Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts

Thursday, September 15, 2011

1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ జ్ఞాపకాలు- గాయాలు

సెప్టెంబర్ 17 దగ్గరపడింది. 63 ఏళ్ళ క్రితం నిజాంపాలన అంతమై నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు అది. చాలాకాలం దాన్ని 'విమోచన దినం'గా జరుపుకున్నా ఇటీవల కాలంలో దాన్ని 'విద్రోహ దినం'గా పరిగణిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఆనాటి పరిస్థితులను తెలియజేసే కొంతమంది కథనాలతో పరవస్తు లోకేశ్వర్ ఇటీవల తీసుకొచ్చిన 'నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవవీరులు, 1948 సెప్టెంబర్ పోలీసు యాక్షన్ జ్ఞాపకాలు - గాయాలు' పుస్తకం నుంచి వెంకటమ్మ అనే సీనియర్ హిందీ పండిట్ కథనాన్ని మీకు అందిస్తున్నాం...

"నా పేరు వెంకటమ్మ. సీనియర్ హిందీ పండిట్ టీచర్‌ను. ఇప్పుడు నా వయస్సు 55 సంవత్సరాలు. తేదీ జ్ఞాపకం లేదు. కాని 1944లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‌లనే. నాకప్పుడు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు. యాఖుత్‌పురా దగ్గర్ల ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ సంబరంగ తియ్యటి జిలేబీలు తిన్న. మా అమ్మమ్మ నన్ను వెంబడి పెట్టుకుని అవతలి బస్తీలకు తీసుకపోయి మూడు రంగుల జండాలను చూపెట్టింది. అంతా హడావుడి పండుగ వాతావరణం. లౌడ్ స్పీకర్లల్ల దేశభక్తి గీతాలు వస్తున్నయి. స్వాతంత్య్రం వచ్చింది అన్న మాటలు నా చెవులల్ల బడ్డయి. అయితే అది రెండవ స్వాతంత్య్రదినం, పోలీస్ యాక్షన్ జర్గిన తర్వాత 15-08-49 అని నాకు చాలా కాలానికి తెల్సింది.

నిజానికి హైద్రాబాద్ స్టేట్ ప్రజలకు అది మొదటి స్వాతంత్య్ర దినం క్రిందనే లెక్క.

సరే ఇప్పుడు నేను నిజాం పరిపాలన చివరి సంవత్సరాలలో జరిగిన రజాకార్‌ల దినాలు, 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీస్ యాక్షన్ సంగతులు, అవి మా కుటుంబంపై, ముఖ్యంగా నా బాల్యంపై వాటి ప్రభావం గురించి వివరిస్త. ఒక పెద్ద తుఫాను వచ్చినపుడు ఆ గాలివానకు ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మా ఎట్లా చలించి చెదిరి పోతయో అట్లనే మామూలు వ్యక్తుల జీవితాలు కూడా రజాకార్ మరియు పోలీస్ యాక్షన్ దినాల తాకిడికి చెల్లాచెదరై కష్టాలకు కన్నీళ్లకు గురయినాయి. అట్ల ఎంత మంది జీవితాలు, ఎన్ని కుటుంబాలు తల క్రిందులయినాయో? వాళ్లు హిందువులైతేనేం? ముస్లింలైతేనేం?

మా బాపుకు బీదర్ దగ్గరల టీచర్ ఉద్యోగం. నా బాల్యం అక్కడే గడచింది. కాని రాజాకార్ల గడ్‌బడ్‌లు ప్రారంభమయ్యేసరికి మా బాపు అమ్మను పిల్లలందర్ని హైద్రాబాద్‌ల అమ్మమ్మ ఇంట్ల వదిలిపెట్టిండు. నెలకో, రెండు నెలలకో ఒకసారి వచ్చిపోయేది. అవతల రజాకార్ల భయం, ఇంట్ల మా మధ్య ఎడబాటు. మా అందరి జీవితాలు అల్లకల్లోలం అయినాయి. అమ్మ - బాపులకే కాదు, మా చిన్నపిల్లల జీవితాలలో కూడా సుఖశాంతులు దెబ్బతిన్నాయి. అమ్మతోపాటు, మా అక్క, నేను, ఒక తమ్ముడు. పెరట్లో రెండు గదుల రేకుల షెడ్లో ఉండేవాళ్లం.

బాపు కోసం ఏడుస్తూ....

ప్రతిరోజు నేను మా బాపును తలచుకొని ఆయన కోసం బెంగతో ఏడ్చేదాన్ని. మా ఎడబాటుకు, దుఃఖానికి మూలకారణాలు నాకు తెలియవు కదా! రాత్రిళ్లు బాపు కావాలని నేను ఏడుస్త్తుంటే అక్క అమ్మలాగ వోదార్చేది. అప్పుడు అమ్మ ఉస్మానియా దవఖానలో ప్రసవం కోసం ఉంది. నిండు గర్భిణి. నా మోకాళ్లకన్నీ గజ్జిపుండ్లు అయినవి. క్రిందపడినపుడు అవి పగిలి రక్తం, చీము కార్తుంటే ఓదార్చేవారు లేక బాపూ బాపూ అని ఏడ్చిన. అక్క ఇంటికీ దవఖానకు కాలినడకన పొద్దు మాపు చెక్కర్లు కొట్టేది. రిక్షాలెక్కటం పెద్ద విలాసం, పైస గల్లోల్ల పని. ఇక ఇంట్ల మా తమ్మునికి పెద్ద జ్వరం. డాక్టర్లు, మందులు ఏమిలేవు. అవుతల బజార్లల్ల బస్తీలల్ల హిందు - ముస్లింల కొట్లాటలు, రజాకార్ల దౌర్జన్యాలు. నేను తమ్ముని మంచం పక్కనే వాణ్ణి చూస్తూ కూర్చునేదాన్ని. నాల్గురోజుల జ్వరం తర్వాత వాడికి పోలియో ఎఫెక్ట్ అయ్యి ఒక కాలు చచ్చు పడిపోయింది. అమ్మ పొత్తిళ్లల్లో ఆడపిల్లను పెట్టుకుని ఇంట్లకు రాంగనే కొడుకు కాలు కుంటి కాలయ్యిందని తెల్సి గుండెపగిలి పెద్దగ ఏడ్చింది. ఆ కాలం అట్ల ఆటుపోట్లకు, అలల తాకిడికి గురికాకపోతే, మా వ్యక్తిగత జీవితాలల్ల అటువంటి విషాదాలు జరుగక పోయేటివి కాదా?

పోలీస్ యాక్షన్ దినాలు సెప్టెంబర్ నెల కదా! అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు, చలి. ఆ వర్షం ముసురు చప్పుడుకు మా రేకుల షెడ్డు పెద్దగా శబ్దంచేసేది, ఇల్లంతా కారేది. రాత్రిల్లు నిద్ర కరువు. తమ్ముడు కాలు వేలాడేసుకుని మంచంలోనే ఉండేవాడు, అట్ల మా ఇంట్ల పేదరికంతో పాటు అవిటితనం కూడా తోడయ్యింది. కాలుకు నాటు వైద్యం చేయించింది అమ్మ. రోజుల తరబడి వాడికి చప్పిడి మెతుకులు, కారం పత్యం. వేడి పప్పన్నం కోసం రోజూ ఏడిచేవాడు. అదే నెలల వినాయక చవితి పండగ వచ్చింది. అమ్మమ్మ ఇంట్ల పాశం (పాయసం) సువాసనలు. దానికోసం వాడు సుదీర్ఘంగా ఏడుపు. అమ్మ బాలింత. చెల్లె పాలకోసం ఏడుపు. నేను బాపు కావాలని ఏడుపు. తమ్ముడు అవిటి వానిగనే కుంటుకుంటు రెండు మూడేండ్లు బ్రతికి, చివరికి ట్రాన్సిల్స్ రోగంతో చచ్చిపోయిండు. అప్పుడు వానికి ఆరేండ్లు. నిండ ఏడేండ్లు దాటకుండనే నూరేండ్లు నిండినయ్. ఈ విషాదాల కన్నీటికి మూల కారణాలు ఆనాటి సామాజిక పరిస్థితులే అని నేను బలంగా నమ్ముతున్నాను.

దినదిన గండంగా...

మా మామ కూడా స్కూల్ టీచర్ కనుక అన్ని సంగతులు ఆయనకు తెలుస్తుండేవి. రాత్రిపూట సిగరెట్ తాక్కుంట నిద్రపోకుండ, బెంచిమీదనే కూచోని, ఏదో దీర్ఘాలోచన చేస్తుండేవాడట. అమ్మ రాత్రిపూట నిద్రలేచి "ఏందన్నా అట్ల కూచున్నవ్, నిద్ర పోలేదా? అని అడిగితే "ఏం లేదమ్మా నిద్రపట్టలేదు'' అని దిగులుగ జవాబు ఇచ్చేటోడట. ఆ రోజులల్ల మా ఇండ్ల ముందుకు పొద్దుటిపూట మాదన్నపేట, సయిదాబాద్‌ల నుండి ఎరుకల ఆడవాళ్లు వచ్చి మాంసం అమ్మేటోళ్లు. గంపలల్ల వాట్ని పట్టుకొచ్చేది. వాళ్లు రవికెలు వేసుకోకపోయేది. వాల్ల నల్లటి శరీరాలు ఆ పొద్దుటపూట లేత ఎండలో మెరిసిపోవటం నేను బాగా గమనించేది.

మా మామ వాళ్లతో " రేపట్నించి మీరు రాకండి. పరిస్థితులు బాగలేవు, ఇట్ల తిరగకుండ్రి'' అని హెచ్చరించడం నాకు బాగా జ్ఞాపకముంది. యూనియన్ సైన్యాలు హైద్రాబాద్‌పై దాడి చోయబోతున్నాయని పుకార్లు మొదలయినాయి. నిజాం సర్కార్ ప్రతిరోజు రాత్రిపూట నగరంల బ్లాక్ అవుట్ చేసేది. నగరం అంతా చీకటి. కరెంట్ బంద్. బ్లాక్ అవుట్‌కు ముందు ఆకాశంలో ఎర్రలైట్ కాంతి వెలిగి పెద్దగా సైరన్ మోగేది, ఆ సిగ్నల్స్‌తో ఇండ్లల కూడా దీపాలు ఆర్పటం, కరెంట్ తీసేయటం చేయాలి. మా ఇంట్లో అందరు కూడా ఇంటి డాబా మీదికెక్కి విమానాలు వస్తున్నయా అని వాటి లైట్ల కాంతుల కోసం వెదికేవాళ్లం. విమానాలు వచ్చి మమ్మల్ని రక్షిస్తాయని ఎదురు చూసెటోళ్లం.

సరే పరిస్థితులన్నీ అట్ల ఉద్రిక్తంగ ఆందోళనగ ఉన్నప్పుడే బక్రీదు పండుగ సమీపించింది. ఆ పండుగకు కొన్ని రోజుల ముందు రజాకార్ల సమావేశంల దాని నాయకుడు కాసిం రజ్వీ ప్రసంగిస్తూ "ఈసారి బక్రీద్‌కు ఖుర్బానీగ గొర్రెల్ని కాదు, హిందువుల తలల్ని ఇవ్వాలని'' రెచ్చగొట్టే ఉపన్యాసం ఇచ్చిండు. కాని హిందువుల అదృష్టం కొద్దీ ఆ బక్రీద్ పండుగకన్న ముందే పోలీస్ యాక్షన్ జరిగి, హిందువులు రక్షింపబడ్డరు.

అయితే అతని ప్రకటన వినగానే హిందువుల గుండెలల్ల రైళ్లు పరిగెత్తినవి. ముఖ్యంగ హైద్రాబాద్ పట్నంల ఇక ఎట్లనన్న చావుతప్పదని, హిందువులు తాగటం, తినటం, విందులు చేసుకోవడం మొదలు పెట్టిండ్రు. మా మామ కూడా అన్ని కోపాలు తాపాలు మరచిపోయి ఇంట్ల పెద్ద దావతు ఏర్పాటు చేసిండు. పూరీలు, గారెలు, కోడిమాంసం, కల్లు, సారా అన్ని ఏర్పాట్లు చేసిండు. అందరికి దగ్గరుండి తృప్తిగ తినిపించిండు. అయితే ఆడోళ్లకు, పిల్లలకు ఈ అనుకోని సంబరాలేమిటో అర్థం కాలే. ఇప్పుడు పండుగలు ఏమీ లేవుకదా అని అడిగితే "మీకెందుకు తినరాదుండ్రి'' అని మెత్తగ కోపడ్డడు. కాని అసలు సంగతి చెప్పలే. మేము బెదురతమని, భయపడతమని. పోలీసు యాక్షన్ అయినంక తెల్లారి అసలు సంగతి చెప్పి"మనం బ్రతికి పోయినం. ఈ మిలిట్రీ రాకపోతే బక్రీద్ పండుగకు గొర్రెల్ని కోసినట్లు మనందర్నీ కోసేది'' అని సంతోషం ఆపుకోలేక అందర్ని కావలించుకుని ఏడ్చిండు.

జైహింద్..పలకరింపులు

సైన్యం వచ్చినంక ఇక ఆ సంబరాలు ఏమని వర్ణించను. పట్నంలనే కాదు, పల్లెపల్లెనా హిందువులు సైన్యానికి స్వాగతాలు పలికిండ్రు. హారతులు ఇచ్చిండ్రు. ఎక్కడ చూసిన గాంధీకీ జై, నెహ్రూకీ జై, భారత్ మాతాకీ జై నినాదాలు. ప్రతి గల్లీ మలుపులు, చౌరస్తాలల్ల, ఇండ్లమీద మూడు రంగుల జండాలు రెపరెపలాడినయ్. ఏ ఇద్దరు కల్సుకున్నా జై హింద్ అని పలకరింపులు.

పోలీస్ యాక్షన్ అయినంక తెల్లారి సాయంత్రం మేం ఆడపిల్లలం చాలా స్వేచ్చగా, సంతోషంగా గొబ్బెమ్మల పూజ చేసుకున్నం. ఆ సంతోష సందర్భంల నాకు మా ఇంటి ముందు రోడ్డు మీద ఆశ్చర్యం కల్గించే దృశ్యం కానవచ్చింది. ముందు మిలట్రీవాళ్లు మార్చ్‌పాస్ట్ చేస్తుంటే, వెనక మిలిటరీ ట్రక్కులు నెమ్మదిగ నడుస్తున్నయ్. ప్రతి ట్రక్కుకు పూల దండలు, గాంధీ నెహ్రు బొమ్మలు. ఆ మిలిట్రీ డ్రెస్సులు, టక్క టక్క బూట్ల చప్పుడు, వారి నెత్తుల మీద చిప్పటోపీలు చూడటం నాకు జీవితంల మొదటిసారి. ఆ దృశ్యాలు నా మనస్సుల నాటుకపోయినయి. "లిబరేషన్ ఆర్మీ'' అన్న పదం నాకు అప్పుడు తెలువదు కదా!

ఇక ఆ తెల్లవారి ఉదయం పది పదకొండు గంటలకు నేను ఇంటి ముంగిట అరుగు మీద ఆడుకుంటున్న. ఎందుకో తల ఎత్తి చూసేసరికి గల్లీ ప్రారంభంల, మసీదు పక్కనుండి వస్తున్న బాపు కనబడ్డడు. బాగా మాసి దుమ్ము పట్టిన దోవతి, కోటు మీద కండువా, చేతిల బట్టల సంచీ, చెదిరిన జుట్టూ... ఇదీ ఆయన రూపం. ఉత్త చేతులతోటి మా ముందుకు రావొద్దని ఆ సంచీల ఒక సేరు పుట్నాల పప్పు తీసుకొని వొచ్చిండు. నేను సంతోషం పట్టలేక బాపూ బాపూ అని అరుచుకుంట ఎదురుంగ ఉరికి ఆయన కాళ్లని గట్టిగా కావలించుకున్న. బాపు నవ్వుకుంట నన్ను ఎత్తుకొని ఇంట్ల కాలు బెట్టిండో లేదో పెంకలు ఎగిరిపోయేటట్లు "అమ్మా బాపు వొచ్చిండు'' అని గట్టిగ ఒర్లిన. అందరు పరిగెత్తుకొచ్చిండ్రు. బాపును కావలించుకుని అందరు ఏడ్చిండ్రు. బాపు కూడా ఏడ్చిండు.

స్కూల్లో చేరాను...

ఆ తర్వాత పోలీస్ యాక్షన్ కంప్లీట్ అయ్యి గడ్‌బడ్‌లన్నీ సద్దుమణిగినంక బాపు మమ్మలందర్నీ తీసుకుని తను పనిచేసే ఊరు కవేలీకి తీసుకపోయిండు. నాంపల్లి స్టేషన్ల రైలెక్కినం. మా స్వంత ఇంటికి మేం పోతున్నం అన్న సంతోషం మా అందరి ముఖాలల్ల వెలిగిపోయింది. నాకు ఆ ఊరు బాగా తెల్సిన ఊరే కదా! రైలుల కిటికీ పక్కన కూర్చుని బాపుతో విడవకుండ ముచ్చట్లు చెప్పిన. నీతోటి నేను కూడా రేపట్నించి బడికొస్త అని చెప్పిన. ఆ బడిల నా దోస్తులు నరేందర్‌రెడ్డి, శివారెడ్డిలు బాగున్నారా? వాళ్లు కలుస్తరా? అని అడిగిన. బుచ్చిరెడ్డి తాత ఎట్టున్నడు, మన చప్రాసి మామూ ఎట్లున్నడు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మా బాపు కసురుకోకుండ, విసుక్కోకుండా ఓపికగ అరటిపండు వొలిచి నోట్లె పెట్టినట్టు జవాబులు చెప్పెటోడు. ఆయన నన్ను ముందే సైకలాజికల్‌గ ప్రిపేర్ చేయించాలనుకున్నట్టుంది. చాలా నెమ్మదిగ నాకు సమ్‌జాయించిండు. చప్రాసీ మామూ లేడమ్మా, ఆయన వేరే స్కూలుకు తబాదలా అయ్యిండు. అది చాలా దూరం మనకు ఇక కనబడడు. మన బడి కూడా మునుపటిలాగ ఉండదు. దాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా కొత్త స్థలంల కొత్త బడి పెట్టుకుందాం అన్నడు.

ఆ తెల్లారి సాపాటు చేసి బాపు చిటికెన వేలు పట్టుకుని బడికి పొయ్యేసరికి నా గుండె గబిల్లుమంది. ఇంకెక్కడి స్కూలు అంతా కాలిపోయింది. కూలిపోయింది. మసిబారిన మొండిగోడలు నిలబడి ఉన్నయ్. నా నోట్లె మాట కరువయ్యింది. దుఃఖం పొంగుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకున్న బాపు నన్ను దగ్గరికి తీసుకుని ఈపు నిమిరిండు. ఒక సంవత్సరం అక్కడున్నమో లేదో బాపుకు హైద్రాబాద్‌కు తబాదలా అయ్యింది. అలియాబాద్ స్కూల్‌కు మారిండు. నేను శంశీర్‌గంజ్‌లోని శారదా గర్ల్స్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్న''
 
వెంకటమ్మ
ఇంటర్య్వూ తేదీ: 15-06-99
సీనియర్ హిందీ పండిట్
మహాబూబియా గర్ల్స్ హైస్కూల్, హైదరాబాద్

Saturday, April 16, 2011

తెలంగాణ గడీలు ఎవరి ఆస్తి?

తెలంగాణలో శతాబ్దాల పాటు కొనసాగిన దొరతనానికి సాక్ష్యాలవి. ఓ వైపు దొరల దర్పానికి నిలువెత్తు దర్పణాలుగా, మరోవైపు గడీ అంటేనే గడగడ వణికిన ప్రజల భయాలకు సజీవ సాక్ష్యాలుగా ఇవి నేటికీ నిలిచి ఉన్నాయి. పాతతరం మనుషుల్లో గడీ పేరు వినగానే ఇప్పటికీ కళ్లల్లో గగుర్పాటు... శరీరమంతా జలదరింపు కన్పిస్తాయి. దొర పిలుపు వచ్చిందంటే పులి బోనులోకి వెళుతున్న మేకపిల్లలా హడలెత్తిపోయేవారు జనం. ప్రాణాలకే కాదు ఆడవాళ్ల మానాలకూ... బయటకు విన్పించని ఆర్తనాదాలకూ ఆలవాలంగా ఉండే గడీలు ఇటీవల మళ్లీ వార్తల్లోకొచ్చాయి.

తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయిన దొరలు, వారి వారసులు ఇప్పుడు మళ్లీ గ్రామాలకు వెళ్తున్నారు. ఊరు గుర్తుకొచ్చి కాదు. ఊళ్లలో ఉన్న తమ ఆస్తులు గుర్తుకొచ్చి. పల్లెల్లో కూడా భూముల విలువ పెరగడంతో దొరలు మళ్లీ పల్లెకొచ్చి తమ గడీల్ని, పొలాల్ని అమ్మకానికి పెడుతుంటే అవి తమని, తమ శ్రమని దోచుకుని నిర్మించినవి కాబట్టి అవి తమ ఉమ్మడి సొత్తని, వాటిని అమ్మడానికి వీల్లేదని గ్రామాల్లోని ప్రజలు తిరగబడుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని చల్‌గల్ గ్రామంలో అదే జరిగింది...

చల్‌గల్ గడీ

చల్‌గల్‌లో ఉన్న గడి రాజుల కోటని తలపిస్తుంది. సిమెంట్ కన్నా బలమైన డంగు సున్నంతో నిర్మించిన ఆ గడీ గోడలు నేటికీ చెక్కు చెదరలేదు. విశాలమైన గదులు, కళాత్మకమైన స్తంభాలతో ఉండే ఆ గడి రెండో అంతస్థుపైకెక్కి చూస్తే చుట్టూ ఐదారు కిలోమీటర్ల మేర ఉన్న పల్లెలు, పంట పొలాలు కనిపిస్తాయి. గడీ యజమాని అయిన కృష్ణభూపాల్‌రావు చాలా ఏళ్ళ క్రితమే గడీని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. చల్‌గల్ జగిత్యాల పట్టణానికి సమీపంలోనే ఉండడంతో భూమి రేట్లు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. దాంతో భూపాల్‌రావు గడీని అమ్మడానికి గతేడాది నవంబర్ 9న గ్రామానికొచ్చాడు. వాళ్ల కోరికను గడీని, గడీ స్థలాన్ని ఊరికి విరాళంగా ఇవ్వాలని చల్‌గల్ గ్రామస్తులు కోరారు. భూపాల్‌రావు పట్టించుకోకుండా గడీని అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన గ్రామస్థులు భూపాల్‌రావుని చుట్టుముట్టి మూడు, నాలుగు గంటల పాటు నిలువరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనని అక్కడి నుంచి పంపించేశారు. ఆ సమయంలో గ్రామస్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి చివరికది లాఠీచార్జి నుంచి కాల్పుల దాకా వెళ్లింది. చాలామంది గ్రామస్తులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎవరినైనా అరెస్టు చేస్తే ఐక్యంగా పోరాడాలని కూడా నిర్ణయించారు గ్రామస్తులు. చల్‌గల్ గ్రామంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

ఎన్ని హంగులో..

ఇది మరో గడీ కథ... ఇప్పటి ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ చుట్టుపక్కల ఉన్న జగ్గాసాగర్, అయిలాపూర్, భీమారం తదితర 80 గ్రామాలు రజాకార్ల కాలంలో రాజా అనంత కిషన్‌రావ్ ఆధీనంలో ఉండేవి. ఆ ఊళ్లో కట్టిన గడీలలో అప్పట్లోనే అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్మనీ నుంచి పాలరాతిని, విలాస వస్తువుల్ని తెప్పించినట్లు చెపుతా రు. అప్పట్లోనే విద్యుద్దీపాలతో (జనరేటర్ సాయంతో) వెలిగిపోతున్న గడీని కిరోసిన్ దీపాలు కూడా లేని ప్రజలు వింతగా, విచిత్రంగా చూసేవారట. గడీలకి పైప్‌లైన్లలో తాగునీటి సౌకర్యం కూడా ఉండేది. ఆ కాలంలో నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ని ఇప్పటికీ గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు.

1982-83 ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం వల్ల రాజా అనంత కిషన్‌రావ్ వారసులైన గజసింహరావ్, నరసింహరావుల కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. నక్సల్స్ ప్రభావం తగ్గుముఖం పట్టాక గ్రామంలో ఉన్న వారి స్థిరాస్తులు కొన్ని అమ్ముకున్నారు. పాత గడీని అమ్మేసి కొత్త గడీని కూల్చేసి విలువైన వస్తువులు, ఫర్నిచర్‌ని తీసికెళ్లిపోయారు. బండలింగాపూర్ సంస్థానం పరిధిలో ఇప్పటికీ వాళ్ల వారసుల స్థిరాస్తులున్నాయి. గడీని ఆనుకుని ఉన్న స్థలాన్ని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసి)కి అప్పగిస్తే అందులో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. కల్యాణ మండపానికి కూడా స్థలం ఇచ్చారు. వేణుగోపాలస్వామి ఆలయానికి ఆండాళ్ దేవికి 4 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సమర్పించారు. ఏటా ధనుర్మాసంలో జరిగే గోదా కల్యాణానికి సంస్థాన వారసులు గ్రామానికి వస్తారు. వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికే దొరలు దానం చేస్తున్నారని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు.

కొందరు దొరలు దాతలే!

ఆర్థిక సంస్కరణలు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలతో ఇప్పుడు పల్లెల్లో కూడా పరిస్థితి మారింది. జనాభా కూడా పెరిగింది. పెరగనిదల్లా భూమి మాత్రమే. నక్సలైట్ల అలికిడి తగ్గిపోవడం, భూముల విలువ పెరగడం వల్ల కొంతమంది దొరలు గడీల్ని, తమ భూముల్ని అమ్మకానికి పెట్టడంతో వివాదాలు మొదలవుతున్నాయి. ఎకరానికి ఇంత రేటని నిర్ణయించి... ఇన్నాళ్ళూ బీళ్లుగా ఉన్న తమ భూముల్ని సాగు చేసుకుని దాని నుంచి వచ్చిన ఆదాయంతో డబ్బు కట్టమని గ్రామస్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. అలా నాలుగైదేళ్లు సాగు చేసుకున్నాక డబ్బు కట్టే విధంగా కౌలుదారుల చేత కాగితాలు రాయించుకుంటున్నారు. నాలుగైదేళ్లకైనా సొంత భూమి కల నెరవేరుతుందనిచాలామంది దొరల బీడుభూముల్ని మళ్లీ సాగుభూములుగా మారుస్తున్నారు. ఇలాంటి సౌలభ్యాలేవీ గడీలకు లేకపోవడంతో నేరుగా అమ్మకానికి పెడుతున్నారు దొరలు. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యే ఒక చిన్న గడీని 8 లక్షలకు అమ్మితే దాన్ని కొన్న వాళ్లు మెరుగులు దిద్ది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్‌ని ప్రారంభించారు. గడీలను పాఠశాలలకు, కమ్యూనిటీ హాళ్ళకు విరాళాలుగా ఇచ్చిన దొరలు కూడా ఉన్నారు.

కొత్త లీడర్లొచ్చారు..

కోరుట్ల మండలం అయిలాపూర్ గడీని మావోయిస్టుల అండతో 1991లో గ్రామస్థులు లూటీ చేస్తే పోలీసులు 120 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఆ వివాదం చాలా ఏళ్లు నడిచింది. అయితే ఇటీవల పల్లెల్లో సర్పంచులతో పాటు ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, మండలాధ్యక్షులు, నీటి సంఘాల చైర్మన్లు లాంటి చాలామంది నాయకులు పుట్టుకొస్తున్నారు. విద్యావంతులూ పెరిగిపోయారు. ప్రజలలో చైతన్యం కూడా పెరిగింది. ఆ చైతన్యమే గడీల్ని తమ ఉమ్మడి ఆస్తిగా భావించేలా, దాని కోసం ఎదురు తిరిగేలా చేస్తోంది. ఏదేమైనా 'ఒకప్పుడు గడీని చూస్తే ఉచ్చపడేది... ఇప్పుడు దాంట్లోనే పోస్తన్నం' అని కవి అన్నవరం దేవేందర్ అన్నట్టు ఇప్పుడు గడీలన్నీ ప్రజల ఆస్తిగా మార్చాలనే ఒక కొత్త తిరుగుబాటు చల్‌గల్ గడీతో మొదలైంది.

- కె.వి. నరేందర్, 94404 02871

Thursday, September 23, 2010

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదు , శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తాం .... * టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌

ఉద్యమాలను నియంత్రిస్తా !
Kcr-miceడిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తామని హెచ్చరించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హటాత్తుగా మడమ తిప్పారు. ముందు చెప్పినట్లు.. డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టించేది లేదని, శాంతియుతంగానే తెలంగాణ సాధిస్తామని తెలంగాణేతర పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. తెలంగాణేతర, ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలను తెలంగాణ వచ్చిన తర్వాత తరిమివేస్తామన్న తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల హెచ్చరికల నేపథ్యంలో.. ఉద్యమకారులను తాము నియంత్రిస్తామని, ఆ విషయంలో తన మాటకు తిరుగులేదని అభయహస్తం ఇచ్చారు. బుధవారం హోటల్‌ తాజ్‌ కృష్ణాలో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ అసెస్‌మెంట్‌ నిర్వహించిన సీఈఓల ఫోరమ్‌ సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ సందర్భంగా ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేసి, పారిశ్రామికవేత్తల వ్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఈ భేటీకి మీడియాను దూరంగా ఉంచడం చర్చనీయాంశమయింది. పారిశ్రామికవేత్తల నుంచి వ్యతిరేక ప్రశ్నలు వస్తే, అవి మీడియాలో వచ్చిన తర్వాత అసలు సమావేశ లక్ష్యమే దెబ్బతింటుందని భావించి మీడియాను దూరంగా ఉంచారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులను మాత్రం ఆహ్వానించారు. ఇదంతా ఐఎంఏ ఆహ్వానం మేరకు జరుగుతు న్నందున, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ నేతల సూచనల మేరకే ఈ సమావేశం జరిగిందని, అందుకే మీడియాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇదిలాఉండగా.. పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న నాస్కామ్‌, ఫిక్కీ, సిఐఐ సభ్యులను మాత్రం ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది.

తెలంగాణ ఉద్యమం వల్ల వ్యాపారం దెబ్బతిందని ఇటీవల ఫిక్కీ కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసినందుకే ఆ సభ్యులను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఇలాంటి పారిశ్రామికవేత్తల సమావేశాల్లో కీలకపాత్ర పోషించే శక్తిసాగర్‌ సీఈఓ దూరంగా ఉండటం ప్రస్తావనార్హం. సీఈఓల భేటీకి హాజరయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆ భేటీని తాము అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమ సంస్థలు ముందస్తుగా హెచ్చరించడంతో చాలామంది సీఈఓలు సమావేశానికి వెళ్లలేదు. ఫలితంగా సమావేశం కొందరికే పరిమితమయిందన్న వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల నుంచి వినిపించాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, ఈ సమావేశానికి వెళితే లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ భేటీకి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మా తెలంగాణ అధ్యక్షుడు వీరారెడ్డి, తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా జయలక్ష్మి హోటల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం తాజ్‌ కృష్ణాలో జరిగిన సమావేశ వివరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, తనతో కేంద్ర ప్రముఖులు రోజూ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణేతర- సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమకు పూర్తి రక్షణ కల్పిస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మిమ్మల్ని వదిలిపెట్టుకునేది లేదన్నారు. అంతా కలసి తెలంగాణ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడదామన్నారు. ఈ విషయంలో తాము ఇప్పటిమాదిరిగా ప్రాంతాలపై వివక్ష చూపబోమని, తమకు అభివృద్ధే ప్రధానమని స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం, రాయితీల వంటి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసులో ఉన్న అపోహలను తొలగించుకుని, పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదిలాఉండగా.. కేసీఆర్‌ ప్రసంగం తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొనే పరిస్థితులు, తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాలు తమకు వ్యతిరేకంగా ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. వాటికి సమాధానాలిచ్చిన కేసీఆర్‌.. తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు ఎవరి వల్ల ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సంస్థలు, నాయకులు, విద్యార్థి సంఘాల గురించి మీరేం భయపడనవసరం లేదు. వారిని నియంత్రించే బాధ్యత మాది. వారికి నచ్చచెబుతాం. పరిస్థితి అంతా సద్దుమణిగేలా చేస్తాం. ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరూ వద్దనరు. ఈ విషయంలో నా మాటకు తిరుగు ఉండదు. విద్యార్థులకు ఆవేశం సహజం. ముందు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అంతా సద్దుకుపోతుందని భరోసా ఇచ్చారు.  

డిసెంబర్‌ తర్వాత భూకంపం సృష్టిస్తానని గతంలో తాను చేసిన హెచ్చరికను ఓ పారిశ్రామికవేత్త ప్రస్తావించగా.. అలాంటివేమీ ఉండవని విస్పష్టమైన హామీ ఇచ్చారు. అప్పటి పరిస్థితిని బట్టి ఒక్కోసారి భావోద్వేగంగా మాట్లాడవలసి ఉంటుంది. భాషను కాకుండా భావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలను తాను నియంత్రిస్తానని, ఆ విషయంలో ఎవరూ అనుమానించవలసిన పనిలేదన్నారు. జేఏసీలు, విద్యార్థి సంఘాలను తాను నియంత్రిస్తానని, వారి వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సంస్థలు, విద్యార్థుల్లో ఈ స్థాయిలో ఆందోళన ఉండనందున, తాను వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చి మీకు నష్టం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

Saturday, September 18, 2010

ఈ గడ్డ మీద పుడితే తెలంగాణ బిడ్డే * పొట్టకూటికోసం వచ్చిన వారిపై ద్వేషం లేదు * మా పొట్ట కొట్టడానికి వచ్చిన వారిపైనే ఉద్యమం * టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - ఈ దొరయేందిరో !

"ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే'' అని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు, ఎమ్మెల్యే పదవులు సహా అన్నింటికీ అర్హులేనని తేల్చి చెప్పారు. హక్కులేదన్నవాడు సన్నాసి.. దద్దమ్మ అని అన్నారు. ఒకవేళ వారికి అన్యాయం జరిగితే.. చేపట్టే ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తానని, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

ఎవరి వాటా ఎంత?  అనే అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సమన్వయకర్తగా నిర్వహించిన 'గ్రేట్ డిబేట్'లో కేసీఆర్ ఫోన్ ద్వారా పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... "సమైక్యవాదం నిజమే అయితే.. ఆంధ్రాలోని న్యాయాధికారుల్లో తెలంగాణ బిడ్డ ఒక్కరున్నారా? తెలంగాణలో గుంటూరు పల్లెలు ఉన్నాయి. కాని, సీమాంధ్రలో ఎక్కడైనా ఒక్క తెలంగాణ పల్లె ఉందా? 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కరీంనగర్‌లో ఏంచెప్పారు.

ప్రధాని తన తొలి ప్రెస్‌మీట్‌లో ఏంచెప్పారు? సోనియానాకు ఫోన్ చేసి.. డిన్నర్‌కు ఇంటికొచ్చి ఏం చెప్పారు? డిసెంబర్ 9న ప్రధాని తెలంగాణ ఏర్పాటు ప్రకటనచేయించారు. దాని అమలు దశలో పడ్డ బ్రేకులు బద్దలు కొట్టాల్సి ఉంది. ఒకసారి ప్రకటన చేశాక.. వేలాడితే.. పాకులాడితే.. కేసీఆర్‌ను తిడితే తెలంగాణ ఆగుతుందా? పోరాడాలని అడ్వకేట్లకుఎవరు చెప్పారు? రేపు పోలీసులూ ఇలా చేస్తారని అంటున్నారు.తెలంగాణకొచ్చిన సీమాంధ్రులు ఇక్కడి సంస్కృతిలో కలిసిపోలేదు.

'మీ బొంద మీకేం తెలుసు. తెలివి ఉందా ?' అని ప్రతి రోజు ఆంధ్రా వారు ఇక్కడి వారిని తక్కువ చేసి మాట్లాడుతారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా డిసెంబర్ 9న తెలంగాణ వచ్చేది కదా? అప్పుడు సహృద్భావ వాతావరణాన్ని నాశనం చేసింది ఎవరు? రెండు రాష్ట్రాలుగా సహృద్భావ వాతావరణంలో విడిపోవాలన్నదే నా భావన.

తెలంగాణ ఏర్పడ్డాక సీమాంధ్రులు ఇక్కడ అద్భుతంగా ఉండవచ్చు. వారికి రేపు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతాం. తెలంగాణ వచ్చాక ఇక్కడి సినిమా పరిశ్రమను ఏ సన్నాసి వెధవ అయినా వదులుకుంటాడా? విభజన ఇప్పటికే జరిగిపోయింది.. చంద్రబాబుపై నెపం పెట్టటం కాదు. సమైక్యంగా ఉండటంపై రాద్ధాంతం వల్ల నష్టపోతున్నది ప్రజలు.

లగడపాటీ.. ఐ లవ్ యూ సో మచ్ : కేసీఆర్ : తెలంగాణ డైనమేట్ కేసీఆర్.. సమైక్యాంధ్ర సీమటపాకాయ లగడపాటి రాజ్‌గోపాల్. ఒకరంటే మరొకరికి పడదనే ప్రచారం. రాష్ట్ర విభజన ఉద్యమం నేపథ్యంలో వారి మధ్య 'దూరం' పెరిగిందన్నది వాస్తవం. అయితే వారిద్దరినీ తొలిసారిగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫోన్ ద్వారా కలిపింది. ఇద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు.

ఒకరంటే మరొకరికి గౌరవం ఉందని చెప్పుకున్నారు. కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి.. "లగడపాటీ..ఐ లవ్ యూ సో మచ్' అని అంటే.."కేసీఆర్ గారు.. ఈ రాత్రే మీ ఇంటికొస్తా'' అని లగడపాటి అన్నారు. ఇరువురు కూడా గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. లగడపాటిపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.

తెలంగాణ జనాభా 34 శాతం కాగా, సీమాంధ్ర వారు కలవటం వల్ల తెలంగాణ జనాభా 40.5 శాతం అయ్యిందని, పదవుల్లోనూ సీమాంధ్రులకు తెలంగాణ ఆమేరకు వాటా దక్కాలని లగడపాటి అంటున్నట్లు రాధాకృష్ణ చెబితే.. లగడపాటి చెప్పేది వంద శాతం కరెక్ట్ అని కేసీఆర్ అన్నారు.

ప్రధాని మన్మోహన్ తెలంగాణపై మాట్లాడిన ఆదివారం లగడపాటి ఇంటికి పంపిస్తానని కేసీఆర్ అంటే.. ఈ రాత్రే (శనివారం) మీ ఇంటికొస్తానని లగడపాటి బదులిచ్చారు. దీనికి కేసీఆర్.. "మోస్ట్ వెల్‌కమ్.. మీ ఇల్లు మా ఇల్లు వేరు కాదు'' అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికకు కట్టుబడి ఉందామని లగడపాటి ప్రతిపాదిస్తే మాత్రం.. కేసీఆర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తలాతోకలేని నివేదిక ఇస్తే ఎందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించారు.

సన్నాసి కమిటీ కావచ్చు... దరఖాస్తు అడిగారు కాబట్టి ఇచ్చాం. కమిటీ నివేదిక ఎలా నివేదిక ఇచ్చినా అంగీకరిస్తే.. డిసెంబర్ 9న కేంద్రం బుద్ధి లేకుండా ప్రకటన చేసిందనుకోవాలా? అని ప్రశ్నించారు. ఓ సమయంలో లగడపాటిని 'యూ ఆర్ ఏ హీరో' అని కొనియాడారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుంచే విరమించుకుంటానని చెప్పి.. అదే విధానానికి కట్టుబడి ఉన్న మగబిడ్డ అని ప్రస్తుతించారు.

పొట్టకూటికోసం వచ్చిన వారిపై ద్వేషం లేదు
మా పొట్ట కొట్టడానికి వచ్చిన వారిపైనే ఉద్యమం : కేసీఆర్

  "ఈ గడ్డ మీద పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే'' అన్న వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమర్ధించుకుంటూ, ఆ వ్యాఖ్యల వెనుక విశాల దృక్పథం ఉందని తెలిపారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిపై తమకెలాంటి ద్వేషం లేదని, మా పొట్ట కొట్టడానికి వచ్చినవారిపైనే మా ఉద్యమం అని పేర్కొన్నారు.

తెలంగాణలో పుట్టిన వాళ్ళంతా ఇక్కడివాళ్లేనని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు 42 శాతం ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసిన నేపథ్యంలో పై విధంగా సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ వివరణపై స్పందించిన తెలంగాణ న్యాయవాదుల సంఘం కార్యదర్శి రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఒకసారి క్షమాపణ చెబితే సరిపోతుందని అన్నారు. లేని పక్షంలో సోమవారం న్యాయవాదుల సంఘం జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ దొరయేందిరో !
main-cartoతుది దశకు చేరుకున్న తెలంగాణ ఉద్యమాన్ని కులాల వారీగా చీల్చి తన అగ్రకుల దురహంకార మాయోపాయాన్ని తమపై ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుల రాజకీయంపై తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. కేసీఆర్‌ తెచ్చే వెలమ-రెడ్ల తెలంగాణ తమకు అవసరం లేదని, అగ్రవర్ణాలు లేని.. బడుగు బలహీన వర్గాలతో కూడిన సామాజిక తెలంగాణ మాత్రమే కావాలంటూ పిడిి లి బిగించనున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని టీఆస్‌ఎస్‌కు తాకట్టు పెట్టి, వారికి తొత్తులుగా మార్చుకునే కేసీఆర్‌ కుల రాజకీయాన్ని తిప్పికొట్టి, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో తామే ముందుండి తెలంగాణ సాధించుకోవాలని బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు నిర్ణయించుకున్నారు.

మరోవైపు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కార్యాచరణ సిద్ధమయింది.అగ్రకులాల రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడంతో పాటు, కేసీఆర్‌ పడగ నీడ నుంచి రక్షించాలన్న లక్ష్యంతో ఇకపై అడుగులు వేయాలని నిర్ణయించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ సభలో దళిత నేత విశారదన్‌ ప్రసంగాన్ని అక్కడే ఉన్న ప్రొఫెసర్‌ కోదండరామిరెడ్డి సూచనలతో అడ్డుకున్న వైనం బడుగు వర్గాల విద్యార్థి లోకంలో ఆగ్రహానికి దారితీసింది. ఈ పరిణామం.. కేసీఆర్‌ చేతిలో ఓయూ విద్యార్థి సంఘాలు చిక్కుకున్నాయన్న వాస్తవాన్ని గ్రహించిన బడుగు వర్గాలు, తమ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు రంగంలోకి దిగాయి.

ఆత్మగౌరవ సభలో తమకు జరిగిన అన్యాయానికి కేసీఆరే కారణమంటూ శనివారం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థి నేతలు ఉస్మానియాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్థం చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది ఓయూలోని బడుగు వర్గాలకు విద్యార్థుల్లో కేసీఆర్‌ చేస్తున్న కుల రాజకీయాలపై ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు వారు శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

బడుగు బలహీన వర్గాల ఆత్మత్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిందని, అయితే కేసీఆర్‌ దానిని వెలమ-రెడ్లకు అంకితం చేసేందుకు ఉద్యమంలో పాల్గొంటున్న తమ మధ్య చీలికలు తెచ్చి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునే ఎత్తుగడను తిప్పికొట్టి కేసీఆర్‌ నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బడుగు బలహీన వర్గాల విద్యార్థి జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు.కేసీఆర్‌ తన తొత్తులను తమలో చొప్పించి ఉద్యమాన్ని కులాల వారీగాచీలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని అన్ని విధాలుగా ప్రలోభపరుచుకుని, తమ ఉద్యమాన్ని చివరకు టీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టే దిశగా తీసుకువెళుతున్నందున, ఇకపై తాము కేసీఆర్‌ ఉచ్చులో చిక్కకూడదని బడుగు జేఏసీ నేతలు తీర్మానించు కున్నారు. తమ వర్గాలకే చెందిన కొందరు నేతలు ఇప్పటికే కేసీఆర్‌ ప్రలోభాలకు చిక్కినందున, అగ్రవర్ణాలతో పాటు వారిని కూడా దూరం పెట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.

తమ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో తుది దశకు చేరిన ఉద్యమం ఫలించాలంటే తమకు అన్ని రాజకీయ పార్టీల అండ కావాలని, అందుకోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు.టీఆర్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న కొన్ని విద్యార్థి సంఘాలు మిగిలిన రాజకీయ పార్టీలను అడ్డుకుని, మొత్తం విద్యార్థులను కేసీఆ ర్‌ మద్దతుదారులుగా మార్చే ప్రయత్నా లను తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నా రు. బడుగు బలహీన వర్గాల ద్వారా ప్రారంభమయిన ఉద్యమాన్ని హైజాక్‌ చేసి, దానిని ఒక్క శాతం కూడా లేని వెలమదొరలకు అంకితం చేసేందుకు కేసీఆర్‌ చేస్తున్న రాజకీయ కుట్రను సమర్థవంతంగా, సమిష్ఠిగా తిప్పికొడతా మని ఓయూ బీసి జేఏసీ కన్వీనర్‌ వి. రామారావు గౌడ్‌ స్పష్టం చేశారు.

విద్యార్థి ఉద్యమంలో చొరబడ్డ టీఆర్‌ఎస్‌ను దూరం చేయకపోతే మిగిలిన పార్టీలు దరికి చేరవని గుర్తించిన బడుగు వర్గాల విద్యార్థి సంఘాలు, మిగిలిన పార్టీల మద్దతు కోరేందుకు సిద్ధమవుతున్నాయి.నాయకులను అడ్డకుంటున్నది ఒక్క టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే సంఘాలే తప్ప, విద్యార్థులంతా కాదని వారికి స్పష్టం చేయనున్నారు. కేసీఆర్‌ అగ్రకుల రాజకీయం, మీడియా వల్ల పెద్ద నేతలుగా ఎదిగిన తమ వర్గ నేతలు కొందరు కేసీఆర్‌ను తాము విమర్శిస్తుంటే అడ్డుకుంటూ, దొరలకు ఊడిగం చేస్తున్నందున.. అలాంటి వారిని ఇకపై నాయకులుగా గుర్తించ వద్దని పిలుపునిచ్చేందుకు తీర్మానించారు. ‘దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన మైక్రోఫైనాన్స్‌ కేసులో పెద్ద లీడరుగా చెలామణి అవుతున్న ఓ నేత 3 లక్షలు తీసుకున్నాడు. కేసీఆర్‌కు భజన చేయడం, ఆయన నుంచి లబ్థి పొందడమే వారి రోజు వారీ కార్యక్రమం. ఇది ఓయూలో అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వాళ్లు చేసే ఉద్యమాలకు విశ్వసనీయత ఉంటుందా’ అని ఓ బీసీ విద్యార్థి సంఘ నేత ప్రశ్నించారు.

కొందరు నాయకుల తీరు, వ్యవహారశైలి వల్ల మొత్తం ఓయూ విద్యార్థులను దోషులుగా చూస్తున్నారని, అన్నింటికన్నా ప్రధానంగా విద్యార్థులందరినీ టీఆర్‌ఎస్‌ సానుభూతిపరులుగా, కార్యకర్తలుగా చూపించేందుకు కేసీఆర్‌, ఆయనకు తందానా పలుకుతున్న నేతల ప్రయత్నాలను అడ్డుకోవడం చారిత్రక అవసరంగా గుర్తిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు ఆత్మగౌరవం అనేది లేకుండా పోతుందని భావిస్తున్నారు.విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వారితో ఆరున్నర లక్షల సభ్యత్వాలు కేసీఆర్‌ చేయిస్తే, దానికి కారణమయిన విద్యార్థి నేతలు మాత్రం ఇంకా ఆయన చుట్టూ తిరుగుతున్న విషాద పరిస్థితిని తోటి విద్యార్థులకు వివరించేందుకు త్వరలో ఒక సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కేసీఆర్‌ను దూరం పెట్టాలి
ramaraoతనకు తొత్తులుగా మారని విద్యార్థి సంఘాల నేతలపై కేసీఆర్‌ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఓయూ జేఏసీ కన్వీనర్‌ రామారావు ఆరోపించారు. కొన్ని విద్యార్థి సంఘాలు కేసీఆర్‌ ప్రలోభానికి లోనయ్యాయని, వారిని విద్యార్థులే దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. దళితుడికి సీఎం, మైనారిటీకి డిప్యూటీ సీఎం ఇస్తానన్న కేసీఆర్‌కు తెలంగాణ జనాభాలో 65 శాతం ఉన్న బీసీలు ఆ పదవులకు అర్హులుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణ-దొరల తెలంగా ణకు వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ ఉద్యమంలో తామూ భాగస్వాము లవుతామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో మొదలయిన విద్యార్థి ఉద్యమాన్ని కేసీఆర్‌ చీల్చి, వారి మధ్య శత్రుత్వాన్ని రగిలించారని ఆరోపించారు. ఆరోపించారు.

కేసీఆర్‌ అగ్రకుల దురంహంకారి
Arvind-Kumar-Goudకేసీఆర్‌ అగ్రకుల దురహంకారి అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవిందకుమార్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. దళితుడితో చెప్పులు తొడిగించుకున్న కేసీఆర్‌ రేపు తెలంగాణ వస్తే దళితుల ఆత్మగౌరవాన్ని ఇంకెంత దెబ్బతీస్తారో గమనించాలని పిలుపునిచ్చారు. దళిత విద్యార్థి విశారదన్‌ను అవమానించిన టీఆర్‌ఎస్‌ అగ్రకుల వైఖరిని దళితులు, బీసీలు ఇప్పటికయినా గ్రహించాలని కోరారు. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు మాత్రమే తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చారన్న వాస్తవాన్ని విస్మరిం చకూడదన్నారు. చంద్రబాబునాయుడు దళితులకు లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌, బీసీలకు అసెంబ్లీ స్పీకర్‌, హోం, రెవిన్యూ, ఆర్ధికమంత్రి వంటి శక్తివంతమైన పదవులు ఇస్తే.. కేసీఆర్‌ మాత్రం దళితులతో చెప్పులు తొడిగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. నిజంగా దళితుడికి ఆ పదవి ఇస్తే అప్పుడు ఇంకెంత దారుణంగా అవమానిస్తారో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని గౌడ్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారుతాం
visharadhan‘ఇప్పటికే ఓయూలో కొన్ని విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌కు తొత్తుగా మారాయన్న అభిప్రాయం, అప్రతిష్ఠ జనంలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల మిగిలిన పార్టీలు మాకు కంటితుడుపు మద్దతు తప్ప, మనస్ఫూర్తిగా మద్దతునిచ్చేందుకు ముందుకురావడం లేదని గ్రహించాం. ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు తీసుకువస్తాం. విద్యార్థుల ఆత్మగౌరవంతో నడిపే ఉద్యమానికి అన్ని పార్టీల మద్దతు అవసరం. ఆత్మగౌరవమంటే శక్తి. ఆ శక్తిని నిర్వీర్యం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. మా ఉద్యమంలో చీలికలు తెచ్చిన కేసీఆర్‌ను మేం కూడా రాజకీయంగానే ఎదుర్కొంటాం. అంటే మేమే రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా మారతాం. అప్పుడే తెలంగాణ సిద్ధిస్తుంద’ని ఓయూకు చెందిన దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్‌ విశారదన్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్‌ బీసీల వ్యతిరేకి : జయప్రసాద్‌
కేసీఆర్‌ పచ్చి బీసీ వ్యతిరేకి అని, ఆయన ఉద్యమాన్ని నడిపించినంత కాలం తెలంగాణ రావడం అసాధ్యమని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్‌ కె.జయప్రసాద్‌ స్పష్టం చేశారు. ఓయూలో దళిత విద్యార్థి నేత విశారదన్‌ను ప్రసంగం మధ్యలోనే అడ్డుకోవడం, దానిని కోదండరామిరెడ్డి దగ్గరుండి మరీ ప్రోత్సహించడం బట్టి.. దొరల తెలంగాణ కోసం కేసీఆర్‌ ఎంత నీచానికి పాల్పడుతున్నారో స్పష్టమవుతోందన్నారు. ఓయూ విద్యార్థులంతా తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటున్నందున.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కేసీఆర్‌ వలలో చిక్కుకోవద్దన్నారు. కేసీఆర్‌ కేవలం వెలమ-రెడ్ల కోసమే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపించారు.