాదాపుగా పోయాయి. ఇప్పుడంతా స్పెషల్‌గా వెడ్డింగ్ ప్లానర్స్ డిజైన్ చేసిన డిజైనర్ వెడ్డింగ్ రోజులు. అంత మాత్రం చేత సంప్రదాయానికి తిలోదకాలిస్తున్నారనుకోవటం పొరపాటే! సంప్రదాయాన్ని, ఆధునికతను కలబోసుకుంటున్న కళాత్మక ట్రెండ్‌లు పెళ్లికి నిండుదనం చేకూరుస్తాయి. వధువరులకు సరికొత్తకళను తెచ్చిపెడతాయి.

పెళ్లి సందడి
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఒకవైపు మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇతర సంస్కృతుల నుంచి నచ్చిన మేలిమి అంశాలను ఎంచుకొని పెళ్లి వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్లు, పెళ్లి తరవాత రిసెప్షన్ వంటి అదనపు వేడుకలు పెళ్లిలో భాగమైపోయాయి.

రూ. 40 కోట్ల పెళ్లి! పసందైన విందు... వెరైటీ వినోదాలు

మూడే ముళ్లు. ఏడే అడుగులు. మొత్తం కలిపి... రూ. 40 కోట్లు. అవును! రాష్ట్రంలో ఎవరూ పెట్టనంత ఖర్చుతో, భారీ బడ్జెట్ సినిమాను కూడా తలదన్నే రీతిలో పెళ్లి వేడుక జరుగుతోంది. అది కూడా మన రాష్ట్రంలోనే, రాజధాని నగరంలోనే! న్యూజిలాండ్‌లో వ్యాపారం చేసే ఏఆర్ ప్రాపర్టీస్ ఎండీ రవీంద్ర తన ఇద్దరు కొడుకులనూ అతి ఖరీదైన పెళ్లి వేడుక ద్వారా ఒకేసారి ఓ ఇంటివారిని చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు కూడా అక్కాచెల్లెళ్లే కావడం విశేషం. వారిద్దరూ నగరంలోని విల్లామేరీ కాలేజీలో చదువుతున్నారు. 


ఆదివారం హైటెక్స్‌లో మొదలైన ఈ పెళ్లి వేడుకలు ఏకంగా వారం పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆహ్వాన పత్రిక నుంచి పెళ్లి దుస్తుల దాకా ఏర్పాట్లన్నీ ఒక రేంజ్‌లో ఉన్నాయట. పత్రికను హైదరాబాదీ ముత్యాల్లో పెట్టి మరీ ఇవ్వగా, విదేశాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తులు, నగా నట్రా కోసమే ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేశారట. 
పెళ్లి కోసం మయసభను తలపించే రీతిలో, జోధా అక్బర్ సినిమా తరహాలో సెట్టింగ్ ఇప్పటికే ముస్తాబయింది.
రిసెప్షన్‌కు దాన్ని తలదన్నేలా అండర్‌వాటర్ థీమ్‌తో ముత్యపు చిప్ప ఆకృతిలో సెట్ తయారవుతోంది.


పసందైన విందు... వెరైటీ వినోదాలు

పెళ్లి భోజనాలు మాయాబజార్ వివాహ భోజనాన్ని తలదన్నే రీతిలో ఉంటాయట. ఒకరోజు బెంగాలీ, మరో రోజు నిజాం, ఇంకో రోజు రాజస్థానీ, తర్వాత పంజాబీ... ఇలా దేశంలోని పాపులర్ రకాలన్నీ కనువిందు చేస్తాయట. ఇవిగాక రిసెప్షన్, సంగీత్ కార్యక్రమాలకు స్పెషల్ విందులుంటాయి. ఇక్కడితోనే అయిపోలేదు. అరేబియన్ ఎడారి సెట్టింగ్‌లో వైవిధ్యభరితమైన సంగీతం నడుమ వినోద కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రష్యన్ బెల్లీ డ్యాన్సులు ప్రత్యేకమట. వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.


కొసమెరుపు:  ఇంతా చేస్తే, ఇంత ఖరీదైన ఈ పెళ్లిలో ఎక్కడా బాజాభజంత్రీల చప్పుడే విన్పించదు. అంతేకాదు, మాంగల్యధారణ కూడా ఉండదని పెళ్లి కొడుకులు, వారి తండ్రి చెబుతున్నారు. అదంతా తమకు పెద్దగా ఇష్టముండదని వారు చెప్పుకొచ్చారు.

Thursday, February 10, 2011

మ్యాచింగ్ మెహందీ

మాఘమాసం వచ్చిందంటే పార్లలో బ్యూటీషియన్స్ లేటెస్ట్ మెహందీ డిజైన్స్ ఎంచుకునే పనిలో పడిపోతారు. పెళ్లికూతురికి మెహందీ పెట్టడం అంటే చాలా పెద్ద పని. అరచేతి నిండా పెడితే సరిపోవడం లేదు. మోచేతి నుంచి మొదలుపెట్టాలి. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం. మార్వాడి బ్రైడల్ మెహందీలో పెళ్లికూతురు చేతులు, కాళ్లు అన్నీ ఎర్రగా మెరిసిపోవాలి.

ఎన్ని రకాలు...

పూర్వం డిజైన్ గురించి కంటే ఆకుమీదే ఎక్కువగా దృష్టిపెట్టేవారు. ఎవరి చెట్టు ఆకు ఎక్కువగా పండుతుందో తెలుసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. కోన్‌లలో కలిపే రకరకాల పదార్థాల వల్ల కలర్ వద్దన్నా వస్తోంది. ఎటొచ్చీ ఆలోచనంతా డిజైన్ గురించే. వీటిలో అరబిక్, అరబిక్ బ్రైడల్, మార్వాడి బ్రైడల్, దేవదాస్ చాలా ప్రముఖమైనవి. పెళ్లికూతురికి మాత్రం ఎక్కువగా మార్వాడి బ్రైడల్ వేస్తారు. చిన్న చిన్న డిజైన్లతో మొత్తం చేయంతా నిండుగా కనిపిస్తుంది. ఎక్కడా లింక్‌పోకుండా డిజైన్ వేస్తారు.

చాలా సమయం పడుతుంది. రెండవది అరబిక్. పెద్ద పెద్ద పువ్వులతో ఉంటుంది. గీతలు, చుక్కలు వేయకుండా ఆకులు, పువ్వులు వంటి డిజైన్లు కనిపిస్తాయి. చూడ్డానికి సింపుల్‌గా, అందంగా ఉంటుంది. వేయడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఇందులో బ్రైడల్ డిజైన్ మళ్లీ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇక చివరిది దేవదాస్. ప్రస్తుతం దేవదాస్ ట్రెండే నడుస్తోంది. అరచేతిలో సింపుల్‌గా రెండు పువ్వులు, కాలికి ఓ మూడు పువ్వులు విడివిడిగా వేస్తారు. చాలా సింపుల్‌గా ఉండే ఈ డిజైన్ అన్ని తరాలవారిని ఆకట్టుకుంటుంది.

మ్యాచింగ్ మహిమ...

మనకి తెలిసిన గోరింటాకు ఎర్రగానే పండుతుంది. మరీ బాగా పండితే మర్నాటికి నల్లబడుతుంది. కాని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కోన్‌లు ఎర్రగా, నల్లగా, పచ్చగా, తెల్లగా కూడా పండుతున్నాయి. ఇదెక్కడి చోద్యం అంటూ ముక్కున వేలేసుకోకండి. ఇదంతా మ్యాచింగ్ కోసం. పెళ్లికూతరు కట్టుకునే చీరకు తగ్గట్టు చేతిలో రంగులు మెరవాలన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాంతో రకరకాల మిక్సింగ్ ప్రాడెక్ట్స్ మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇందులో మొదటిది బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. ముందుగా కోన్ పెట్టుకుని చివర్లో మెహందీ బ్లాక్ పౌడర్‌ని నీళ్లలో కలిపి డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు.

రెండవది జర్దోసి. చీరలపైన చేసే జర్దోసి వర్క్‌లాగే చేతులపై కూడా ప్రత్యేకంగా డిజైన్ గీస్తారు. ముందు కోన్‌తో డిజైన్ పెట్టుకుని తరువాత జర్దోసి పొడిని గమ్‌లో కలుపుకుని డిజైన్‌కి అవుట్‌లైన్ గీస్తారు. ఈ జర్దోసి పొడి గోల్డ్, సిల్వర్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది. పెళ్లి చీరపై ఉండే రంగును బట్టి మెహందీ అవుట్‌లైన్ గీసుకోవాలి. మూడోది మిర్రర్ వర్క్ మెహందీ. సన్నగా, చిన్నగా ప్లాస్టిక్ పేపర్ మందంలో ఉండే మెహందీ మిర్రర్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. మెహందీ డిజైన్ వేసిన తర్వాత సందుల్లో ఈ మిర్రర్‌ని అతికిస్తారు. ఆరిన తర్వాత నీళ్లతో కడుగుతారు. పండిన గోరింటాకు మధ్యలో అద్దం ముక్కలు అలాగే ఉంటాయి.

ఐదారు రోజులు అలాగే మెరుస్తూ కనిపిస్తాయి. వీటన్నింటికంటే భిన్నమైంది నెయిల్‌పాలిష్ మెహందీ. మనకి కావల్సిన రంగు నెయిల్‌పాలిష్‌ని తీసుకుని పలుచగా చేసి కోన్‌లో కలుపుకోవాలి. ఏ రంగు నెయిల్‌పాలిష్ కలిపితే ఆ రంగు షేడ్ చేతిపై కనిపిస్తుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో మెహందీని చేతిపైకి తెస్తున్నారు. ఫలితంగా రకరకాల రంగుల్లో మెహందీని చూడగలుగుతున్నాం.

రెడ్ టాటూలుగా...
మనం గోరింటాకు అని నోటినిండా పిలుచుకునే మెహందీని విదేశీ వనితలు రెడ్‌టాటూ అని పిలుస్తారు. నిజానికి టాటూ అంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కాని ఒంటిపైన రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోడానికి అందరూ ఇష్టపడడం లేదు. అలాగని టెంపరరీ టాటూలను వేసుకోడానికి ముందుకు రావడంలేదు. దీని గురించి మనకు మిర్రర్ పార్లర్ డైరెక్టర్ విజయలక్ష్మి బాగా చెబుతారు..."మనకి మెహందీ అంటే ఎంత మక్కువో విదేశీ అమ్మాయిలకు టాటూలంటే అంతే ప్రాణం. కాని అవి వేసుకుంటే ప్రతీ రోజూ ఒకే డిజైన్‌ని చూసుకోవాలి. ఇలా ఒకే డిజైన్‌ని చూసుకోడానికి ఇష్టపడని అమ్మాయిలు టెంపరరీ టాటూలను వేయించుకుంటున్నారు.

అయితే ఆ టాటూలు వేసే ముందు వాడే లిక్విడ్స్ వల్ల చాలామంది శరీరంపైన దద్దుర్లొస్తున్నాయి. దాంతో ఎందుకొచ్చిన తంటాలనుకుని వాళ్లు టాటూల జోలికి వెళ్లడం లేదు. అలాంటివారి దృష్టి ఇప్పుడు మన మెహందీపై పడింది. చక్కగా వారికిష్టమైన చోట నచ్చిన డిజైన్ వేయించుకుని మురిసిపోతున్నారు. మెడపైనా, నడుంపైనా, కాళ్లపైనా...ఇలా వారికి నచ్చినచోట మెహందీ టాటూలను వేయించుకుంటున్నారు. వాటికి 'రెడ్ టాటూ' అని పేరు పెట్టారు. కెమికల్స్‌తో కూడిన ఆ టాటూల కంటే ఈ మెహందీ పెట్టుకోవడం ఎంతో ఉత్తమమని ఇతరులకు సలహా కూడా ఇస్తున్నారు'' అని చెప్పారామె.

మెహందీ పండుగ ...

మనకు పెళ్లికూతుర్ని చేయడం అంటే నలుగుపెట్టి స్నానం చేయించడం, పట్టుచీర కట్టి ముస్తాబు చేసి గాజులు తొడగడం, వచ్చిన ముత్తైదువులకి పసుపుకుంకం తాంబూలం ఇవ్వడం. ఇప్పుడు వీటి జాబితాలో మెహందీ కూడా చేరింది. ఉత్తరభారతదేశంలో 'మెహందీ రసం' పేరుతో చేసుకునే ప్రత్యేక వేడుక కొంతకాలం క్రితం మన రాష్ట్రంలో కూడా అడుగుపెట్టింది. ధనవంతుల ఇళ్లలో తన ప్రత్యేకతను చాటుచుంటోంది. మెహందీ వేడుక అంటే పెళ్లికూతుర్ని చూడ్డానికి వచ్చిన ఆడవాళ్లందరికీ గోరింటాకు పెట్టిస్తారు. పదిమంది కానీ వందమంది కానీ అందరికీ పెట్టాల్సిందే. ఏడేళ్లుగా మెహందీ పెడుతున్న ధనలక్ష్మి తన అనుభవం చెబుతోంది.

"ఒక పెళ్లికి జరిగిన మెహందీరసానికి వెళ్లాను. నేనూ నాతో మరో అమ్మాయి కూడా వచ్చింది. చాలామంది పేరంటాళ్లు వచ్చారు. అందరికీ మెహందీ పెట్టాలి. అంతమందికి పెట్టాలంటే త్వరగా పెట్టే డిజైన్‌లని ఎంచుకోవాలి. అందుకే అందరికీ దేవదాస్ డిజైన్స్ వేసేసాము. ఇద్దరం కలిసి నాలుగు గంటల్లో నలభైమందికి పెట్టేశాం'' అని గుర్తుచేసుకున్నారామె. ఇక ఇందులో ఖరీదుల విషయానికొస్తే...కాళ్లూ చేతులూ ఫుల్‌గా వేయించుకుంటే వెయ్యినుంచి రెండువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. పెళ్లికూతురికైతే చేతులు, కాళ్లకు కలిపి మూడువేల నుంచి ఐదువేల రూపాయలవరకూ తీసుకుంటున్నారు. ఐదారొందల రూపాయలకు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రాంతాన్ని బట్టి, పార్లర్స్‌ని బట్టి ఖరీదులు చెబుతున్నారు.

ఫ్లయిట్ ఎక్కేవారికి ప్రత్యేకం..
పెళ్లయిన వెంటనే ఫ్లయిట్ ఎక్కి వెళ్లె పెళ్లికూతుర్లకి మెహందీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు విజయలక్ష్మి. " పెళ్లయిన వెంటనే విదేశాలకి వెళ్లే పెళ్లికూతుళ్లు ఎక్కువవుతున్నారు. భర్త ఉద్యోగనిమిత్తమో, హనీమూన్ ప్రయాణమో...మొత్తానికి పెళ్లయిన వారంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లాల్సివస్తోంది. అక్కడ వేలిముద్రలు తీసుకుంటారు. ఆ సమయంలో వేళ్లకి గోరింటాకు ఉంటే ఒప్పుకోరు.

ఒకసారి దీని వల్లే ఒక పెళ్లికూతురు ప్రయాణం రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దాంతో మా దగ్గరికి వచ్చే పెళ్లికూతుర్లని ముందే అన్ని వివరాలు అడుగుతున్నాం. విదేశీయానం ఉన్నట్లయితే చేతినిండా మెహందీ పెట్టినా వేళ్లకి పెట్టం. పెళ్లిసమయంలో అందంగా కనిపించడం కోసం ఆ ప్రాంతంలో స్కెచ్‌తో రంగు వేస్తున్నాం. తరువాత కడిగేస్తే పోతుంది. విదేశాలకు వెళ్లాక ఆ వేళ్లభాగంలో కోన్ పెట్టుకోమని చెబుతాం. ఈ చిన్న జాగ్రత్త తెలియక చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు.'' అని వివరించారామె.

Wednesday, December 15, 2010

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' * ఆ మత్తు వద్దు మన పిల్ల్లలకు .....

'హైదరాబాదులో డ్రగ్స్ మహమ్మారి...' 'డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్లు....' 'డ్రగ్స్ వలలో యువత....' 'డ్రగ్స్ సేవనంలో సినీతారలు....' ఇవన్నీ దాదాపు ప్రతిరోజూ వార్తాపత్రికల్లో కనిపిస్తున్న హెడ్డింగులు. పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఈ శీర్షికలు కళ్లపడగానే గుండెల్లో గుబులు, భయం. ఒక్క క్షణం మన పిల్లలూ కళ్లముందు మెదులుతారు. ఆ...మన పిల్లలకెందుకు అలవాటవుతాయి ఇవి అన్న భరోసాతో పేపర్‌ని మడచి టీపాయ్ మీద పడేస్తాం. కాని వేగంగా దూసుకెళ్తున్న డ్రగ్స్ రాకెట్ మన పిల్లల్ని ఢీ కొట్టదన్న గ్యారెంటీ ఏంటి? అప్పుడేం చేయగలం? ఆలోచనల్లో పడ్డారు కదూ....ఇలాంటి ముందు జాగ్రత్త కలిగించడానికే మొదలైంది 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్‌సొసైటీ'. దాని గురించే ఇది...

సంవత్సరం కిందట...ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఓ అపార్ట్‌మెంట్.... ఇంట్లో మరిచిపోయిన ఆఫీస్ కాగితాలను తీసుకెళ్లడానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తన ఫ్లాట్‌కు వచ్చింది కనూప్రియా సింగ్. ఫైల్ తీసుకుని తాళం వేస్తూ హడావుడిగా లిఫ్ట్ వైపు పరిగెడుతుంటే...ఎదురు ఫ్లాట్‌లో నుంచి పదహారేళ్ల అబ్బాయి అరుపులు వినిపించాయి గట్టి గట్టిగా...ఓ నలుగురు మనుషులు ఆ పిల్లాడిని పట్టుకుని బలవంతంగా ఈడ్చుకొస్తున్నారు బయటకు.

'భయ్యా....ఆహిస్తా...( అన్నా...మెల్లగా...) అంటున్నాడు గాభరాగా ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి ఆ నలుగురితో. బహుశా ఆ అబ్బాయి తండ్రేమో. తల్లి అనుకుంటా....నోట్లో పమిట చెంగు అదిమి పెట్టుకుని తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గుమ్మం దగ్గర కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్లంతా పోగై ఆవిడను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయసాగారు. తండ్రేమో ఆ పిల్లాడితో కలిసి లిఫ్ట్‌లో కిందకి వెళ్లిపోయాడు. మౌనంగా వాళ్లనే అనుసరించింది కనూప్రియా సింగ్. కింద అంబులెన్స్‌లోకి ఎక్కించారు ఆ పిల్లాడిని బలవంతంగా. ఇంకా అరుస్తూ గింజుకుంటూనే ఉన్నాడు ఆ పిల్లాడు. కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.. తండ్రీ అంబులెన్స్ ఎక్కగానే అక్కడ్నుంచి కదిలింది అది.

'క్యా హువా భయ్యా...' పక్కనే ఉన్న వాచ్‌మన్‌ను అడిగింది కనూప్రియ.
'క్యాబోలూ మేడం...అంటూ చెప్పసాగాడు...' 304 వాళ్ల అబ్బాయండి....టెన్త్ చదువుతున్నాడు. ఎప్పుడు అలవాటైందో తెలియదు కాని డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. ఆరునెలల నుంచైతే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇంట్లో డబ్బులు పోతుంటే....ఎందుకో అనుమానం వచ్చి వాళ్ల నాన్న ఆరా తీస్తే అన్ని విషయాలు బయటపడ్డాయి. స్కూల్‌కని ఇంట్లోంచి వెళ్తున్నాడు కాని అటెండెన్స్ లేదట.

సెకండ్ టర్మ్ ఫీజు కట్టమని డబ్బులిచ్చి పంపితే...ఆ డబ్బుతో డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసింది. కానీ అప్పటికే శృతిమించిపోయింది. ఇప్పుడు డీ ఎడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నారు మేడం...చాకులాగా ఉండేటోడు పిల్లోడు... ఎట్ల అయిపోయిండు. ఫుట్‌బాల్ బాగా ఆడేవాడు. చాంపియన్ అయితడని కలలు కన్నడు వాళ్ల నాన్న...ప్చ్,...పిల్లల్ని కంటం కాని వాళ్ల తలరాతలను కంటమా..?' అంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు వాచ్‌మన్.

హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్
అంతా విన్న కనూప్రియాసింగ్ దిగాలు పడింది. ఆఫీస్‌కు వెళ్లిందే కాని మనసు మనసులో లేదు. డ్రగ్స్ దుష్ప్రభావాలను, వాటి బారిన పడుతున్న యువతకు సంబంధించిన సమాచారాన్ని చూసింది నెట్‌లో. ఇంకా దిగ్భ్రమ చెందింది తెలిసిన వివరాలను చూసి. లాభం లేదు...జాతి భవిష్యత్తు ఇలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఏదైనా చేయాలి అని గట్టిగా అనుకున్న కనూప్రియాసింగ్ ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఉన్న స్నేహితులందరికీ ఫోన్ చేసి అంతకుముందు రోజు తమ అపార్ట్‌మెంట్లో జరిగిన విషయాన్నంతా చెప్పింది పూసగుచ్చినట్టు.

తర్వాత తనకు వచ్చిన ఆలోచనలూ పంచుకుంది. 'నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని...ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిన పనులు. మనకెక్కడ వీలవుతుంది' ఒక స్నేహితుడి కామెంట్. 'బాగా చెప్పావు. స్వంత పనులకే టైమ్ దొరక్క ఛస్తుంటే...ఇంకా ఈ సమాజసేవను ఎక్కడ నెత్తినెట్టుకునేది?' ఇంకో స్నేహితురాలి విరుపు. దాదాపు అందరూ కుదరదనే తేల్చారు.

'ఒక్కసారి ఆలోచించండి...రేప్పొద్దున ఈ జాబితాలో మన పిల్లలూ ఉండొచ్చు' హెచ్చరించింది కనూప్రియ.
'మన పిల్లలా..?' ఉలిక్కిపడ్డారు అంతా.
'అవును. మనమేమీ ఈ సమాజానికి దూరంగా తీసుకెళ్లి వాళ్లను పెంచలేం కదా. పరిస్థితుల నుంచి పారిపోయే కంటే. నెమ్మదిగా పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్..మనకు సెలవు దొరికిన సమయాల్లో స్కూళ్లకు వెళదాం. డ్రగ్స్, వాటి దుష్ప్రభావాలు గురించి పిల్లలకు అవగాహన కల్పిద్దాం ' అని ఒప్పించే ప్రయత్నం చేసింది.

అందరూ ఆలోచించి కనూప్రియాసింగ్ ప్రతిపాదనకు ఓటేశారు. అట్లా రూపుదిద్దుకుంది డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పనిచేసే 'హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ సొసైటీ' అనే సంస్థ.
వెబ్‌సైట్‌లో
ముందుగా పాఠశాల యాజమాన్యాల అనుమతి తీసుకుంటూ...వారాంతపు సెలవుల్లో హైస్కూలు పిల్లలకు డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రారంభించారు ఈ స్నేహితుల బృందం. ఆ బృందంలో ఒకరైన ఎల్లిగారం నాగరాజు హైదరాబాదులో ప్రాపర్టీమేనేజ్‌మెంట్ కన్సల్టన్సీని స్థాపించి ఓ వైపు వ్యాపారం చేసుకుంటూనే మరోవైపు హ్యాపీలైఫ్ వెల్‌ఫేర్ పనులనూ కొనసాగిస్తున్నారు. బోయిన్‌పల్లిలో నివాసముంటున్న నాగరాజు ఆ దగ్గర్లోని స్కూళ్లకు వెళ్లి డ్రగ్స్ మీద అవగాహన కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంస్థ తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాల వివరాలతో 'హ్యాపీలైఫ్‌వెల్‌ఫేర్. ఒఆర్‌జి (జ్చిఞఞడజూజీజ్ఛఠ్ఛీజూజ్చట్ఛ.ౌటజ) అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది.

విశేష స్పందన
తమ వెబ్‌సైట్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్తూ ఇ. నాగరాజు 'మా ఈ కృషిని కేవలం స్కూలు యాజమాన్యాలే కాదు...తల్లిదండ్రులూ గుర్తించడం మొదలుపెట్టారు. ఎంతోమంది పేరెంట్స్ మా సంస్థలో సభ్యులమవుతామని ముందుకు వస్తున్నారు. చాలామంది సభ్యులయ్యారు కూడా. మా సేవలు ముంబై, బెంగుళూరు వంటి అన్ని ప్రధాన నగరాలకూ విస్తరించాయి. ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతున్నాం.

హైదరాబాదులో రోజూ పేపర్లలో వస్తున్న డ్రగ్స్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే...మా కార్యక్రమాలను ఇక్కడ ఇంకా విస్తృతం చేయాలని నిర్ణయించాం. జనవరిలో మా ఢిల్లీ బృందం కూడా ఇక్కడికి రానుంది. ఇక్కడ తల్లితండ్రులకూ అవగాహనా క్యాంపులు నిర్వహించాలనుకుంటున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ మాది. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి చేరొచ్చు. ఒక్క స్కూలు పిల్లలకే కాదు కాలేజీ విద్యార్థులకూ అవగాహనా కార్యక్రమాలున్నాయి.
డ్రగ్స్ బారిన పడ్డ విద్యార్థులను కాపాడేందుకు కౌన్సిలింగ్, డీ ఎడిక్షన్ లాంటి సేవలనూ అందిస్తున్నాం. జంటనగరాల తల్లితండ్రులను మేము కోరేది ఒక్కటే...మా సేవలను తీసుకోవడమే కాక మా సంస్థలో చేరి మీరూ మీకు తెలిసిన వాళ్లను చైతన్యపర్చండి. జాతి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడండి' అని విన్నవించారు.
సరస్వతి రమ 
ఫోటోలు: రాజ్‌కుమార్

Thursday, December 9, 2010

పెళ్లకాని ప్రసాదులు * యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ....

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు. ఆ ముచ్చట్లో పెళ్లి కూడా ఒకటి. అయితే ఈ మధ్య యువకులు వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కళ్యాణపీట మీద కూర్చోవడం ఆలస్య మవుతుండడంతో పెళ్లికాని ప్రసాదులుగా పేరు తెచ్చుకుంటున్నారు. కెరీర్‌కు అధికంగా ప్రాధాన్యతనిస్తూ తమ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమం లో పెళ్లికాని ప్రసాదుల వయస్సు మూడు పదులకు చేరుకోవడం, దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యువతీ యువలకులకు తలంబ్రాలు తలమీద పోయించుకోవడానికి అడ్డువస్తోన్న కారణాలెన్నో ఉన్నాయి...

marriageప్రతి ఏడాది రెండు, మూడు పెళ్లిళ్ల సీజన్‌లు ఉంటాయి.అనుకూలంగా ఉండే పెళ్లి ముహూర్తాలను పెట్టుకొని వివిధ సమయాల్లో యువతీ యువకులు పెళ్లిచేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్‌ నగరంలోని యువతీ యువకులు తమ కెరీర్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతే పెళ్లిచేసుకోవాలని వారు భావిస్తూ తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణం వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే కాదు, కుదేలయిన అనేక రంగాల వల్ల నగర యువత కొంతమంది పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు.దీంతో వారి వయస్సు 30కు చేరుకోవడంతో పాటు కొన్నిసార్లు ఆ వయస్సు కూడా దాటి పోతోంది.

నగరాల్లోనే...
ప్రధానంగా నగరాల్లోని తల్లిదండ్రులు పిల్లల చదువుపెైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు అనుకున్నవారు పిల్లలకు కళ్యాణం చేస్తున్నారు. తరువాత వారి చదువుని కొనసాగిస్తున్నారు.మరికొంత మంది ఉద్యోగం వచ్చే వరకు ఎదురుచూస్తున్నారు. అలా అబ్బాయిలకు దశాబ్దంన్నర క్రితం 21 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. అప్పుడు అబ్బాయిలకు 25 దాటగానే పెళ్లికాని ప్రసాద్‌లని పిలిచేవారు. అయిదు,ఆరు సంవత్సరాల నుంచి ఆ వయసు క్రమేణా పెరుగుతోంది. ఇప్పుడు 26, 27 ఏళ్లు వచ్చి నా ఏమంత వయసు వచ్చింది అని సమర్ధించుకునేవారు ఎక్కువెై పోతున్నారు.ఉద్యోగం రేపో మాపో వచ్చేస్తోంది. ఉద్యోగం రాగానే తలంబ్రాల కార్యక్రమమే అని సమాధానమిస్తున్నారు.

నౌకరి సంపాదించిన తరువాతనే పెళ్లి చేసుకోవడానికి యువత ఆసిక్తి చూపిస్తున్నారు. అలా ఎదురు చూస్తు 30 ఏళ్లు దాటిపోయినవారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. పెరిగిన పోటీ, సవాళ్లతో యువత పోరాడుతోం ది. ఉద్యోగం సంపాదించినా కొంతమంది పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వచ్చేది తక్కువ జీతం, అది నా అవసరాలకే సరిపోవడం లేదు. ఇంకా వచ్చే భార్యని ఎలా పోషించను అని అం టున్నారు. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తున్నా తప్పించుకుంటున్నారు.వేతనాలు పెరిగిన వెంటనే ఇంటి వాడినవడానికి సిద్ధమని హామీ ఇస్తున్నారు.

యువకుల అభిప్రాయాలు... :
ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఈ నాలుగురోజులెైనా బిందాస్‌గా గడపనీ అని చెప్పేవారు ఒకరెైతే, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదని మరొకరు, ఉద్యోగంచేసే అమ్మాయి ఉండాలని కోరుకునే యువకులు నేడు ఎందరినో చూడవచ్చు.

అమ్మాయిలదీ అదే వరుస... :
BRIDGEతమ కాళ్లఫై నిలబడాలని అమ్మాయిల్లో పట్టుదల ఎక్కువగా కనిపిస్తోంది. కాబోయే భర్త తెచ్చే జీతం మీద ఆధారపడేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది.అబ్బాయిలకు సరిసమానంగా నేడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి కి అబ్బాయిల కంటే పెళ్లిచేసుకోమని ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.అయినా తల్లిదండ్రులకు నచ్చచెప్పినచ్చి న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులెైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు.వివాహం ఆలస్యమైనా జీవితంలో స్థిరపడడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు.

పల్లెల్లో... :
ఉద్యోగాలఫై ఆధారపడని, కార్మికులుగా, కూలిపనిగా చేసే గ్రామీణ కుటుంబాల్లో ఇది వరకు అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. దాన్ని పెద్ద తప్పుగా భావించేవారు కాదు. గ్రామాల్లో అబ్బాయి లు ప్రస్తుత సమాజంపెై అవగాహన ఏర్పరుచుకుంటున్నా రు. 25 ఏళ్లు కూడా లేవు నాకింతలోకే పెళ్లి ఎందుకని తల్లిదండ్రులను అడుగుతున్నారు. పెద్దలు ఇతర కుటుం బ సభ్యుల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తోందని యువకులు వాపోతున్నారు. పల్లెల్లో చెల్లెలికి, అక్కకి పెళ్లి కాలేదని వయసు పెరిగిపోయే వారు ఎక్కువగా కనిపిస్తారు.

పల్లెపడుచులు... :
పల్లెల్లో అబ్బాయిగాని, అమ్మాయి పుట్టగానే వారికి జోడిని కుదుర్చుకోవడం ఆచారం. రక్తసంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు వయసు రాగానే కళ్యాణం కానిచ్చేవారు. ఇలా అనేకచోట్ల జరుగడం తెలిసిందే. క్రమంగా పల్లెటూర్లలో కూడా మా ర్పు వస్తోంది. ఆడపిల్లకి పెళ్లి అయ్యేవరకు చదివిస్తున్నారు.అంటే వీరి ఉద్దేశ్యం పదవ తరగతి వరకు. పదవ క్లాసుకు ముందు కూడా మంచి వరుడు దొరకగానే పెళ్లి చేసేస్తున్నారు. ఎక్కువ ఆస్తి ఉన్నవారు, తక్కువ కట్నం అడిగేవారు వస్తే అమ్మాయిలకు16 ఏళ్లు దాటకపోయినా మూడు ముళ్లు వేయించేస్తున్నారు.

మార్పు సహజం... :
యువతలో కాలనుగుణంగా చైతన్యం  వచ్చింది. సాదాసీదాగా బతికేయాలని అనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఏ రంగమైనా తమకంటూ గుర్తింపు రావాలని యువతీ యువకులు తపిస్తున్నారు. దాంతో పోటీ పెరగడంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి కొంత సమయం పడుతుందని ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో పడి వయసు గురించి పట్టించుకోకపోతే సంతాన సాఫల్య సమస్యలను ఎదుర్కోవలిసి ఉంటుందని వెైద్యులు తెలియచేస్తున్నారు. లక్ష్యంపెై స్పష్టత, ఆత్మవిశ్వాసం తోడుంటే మూడు పదుల వయసు వరకూ వేచి చూడకుండా విజయాలను సొంతం చేసుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Saturday, November 27, 2010

400 ఏళ్లు..వెనక్కి! - ఆటోచెప్పే భాగ్యనగర కథ

నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ పేరుతో ఉత్సవాలు కూడా జరుపుకున్నాం. కాని నిజంగా మనకు మన భాగ్యనగరం గురించి తెలిసింది ఎంత? అప్పటి వీధులు ఎలా ఉండేవి? మనుషులు ఎలా ఉండేవారు? వేషభాషలు ఎలా ఉండేవి? కళలు, సంస్కృతి ఎలా ఉండేవి? పాత ఫోటోల్లోనో, పీరియడ్ సినిమాల్లోనో తప్ప వాటి గురించి మనకేం తెలుసు? తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత ఉన్నా అన్నిట్నీ ఒకేచోట తెలుసుకునే మార్గం ఇప్పటిదాకా లేదు మనకు. ఇప్పుడు 'హైదరాబాద్ గ్రాఫిక్ నవల' రూపంలో ఆ అవకాశం వచ్చింది.

ఏమిటీ నవల?
నాలుగొందల ఏళ్ల నాటి హైదరాబాద్ చరిత్ర యావత్తూ కాలానుగుణంగా బొమ్మల కథ రూపంలో చూపించడం హైదరాబాద్ గ్రాఫిక్ నవల ఉద్దేశం. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'యుగంతర్' చేపట్టిన 'ఆర్కైవ్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్'లో భాగంగా ఈ మహత్తర కార్యానికి ఇద్దరు కుర్రాళ్లు పునుకున్నారు. వాళ్లు జయదీప్, జస్‌రామన్‌లు. ఇప్పటికే ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తిచేశారు కూడా.

సులువేం కాదు..
గ్రాఫిక్ నవలను తయారుచేయడం అంత సులువేం కాదు. ప్రతి ఎపిసోడ్‌లో ఎన్నో పేజీలు, ప్రతి పేజీలో ఎన్నో ప్యానల్స్ ఉంటాయి. ప్రతి ప్యానల్‌లో కనిపించే మనుషులు, కట్టడాలు, వీధులు, వస్తువుల కోసం కొన్ని వందల ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అనుకున్న యాంగిల్‌లోనే ఉండాలి. స్క్రిప్ట్, విజువలైజేషన్ పకడ్బందీగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు.. స్క్రిప్ట్‌కి తగ్గట్లుగా బొమ్మలు గీసే ఆర్టిస్ట్‌కి ప్రతి ప్యానల్ ఎలా ఉండాలన్నది అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. మధ్యలో ఎన్నో చర్చలు, మార్పులు, చేర్పులు. ఇవన్నీ జరిగితే తయారయ్యేది ఒక్క ప్యానల్ మాత్రమే. జయదీప్, జస్‌రామన్‌లు ఇప్పటి వరకు ఈ గ్రాఫిక్ నవలకు సంబంధించి రెండు ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీనికంటే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని డాక్యుమెంటరీ తీయడం ఎంతో సులువని వారు పేర్కొంటారు.

'ఆటో'యే హీరో!
మనకు ఎన్నో ఇంగ్లీష్ బొమ్మల కథలు తెలుసు. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. సూపర్‌మాన్, బ్యాట్‌మాన్, స్పైడర్‌మాన్, ఫాంటమ్.. ఏ బొమ్మల కథ తీసుకున్నా సరే అందులోని హీరో.. విలన్లతో సాగించే వీరోచిత పోరాట సన్నివేశాలు పిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ గ్రాఫిక్ నవలలో కూడా హీరో ఉంటాడు. కాకపోతే అది ఒక ఆటో. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మీకు 'టైం మెషిన్' తెలుసుకదా? హాలీవుడ్‌లో ఈ థీమ్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. టైం మెషిన్‌లో కూర్చుని ఒక మీట నొక్కగానే అది కాలంలో ముందుకో, వెనక్కో తీసుకెళుతుంది. మన తెలుగులో కూడా బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్య 369' సినిమాలో కూడా ఇదే ఇతివృత్తం. సరిగ్గా ఈ ఆటో కూడా అలాంటి టైం మెషినే. ప్రతి ఎపిసోడ్‌లో ముందుగా ఆటో వస్తుంది.

అందులో ప్రయాణికుడు ఎక్కగానే అది భాగ్యనగర చరిత్రలో కొన్నేళ్ల వెనక్కో, ముందుకో తీసుకెళ్లి వదిలేస్తుంది. ఇక అక్కడ్నించి కథ మొదలవుతుందన్నమాట. ఆ కాలంలో మన భాగ్యనగర వీధులు ఎలా ఉండేవో, మనుషులు ఎలా ఉండేవారో, ఏక్కడ ఏయే కట్టడాలు ఎలా ఉండేవో.. అన్నీ కాలానుగుణంగా కనిపిస్తూ పాఠకులకు కనువిందు చేస్తాయి. ఇలా మొత్తం 400 ఏళ్ల భాగ్యనగర చరిత్ర కాలాన్ని విభజించుకుంటూ ఆయా కాల, మాన పరిస్థితులలో భాగ్యనగర వైభవాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు ఈ గ్రాఫిక్ నవల ద్వారా కృషి చేస్తున్న జయదీప్, జస్‌రామన్‌లు కొత్తరకం చరిత్రకారులుగా అందరి ప్రశంసలు పొందడం ఖాయం. హైదరాబాద్ గ్రాఫిక్ నవల మొదటి ఎపిసోడ్, ఇతరత్రా వివరాల కోసం www.facebook.com/hydgraphicnovelను చూడవచ్చు.
ఈ గ్రాఫిక్ నవల ప్రాజెక్ట్ ఆలోచన మీదేనా? లేకపోతే..
జయదీప్: ఈ ఆలోచన పూర్తిగా మాదే. నిజానికి దీనికంటే ముందు మేం సత్యం ఫౌండేషన్ వాళ్ల కోసం ఒక ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేశాం. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. పాత తరం వాళ్లలో అన్ని వర్గాలకు చెందిన 30 మందిని ఇంటర్వ్యూ చేశాం. ఇంటర్వ్యూ అంటే.. అసలు గతంలో హైదరాబాద్ ఎలా ఉండేదో, ఎక్కడెక్కడ ఏమేం ఉండేవో, ఆ రోజుల్లో ప్రజల జీవన విధానం, స్థితిగతులు, సంప్రదాయాలు, సంస్కృతి ఎలా ఉండేవో అవన్నీ వాళ్ల నుంచి తెలుసుకున్నాం. అదంతా నేటి హైదరాబాదీలు ఏమాత్రం ఎరగరు.

జస్‌రామన్: అవన్నీ వింటున్నప్పుడు మాకు హైదరాబాద్ గురించి ఏదైనా డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. తీయొచ్చు.. కానీ నాలుగొందల ఏళ్లు వెనక్కి వెళ్లి చూపించడం ఎలా? ఇదే పెద్ద సమస్య అయింది. ఆనాటి వీధులు ఇప్పుడు లేవు. పెద్ద పెద్ద కట్టడాలు, స్మారక చిహ్నాలు కూల్చివేతలకు గురయ్యాయి. అంతెందుకు.. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు తిరిగొచ్చి హైదరాబాద్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటిది నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరంను చూపించడం ఎలా? పోనీ సెట్టింగ్స్ వేసి తీద్దామా అంటే.. ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

జయదీప్: సెట్టింగ్స్ వేయడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే ఆనాటి వీధులు, కట్టడాలు, స్మారక చిహ్నాల గురించి తెలిసిన వాళ్లు ఎవరున్నారో, ఎక్కడున్నారో పట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా అప్పుడే మాకు ఈ ఐడియా వచ్చింది. ఇతర మార్గాలేవీ వర్కవుట్ అవవని నిర్ణయించుకున్నాక, గ్రాఫిక్స్.. అంటే బొమ్మల రూపంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఇందులో మాకెలాంటి ఇబ్బందీ కనిపించలేదు. నాలుగొందల ఏళ్ల క్రితం భాగ్యనగరం ఎలా ఉండేదో, ఎక్కడ ఏమేం ఉండేవో ఇప్పటికే మాకు ఒక అవగాహన ఉంది కదా. ప్రతి సీన్ ఆర్టిస్టుకి అర్థమయ్యేలా చెబుతాం. ఆ ప్రకా రం గ్రాఫిక్ తయారవుతుంది. ఇదీ మా ఆలోచన.

మరి, ఈ 'యుగంతర్' వాళ్లతో పరిచయం ఎలా?
జస్‌రామన్: యుగంతర్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులోని డైరెక్టర్లలో కె.లలిత ఒకరు. ఆవిడ మాకు ఆంటీ అవుతారు. అప్పటికే వీళ్లు 'ఆర్కైవ్స్ హైదరాబాద్' అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంటరీలు తీసి భద్రపరచడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. మా గ్రాఫిక్ నవలా ప్రాజెక్టు వీరికి కూడా నచ్చడంతో అందుకు అవసరమయ్యే నిధులు, ఇతర సహాయ సహకారాలు అందజేసేందుకు యుగంతర్ సంసిద్ధమైంది. అలా ఈ ప్రాజెక్ట్ ప్రాణం పోసుకుంది. గత ఏడాది నవంబర్‌లో గ్రాఫిక్ నవలకు సంబంధించిన పని ప్రారంభించాం. ఇప్పటి వరకు రెండు ఎపిసోడ్లు పూర్తి చేశాం. మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రాలు మా ఫేస్‌బుక్ పేజీలో పెట్టాం. మంచి స్పందన వచ్చింది.

కథ ఎక్కడ్నించి, ఎలా మొదలవుతుంది?
జయదీప్: దాదాపు అరవై ఐదేళ్ల క్రితం.. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో కథ మొదలవుతుంది. ప్రముఖ వేటగాడు సర్ పెర్సీ పంజాగుట్ట అటవీప్రాంతంలో రాక్షస బల్లుల కోసం తిరుగాడుతూ సమీపంలో ప్రవహిస్తున్న నది నీటి ప్రవాహంలో ఏదో కొట్టుకొస్తుండడం గమనిస్తాడు. తీరా దగ్గరికి వచ్చేసరికి అదొక అతి పెద్ద రాక్షస బల్లి. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెడుతుండగా 'టైం మెషిన్ ఆటో' ఎదురవుతుంది.

"త్వరగా పోనీ.. ఇరవై ఒకటో శతాబ్దానికి..'' అంటూ ఆటో ఎక్కేస్తాడు. అయితే ఆ హైదరాబాదీ ఆటో డ్రైవర్ తాపీగా.. "ఎంతిస్తావ్.. మీటర్ మీద ఎక్స్‌ట్రా ఇస్తావా..?'' అంటూ బేరం మొదలెడతాడు. ఒక వైపున తరుముకొస్తున్న రాక్షసబల్లి.. మరో వైపున ఆటోవాలా బేరసారాలు.. దీంతో సర్ పెర్సీకి తిక్కరేగిపోతుంది. "జల్దీ.. జల్దీ..'' అని తొందరపెట్టి ఎట్టకేలకు రాక్షస బల్లి నుంచి తప్పించుకుని, బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నగరంలోకి వచ్చిపడతాడు. ఇలా మొదలవుతుంది మొదటి ఎపిసోడ్ కథ. ఈ నవల మొత్తం పూర్తి అవడానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ఏడాది పాటు ఎంతో కష్టపడితే ఇప్పటికి రెండు ఎపిసోడ్లు అంటే.. దాదాపు 35 పేజీలే పూర్తిచేయగలిగాం.

ఎందుకింత సమయం?
జస్‌రామన్: అంటే.. మేం ఇక్కడుంటే మా ఆర్టిస్ట్ ఎక్కడో ఉంటాడు. ఉదాహ రణకు మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన బొమ్మలన్నీ హర్షో మోహన్ చత్తోరాజ్ గీశారు. ఈయన కోల్‌కతాలో ఉంటారు. మేం ఈమెయిల్ ద్వారా ప్రతి సీన్ ఆయనకి వివరించి, ఆ సీన్ ఎలా ఉండాలో కూడా రఫ్‌గా మేం గీసి, దానికి సంబంధించిన ఫొటోలన్నీ ఆయనకు పంపితే వాటిని ఆధారంగా చేసుకుని, సీన్ అర్థం చేసుకుని ఆయన బొమ్మలు గీస్తారు. ఈ ప్రక్రియలో ఈ-మెయిల్స్, ఫోన్‌కాల్స్ ద్వారా మేం పరస్పరం సంప్రదించుకుని, సందేహాలు తీర్చుకోడానికి, సూచనలు ఇచ్చుకోవడానికే అధిక సమయం ఖర్చయిపోతోంది.

ఇంత ఇబ్బంది పడేకంటే ఇక్కడే ఆర్టిస్ట్‌ని చూసుకోవచ్చు కదా?
జయదీప్: చూసుకోవచ్చు.. కానీ ఇక్కడి ఆర్టిస్టులందరూ చాలా బిజీ. వీళ్లంతా ఇక్కడ ఉంటూ విదేశాల నుంచి గ్రాఫిక్స్,యానిమేషన్లకు సంబంధించి వచ్చే పనులు చేస్తున్నారు. ఇక్కడి ఆర్టిస్టులను తప్పు పట్టాలన్నది కాదు మా ఉద్దేశం. కమర్షియల్ వర్క్స్ చేస్తే వాళ్లకు రూపాయలు కాదు, డాలర్స్ వస్తాయి. అలాంటి సమయంలో మేం ఇచ్చే రూపాయలు పుచ్చుకుని మా వర్క్ చేయమని మేం అడగలేం కదా! అందుకని మా ప్రాజెక్ట్ కోసం మేం ఇతర ప్రాంతాల ఆర్టిస్ట్‌లపై ఆధారపడ్డాం. మా గ్రాఫిక్ నవలకు సంబంధించి ఒకో ఎపిసోడ్ బొమ్మలు ఒకో ఆర్టిస్ట్ చేత వేయిస్తున్నాం. మొదటి ఎపిసోడ్‌కు హర్షో మోహన్ చత్తోరా బొమ్మలు గీస్తే, రెండో ఎపిసోడ్‌కు అర్జెంటీనా ఆర్టిస్ట్ ఫెదరికో జూమెన్ గీశారు. అలా ప్రతి ఎపిసోడ్‌కు ఆర్టిస్ట్ మారిపోతారు.

మరి ఆర్టిస్ట్ మారినప్పుడు బొమ్మల శైలి కూడా మారుతుంది కదా?
జయదీప్: మారుతుంది. అయితే కాలం కూడా మారిపోతుందిగా. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చార్మినార్, దాని పరిసర ప్రాంతాలు ఉన్నాయనుకోండి. నాలుగొందల ఏళ్ల క్రితం ఉన్నట్లే మూడొందల ఏళ్ల క్రితం ఉండదు కదా. కాలంతోపాటే ఆ ప్రాంతం కూడా మారుతుంది. మరో వంద సంవత్సరాలు గడిచాక ఇంకా మారిపోతుంది. కాబట్టి బొమ్మలు కచ్చితంగా మారాలి. స్క్రిప్ట్ మాత్రం మారిపోకూడదు, అదీ అసలు విషయం.
ఓకే, చిన్న వయసులోనే పెద్ద బాధ్యత భుజాన వేసుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!
- వై.రమేష్‌బాబు,

Friday, November 19, 2010

బ్యాడ్‌ హ్యాబిట్‌

కాలేజీ ఫ్రెషర్స్‌ డే పార్టీ జరుగుతోంది. అందులో ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ లోపుగా ఒక విద్యార్థి మైకంతో కళ్లు తిరిగి పడిపోయాడు. అతను మద్యం ఎక్కువగా సేవించడం వల్ల తూలి పడ్డాడని తెలుసుకోవడానిి మిగతా వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆ పార్టీలో దాదాపు అందరూ డ్రింక్‌ తాగుతున్నవారే. చివరకు ఆ అబ్బా యిని తమ ఫ్రెండ్స్‌ ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఆ అబ్బాయి విపరీతమైన హ్యాంగోవర్‌తో బాధపడడంతో పాటు తన మొహాన్ని తన తల్లిదండ్రులకు చూపించడానికి సిగ్గుపడ్డాడు. ఈ విధమైన పరిస్థితులు నేడు చాలా మంది యంగ్‌ స్టర్స్‌కు ఎదురవుతూనే ఉన్నాయి.

పార్టీలలో, పబ్‌లలో మిత్ర బృందమంతా కలుసుకున్నప్పుడు బీర్‌, ఆల్క హాల్‌ తీసుకోవడం నేడు ఫ్యాషన్‌గా భావిస్తున్నారు కొంతమంది కుర్ర కారు. అబ్బాయిలే కాకుండా నేడు కొంతమంది అమ్మాయిలు కూడా మద్యం సేవించడం నేర్చుకుంటున్నారు. ఇలా సరదా కోసం అలవాటు చేసుకున్నవే చివరకు వ్యసనాలుగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీ లైనంత వరకు వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

మద్యంతో హాని...
badhabit1మద్యం తాగడం వల్ల ఎలాంటి హాని కలుగుతుందో చదువుకున్నవారికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ పబ్బులు, పార్టీలలో డ్రింకింగ్‌ తప్పని సరి అంటున్నారు నేటి యంగ్‌స్టర్స్‌. యంగ్‌ జనరేషన్‌ కలిసినప్పుడు ఫన్‌ ఉండాలంటే ఈ మాత్రం రిస్క్‌ తీసుకోవాల్సిందేనని అంటున్నారు. అదీకా కుండా ఇంతకు ముందు పార్టీలకు యువకులు మాత్రమే హాజరయ్యేవారు. ఇందులో వారు మద్యం సేవించేవారు. నేడు ఆడా, మగా తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లడం అలవాటయిపోయింది. అందువల్ల ప్రస్తుతం తమ స్నేహితులతో (బాయ్‌ ఫ్రెండ్స్‌) కలిసి కొందరు అమ్మాయిలు కూడా డ్రింక్‌ చేయడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌ అయింది. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌ అందరం కలిసినప్పుడు సరదాగా కొంచెం తాగడంలో పెద్ద తప్పులేదు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్‌ అని చెప్పుకొంటున్నారు నేటి యువతీ యువకులు. మన దేశ చట్టం ప్రకారం 21 సంవత్సరాలు నిండని వారికి మద్యం అమ్మ రాదని రూలు ఉంది. షాపుకు వచ్చిన విద్యార్థుల ఐడెంటీ కార్డును పరిశీలించిన తరువాతే అమ్మాలని ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది తమకు కావలసిన డ్రింక్స్‌ను కొనుగోలు చేస్తున్నారని పెద్దలు వాపోతున్నారు.

తక్కువ మోతాదులో...
badhabitస్నేహితులందరం ఎప్పుడైనా కలిసినప్పుడు, క్లబ్‌లకు వెళ్లినప్పుడు తప్పకుం డా బీర్‌కానీ, ఆల్కహాల్‌కానీ తీసుకుంటాం. అది కూడా తక్కువ మోతాదు లోనే పుచ్చుకుంటాం. దీనివల్ల హాని సంగతి కాసేపు పక్కన పెడితే అమ్మాయి లను ఆకట్టుకోవడానికి ఇది షార్ట్‌ రూట్‌ అని నేననుకుంటున్నాను. అమ్మా యిల ముందు అటెన్ష్‌గా, స్టైల్‌గా మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు అది చాలా చక్కగా పనిచేసి నాలోని మరో కొత్త వ్యక్తి బయటకు వచ్చి పార్టీలో ఆనందంగా గడపగల్గుతున్నాను’ అని 18 సంవత్స రాల స్టూడెంట్‌ విష్ణు అంటున్నాడు.

జాగ్రత్తలు తీసుకుంటున్నారు...
నేటి రోజుల్లో చాలా మంది యూత్‌ లేట్‌నైట్‌ పార్టీలలో, పబ్బులలో డ్రింక్‌ చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా ఉం డేందుకు మందు తాగిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న చిట్కాల ను ఉపయోగించి తల్లిదండ్రుల నుంచి తప్పించుకుంటున్నారు. ‘ఒకసారి మా కాలేజీ మిత్రులతో పార్టీలో పాల్గొన్నాను. అపుడు వారి బలవంతం మీద మొదటిసారిగా మద్యం తీసుకున్నాను. తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు పేరెంట్స్‌ పసిగట్టకుండా ఉండేందుకు మౌత్‌ ఫ్రెషనర్‌ను ఉపయోగించి వారి నుంచి తప్పించుకున్నాను. ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా డ్రిం్‌ చేయాల్సి వచ్చినప్పుడు నా బ్యాగ్‌లో పిప్పర్‌మెంట్లు, మౌత్‌ఫ్రెషనర్‌ను తప్పకుండా తీసుకవెళతాను’ అని స్టూడెంట్‌ ప్రభాకర్‌ అన్నాడు.

గుణపాఠం నేర్చుకున్నాను...
రాత్రి పార్టీలలో డ్రింక్‌ చేసిన తరువాత రోజు ఉదయం హ్యాంగ్‌ఓవర్‌తో, తలనొప్పితో బాధపడాల్సి వస్తుంటుందని కొంత మంది యంగ్‌స్టర్‌ తమ అనుభవాలను చెబుతున్నారు. ‘నాకు మా కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే పార్టీలో ఒక చేదు అనుభవం ఎదురైంది. నాకు ఇంకా గుర్తుంది. ఆ పార్టీ అయిన తరువాత నా స్నేహితులే నన్ను మా ఇంటి వద్దకు చేర్చారు. ఎందుకంటే ఆరోజు రాత్రి దాదాపు ఐదు పెగ్గులకు మించి తాగడంతో నేను కిందపడిపోయాను. లేచే ఓపికలేక పోయింది. ఇది అయిన మరుసటిరోజు విపరీతమైన తలనొప్పి (హ్యాంగోవర్‌)తో బాధపడాల్సి వచ్చింది. అంతేకాకుండా తెల్లారి మా తల్లిదండ్రు లకు నా మొహం చూపించలేకపోయాను. సిగ్గుతో నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ ఆ సంఘటన వల్ల నేనొక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. పార్టీలలో సరదాల కోసం మందుకు బానిసలు కావడం తప్పని తెలుసుకున్నాను. తాగితేనే ఎంజాయ్‌ చేయగలమను కుంటే అసలు పార్టీలకే పోనవసరంలేదు’ అని 22 సంవత్సరాల సతీష్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

వ్యసనంగా మారే అవకాశం ఉంది...
యవ్వనంలో తాము చేసే పని చాలా కరెక్ట్‌ అని టీనేజర్స్‌ ఆనుకుంటారు. అది భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలను కలిగిస్తుందని తెలిసినా కూడా వాటివైపే మొగ్గుచూపుతారు. తాత్కాలిక సుఖం కోసం తమ అమూల్యమైన సమయాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. ‘ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలూ అబ్బాయిలూ అనే తేడాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇరువురూ వెళ్లడం పరిపాటయింది. ఇంతకు ముందు విదేశాల్లోనే ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోని నగరాలకు కూడా వ్యాపించింది. పబ్బులకు వెళ్లడం సాధారణ విషయంగా పరిగణించే స్థాయికి నేటి యంగ్‌స్టర్స్‌ వచ్చారు. ఇలా పబ్బుల్లో అబ్బాయితో సమానంగా యువతులు కూడా డ్రింక్‌ (మద్యం) తీసుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఇలాంటివి ముందు సరదాల కోసం అలవాటు చేసుకొన్నా చివరకు వ్యసనంగా మారుతుంది. ఎంజాయ్‌ చేయడం తప్పులేదు కానీ అందుకోసం ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావడం తమ భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని నేటితరం తెలుసుకోవాలి’ అని మాససిక నిపుణులు తెలియజేస్తున్నారు.
-ఎస్‌.అనిల్‌ కుమార్‌