Showing posts with label Ramdan. Show all posts
Showing posts with label Ramdan. Show all posts

Monday, December 6, 2010

నేనెందకు ప్రవక్తపై పుస్తకం రాశాను?

                                     భిన్న  మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి అన్వయించుకొని విశ్లేషించటం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ట్ణాతురాలు క్యారన్ ఆంస్ట్రాంగ్. ఆమె రాసిన 'హిస్టరీ ఆఫ్ గాడ్' పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. 30 భాషాల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంస్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - 'ముహమ్మద్: ఏ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్'. దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం.

సల్మాన్ రష్డీ రచించిన 'సెటానిక్ వెర్సెస్' వివాదం, ఫత్వా సందర్భంగా, పది సంవత్సరాల క్రితం నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర వ్రాశాను. అంతకు ముందు ఎంతో ఉదారంగా, స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా అప్పుడు ఇస్లాం మతం పట్ల కనపరచిన అహేతుకమైన ద్వేషం నన్ను చాలా కలవరపరిచింది. ఇరవయ్యో శతాబ్దంలో జరిగిన దారుణమైన సంఘటనల తరువాత కూడా ప్రపంచ జనాభాలో దాదాపు అయిదు వంతులుగా ఉన్న ఒక మతం పట్ల మనం అస్ఫుటమైన అసత్యమైన అభిప్రాయాలను పెంచి పోషించకూడదనిపించింది. సల్మాన్ రష్డీపై అయెతుల్లా ఖొమైనీ ఫత్వా విధించినపుడు ఈ అహేతుక ద్వేషం అనేక పశ్చిమ దేశాలలో మరింత ప్రత్యక్షంగా కనపడింది.

1990లో నేనీ పుస్తకం వ్రాస్తున్నప్పుడు ఒక ఇస్లామిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న 45 రాజ్యాల తాలూకు 44 మంది ప్రతినిధులు ఈ ఫత్వాని ఖండించారు. అది ఇస్లామ్ మత విరుద్ధమన్నారు. అయినా బ్రిటన్‌లో ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సౌదీ అరేబియా షేకులు, కైరోలోని అల్ అజ్‌హర్ మదర్సా కూడా ఈ ఫత్వా ఇస్లామ్ మత వ్యతిరేకమైనదన్నది. కానీ ఇదంతా పశ్చిమ దేశాలవారు వినదలచుకోలేదు. అయెతుల్లాతో విభేదించేవారూ, రష్డీని చంపాలనే కోరికలేని వారూ అయిన ముస్లిములు బ్రిటన్‌లో చాలామంది ఉన్నారు.

అయితే సల్మాన్ రష్డీ తన నవలలో ముహమ్మద్ ప్రవక్తను దైవ దూషకునిగా చిత్రించడం వీరిని తీవ్రంగా కలత పెట్టింది. పశ్చిమ మేధావులు మాత్రం , ముస్లింలంతా రష్డీ రక్తం కళ్ళ జూడాలనుకుంటున్నారని భావించారు. కొందరు బ్రిటిష్ రచయితలు, మేధావులు, తత్వవేత్తలు కూడా ఇస్లాముని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజం తెలుసుకోడానికి కూడా ఆసక్తి కనపరచలేదు. వారి దృష్టిలో ఇస్లాం సహనం లేని ఒక మూఢమతం. గౌరవించతగ్గది కాదు. అంతేకాదు, రష్డీ ముహమ్మద్‌ని చిత్రించిన తీరుకు నొచ్చుకున్న ముస్టింల సున్నితమైన మనోభావాలను వారు పట్టించుకోలేదు.

అదంత ముఖ్యమైన విషయం కాదనుకున్నారు. ముహమ్మద్ గురించి రష్డీ చెప్పింది మాత్రమే పశ్చిమ దేశాల పాఠకులు చదవడం విచారకరం అనిపించింది. రష్డీ నిజంగా తన నవలలో ఏం చెప్పదలిచాడో నేను అర్ధం చేసుకోగలిగినప్పటికీ, ఒక గొప్ప వ్యక్తి నిజమైన జీవిత కథ అందరికీ తెలియాలనే నేనీ పుస్తక రచనకి పూనుకున్నాను. నాకు ప్రచురణ కర్త దొరకడం కూడా కష్టమైంది.

ఎందుకంటే నా లాంటి మహిళ, వారి ప్రవక్త గురించి వ్రాస్తే ముస్లిమ్‌లకి కోపం వచ్చి నేను కూడా రష్డీ వలె రహస్య జీవితం గడపవలసిన పరిస్థితి సంభవం కావచ్చు అని చాలామంది భావించారు. కానీ నా పుస్తకానికి ముస్లిముల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించడం నన్నెంతో కదిలించింది. నేనీ పుస్తకం కేవలం సంచలనం సృష్టించడానికే వ్రాయలేదని నమ్మారు. తరువాత పది సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో ఉన్న ఈ 'ఇస్లామోఫోబియా' తగ్గుతూ వచ్చింది. ముస్లిములకి వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు.

ఇప్పుడు విద్యుద్ఘాతం వంటి సెప్టెంబర్ పదకొండు సంఘటన - న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రమూ, పెంటగాన్‌లో ఒక భాగమూ ధ్వంసమైన తీరు - ముస్లిమ్ ఉగ్రవాదులు ఈ దారుణ మారణకాండకి తలపడి దాదాపు 5000ల మంది మరణానికి కారంణం కావడం, పశ్చిమ దేశాలలో ముస్లిమ్ వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి, వారికి ఇస్లామ్‌పై ఉండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది. ముస్లిములు హింసనూ తీవ్రవాదాన్నీ సమర్ధించే మత మౌడ్యులనే భావనను ఈ ఘోరమైన చర్య స్థిరపరిచింది.

ఈ విపత్కర సంఘటన తరువాత ఒక నెలకి నేనీ ఉపోద్ఘాతం వ్రాస్తున్నాను. ఇదొక ప్రత్యేక సందర్భం. ఇస్లామ్, హింసను సమర్ధిస్తుందనే భావాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటన తరువాత జరిగిన అనేక చర్చల్లో, వాద వివాదాల్లో చాలామంది కుర్ఆన్‌లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. ఇటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసేవారు క్రిస్టియన్, జ్యూయిష్ మత గ్రం«థాలలో కూడా ఇటువంటి కలహశీలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయని మర్చిపోయారు.

జ్యూయిష్ బైబిల్‌లో అతి పవిత్రమైనదిగా భావించే 'తోరా'లో ఇజ్రాయిల్ వారిని, వారికి ప్రభువు వాగ్దానం చేసిన భూమినించి తరిమికొట్టమని, వారి పవిత్ర చిహ్నాలను ధ్వంసం చెయ్యమనీ ఉంది. వారితో ఎటువంటి ఒడంబడికలూ ఉండకూడదంది. కొంతమంది యూదు మతవాదులు, ఇలాంటి వాటిని పాలస్తీనియన్లపై హింసను సమర్ధించడానికి వాడుకుంటారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపన ప్రక్రియను విమర్శించడానికి కూడా వాడుతుంటారు. కాని జుడాయిజమ్ గురించి పూర్తిగా తెలిసిన వారెవరూ ఈ వాక్యాలను ప్రామాణికంగా తీసుకోరు. వాటిని ఆ విధంగా వాడుకోవడం న్యాయవిరుద్ధమంటారు.

జీసస్‌ని ఎల్లప్పుడూ శాంతికాముకునిగా భావిస్తాము. కానీ కొన్ని గోస్పెల్స్ ఆయన్ని పోరాటశీలునిగా కూడా చిత్రిస్తాయి. ఒక సందర్భంలో ఆయన, తను శాంతిని కాక ఖడ్గాన్ని తెచ్చానంటాడు. అయితే ఎవరూ కూడా సెబ్రెనీసాలో క్రిష్టియన్ సెర్బులు 8000ల మంది ముస్లిములని చంపినపుడు ఈ వాక్యాన్ని ఉల్లేఖించలేదు. ఎవరూ క్రైస్తవ మతం హింసను ప్రోత్సహిస్తుందనలేదు. అటువంటి ఆరోపణలు చెయ్యడం అనుచితం అని చాలామందికి తెలుసు. పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చెయ్యరు.

(సెప్టెంబర్ ఘాతుకానికి పాల్పడిన) తీవ్రవాదులు తాము ముహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తున్నామనుకోవడం నన్నెక్కువ బాధ పెట్టింది. ఈ దాడికి కీలకమైన వ్యక్తిగా భావించే ఒసామా బిన్ లాడెన్, ముహమ్మద్ ప్రవక్త జీవిత విధానంలోని సనాతన వాదాన్ని (ఫండమెంటలిజమ్) అనుసరించాడు. సయ్యిద్ ఖుతుబ్ అనే ఈజిప్షియన్ మేధావి మొట్టమొదట చేసిన ఫండమెంటలిస్టు సూత్రీకరణ ప్రకారం ముహమ్మద్ జీవితం ఒక దివ్య సాక్షాత్కారం. భగవంతుడు ముహమ్మద్‌కు చెప్పిన మార్గం ఒక్కటే సత్సమాజ స్థాపనకు మార్గం.

(ఖుతుబ్‌కి 1966లో ప్రెసిడెంట్ జమాల్ అబ్దుల్ నాజర్ మరణశిక్ష విధించాడు.) ముహమ్మద్ ప్రవక్త ముస్లిములు చెప్పే 'జాహిలియా'ని (అంటే చీకటి యుగం) అంతం చేయడానికి పోరాడాడు. ఈ జాహిలియా అనే పదాన్ని ముస్లిమ్‌లు రాక ముందు అరేబియాలో ఉండి అవినీతి, బర్బరత్వం రాజ్యమేలిన కాలానికి ప్రతీకగా వాడతారు. ఖుతుబ్ అభిప్రాయం ప్రకారం ప్రతి యుగంలోనూ ఒక జాహిలియా ఉంటుంది. కనుక ఇరవయ్యో శతాబ్దంలో కూడా ముహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తూ తమ ప్రాంతాల్లోని జాహిలియాని నిర్మూలించాలి. ఇందుకోసం వాళ్లు ముందుగా ప్రధాన స్రవంతిగా ఉన్న 'జాహిలి' సమాజం నుంచి విడివిడి అంకిత భావంతో పని చేసే ఒక అగ్ర నాయకత్వాన్ని తయారు చెయ్యాలి.

జిహాద్ రూపకర్త కాకపోవటమే కాక ముహమ్మద్ (నిజానికి) శాంతి కాముకుడు. శాంతి స్థాపకుడు. శాంతి స్థాపనకు ప్రాణాలను కూడా లెక్కచెయ్యని వ్యక్తి, మక్కాతో రాజీకోసం తన సన్నిహితుల మద్దతును కూడా వదులుకున్న వాడు....మొండిగా చనిపోయేవరకూ యుద్ధం చేసేకన్నా సంప్రదింపులతో రాజీ మార్గం అవలంబించడం మంచిదని భావించాడు. ఈ వినయం, సర్దుబాటులే విజయ సాధన మార్గాలయాయని కుర్ఆన్ కూడా పేర్కొంది. ఈ సంక్లిష్ట సమయంలో మనం ప్రవక్త జీవితాన్ని తెలుసుకోవడం అవసరం.

తమ స్వలాభం కోసం ముస్లిమ్ అతివాదులు ముహమ్మద్ జీవితాన్ని వక్రీకరించడాన్ని మనం ఒప్పుకోకూడదు. అమితంగా మారిపోయిన ఈనాటి ప్రపంచంలో మనం ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకోడానికి కూడా మనం ముహమ్మద్ జీవితాన్ని చదవాలి. పశ్చిమ దేశ వాసులమైన మనకి ఎప్పుడూ ఇస్లాంతో సరిపడలేదు. ఆ మతాన్ని గురించి మనకి చాలా అహంకారపూరితమైన, మొరటు అభిప్రాయాలుండేవి. తీసిపారేసే చూపు ఉండేది. మనం ఇంకా అటువంటి అజ్ఞానంతో అపార్ధాలతో కూడిన వైఖరి అవలంబించలేమని ఇప్పుడు తెలియ వచ్చింది. ఈ పుస్తకం చివరన నేను ప్రఖ్యాత కెనెడియన్ పండితుడు విల్ ఫ్రెడ్ క్యాంట్వెల్ స్మిత్ వాక్యాలని ఉల్లేఖించాను.

ఆయన రచనలు నాకు నిరంతర స్పూర్తిదాయకాలు. ఇరవయ్యో శతాబ్దపు సవాళ్ళను జయప్రదంగా ఎదుర్కోవాలంటే పశ్చిమదేశాలూ, ఇస్లామిక్ ప్రపంచమూ కూడా గట్టి కృషి చెయ్యాలని ఆయన 1956లోనే హెచ్చరించాడు. ముస్లిములు పశ్చిమ సమాజాన్నీ, పశ్చిమం సాధించిన విజయాలనూ అంగీకరించాలనీ, అట్లాగే పశ్చిమ దేశవాసులు కూడా ముస్లిములను తమకన్నా తక్కువవారుగా కాక సమానులుగా చూడాలనీ అన్నాడు.

పాశ్చాత్య నాగరికతా, క్రైస్తవ మత ధర్మశాస్త్రమూ కూడా తక్కిన వారిని సరైన గౌరవ మర్యాదలతో చూడ్డం నేర్చుకోకపోతే ఆ రెండూ కూడా ఇరవయ్యో శతాబ్దపు వాస్తవాలను ఎదుర్కోలేవని ఆయన అన్నాడు. ఈ క్రమంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ - సెప్టెంబర్ విషాదం, అటు పాశ్చాత్యులూ, ఇటు ముస్లిములూ కూడా ఈ పరీక్షలో నెగ్గలేదని తేల్చింది.

ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం మెరుగ్గా ఉండాలంటే మనతో ఈ ధరిత్రిపై సహజీవనం చేస్తున్న ముస్లిమ్‌లను అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. వారి మతాన్ని అభిమానించడం, గౌరవించడం నేర్చుకోవాలి. వారి అవసరాలను, వారి ఆరాట పోరాటాలను, వారి ఆశలను ఉద్దేశాలను గుర్తించాలి. అందుకు ముహమ్మద్ ప్రవక్త జీవితాన్ని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించడం మొదటి మెట్టు. ఈ సంక్లిష్ట సమయంలోని అజ్ఞాన తిమిరాన్ని ఆయన మేధో వికాస కాంతులు పారదోలగలవు.

Friday, September 10, 2010

అందరి ఆనందం..ఈద్

రమజాన్ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్నిసృష్టిస్తుంది.
"ఈద్''అనేది ఒక అరబీ పదబంధం. ఒక మహనీయుని, లేక మహా సంఘటనను స్మరించుకుంటూ, ఏటా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రతి శుభ సందర్భాన్ని 'ఈద్'అంటారు. దీన్నే మనం తెలుగు భాషలో 'పండగ' అంటున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్(సం)మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వలస వెళ్ళిన పద్దెనిమిది మాసాల తరువాత, అంటే రమజాన్ మాసం మరి రెండు రోజుల్లో ముగుస్తుందనగా, హిజ్రి శకం రెండవ సంవత్సరంలో సదఖా, ఫిత్రా, ఈద్ నమాజులకు సంబంధించిన ఆదేశాలు అవతరించాయి.

"ఎవరైతే పరిశుద్ధతను పొంది, అల్లాహ్(దైవ)నామాన్ని స్మరిస్తూ(ఈద్)నమాజ్ ఆచరించారో వారు సాఫల్యం పొందారు''(పవిత్ర ఖురాన్ 18-14). ఈ వాక్యానికి సంబంధించిన ఒక వ్యాఖ్యానంలో 'ఎవరైతే జకాత్, ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజు ఆచరించారో వారు సాఫల్యం పొందారు'అని ఉంది. ఒకసారి హజ్రత్ అబుల్ ఆలియా, అబూఖుల్‌దాతో, 'రేపు మీరు ప్రార్థన కోసం ఈద్‌గాహ్‌కు వెళ్ళే ముందు ఒకసారి నా వద్దకు వచ్చి వెళ్ళండి' అన్నారు.

మరునాడు అబూఖుల్‌దా ఆయన వద్దకు వెళ్ళినపుడు 'ఏమైనా భుజించారా?'అని ప్రశ్నించారు. సమాధానంగా అబూఖుల్‌దా 'ఆ.. భుజించాను'అన్నారు. 'గుస్ల్(స్నానం)చేశారా?'అని మళ్ళీ ప్రశ్నించారు. 'ఆ.. చేశాను'అన్నారాయన సమాధానంగా. 'మరి జకాత్, ఫిత్రాలు చెల్లించారా?' 'ఆ.. చెల్లించాను'అని చెప్పాడరు అబూఖుల్‌దా. 'ఇక చాలు ఈ విషయాలే అడుగుదామని రమ్మన్నాను. ఈ దైవ వాక్యం అర్థం కూడా ఇదే.'అన్నారాయన. హజ్రత్ ఉమర్‌బిన్ అబ్దుల్ అజీజ్ కూడా ప్రజలను ఫిత్రా చెల్లించమని ఆదేశించి, ఈ వాక్యాన్నే చదివి వినిపించేవారు.

ఉత్సాహవేళ...
పవిత్ర ఖురాన్‌లో 'ఈద్'అనే పదం ఓ ప్రత్యేక అర్థంలో మనకు కనిపిస్తుంది. మాయిదా సూరాలో దేవుని ప్రవక్త హజ్రత్ ఈసా అలై హిస్సలాం(క్రీస్తు మహనీయులు)ఆకాశం నుంచి 'మాయిదా'ను(ఆహార పదార్థాలతో నిండిన పళ్ళెరాలు)అవతరింపచేయమని దైవాన్ని వేడుకుంటారు. "మా ప్రభువా!! మా ముందు వడ్డించిన విస్తరినొకదాన్ని ఆకాశం నుంచి అవతరింపచేయి.

అది మాకూ, మా పూర్వీకులకూ, రాబోయే తరాలకూ పండగ(ఈద్) ఈ రోజు అవుతుంది.''(పవిత్ర ఖురాన్ 5-114) అల్లమా ఇచ్నెకసీర్, హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్(రజి) మహనీయుల్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు.

హ!! ఈసా అలై హిస్సాలాం, ఇజ్రాయేలీయులతో, 'మీరు 30రోజుల వరకు ఉపవాసవ్రతం పాటించి, ఆకాశం నుంచి మాయిదాను వర్షింపచేయమని అల్లాహ్‌ను ప్రార్థిస్తే ఆయన మీ వేడుకోలును స్వీకరిస్తాడు. ఎందుకంటే, స్వయంగా ఆచరించిన వారికేదాని ప్రతిఫలం దొరుకుతుంది''అన్నారు. అప్పుడు క్రీస్తు మహనీయుల వారి వాక్కు ప్రకారం ఇజ్రేయెలీయులు 30రోజులు ఉపవాసాలు పాటించారు. దీంతో ఆకాశం నుంచి 'మాయిదా' అవతరించింది.

హ.. అమ్మార్ బిన్ యాసిర్(రజి) కథనం ప్రకారం, 'ఈ మాయిదాను ప్రజలు ఎంత తిన్నా తరిగేది కాదు'అందుకే మాయిదా అవతరణను క్రీస్తు మహనీయులు పండగ(ఈద్)తో పోల్చారు. అంటే, దేవుని అనుగ్రహాలను పొంది మనం సంతోషాన్ని, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేయడం ప్రవక్తల సంప్రదాయం అన్నమాట. ఈ విషయం పవిత్రఖురాన్‌లో కూడా ఇలా ఉంది. 'ప్రవక్తా! వారికిలా చెప్పండి. ఈ మహా భాగ్యాన్ని దైవం మీ కోసం పంపాడంటే, అది ఆయన అనుగ్రహం, కారుణ్యమే. దానికి వారు ఆనందోత్సాహాలు జరుపుకోవాలి'(పవిత్ర ఖురాన్ 10-58).

దైవ కృప అపారం
మరో చోట.. 'మీ ప్రభువు అనుగ్రహాలను గురించి బాగా చర్చించండి, వాటిని దాటుతూ ఉండండి'అని ఉంది(పవిత్ర ఖురాన్ 93-11). నిజానికి రమజాన్ ఉపవాసాలు దైవం మానవులపై కురిపించిన అపార దయానుగ్రహాలు. పండగ ఆ అనుగ్రహాలను స్మరించుకుంటూ దైవానికి కృతాజ్ఞతాంజలులు సమర్పించుకొనే ఓ చక్కని సందర్భం.

అంతేకాకుండా ఈ పవిత్ర రమజాన్‌లోనే దైవం మానవాళికి మరో మహత్తర కానుక కూడా బహుకరించాడు. అదే పవిత్ర ఖురాన్ అవతరణ. ఇది సమస్త మానవాళికి సన్మార్గ ప్రదాయిని. మానవ కల్యాణం కోసం ఇంతటి మహత్తర, మహిమాన్విత గ్రంథ రాజాన్ని అవతరిపంచేసినందుకు, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుకొని, ఆయన ఘనతను, కొనియాడండి.

ఆయనకు కృతజ్ఞతలు తెలపండి'(పవిత్ర ఖురాన్ 2-185) ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారం, హద్దుల్ని అతిక్రమించకుండా, దుబారాలకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు తావీయకుండా దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండగ.

ప్రవక్త ఏం చేసేవారు?
పండగ సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త(స)వారి ఆచరణ ఇలా ఉండేది. ఆయన పండగ నమాజును ఈద్‌గాహ్‌లో చేసేవారు. అందుకే ప్రవక్త సంప్రదాయన్ననుసరించి ఈద్ నమాజును ఊరి బయట బహిరంగ ప్రదేశంలో (ఈద్‌గాహ్‌లో)నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచ దేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం.

అయితే అనివార్య పరిస్థితుల్లో మాత్రం ఈద్ నమాజ్‌ను మసీదులోనే చేసుకోవచ్చు. ప్రవక్త వారు కూడా ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్‌గాహ్‌లో పండగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ప్రవక్త మహనీయులు ఉన్నంతలోనే కొత్త వస్త్రాలు ధరించేవారు.

శుక్రవారం నమాజుకు, పండగ నమాజులకు ధరించేందుకు ఆయనకు ప్రత్యేకంగా ఒక జత దుస్తులు ఉండేవి. పండగపూట మంచి బట్టలు ధరించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు వాడడం కూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్‌గాహ్‌కు వెళ్లే ముందు కొద్దిగా అల్పాహారం (అంటే ఆ రోజుల్లో ఖర్జూరాలు) తీసుకొనే వారు.

బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్‌గాహ్‌కు వెళ్లేవారు. రమజాన్ నమాజును కాస్త ఆలస్యంగా బక్రీద్ నమాజును కాస్త తొందరగా చేసేవారు. ఈదుల్ ఫిత్ర్‌లో సదఖ, ఫిత్రా, ఈదుల్ అజహాలో ఖుర్బానీ ముఖ్య విధులు. యావత్ ప్రపంచంలో ఈ పండగను అత్యంత భక్తి ప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

పేదసాదలను ఆదుకోవాలి
కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండగ రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ధనవంతులు జకాత్, ఫిత్రాల రూపంలో తమను ఆదుకుంటారని వారు ఆశిస్తారు. కాబట్టి ధనవంతులు నిరుపేదల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా, అభాగ్యులకు సాయం చేసి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రయత్నించాలి. ఇస్లామియా ధర్మశాస్త్రం డబ్బు దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా చేసేవారు సైతాన్ సోదరులని చెప్పింది.

అవసరార్థులకు, పేదసాదలకు ధనసాయం చేసేందుకు ఖర్చు చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. తద్వారా మనం ఆనందంగా ఉండడంతో పాటు సమాజమంతా ఆనందంగా ఉండాలన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండగ సమాజంలో ఈ విధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది.

సేమియా, షీర్‌ఖుర్మాల తీపితో పాటు కులమతాలకు అతీతంగా అందరి మధ్య ఆత్మీయతలు, అనుబంధాలను ప్రోది చేస్తుంది. ఎలాంటి అసమానత, అణచివేత, దోపిడీ, పీడన, దారిద్య్రం లేని ఓ సుందర సమాజ నిర్మాణానికి పండగలు దోహదం చేయాలని, రమజాన్ స్ఫూర్తి అందరి గుండెల్లో నిండుగా వెలగాలని కోరుకుందాం. 
* యం.డి. ఉస్మాన్ ఖాన్